Skip to main content

Admissions 2025 : ప‌రీక్ష‌లకు ముందే అడ్మిష‌న్లు షురూ.. ఆఫ‌ర్లంటూ ఫోన్ కాల్స్..

వ‌చ్చేనెల‌లో బోర్డు ప‌రీక్ష‌లు ఉన్నాయి. అవి క‌నీసం ప్రారంభం కూడా కాక‌ముందే ప‌లు ప్రైవేటు క‌ళాశాల‌లు, ఇంట‌ర్ కోసం, బీటెక్ కోసం అడ్మిష‌న్లు అని ఇప్ప‌టి నుంచే ప్రారంభించారు. అస‌లు విష‌య‌మేంటంటే..
Admission calls for parents before board exams

హైదరాబాద్‌: పదవ తరగతి, ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కాకుండానే.. ముందస్తు అడ్మిషన్లతో కార్పొరేట్‌ కళాశాలలు హడావుడి చేస్తున్నాయి. అనుమతి లేకుండా విద్యార్థుల డేటాను సంపాదించి వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ వల విసురుతున్నారు. ఫోన్లే కాకుండా వాట్సాప్‌లకు అడ్మిషన్ల మెసేజ్‌లు పంపుతున్నారు. వీటికి ఎక్కువగా తల్లిదండ్రులు ప్రభావితమవుతున్నారు. ముందుగా మేల్కోకుంటే ఫీజులు ఎక్కడ పెంచుతారోనని వారు ఆందోళన చెందుతున్నారు.

Model Schools Admissions 2025 : తెలంగాణ మోడల్‌ స్కూల్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం!

దీన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకునేందుకు కార్పొరేట్‌ ఇంటర్, ఇంజనీరింగ్‌ కళాశాలలు గాలం వేస్తున్నాయి. ఆకట్టుకునేలా బ్యాచ్‌కో పేరు పెట్టి రంగు రంగుల బ్రోచర్లు చూపి మంచి భవిష్యత్తు అంటూ ఆశల పల్లకిలో విహరింపజేస్తూ రూ.లక్షల్లో ఫీజులు బాదేస్తున్నారు.

హలో సార్‌... మీ పాప మౌనిక పదవ తరగతి చదవుతున్నది కదా..!. ఇంటర్‌కు ఏం ప్లాన్‌ చేస్తున్నారు సార్‌? మాది ఫలనా కార్పొరేట్‌ కాలేజీ. ఐఐటీ, ఈపీసెట్‌ కోచింగ్, ఏసీ, నాన్‌ ఏసీ స్పెషల్‌ బ్యాచ్‌లు ఉన్నాయి. హాస్టల్‌ సౌకర్యం కూడా ఉంది. ఇప్పుడు జాయిన్‌ అయితే ఫీజులో కొంత డిస్కౌంట్‌ ఉంటుంది. పరీక్షల తర్వాత సీట్లు కష్టం. అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఫీజులు పెరుగుతాయి. ముందుగా సీటు రిజర్వ్‌ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి కాలేజీ క్యాంపస్‌కు విజిట్‌ చేసి చూడండి.

సార్‌ గుడ్‌ ఈవెనింగ్, కార్తీక్‌ ఫాదరేనా? మీ అబ్బాయి ఇంటర్మీడియట్‌ (Intermediate) చదువుతున్నాడు కదా. బీటెక్‌ (BTECH) కోసం ఏం ప్లాన్‌ చేశారు. తమిళనాడు, కేరళలోని ఫలానా యూనివర్సిటీల్లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్, ఏఐఎంల్, డేటాసైన్స్, మెకానికల్‌ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఆసక్తి ఉంటే చెప్పండి.. రాయితీలు ఇప్పిస్తాం...

Education News: నాణ్యత ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్‌ కాలేజీలపై కొరడా .... ఉన్నత విద్యామండలికి ఆదేశం

...టెన్త్, ఇంటర్‌ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పుడు ఇలాంటి ఫోన్ల బెడదరిగింది. కనీసం బోర్డు పరీక్షలు కూడా కంప్లీట్‌ కాకముందే కార్పొరేట్‌ కాలేజీలు బేరసారాలు ప్రారంభించాయి. అడ్డగోలు ఫోన్లు, ఆఫర్లతో తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తున్నాయి. పరీక్షలు కూడా రాయకుండా అడ్మిషన్లు ఎలా తీసుకోవాలి.. తీసుకోకుంటే ఫీజులు ఇంకా పెరుగుతాయేమో అని వారు ఆందోళనకు గురవుతున్నారు.

మరోవైపు పీఆర్‌ఓలు...

వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్ల కోసం పలు విద్యాసంస్థల పీఆర్‌ఓలు కూడా రంగంలోకి దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులు కొద్దిగా ఆసక్తి కనబర్చినా చాలు విద్యార్థుల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. నామినల్‌ రోల్‌ ద్వారా విద్యార్థుల వివరాలు ఫోన్‌ నెంబర్లు, చిరునామా సేకరిస్తున్నారు. వాటి కోసం సంబంధిత విభాగాల ఇన్‌చార్జిలకు విందులు, నజరానాలు సమకూర్చుతున్నారు.

Gurukul School Admissions : గురుకుల పాఠ‌శాల‌లో అడ్మిషన్లకు దరఖాస్తులు.. ఇదే చివరి తేది

నిబంధనల ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవరికి ఇవ్వరాదు. కానీ కాసులకు కక్కుర్తి పడి కింది స్థాయి సిబ్బంది కొందరు విద్యార్థుల సమాచారం అందిస్తున్నారు. దీంతో పీఆర్‌ఓ ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం.. కళాశాలల గురించి వివరిస్తూ తల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అడ్మిషన్లు ఎక్కువగా చేసిన వారికి ఇన్సెంటివ్‌ అవకాశం ఉండటంతో పోటీపడుతున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా

సాధారణంగా పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాతనే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక ఈసారి గతేడాది కంటే ఫీజులు అధికంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. కనీసం 20 శాతం అధికంగా ఫీజుల దోపిడీకి కళాశాలలు సిద్ధమయ్యాయి. ఇంటర్‌కు సంబంధించి 'సూపర్, స్టార్, సీఓ' బ్రాంచ్‌ల పేరిట కొన్ని కళాశాలలు ఏడాదికి రెండున్నర నుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఇక ఇంజనీరింగ్‌ కోర్సులకు రూ.ఐదు నుంచి రూ.10 లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నారని తెలుస్తోంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 19 Feb 2025 12:21PM

Photo Stories