TTD: రూ.5,258.68 కోట్లతో టీటీడీ బడ్జెట్

వచ్చే 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించినట్లు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు అంగీకరించినట్లు చెప్పారు. శ్రీవారికి దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తుల సంరక్షణ, సద్వినియోగం ప్రధాన లక్ష్యంగా విస్తృత చర్యలు చేపడతామన్నారు. స్వామివారి ఆస్తులపై కోర్టు కేసుల్లో విచారణ వేగంగా పూర్తయి సద్వినియోగంలోకి తెచ్చేందుకు చూస్తామని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో టీటీడీ ఆలయాల నిర్మాణం, భూ కేటాయింపులను అనుసరించి కార్యాచరణ వేగిరం చేస్తామని వివరించారు.
మార్చి 24వ తేదీ తిరుమల అన్నమయ్య భవనంలో బోర్డు సమావేశం తర్వాత ఈవో జె.శ్యామలరావుతో కలిసి బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. 2024–25లో 5,179.85 కోట్ల బడ్జెట్ అంచనా కాగా.. ఈసారి రూ.78.83 కోట్లు పెరిగాయి. బ్యాంకు డిపాజిట్లు, బంగారం ద్వారా రూ.1,253 కోట్ల వడ్డీ వస్తున్నట్లు అంచనా వేసిన టీటీడీ.. వచ్చే ఏడాది మరో రూ.57 కోట్లు పెరిగి రూ.1,310 కోట్లు వస్తాయని పేర్కొంది.
AP Government: ఏపీ ప్రభుత్వ గౌరవ సలహాదారుగా నియమితులైన నలుగురు వీరే..
శ్రీవారి హుండీ ద్వారా రూ.1,729 కోట్లు ఆదాయం వస్తుందని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం ఇది రూ.1,671 కోట్లుగా ఉంది. ఇందులో ఉద్యోగులు, పొరుగు ఉద్యోగులు, ఒప్పంద సేవ సిబ్బంది జీతాలకు రూ.1,773.75 కోట్లు వెచ్చిచనున్నారు. పరికరాల కొనుగోలుకు రూ.768 కోట్లు కేటాయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభ నిల్వ రూ.350 కోట్లుగా అంచనా వేశారు. కార్పస్, ఇతర పెట్టుబడులకు రూ.800 కోట్లు వ్యయం చేయనున్నారు.
ముఖ్యాంశాలు ఇలా..
- హిందూ ధర్మప్రచారానికి రూ.121.50 కోట్లు.
- తెల్లవారుజామున 5.30కు శ్రీవారి బ్రేక్ దర్శనం సమయం మార్పునకు పరిశీలన.
- ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్‌కు భూ కేటాయింపుల రద్దు. కొత్త ఆగమ సలహామండలి ఏర్పాటుకు ఆమోదం.
- సమావేశానికి ముందు టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపం తెలిపింది.
Groundwater Level: ఆంధ్రప్రదేశ్‌లో గణనీయంగా పెరిగిన భూగర్భజలాలు