TGCHE: 15 శాతం ప్రవేశాలు లేకుంటే ఈ కాలేజీలు మూతే!
కనీసం 15 శాతం మంది విద్యార్థులు కాలేజీలో చేరాలని, అన్ని విభాగాల్లోనూ ఇదే స్థాయిలో విద్యార్థులు ఉండాలనే నిబంధనను ఏడాది క్రితమే తీసుకొచ్చారు. అయితే ఇది అమలుకు నోచుకోలేదు. విద్యార్థులు డిగ్రీకి కూడా నగరాల బాటపడుతున్నారు. ఫలితంగా జిల్లా, మండల కేంద్రాల్లోని డిగ్రీ కాలేజీల్లో మౌలిక వసతులు, నాణ్యమైన ఫ్యాకల్టీపై డబ్బు వెచ్చించడం కష్టంగా ఉందని యాజమాన్యాలు అంటున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఏడాది కాలంగా 15 శాతం చేరికలు ఉండాలన్న నిబంధనను అమలు చేయలేదని అధికారవర్గాలు అంటున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేస్తే దాదాపు 150 డిగ్రీ కాలేజీలు మూతపడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీలకు కష్టకాలం వచ్చే పరిస్థితి నెలకొంది. కొత్త కోర్సులతో విద్యార్థులను ఆకర్షించగలిగి, సరైన ఫ్యాకల్టీ ఏర్పాటు చేసుకుంటేనే అనుమతులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర నివేదికను కూడా కొన్ని నెలల క్రితం ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి అందజేసింది.
చదవండి: Tribal University: ట్రైబల్ వర్సిటీలో చేరేందుకు అనాసక్తి
సగానికి పైగా సీట్లు ఖాళీ
రాష్ట్రవ్యాప్తంగా 1,055 ప్రైవేట్, ప్రభుత్వ, ఎయిడెడ్, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 4,57,704 డిగ్రీ సీట్లున్నాయి. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్–తెలంగాణ (దోస్త్) ద్వారా ఈ సీట్లు భర్తీ చేస్తారు. ఈ ఏడాది నిర్వహించిన దోస్త్ ప్రవేశాల తీరును పరిశీలిస్తే 1,96,442 సీట్లు మాత్రమే వివిధ కోర్సుల్లో భర్తీ అయ్యాయి. 2.61 లక్షలకుపైగా సీట్లు మిగిలిపోయాయి.
ఇందులో 70 శాతం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కాలేజీలే ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఇష్టారాజ్యంగా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు అనుమతులు ఇచ్చారు. వాటిల్లో ఫ్యాకల్టీ ఉందా? మౌలిక సదుపాయాలు ఉన్నాయా? అనే విషయాలను పరిశీలించలేదు. 816 ప్రైవేట్ కాలేజీల్లో 3,44,793 సీట్లు అందుబాటులో ఉంటే, చేరిన విద్యార్థులు కేవలం 1,32,388 మాత్రమే. కనీసం 40 శాతం కూడా ప్రవేశాలు లేని ఈ కాలేజీలకు అనుమతులు ఇవ్వడం సరికాదని ఉన్నత విద్యామండలి భావిస్తోంది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
కొత్త కోర్సులుంటేనే...
దేశవ్యాప్తంగా డిగ్రీ కోర్సుల ట్రెండ్ మారింది. సంప్రదాయ డిగ్రీ కోర్సులను విద్యార్థులు ఇష్టపడటం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేక కొత్త కోర్సులకు అనుమతులు ఇస్తోంది. హిస్టరీ నేపథ్యమున్న వారు కాంబినేషన్‌గా కంప్యూటర్ సబ్జెక్టును ఎంచుకోవచ్చు. సైన్స్ నేపథ్యమున్న విద్యార్థి ఎకనామిక్స్ లేదా హిస్టరీని అదనపు సబ్జెక్టుగా ఎంచుకునే అవకాశం కల్పించారు.
క్రెడిట్ విధానం తీసుకొచ్చిన తర్వాత అనేక రాష్ట్రాల్లో సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్థానంలో ఆన్‌లైన్, కాంబినేషన్ కోర్సులతో డిగ్రీలు వస్తున్నాయి. మూడేళ్లకు బదులు, నాలుగేళ్ల ఆనర్స్ కోర్సుల ప్రభావం పెరిగింది. వీటిని దృష్టిలో ఉంచుకొని కంప్యూటర్ కోర్సులు, బీకాంలో ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ డేటాసైన్స్ వంటి కొత్త కోర్సులను అనివార్యంగా కాలేజీలు ప్రవేశపెట్టాలి. హైదరాబాద్ నగరానికి పరిమితమైన ఈ కోర్సులు గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా మార్పులు చేసుకున్న కాలేజీలకే మనుగడ ఉంటుందని ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి.
2024లో దోస్త్ ద్వారా డిగ్రీ సీట్ల భర్తీ ఇలా...
కాలేజీలు |
సంఖ్య |
సీట్లు |
భర్తీ |
శాతం |
ప్రభుత్వ |
160 |
89,337 |
55,361 |
61.96 |
ప్రైవేట్ |
815 |
3,44,793 |
1,32,388 |
38.39 |
రెసిడెన్షియల్ |
79 |
23,574 |
8,693 |
36.87 |
ఏ కోర్సులో ఎంతమంది? (2024 సంవత్సరం డేటా)
కోర్సు |
బీకాం |
బీఎస్సీ లైఫ్‌సైన్స్ |
బీఎస్సీ ఫిజికల్ సైన్స్ |
బీఏ |
బీబీఏ |
బీసీఏ |
బీబీఎం |
బీఎస్‌డబ్ల్యూ |
బ్యాచ్‌లర్ ఆఫ్ ఒకేషనల్ |
డిప్లొమా |
ప్రవేశాలు |
77,469 |
36,733 |
32,181 |
28,362 |
15,835 |
5,170 |
100 |
25 |
11 |
556 |
స్కిల్స్ కోర్సులదే కాలం
డిగ్రీలో కొన్ని కోర్సులకే విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్నారు. కంప్యూటర్స్, లైఫ్‌సైన్స్ కోర్సులకు భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారణంగానే తొలి ప్రాధాన్యం ఇంజనీరింగ్‌కే ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిగ్రీ కాలేజీలు ఇంకా అప్‌గ్రేడ్ కావాల్సిన అవసరముంది. స్కిల్‌తో పాటు డిగ్రీ వస్తేనే విద్యార్థికీ భవిష్యత్ ఉంటుంది.
– ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్