Skip to main content

Indian History : సింధూ ప్రజలు ఎవరితో వ్యాపారం చేశారు?

భారతదేశ చరిత్ర క్రీ .పూ. 34 వేల ఏళ్ల కిందట హోమోసెఫియన్ల కాలం నుంచి ప్రారంభమైనట్లు చరిత్రకారుల అభిప్రాయం.
Who did the Indus people trade with?   history behind indus valley

భారతదేశ చరిత్ర అంటే భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్‌తో కూడిన సమస్త భారత ఉపఖండ చరిత్ర. వేదాల్లో భారత దేశాన్ని జంబూ ద్వీపంగా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో నేరేడు పళ్లు ఎక్కువగా లభించడం వల్ల ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. భరతుడు అనే రాజు పేరు మీదుగా భారతదేశం లేదా భరతవర్షం అనే పేర్లు స్థిరపడ్డాయి. సింధూ నదికి ఆవల ఉన్న నాటి పర్షియన్లు, గ్రీకులు ఈ ప్రాంతాన్ని హిందూ దేశమని పిలిచారు. బ్రిటిషర్ల మూలంగా ఇండియా అనే పేరు వచ్చింది. సింధూ నదిని ఇండస్‌ అని పిలిచేవారు.  

భారతదేశ చరిత్ర

ఒక దేశ ప్రజల సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక జీవనం వారి భౌగోళిక పరిస్థితులతో ప్రత్యక్షంగా ప్రభావితమవుతుంది. అధికంగా సారవంతమవడం వల్ల భారతదేశ దక్షిణ ప్రాంతం కంటే గంగా, సింధూ మైదాన ప్రాంతం అన్ని రంగాల్లో బాగా అభివృద్ధి చెందింది. గంగా – సింధూ మైదానాలు, కృష్ణా, గోదావరి, తుంగభద్ర, కావేరి నదీ ప్రాంతాలు సాంస్కృతికంగా ముందు వరుసలో నిలిచాయి. జైన, బౌద్ధ, హిందూ మతాలు, లలిత కళలు ఈ ప్రాంతాల్లో విశేషంగా విలసిల్లాయి. అందువల్లే ఈ ప్రాంతాలపై ఆధిపత్యం కోసం నిరంతరం యుద్ధాలు జరిగాయి. భారతదేశ పశ్చిమ – మధ్య ప్రాంతాలకు (రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌) భౌగోళికంగా సరైన రవాణా సౌకర్యాలు లేవు. ఇవి ఇతర నాగరిక ప్రాంతాల నుంచి వేరవడం వల్ల ఇక్కడి ప్రజలు సాంఘిక దురాచారాలకు లోనయ్యారు. 

Indian History State Formation: భారతదేశ చరిత్ర రాష్ట్రాల ఏర్పాటుపై టాప్‌ 30బిట్స్‌

నాగరికత పరిణామ క్రమంలో లిపి వాడుకలోకి రాని పూర్వయుగాన్ని ‘చరిత్ర పూర్వయుగం’గా పేర్కొంటారు. లిపి ఉండి మనం చదవడానికి వీలు కాని యుగాన్ని ‘ప్రొటో హిస్టరీ యుగం’గా, లిపి సృష్టి జరిగి రాత ఆరంభమైనప్పటి నుంచి ‘చారిత్రక యుగం’గా వ్యవహరిస్తారు. మన దేశ చరిత్రలో ప్రసిద్ధి చెందిన సింధూ నాగరికత ప్రొటో హిస్టరీకి సంబంధించింది. ఎందుకంటే అప్పటి ప్రజలు వాడిన లిపిని మనం అర్థం చేసుకోలేకపోయాం. చరిత్రలో కాలాన్ని క్రీస్తు పూర్వయుగంగా, క్రీస్తు శకంగా విభజించారు. 
పాతరాతి యుగం (క్రీ.పూ. 35000–10000)
➦    ఈ యుగంలో మానవులు ఎక్కువగా అడవుల్లో నివసించేవారు. 
➦    క్వార్టజైట్‌ అనే కఠిన శిలతో కత్తి, సుత్తి, గొడ్డలి, బల్లెం, బొరిగ మొదలైన ఆయుధాలను తయారుచేసుకున్నారు. 
➦    జంతువులను వేటాడి పచ్చిమాంసం తినేవారు.
➦    చెట్ల తొర్రలు, కొండ గుహల్లో నివసించేవారు. 
➦    ఆకులు, చర్మాన్ని దుస్తులుగా కప్పుకునేవారు. 
➦   వీరికి పంటలు పండించడం తెలియదు.
➦    వీరు నివసించిన గుహలు కర్నూలులో ఉన్నాయి. 
➦    అండమాన్‌ దీవుల్లోని ఆదిమవాసులు, ఆంధ్రాలోని యానాదులు, తమిళనాడులోని కురుంబులు, ఇరుళులు, కదిరులు ఈ యుగ సంతతికి చెందినవారని చరిత్రకారుల అభిప్రాయం.

Telangana Movement Top 50 Bits: తెలంగాణ ఉద్యమం టాప్‌ 50 బిట్స్‌

మధ్యరాతి యుగం (క్రీ.పూ. 8000–4000)
➦    మధ్యరాతి యుగంలో ప్రజలు సంచార జీవితానికి స్వస్తి పలికారు. స్థిర నివాసం ఏర్పరచుకోవడం ప్రారంభమైంది.
➦    జంతువులను మచ్చిక చేసుకున్నారు. 
➦    ఈ కాలానికి చెందిన ప్రజలు జెస్పర్, చెర్ట్‌ అనే ఇసుక రాళ్లతో చేసిన పరికరాలు, ఆయుధాలను ఉపయోగించేవారు. ఇవి పరిమాణంలో చిన్నవిగా ఉండేవి. అందువల్ల ఈ యుగాన్ని ‘సూక్ష్మ శిలాయుగం’గా పేర్కొంటారు. 
➦    మరణించిన వారిని ఆహారం, వారు వాడిన పనిముట్లతో పాటు ఖననం చేసేవారు. 
నూతన శిలా యుగం (క్రీ.పూ. 4000–2500)
➦    నూతన శిలా యుగంలో మానవ జీవన సరళిలో స్థిరత్వం చోటుచేసుకుంది.
➦    పంటలు పండించడాన్ని విస్తృతపరిచారు. 
➦    నూలు, ఉన్ని వస్త్రాలను నేయడం నేర్చుకున్నారు. 
➦    ‘వ్యవసాయం, పశుపోషణ’ ముఖ్య వృత్తులుగా మారాయి. 
➦    ఇళ్ల నిర్మాణం జరిగి పల్లెలు ఏర్పడ్డాయి.
➦    సరకుల రవాణా కోసం బండ్లను వినియోగించారు.
➦    మట్టి పాత్రలను ఎక్కువగా తయారు చేశారు.
➦    పదునైన, నునుపైన, అందమైన రాతి పనిముట్లు, ఆయు«ధాలను రకరకాల ఆకృతుల్లో తయారుచేసి ఉపయోగించేవారు.
➦    విగ్రహారాధన, లింగపూజ, చంద్రుని వృద్ధి, క్షయ దశల ఆధారంగా రోజులను లెక్కవేయడం వీరి నుంచే ప్రారంభమైంది. 
➦    వీరు జంతువులు, శిలలు, పితృదేవతలు, భూతాలను ఆరాధించారు. 
➦    మరణించినవారిని సమాధి చేసేవారు.
➦    ఎముకలు, గవ్వలతో రూపొందించిన ఆభరణాలు ధరించేవారు.
➦    ఈ యుగానికి చెందిన ప్రజలు ఆస్ట్రిక్‌ జాతివారని కొందరు చరిత్రకారుల భావన.

TSPSC Group1,2,3 Exams 2024 Tips : TSPSC గ్రూప్‌-1, 2 ప‌రీక్ష‌ల్లో ఎక్కువ‌గా వ‌చ్చే ప్ర‌శ్న‌లు ఇవే..!| Saidulu Sir

సింధూ నాగరికత (క్రీ.పూ. 2500–1750)

రాగి లోహం వాడుకతో ఈ యుగం ప్రారంభమైనందువల్ల దీన్ని ‘తామ్ర శిలాయుగం’గా పే­ర్కొంటారు. దీన్ని ‘హరప్పా సంస్కృతి’ అని కూడా అంటారు. 1921లో సింధూ మైదాన ప్రాంతంలో చేపట్టిన పురావస్తు తవ్వకాల్లో హరప్పా ప్రదేశం బయల్పడింది. అందువల్ల దీన్ని ‘సింధూ నాగరికత’ లేదా ‘హరప్పా నాగరికత’గా వ్యవహరించారు.
హరప్పా, మొహంజోదారో ప్రదేశాలు ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నాయి. హరప్పా నగరంలో ధాన్యాగార భవనం ఒక విశిష్ట నిర్మాణం. మొ­హంజోదారోలో బయల్పడిన స్నానవాటిక ప్రసిద్ధి చెందింది. చాన్హుదారో కోటలకు ఖ్యాతి చెందింది. గుజరాత్‌లోని లోథాల్‌ ప్రసిద్ధ రేవు పట్టణం. దేశ, విదేశీ (మెసపటోమియా ప్రజలతో) వాణిజ్యం చే­శారు. రాజస్థాన్‌లోని కాళీభంగన్, హరియాణాలోని బన్వాలి కూడా ఈ నాగరికతకు చెందిన ముఖ్యమైన ప్రదేశాలు. సింధూ స్థావరాల్లో రాఖీగర్హిని అతి పెద్ద నగరంగా 2014లో పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతకుముందు వరకు మొహంజోదారోను పెద్ద నగరంగా పరిగణించేవారు.
నాటి మెసపటోమియా, ఈజిప్టు నాగరికత కంటే సింధూ నాగరికత పరిధి చాలా విస్తృతమైంది. ఈ నాగరికతకు చెందిన ప్రజలు గ్రిడ్‌ పద్ధతిలో పట్టణాలను నిర్మించారు. మెలుహా ప్రాంతంవారికి సుమేరియన్లతో ఉన్న సంబంధాల గురించి కొన్ని సుమేరియన్‌ గ్రంథాల ద్వారా తెలుస్తోంది. సింధూ ప్రాంతాన్ని అత్యంత ప్రాచీన కాలంలో ‘మెలుహా’గా వ్యవహరించేవారు. 

Telangana History Quiz in Telugu: తెలంగాణలో ఏ దేవాలయ శిఖరాన్ని నీళ్లలో తేలే ఇటుకలతో నిర్మించారు?

హరప్పా నాగరితను పట్టణ నాగరికతగా పేర్కొనవచ్చు. వీధులు ఉత్తర, దక్షిణాలుగా, ఉప వీధులు తూర్పు, పడమరలుగా చక్కని దీర్ఘచతురస్ర ఆకారంలో నిర్మించారు. నిర్మాణాలకు కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. భూగర్భ మురుగు పారుదల సౌకర్యం నాటి సాంకేతిక ప్రతిభకు నిదర్శనం. నగర ప్రజల సమష్టి ప్రయోజనాల కోసం సభా మందిరాన్ని కూడా నిర్మించారు. గోధుమ, బార్లీ వీరి ప్రధానమైన పంటలు. 
లోథాల్‌ నగరంలో పత్తి, వరి పండించినట్లుగా ఆధారాలు లభించాయి. వీరు పాలు, కూరగాయలు, గోధుమ, బార్లీతో పాటు మంసాహారాన్ని కూడా తీసుకునేవారు. ఎద్దు, మహిషం, గొర్రె, పంది, ఒంటె, కుక్క, ఆవు లాంటి పెంపుడు జంతువులు, ఖడ్గమృగం, పెద్దపులి, ఎలుగుబంటి, వానరం తదితర వన్యమృగాలు వీరికి తెలుసు. వీరు యుద్ధాల్లో రాగితో చేసిన గొడ్డలి, కత్తి, బల్లెం, విల్లంబులు, బాడిశ తదితర పరికరాలను ఉపయోగించారు. కానీ రక్షణ కవచాలు తెలియదు. గృహ సామగ్రి కోసం రాగి, వెండి, పింగాణీతో పాటు శిలలు, దంతాలతో చేసిన వస్తువులను వినియోగించారు. వీరు దశాంశ పద్ధతిలో తూనికలు ఉపయోగించారు.
సింధూ ప్రజల మట్టి ముద్రికలు, శిలా విగ్రహాలు, లోహ ప్రతిమల ఆధారంగా వీరు ప్రధానంగా మాతృదేవత లేదా అమ్మతల్లిని ఆరాధించినట్లుగా తెలుస్తోంది. మూడు ముఖాలతో పద్మాసీనుడై ఉన్న శివుని చుట్టూ వన్యమృగాలున్న ఒక ముద్రిక లభించింది. దీని ఆధారంగా వీరు పశుపతిగా, మహాయోగిగా శివుణ్ని ఆరాధించేవారని, వృక్షాలు, సర్పాలను కూడా పూజించేవారని తెలుస్తోంది.‘స్వస్తిక్‌’ అనేది సూర్య దేవతారాదనకు చిహ్నం. మృతదేహాన్ని పూడ్చి పెట్టేవారు. సింధూ ప్రజల లిపి బొమ్మల లిపి. దీన్ని కుడి నుంచి ఎడమ దిశకు రాసినట్లుగా తెలుస్తోంది.
మొహంజోదారో నగరం ఏడుసార్లు ధ్వంసమైనా మళ్లీ నిర్మించారు. ఇక్కడ 4.5 అడుగుల నాట్యం చేస్తున్న స్త్రీ విగ్రహాన్ని కనుగొన్నారు. వీరికి గుర్రం తెలియదు. అందువల్ల గుర్రాన్ని ఉపయోగించిన ఆర్యులు వీరిని సులభంగా ఓడించారని చరిత్రకారుల అభిప్రాయం. కొంత వరకు ప్రకృతి వైపరీత్యాలు కూడా ఈ నాగరికత నాశనం చెందడానికి కారణమై ఉంటాయని భావిస్తున్నారు. 
సింధూ నాగరికత ప్రజలకు సమకాలీకులైన సుమేరియన్లు ఇనుమును ఉపయోగించినా వీరు దీన్ని వాడలేదు. ఎన్నిసార్లు వరదలు వచ్చినా అదే ప్రాంతంలో నివసించారు. ఈ కారణాల వల్ల వీరికి ఆధునిక పద్ధతులను త్వరగా స్వీకరించే మనస్తత్వం లేదని భావిస్తున్నారు. 

RRC Sports Quota Jobs : ఆర్‌ఆర్‌సీలో స్పోర్ట్స్ కోటాలో వివిధ పోస్టుల భ‌ర్తీ ద‌ర‌ఖాస్తులు.. వీరే అర్హులు..

సింధూ నాగరికతకు చెందిన నగరాలు
నగరం     కనుగొన్న    కనుగొన్నవారు
    సం.
హరప్పా     1921     దయారాం సహాని
మొహంజోదారో    1922    ఆర్‌.డి. బెనర్జీ
చాన్హుదారో    1935    ఎం.జి.మజుందార్‌
కాళీభంగన్‌    1953    ఎ.కె. ఘోష్‌
రూపర్‌    1953    వై.డి. శర్మ
లోథాల్‌    1954    ఎస్‌.ఆర్‌. రావ్‌
రాఖీగర్హి    1963    –
బన్వాలీ    1973    ఆర్‌.ఎన్‌. బిస్త్‌
దోలవీర    1991    ఘోష్‌
సింధూ నాగరికత ప్రజల ప్రత్యేకతలు
➦    వరి, పత్తి పండించడంలో సిద్ధహస్తులు.
➦    తూనికలు, కొలతలను ప్రామాణికబద్ధం చేశారు. 
➦    స్త్రీ శక్తిని పూజించడం వీరి నుంచే ప్రారంభమైంది. లింగ పూజ, అగ్ని పూజ, కోనేటి స్నానం వీరే ప్రారంభించారు. 
➦    దువ్వెనలు వాడటం, గాజులు ధరించడం వీరి నుంచి వచ్చినవే. 

APPSC Jobs Notifications 2024 Mistakes : ఏపీపీఎస్సీ గ్రూప్‌–1, 2 సహా 21 నోటిఫికేషన్లు.. ఈ పరీక్షలకు కనీసం తేదీలు కూడా..

Published date : 20 Aug 2024 01:41PM

Photo Stories