APPSC Jobs Notifications 2024 Mistakes : ఏపీపీఎస్సీ గ్రూప్–1, 2 సహా 21 నోటిఫికేషన్లు.. ఈ పరీక్షలకు కనీసం తేదీలు కూడా..
మరో ఏడాది పాటు పదవీ కాలం ఉన్న కమిషన్ చైర్మన్‌ను రాజకీయ కుట్రతో ఆగమేఘాలపై తొలగించి గత నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు జరగకుండా అడ్డుపడ్డారు.
గ్రూప్–1, గ్రూప్–2 పరీక్షలు మాత్రం..
ఏపీలోని కూటమి సర్కారు నిర్వాకాలు, కాలయాపనతో గ్రూప్–2, గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులతో పాటు మరో 19 నోటిఫికేషన్లకు సంబంధించి నిర్విరామంగా సిద్ధమవుతున్న దాదాపు 8 లక్షల మందికి పైగా యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్‌తో పాటు ఇచ్చే షెడ్యూల్‌లోనే పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటించి షెడ్యూల్ ప్రకారం పోస్టులు భర్తీ చేశారు.
అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చీ రాగానే రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఏపీపీఎస్సీపై దాడి ప్రారంభించింది. పదవిలో ఉన్న ఏపీపీఎస్సీ చైర్మన్‌ను కుటిల రాజకీయాలతో తొలగించింది. జూలై 2025 వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ అర్ధాంతరంగా తొలగించడంతో గతంలో ఇచ్చిన పలు నోటిఫికేషన్ల తాలూకు పరీక్షలు, ప్రకటించాల్సిన కొత్త నోటిఫికేషన్లు పెండింగ్‌లో పడిపోయాయి.
ఏపీపీఎస్సీ కొత్త చైర్మన్ వచ్చే వరకు..
దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు సర్వీస్ కమిషన్‌కు ప్రభుత్వం కొత్త చైర్మన్‌ను నియమించలేదు. నిబంధనల ప్రకారం సర్వీస్ కమిషన్ చైర్మన్ ఏదైనా కారణంతో అందుబాటులో లేకుంటే కొత్త చైర్మన్ వచ్చే వరకు ఆ బాధ్యతలను సభ్యుల్లో ఒకరికి అప్పగించాలి. విషయాన్ని గవర్నర్ దృష్టికి తెచ్చి చైర్మన్‌గా బాధ్యతలు మరొకరికి అప్పగించాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇన్ని రోజులు కమిషన్‌కు చైర్మన్ లేని పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని పేర్కొంటున్నారు.
ఎప్పుడు జరుగుతాయో తెలియక అభ్యర్థులు..
గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ల మేరకు గ్రూప్–1, 2 ప్రిలిమ్స్, డీవైఈవో (డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్) ప్రిలిమ్స్‌ను గత ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం నిర్వహించి ఫలితాలను సైతం ప్రకటించింది. ముందుగా ప్రకటించిన తేదీల్లోనే మెయిన్స్ కూడా నిర్వహిస్తారని భావించి సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అశనిపాతంగా మారింది. దీంతో ఎప్పుడు జరుగుతాయో తెలియని మెయిన్స్ కోసం శిక్షణ కొనసాగించాలా? లేక విరమించాలా? అనేది తేల్చుకోలేక నిరుద్యోగ అభ్యర్థులు సతమతమవుతున్నారు.
ఇంకా పలు నోటిఫికేషన్ల పరీక్షలపై..
ఏపీపీఎస్సీ ద్వారా వెలువడే అన్ని నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణకు చైర్మన్ అనుమతి తప్పనిసరి. చైర్మన్ ఆదేశాల మేరకు కార్యదర్శి పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే ప్రకటించిన 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తియాలి. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో గ్రూప్–2, గ్రూప్–1, డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ లాంటి కీలమైన 19 నోటిఫికేషన్లు ఉన్నాయి.
కేవలం ఈ మూడు పరీక్షలకు సంబంధించి..
వీటిలో గ్రూప్–2, గ్రూప్–1తో పాటు డీవైఈవో పోస్టులకు మాత్రమే ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి చేసి ఫలితాలను సైతం విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్–2 మెయిన్స్ జూలైలో జరగాల్సి ఉండగా వాయిదా వేశారు. సెప్టెంబర్‌లో నిర్వహించాల్సిన గ్రూప్–1 మెయిన్స్ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. డీవైఈవో మెయిన్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. కేవలం ఈ మూడు పరీక్షలకు సంబంధించి మెయిన్స్‌కు అర్హత సాధించిన వారే దాదాపు 1.15 లక్షల మంది ఉన్నారు.వీరి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన వారిలో చాలామంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులున్నారు. వారంతా తమ దీర్ఘకాలిక సెలవులు పెట్టి మెయిన్స్ కోసం సిద్ధమవుతున్నారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో వారంతా ఎటూ తేల్చుకోలేక ఆందోళన చెందుతున్నారు.
మరో 19 నోటిఫికేషన్లకు మోక్షం ఇంకెప్పుడో..!
ప్రిలిమ్స్ నిర్వహించిన మూడు నోటిఫికేషన్లకు సంబంధించి మెయిన్స్ మాట అటుంచితే.. గతంలో ఇచ్చిన మరో 19 నోటిఫికేషన్లకు కూటమి ప్రభుత్వం కనీసం పరీక్షల నిర్వహణ తేదీలను కూడా ప్రకటించలేదు. వీటిలో డిగ్రీ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, జూనియర్ కాలేజీ లెక్చరర్లతో పాటు వివిధ శాఖల్లో దాదాపు 1,475 పోస్టులున్నాయి. వీటికి సుమారు 6.35 లక్షల మంది దరఖాస్తు చేసుకుని సిద్ధమవుతున్నారు.
అటవీ శాఖలోని ఉద్యోగాలకు..
దీంతో పాటు కొత్తగా అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్లు లాంటి పోస్టులతో పాటు వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతినిచ్చిన దాదాపు 800 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది. వీటిపై గతంలో ఏపీపీఎస్పీ ప్రకటన ఇవ్వడంతో లక్షలాది మంది కొద్ది నెలలుగా శిక్షణ పొందుతున్నారు. దీంతో పాటు కొత్తగా ఆర్థికశాఖ అనుమతి పొందిన 10కి పైగా నోటిఫికేషన్లు ప్రకటించాల్సి ఉంది.
గత ప్రభుత్వ హయంలో..
వైఎస్సార్ సీపీ హయాంలో సర్వీస్ కమిషన్ నుంచి వెలువడ్డ అన్ని నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరిగాయి. ఉద్యోగాల భర్తీని పక్కాగా పూర్తి చేశారు. గత ఐదేళ్లలో కమిషన్ ద్వారా అన్ని శాఖల్లో 78 నోటిఫికేషన్లు ఇవ్వగా అర్హత గల ఏ నిరుద్యోగికీ అన్యాయం జరగకుండా 6,296 ఉద్యోగాలను వివాద రహితంగా భర్తీ చేశారు. ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్‌కు షెడ్యూల్‌లో ప్రకటించిన తేదీల్లోనే పరీక్షలు నిర్వహించగా ఏ ఒక్కటీ వాయిదాగానీ, రద్దు చేసిన సందర్భాలు లేవు. 2019కి ముందు నాటి టీడీపీ ప్రభుత్వం వివాదాస్పదంగా మార్చిన పరీక్షలను సైతం న్యాయ వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేశారు.
ఇప్పుడు మళ్లీ అదే దుస్థితి..
వివిధ రాష్ట్రాల సర్వీస్ కమిషన్ల పనితీరుపై ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకున్నట్లు పేర్కొనగా వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీలో ఏపీపీఎస్సీ ప్రథమస్థానంలో నిలవడం గమనార్హం. 2019కి ముందు ఇచ్చిన నోటిఫికేషన్లు వివాదాల్లో చిక్కుకోవడంతో నిరుద్యోగ యువత ఇబ్బందులు పడ్డారు. 2018 డిసెంబర్‌లో 32 నోటిఫికేషన్లు జారీ చేయగా ఒక్క నోటిఫికేషన్‌కూ పరీక్షలు నిర్వహించకపోవడం గమనార్హం. ఇప్పుడు మళ్లీ అదే దుస్థితి నెలకొందని నిరుద్యోగులు వాపోతున్నారు.
రాజ్యాంగం ప్రకారం..
కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది. గత ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రిటైర్డ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించింది. ఇతర సభ్యులపైనా ఒత్తిళ్లు తెస్తోంది. వాస్తవానికి ప్రభుత్వాలు మారినా రాజ్యాంగ బద్ధమైన ఈ పోస్టుల్లో ఉన్నవారిని పదవీ కాలం పూర్తయ్యే వరకు తొలగించకూడదు. గతంలో ఇదే విధానం కొనసాగింది.టీడీపీ హయాంలో నియమితులైన ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యులు వైఎస్ జగన్ ప్రభుత్వంలో పూర్తి కాలం కొనసాగారు. కూటమి సర్కారు అందుకు విరుద్ధంగా బలవంతంగా రాజీనామాలు చేయిస్తోంది. రాజ్యాంగంలోని 316, 317 నిబంధనల ప్రకారం కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం, పదవీ కాలాన్ని నిర్దేశించారు.
దీని ప్రకారం ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యులు ఆరేళ్ల వరకు లేదా 62 ఏళ్ల వయసు వచ్చే వరకు (ఏది ముందు అయితే అది) బాధ్యతల్లో కొనసాగవచ్చు. ఆయా పోస్టుల్లో ఖాళీలు ఏర్పడితే వెంటనే భర్తీ చేయాలి. ముఖ్యంగా చైర్మన్ పదవి ఖాళీ అయితే ఆ స్థానంలో కొత్త చైర్మన్ వచ్చే వరకు ఇన్‌చార్జీగా మరొకరికి బాధ్యతలు అప్పగించాలి.
వీరి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.. వీరంతా..
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీపీఎస్సీ చైర్మన్‌గా తొలుత వివాదాస్పద పోలీసు అధికారి (రిటైర్డ్) ఏబీ వెంకటేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది. రిటైర్డ్ ఐఏఎస్ పూనం మాలకొండయ్యతో పాటు పోలా భాస్కర్ పేర్లు కూడా వినిపించాయి. కేరళ టూరిజం శాఖలో పనిచేస్తున్న కె.శ్రీనివాస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా పనిచేసిన అప్పారావు, అదే వర్సిటీలో పనిచేస్తున్న యలమంచిలి రామకృష్ణ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.
Tags
- appsc reforms 2024
- appsc new chairman 2024
- appsc jobs notification 2024 pending list
- appsc group 1 mains exam problems
- appsc group 2 mains exam problems 2024
- ap job calendar 2024
- ap job calendar 2024 news telugu
- ap job calendar 2024 release date
- ap job calendar 2024 release date news telugu
- ap government jobs notifications latest 2024 news telugu
- APPSC Jobs News
- appsc jobs pending news telugu
- APPSC Jobs Notification 2024
- appsc jobs notifications issue news telugu
- appsc jobs notifications cbn government
- appsc jobs notifications cbn government news telugu
- Nara Chandrababu
- APPSC State Govt Jobs
- appsc jobs news telugu
- Jobs
- appsc jobs notifications pending issues 2024
- appsc jobs notifications pending issues 2024 news telugu
- telugu news appsc jobs notifications pending issues 2024
- APPSC
- NotificationDelay
- RecruitmentUpdate
- ExamPostponement
- AllianceGovernment
- exampreparation
- Group1Examination
- Group2Exams
- sakshiducationlatest news