Skip to main content

Telangana History for Group 1 and 2 : శాతవాహనుల రాజ్యభాష ఏది? ఇదే వారి చరిత్ర

Telangana History for Group 1 and 2 Exams

శాతవాహనుల చరిత్ర
శ్రేణులు – ప్రాధాన్యం
జున్నార్‌ శాసనాల్లో ‘ధమ్నక’, ‘కాసాకార’, ‘తెసకార’ శ్రేణుల గురించి పేర్కొన్నారు. గోవర్ధనలో ‘కాలీకసికాయ’ శ్రేణులుండేవి. నాసిక్‌ శాసనాల్లో ‘కులరిక’, ‘తెలపిషిక’, ‘ఒదయంత్రిక’ మొదలైన శ్రేణుల గురించి పేర్కొన్నారు. ప్రతి శ్రేణికి అధ్యక్షుడిగా శ్రేష్ఠి ఉండేవాడు. శ్రేణుల కార్యాలయాలు పురమందిరంలో లేదా నిగమసభలో ఉండేవి. ఉషవదత్తుడు శ్రేణుల్లో పెట్టిన పెట్టుబడులు ‘నిగమసభ’లో రిజిస్టర్‌ చేశారు.
బ్యాంకులు – రుణపరపతి విధానాలు
శాతవాహనుల కాలంలో వడ్డీకి అప్పులు ఇచ్చే పద్ధతి ఉండేది. స్పల్ప వడ్డీ మాత్రమే వసూలు చేసేవారు. అప్పుల మీద వడ్డీరేటు సాధారణంగా ఏడాదికి 12 శాతం ఉండేది. దీన్ని నెలకు ఒకసారి గణించే పద్ధతిలో నిర్ణయించేవారు. నాటి సంస్థలు,బ్యాంకులు ఈ విధానాన్ని అనుసరించాయని పశ్చిమ దక్కన్‌లో దొరికిన శాసనాలు ధ్రువపరుస్తున్నాయి. ఉషవదత్తుని నాసిక్‌ శాసనంలో గోవర్ధనలోని చేనేత పనివారి శ్రేణి రెండు డిపాజిట్లు స్వీకరించినట్లుగా పేర్కొన్నారు. అందులో మొదటిది నెలకు ఒక శాతం వడ్డీ రేటుతో 2,000 కార్షాపణలు, రెండోది నెలకు 3/4 శాతం వడ్డీ రేటు మీద 1,000 కార్షాపణలు ఉన్నాయి. మొదటి డిపాజిట్‌ మీద వచ్చే వడ్డీ మొత్తాన్ని నాసిక్‌లోని గుహలో వర్షాకాలంలో నివాసం ఏర్పాటు చేసుకున్న బౌద్ధ సన్యాసులకు ప్రతి ఒక్కరికి ఏడాదికి వస్త్రాలు ఖరీదు చేసేందుకుగాను 12 కార్షాపణులుగా ఖర్చు పెట్టడానికి నిర్దేశించారు. రెండో∙డిపాజిట్‌పై వచ్చే మొత్తాన్ని ఆ బౌద్ధ సన్యాసుల ఇతర అవసరాలకు కేటాయించారు.
Infosys Campus Placements: ఇన్ఫోసిస్‌ ప్లేస్‌మెంట్స్‌.. ఫ్రెషర్స్‌కు ఏటా రూ.9 లక్షల ప్యాకేజీ
సాంస్కృతిక విధానం
దక్కన్‌ పీఠభూమికి చెందిన పాతరాతి యుగం నిర్మాతలకు ఇనుము, వ్యవసాయానికి సంబంధించిన పరిజ్ఞానం ఉందని వివిధ ఆధారాల ద్వారా తెలుస్తోంది. కరీంనగర్‌ జిల్లాలోని ఒక ప్రాంతంలో కమ్మరి కొలిమి బయటపడింది. కరీంనగర్, వరంగల్‌ జిల్లాల్లోని ఇనుప ఖనిజ నిక్షేపాలను శాతవాహనులు ఉపయోగించుకున్నట్లుగా ఆధారాలున్నాయి. రాతి యుగంలోనే ఇనుము పరిశ్రమ ఉన్నట్లుగా ఆయా ప్రాంతాల్లో ఆధారాలు లభించాయి. శాతవాహనులు బంగారాన్ని ఆభరణాల్లో మాత్రమే ఉపయోగించి ఉండవచ్చు. కుషాణులలా వీరు బంగారు నాణేలను ముద్రించలేదు. వీరు ప్రధానంగా సీసంతో చేసిన నాణేలను ముద్రించారు. ఇవి దక్కన్‌ పీఠభూమి ప్రాంతంలో లభించాయి. వీరు రాగి, కంచు నాణేలను కూడా ముద్రించారు.
ప్లీని (క్రీ.శ. మొదటి శతాబ్దంలో వచ్చిన గ్రీకు యాత్రికుడు) కథనం ప్రకారం ఆంధ్ర సామ్రాజ్యం లక్ష మంది కాల్బలం, రెండువేల గుర్రాలు, వెయ్యి ఏనుగులను కలిగిన సైన్యాన్ని పోషించేది. దీని వెనుక పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రజానీకం ఉండేదని, వారు పెద్ద సైన్యాన్ని పోషించగలిగే అదనపు ఆహారాన్ని ఉత్పత్తి చేసేవారని ఊహించవచ్చు. 
కరీంనగర్‌ జిల్లాలోని పెద్ద బంకూరులో క్రీ.పూ. 200–క్రీ.శ. 200 మధ్యకాలంలో కాల్చిన ఇటుకలు, ఇంటి పైకప్పుల్లో సమతలంగా ఉన్న పెంకులను వినియోగించినట్లు ఆధారాలున్నాయి. ఈ ప్రాంతంలో మురుగునీటిని సంబంధిత గుంటల్లోకి తీసుకువెళ్లే మూతమూసిన కాలువలు కూడా బయటపడ్డాయి. ఆంధ్రప్రాంతంలో 30 కోటలు కలిగిన పట్టణాలు, అసంఖ్యాక గ్రామాలు ఉన్నట్లుగా మెగస్తనీస్‌ పేర్కొన్నాడు. రెండో, మూడో శతాబ్దాలకు చెందిన అనేక పట్టణాల వివరాలు కూడా శాసనాలు, తవ్వకాల ద్వారా తెలుస్తోంది.
యజ్ఞశ్రీ శాతకర్ణి చేనేత పనివారి శ్రేణికి 1,000 కార్షాపణలు, వడ్రంగి పనివారి శ్రేణికి 2,000 కార్షాపణలు, నూనె గానుగ పనివారి శ్రేణికి 5,000 కార్షాపణాలు డిపాజిట్‌ చేసినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది.
Jobs In ICDS: ఐసీడీఎస్‌లో వివిధ పోస్టుల భర్తీ.. ఈనెల 23న కంప్యూటర్‌ టెస్ట్‌
మత విధానాలు
దేవతలు, ఆరాధ్య వృక్ష జంతుగణాలు, వైదిక క్రతువుల వివరాలు క్రీ.శ.2వ శతాబ్ది నాటి బౌద్ధమత వికాసం గురించి తెలుపుతున్నాయి. నాగానిక వేయించిన శాసనంలో తనను తాను ‘దీఖవ్రత యజ్ఞసుంద’, ‘యజ్ఞహుత ధూపన సుగంధాయ’గా వర్ణించుకుంది. అదేవిధంగా గౌతమీ బాలశ్రీ నాసిక్‌ శాసనంలో రాజర్షి వధువు (వైదిక మతానుయాయ అయిన రాజుకు ధర్మపత్ని)గా ప్రకటించుకుంది. నానాఘాట్‌ శాసనం ప్రారంభంలో ఇంద్ర, ధర్మ, లోకపాలక, సంకర్షణ, వాసుదేవులను, సూర్య, చంద్రులను స్తుతించే అంశాలున్నాయి. శాతకర్ణి కుమారుల్లో ఒకరికి వేదసిరి అనే పేరుండటం, తర్వాతి రాజులకు యజ్ఞశ్రీ తదితర పేర్లు ఉండటం లాంటివి వైదిక మతం పట్ల శాతవాహనుల గౌరవ, ఆదరణలను సూచిస్తున్నాయి. రామాయణ, మహాభారతంలోని ఘట్టాలను గృహాల్లో చిత్రపటాలుగా అలంకరించుకున్నట్లు అధారాలు లభించాయి. గాథాసప్తశతిలో కృష్ణలీలలను వర్ణిస్తూ రాసిన కొన్ని కథలు పౌరాణికం, ఇతిహాసం, మతానికి ఉన్న ప్రజాదరణ గురించి తెలుపుతున్నాయి. ఉషవదత్తుని శాసనాలు కూడా అతడి వైదిక మతాభిమానం; బ్రాహ్మణ పోషణ; ప్రభాస, పుష్కర మొదలైన తీర్థ్ధయాత్రల సందర్శన గురించి వివరిస్తున్నాయి.
జైనమతం: శాతవాహన వంశ స్థాపకుడైన సిముకుడు జైన మతాన్ని ఆదరించేవాడని అనేక ప్రాచీన జైన గ్రంథాల ద్వారా తెలుస్తోంది. తర్వాత కాలంలో రెండో శాతకర్ణి జైనమతాచార్యుడైన కొండ కుందాచార్యుని ఆగ్రహానికి గురయ్యాడనీ, జైనాచార్యుడు శాతవాహనుల అధికారాన్ని నిర్మూలించడానికి భారతదేశానికి శకులను ఆహ్వానించాడని కొన్ని జైన గ్రంథాల్లో పేర్కొన్నారు.
బౌద్ధమతం: భద్రయానీయ శాఖకు చెందిన బౌద్ధులకు గౌతమీ బాలశ్రీ నాసిక్‌లో గుహాలయాన్ని తొలిపించింది. క్షత్రియుడైన ఉషవదత్తుడు నాసిక్‌ వద్ద కొన్ని గుహలను తొలిపించి వాటి నిర్వహణ కోసం వేలాదిగా కార్షాపణాలను దానం చేశాడు. మహా సాంఘికుల్లోని చైత్యాక, శైల, పూర్వశైల, అపరశైల శాఖలు కూడా తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రజాదరణ పొందాయి. నాటి హీనయాన బౌద్ధం లేదా మహాథేరవాదం కూడా తెలంగాణలో నేటికీ కొనసాగుతూనే ఉంది. వీరికి, సాంఘికవాదులకు మధ్య వీరిద్దరినీ సమీకరించే దృష్టితో బహుతృతీయ అనే మరోశాఖ కూడా తెలంగాణ బౌద్ధుల్లో కనిపిస్తుంది.
TGCHE: దోస్త్‌ ఇంట్రా స్లైడింగ్‌ తేదీలు ఇవే..
శిల్పకళ – సేవలు
గుడిమల్లం (చిత్తూరు జిల్లా)లో ఇటీవల జరిపిన తవ్వకాల్లో బయటపడిన దేవాలయ శిథిలాలు శాతవాహన యుగానికి చెందినవే అనే అభిప్రాయం ఉంది. బౌద్ధశిల్పాలకు బుద్ధుని జీవితంలోని పంచ కల్యాణాలు, బుద్ధ జాతక కథలు, సామాన్య జీవిత దృశ్యాలు కథా వస్తువులు. కృష్ణాలోయలోని స్తూపాల్లో చాలావాటికి నాలుగు దిక్కుల్లో వేదికలు, వాటిపై విదేశీ ‘ఆయక స్తంభాలు’ ఉండేవి. ఇవి పంచ కల్యాణాలను (బుద్ధుని జననం, మహాభినిష్క్రమణ, సంబోధి, ధర్మచక్ర పరివర్తనం, మహా పరినిర్యాణం) సూచిస్తాయి.
విహారం: వర్షాకాలంలో బౌద్ధ బిక్షువుల నివాసానికి ఉద్దేశించినవి విహారాలు.
చైత్యం: పూజా వస్తువుగా చైత్యం లేదా బుద్ధ విగ్రహం ఉండి నిత్యార్చనకు ఉపయోగించే ఆలయమే చైత్యగృహం లేదా చైత్యాలయం.
సంఘారామం: ఒకే ఆవరణలో మూడు, నాలు­గు విహారాలుండి, అధ్యయనానికి అనుకూలమైనది సంఘారామం.
చిత్ర కళలు
అజంతా 10వ గుహలోని ‘శ్వేతగజ జాతక’ చిత్రం శాతవాహన యుగానిదే. నాటి ప్రజలు రా­మాయణ భాగవతాది పురాణ గాథలను ఇళ్ల గోడలపై చిత్రించుకునే వారని గాథాసప్తశతి ద్వారా తెలుస్తోంది.
Puzzle of the Day (21.08.2024): Maths Missing Number Puzzle
సాహిత్య సేవ
శాతవాహన రాజులు సాహిత్య ప్రియులు.  వీరి రాజ్యభాష ప్రాకృతం. ప్రాకృత భాషా వికాసానికి వీరు చాలా కృషి చేశారు. కుంతల శాతకర్ణి అంతఃపురంలో ప్రాకృతభాషను ఉపయోగించినట్లు రాజశేఖరుడు తన ‘కావ్య మీమాంస’లో పేర్కొన్నాడు. హాలుడు సంకలితపరిచిన ‘గాథాసప్తశతి’ ద్వారా నాటి సామాన్య ప్రజలు కూడా ప్రాకృత భాషలో కవితలు చెప్పగలిగేవారని, కేవలం రాజాదరణ వల్లే కాకుండా ప్రజాదరణ వల్ల కూడా సాహిత్య వికాసం జరిగిందని తెలుస్తోంది. శక–క్షత్రువుల శాసనాలు చాలావరకు సంస్కృత భాషలో ఉన్నాయి.
యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించిన ద్వైభాషిక నాణేలపై ప్రాకృతం కాకుండా ఉన్న మరో భాష తెలుగేనని డి.సి.సర్కార్‌ నిర్ణయించారు. ఆచార్య నాగార్జునుడు (భారతదేశ ఐన్‌స్టీన్‌) రచించిన సుహృల్లేఖ(స్నేహితునికి లేఖ) గ్రంథాన్ని నాటి పాఠ్యాంశాల్లో భాగంగా చేర్చి, విద్యార్థులతో కంఠస్థం చేయించేవారని ఇత్సింగ్‌ రచనల ద్వారా తెలుస్తోంది.
ఆర్యమంజూశ్రీ రాసిన ‘కల్పసూత్రం’, గుణాఢ్యుడి ‘బృహత్కత’, శర్వవర్మ రాసిన ‘కాతంత్ర వ్యాకరణం’, ఆర్యదేవుడు రాసిన ‘చిత్తశుద్ధి’ మొదలైనవి శాతవాహనుల కాలంనాటి ప్రముఖ గ్రంథాలు. 
POWERGRID Apprenticeship Recruitment: పవర్‌గ్రిడ్‌లో వెయ్యికి పైగా ఖాళీలు.. నోటిఫికేషన్‌ విడుదల

Published date : 21 Aug 2024 12:34PM

Photo Stories