Success Story: పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ.. కలెక్టర్ అయ్యానిలా..
అందుకోసం మధ్యలో చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చినా అందివచ్చిన అవకాశాలను ఆసరాగా చేసుకుని జీవిత ఉన్నత శిఖరాలకు మెట్లుగా మలచుకున్నాడు. ఓ దశలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమితులైనా అంతటితో సంతృప్తిచెందకుండా అనుకున్న లక్ష్య సాధన కోసం అహర్నిశలు శ్రమించాడు. తన ఆశయూన్ని నెరవేర్చుకునేందుకు ఓ దశలో అజ్ఞాతంలోకి(కుటుంబానికి, మిత్రులకు దూరంగా) వెళ్లాడు. సమస్యలనే సాధనంగా చేసుకుంటూ ఆశయూన్ని అందుకున్నాడు. ఆయనే కలెక్టర్ సి. నారాయణరెడ్డి.
కుటుంబ నేపథ్యం..
మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలంలోని శ్రీపురం అనే గ్రామంలో చింతకుంట చెన్నారెడ్డి, నర్సింగమ్మ దంపతుల ఆరో సంతానం మన జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి. నలుగురు అన్నలు, ఓ అక్క తర్వాత జన్మించిన ఆయనది వ్యవసాయ కుటుంబ నేపథ్యమే. చిన్నపాటి వ్యవసాయం ఉన్న ఆ కుటుంబంలో తండ్రితో పాటు నలుగురు అన్నలు కూడా వ్యవసాయమే చేసేవారు. అయితే, ఏడో తరగతి చదువుతున్నప్పుడే తండ్రి చెన్నారెడ్డి కన్నుమూశారు. అప్పటినుంచీ అన్నలే ఆయనకు అన్నీ అయి పెంచి చదివించారు.తండ్రి చనిపోవడంతో ఆయన చదువుకునే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
చదువుకుంటూ.. పెట్రోల్ పంపులో పనిచేస్తూ..
అన్నలు ప్రోత్సహించి చదివించినా, ఖాళీ ఉన్నప్పుడల్లా పొలానికి వెళ్లి వ్యవసాయ పనులు చేసేవారు. పదోతరగతి పూర్తయిన తర్వాత ఇక చదవకూడదని, ఏదైనా పనిచేసి కుటుంబానికి ఆసరాగా నిలవానుకున్నారు. వెంటనే హైదరాబాద్ వెళ్లి ఓ పెట్రోల్ పంపులో పనిచేశారు. అయితే, పదోతరగతిలో మంచి మార్కులు రావడంతో జూనియర్ కళాశాల యాజమాన్యం ఉచితంగా చదువు చెప్తామనడంతో ఇంటర్‌లో చేరారు. ఇంటర్ తర్వాత కూడా చదువు భారమవుతుందేమోనని భావించిన ఆయన అప్పుడు పెయింటర్‌గా పనిచేశారు. మళ్లీ ఇంటర్‌లో మంచి మార్కులు రావడంతో డిగ్రీలో చేరారు. 3వ తరగతి వరకు శ్రీపురంలో, 4 నుంచి 7 వరకు పక్కనే ఉన్న కల్వాల్‌లో, 8 నుంచి ఇంటర్‌వరకు మక్తల్‌లో, డిగ్రీ నారాయణఖేడ్‌లో చదివిన నారాయణరెడ్డి బీఈడీ కోర్సును ఉస్మానియా యూనివర్శిటీలో చదివారు.
టీచర్ ఉద్యోగం వచ్చిన కూడా..
ఆ తర్వాత ఎంఎస్సీ( మ్యాథ్స్) కూడా చేశారు. ఆ తర్వాత డీఎస్సీ రాసి టీచర్ ఉద్యోగం సంపాదించారు. 2008లో గ్రూప్-1 రాసి మొదటి ప్రయత్నంలోనే స్టేట్ 4వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం సంపాదించారు. బీఈడీలో, డీఎస్సీలో కూడా ఆయన రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. 2011లో గద్వాల ఆర్డీఓగా, ఆ తర్వాత 2011లో పెద్దపల్లి ఆర్డీఓగా, అనంతరం ఈ ఏడాది జూలైలో సూర్యాపేట ఆర్డీఓగా పనిచేసిన ఆయన జిల్లాల విభజన నేపథ్యంలో నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు.
జేబులో చిల్లిగవ్వ లేకుండానే వారాల పాటు..
జేసీ నారాయణరెడ్డికి చిన్నప్పటి నుంచి చదువుకోవాలనే కోరిక బాగా ఉండేది. అందుకే అన్ని క్లాసుల్లోనూ ఫస్ట్ వచ్చేవారు. అయితే, ఇంటర్ తర్వాత డిగ్రీలో ఉన్నప్పుడే ఆయన ఓ అవగాహనకు వచ్చారు. చదువే ఆయుధమని, ఆ ఆయుధాన్ని ఉపయోగించుకుని జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు.వంశవృక్షంలో ఎక్కడో ఓ చోట టర్న్ రావాలని, ఆ టర్న్‌కు కారణం తానే కావాలని కలలు కన్నారు. ఇక, ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లిన తర్వాత జీవితంపై ఆయనకు ఓ స్పష్టత వచ్చింది. ఉస్మానియాలో ఉన్నప్పుడు జేబులో చిల్లిగవ్వ లేకుండా వారాల పాటు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
ఈ ఉద్యోగం చేస్తున్నావా అని.. అవమానించారు..
ఈ క్రమంలోనే కష్టపడి చదివి డీఎస్సీ రాసి మహబూబ్‌నగర్ జిల్లా టాపర్‌గా నిలిచారు. అయితే, 2006 డీఎస్సీలో ఎంపికైన వారికి పోస్టింగ్‌లు ఇవ్వడం ఆలస్యమైంది. దీంతో మక్తల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేశారు. అప్పుడు ఆయన జీతం నెలకు రూ.2,500మాత్రమే. అప్పటికే ఎమ్మెస్సీ, బీఈడీ అయిపోవడంతో అక్కడ పనిచేస్తున్న వారంతా ఆయన్ను నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశారు. ఇంత చిన్న ఉద్యోగం ఎందుకు చేస్తున్నాడో అని హాస్య ధోరణిలో మాట్లాడుకోవడం ఆయనకు ఇబ్బంది అనిపించింది.
నేను చదివిన స్కూల్‌లోనే ఉద్యోగం..
రెండు నెలలకే ఆ ఉద్యోగాన్ని మానేసి మేనమామలు ఇచ్చిన ఆర్థిక భరోసా హైదరాబాద్‌లోని ఆర్‌సీ రెడ్డి ఇనిస్టిట్యూట్‌లో గ్రూప్స్ శిక్షణకు వెళ్లారు. అయితే, 2008లో ఆయనకు డీఎస్సీ పోస్టింగ్ ఇచ్చారు. తాను చదివిన కల్వాల్ పాఠశాలలోనే ఉద్యోగం వచ్చింది. ఉన్న ఊరే అయినా ఓ రూం అద్దెకు తీసుకుని చదువుకున్నారు నారాయణరెడ్డి. బడిలో పాఠాలు చెప్పడం, ఇంట్లో తినడం, రూంకు వెళ్లి చదువుకోవడమే పనిగా పెట్టుకున్నారు.
నాకు ఎప్పుటికి ఈ బాధ ఉంటుంది..
తన జీవిత ప్రస్థానం గురించి చెపుతూ జేసీ నారాయణరెడ్డి ఎంతో ఆర్ద్రతతో చెప్పిన ఓ మాట నిజంగా ఈనాటి యువతకు స్ఫూర్తిదాయకమే. ‘అయ్యో... నేను సివిల్స్ ఎందుకు రాయలేదు.. అని అప్పుడుప్పుడూ బాధపడుతుంటా... నాకు ఎప్పుడూ ఆ బాధ ఉంటుంది.’ అని చెప్పారు. ఆయన ఏ పరీక్ష రాసినా మంచి మార్కులే... ఏ పోటీ పరీక్షలోనయినా టాప్ ర్యాంకులే... అలాంటి సమయంలో సివిల్స్ రాసి ఉంటే మంచి ఫలితమే సాధించేవారు.. కానీ, ఆర్థిక అనివార్యత, జీవితంలో పడ్డ కష్టాలు ఆయనను ఏదో ఉద్యోగంలో చేర్పించాయి. కానీ, తన ఉద్యోగంలో కూడా నిబద్ధత ప్రదర్శిస్తూ సివిల్స్ రాయలేదనే బాధను అధిగమిస్తూ ఆయన ఉన్నతాధికారి స్థానానికి వచ్చారు. అంటే మనకున్న పరిమితుల్లో సర్దుకుపోతూనే ఉన్నత స్థానానికి వెళ్లాలన్న భావన జేసీ నారాయణరెడ్డి జీవితంలో స్పష్టంగా కనిపిస్తోంది.
Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా లక్ష్యాన్ని మాత్రం మరువలేదు..
వెంటనే అజ్ఞాతవాసంలోకి..
ఇక, ఆ సమయంలో మరోసారి నారాయణరెడ్డి తన లక్ష్యాన్ని నెమరువేసుకున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్ చదివేంత శక్తి ఇచ్చిన మెదడు... ఉద్యోగాన్ని కూడా సాధించి పెడుతుందని, అది జరగాల్సిందేనని భీష్మించుకున్నారు. వెంటనే అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. అంటే... ఎక్కడికో వెళ్లలేదు... చదువే పనిగా పెట్టుకుని కుటుంబానికి, స్నేహితులకు, ఇతర కార్యక్రమాలకు సమయం ఇవ్వలేదు. ఉదయం 5:30 నుంచి రాత్రి 11:30 వరకు ఒకటే పని... చదువుకోవడమే.
ఆశలు సమాధి..
కాలకృత్యాలు తీర్చుకోవడం, భోజన విరామ సమయాల్లో తప్ప ఆయన ఎప్పుడూ పుస్తకాలను అంటిపెట్టుకునే ఉండేవారు. 2007 జనవరి నుంచి 2008 ఆగస్టు వరకు ఆ పద్ధతిలోనే చదువుకుని గ్రూప్-1 ఉద్యోగం రాశారు. అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయమేంటో తెలుసా... గ్రూప్-1 ద్వారానే తనకు కొత్త జీవితం రావాలి. లేదంటే తన ఆశలు సమాధి అయిపోవాలని నిర్ణయించుకున్నారంటే ఎంత పట్టుదలగా ప్రయత్నించారో అర్థం చేసుకోవచ్చు. ఇంత కష్టపడ్డా తానెప్పుడూ ఒత్తిడిని ఎదుర్కోలేదని నారాయణరెడ్డి ధీమాగా చెప్పారంటే ఎంత కష్టమయినా ఎదుర్కోవాలనే ఆయన పట్టుదలతో పాటు ఆయన చేసిన శ్రమ ఆయుధాలయ్యాయి.
కష్టానికి నిర్వచనంగా ఆయనను విజయతీరాల వైపు తీసుకెళ్లాయి. అందుకే ఆయన కూడా పట్టుదల, శ్రమ అనే ఆయుధాలను ఉపయోగించుకుని జీవితాన్ని మార్చుకోవాలని నేటి యువతకు చెపుతున్నారు. శ్రమయే వజయేత అనే సూక్తికి నిలువుటద్దంగా నిలిచిన మన జేసీ నారాయణరెడ్డి జీవితాన్ని, ఆయన ఎదుర్కొన్న కష్టాలను ఆదర్శంగా తీసుకుని, స్ఫూర్తి పొంది జిల్లా యువత తమ తమ జీవితాల్లో విజయతీరాలను చేరాలని ఆకాంక్షిస్తోంది.
పనితీరులో.. ఈ కలెక్టర్ రూటే వేరు..
ములుగు జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో.. జిల్లా పాలనలో తనదైన మార్క్ వేశారు. పనితీరుతో ప్రజలను ఫిదా చేశారు. జిల్లా అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల అమలు కోసం ఆయన పని చేస్తున్న తీరు స్థానిక ప్రజల మన్ననలు పొందారు. నిత్యం ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉంటూ ప్రజలకు అధికారులకు అందుబాటులో ఉన్నారు. ఇక ఇంతకు ముందు కలెక్టర్ లకు భిన్నంగా , ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతూ నూతన కార్యక్రమాలు చేపడుతూ నూతనంగా ఏర్పడిన ములుగు జిల్లాలో తనదైన ముద్ర వేశారు .
Success Story: ట్యూషన్లు చెప్పుతూ.. రిసెప్షనిస్టుగా పనిచేస్తూ.. ఐపీఎస్ అయ్యానిలా..
15 కిలోమీటర్ల మేర సైకిల్‌పై..
ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్‌తో పాటు జిల్లా ఉన్నతాధికారులను భాగస్వామ్యం చేస్తూ..వివిధ విన్నూత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈయన గ్రామాల్లో శ్రమదానం చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఏ గ్రామంకు వెళ్లిన ఆ గ్రామ ప్రజలతో కలిసి పోతూ అందరిలో ఒక్కడిగా ఉన్నారు. ఇక అంతే కాదు గోవిందరావుపేట మండలం మచ్చాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఎస్పీతో కలిసి కలెక్టర్ 15 కిలోమీటర్ల మేర సైకిల్‌పై వెళ్లారు. అనంతరం గ్రామస్థులతో కలిసి చెత్తాచెదారాన్ని తొలగించారు. సామాన్యుల తో కలిసి ఓ ఐఏఎస్ అధికారి పని చేస్తున్న తీరు చూసి ములుగు జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేశారు.
తాను కలెక్టర్ అనే హోదా మరిచిపోయి..
గోవిందరావుపేట మండలం రంగాపురం గ్రామంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన కలెక్టర్ అక్కడ రైతులు వ్యవసాయ కూలీలు నాటు వేస్తుండడాన్ని గమనించిన తాను కలెక్టర్ అనే హోదా మరిచిపోయివారితో కలిసిపోయారు. సామాన్య కూలీలాగా వారితో కలిసి నాట్లు వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తాను కూడా రైతు బిడ్డనేనని డిగ్రీ వరకు చదువుతూ వ్యవసాయ పనులు చేశానని రైతు కూలీలతో కాసేపు ముచ్చటించారు.
విధులలో నిర్లక్ష్యం వహింస్తే అంతే..
అనుమతి లేకుండా జిల్లా అధికారులు, ఆయా శాఖల ఉద్యోగులు, సిబ్బంది విధులకు గైర్హాజరైతే కఠినంగా ఉంటా.. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండి ఆలస్యంగా వస్తే ఊరుకోను... ఈ విషయాల్లో ఇప్పటికే ములుగు జిల్లాలో 26 మందిని సస్పెండ్ చేసి వచ్చాను’. అంటూ.. నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణరెడ్డి సున్నితంగా హెచ్చరించారు. విధులను నిర్లక్ష్యం చేయకుండా ఫ్రెండ్లీగా పని చేసుకుందామన్నారు.
ఓ సాధారణ వ్యక్తిలా..
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ ఆకస్మిక తనిఖీ కోసం కలెక్టర్ సైకిల్‌పై ఆస్పత్రికి వెళ్లారు. తాను బస చేస్తున్న ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి అధికారులకు, సెక్యూరిటీకి సమాచారం ఇవ్వకుండా.. ఎన్టీఆర్ చౌరస్తా, బస్టాండ్ మీదుగా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. ఓ సాధారణ వ్యక్తిలా ఆయన ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. అందుబాటులో ఉన్న సిబ్బంది నుంచి ఆస్పత్రిలో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలు తెలుసుకున్నారు. ఉదయం విధుల్లో ఉండాల్సిన డాక్టర్లు, ఇతర సిబ్బంది హాజరు కాకపోవడంతో వారికి మెమోలు జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్ వైపు..నా సక్సెస్‌కు కారణం వీరే..
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...
Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..