Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..
మరోసారి ఎట్టి పరిస్థితిల్లోనూ తప్పులు పునరావృతం కాకూడదు.. ఒత్తిడికి తలొగ్గకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వరుస వైఫల్యాలనే విజయానికి బాటగా మార్చుకున్నానంటున్న 44వ ర్యాంకర్ సృజన సక్సెస్ స్టోరీ ఆమె మాటల్లోనే..
చివరి ప్రయత్నంలో..
నాన్న ఐఏఎస్ అధికారి కావడం, ఆ హోదాతోనే ప్రజలకు ప్రత్యక్షంగా సేవచేయగలమన్న గట్టి నమ్మకమే ఐఏఎస్‌ను లక్ష్యంగా నిర్దేశించుకోవడానికి ప్రధాన కారణం. 2007లో హెచ్‌సీయూలో ఎంఏ పూర్తిచేయగానే సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించి వరుసగా మూడేళ్లు పరీక్ష రాశాను. ఈ మూడుసార్లూ విఫలమయ్యా. ఈ మధ్యలో గ్రూప్-1 రాయడం, లే సెక్రటరీగా ఎంపిక కావడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇదే సివిల్స్ చివరి ప్రయత్నంలో 44వ ర్యాంకు సాధించడానికి తోడ్పడింది.
మనస్సు మార్చుకుని.. ఆశయం వైపు..
2008, 2009లో పొలిటికల్ సైన్స్, సైకాలజీ ఆప్షన్స్‌తో హాజరయ్యాను. కానీ విజయం లభించలేదు. దీంతో లోపం ఎక్కడ అని అన్వేషించాను. ఆప్షనల్స్ సిలబస్ విషయంలో సమయం ప్రధాన సమస్యగా గుర్తించాను. అకడెమిక్స్ వేరు.. కాంపిటీటివ్ అందులోనూ యూపీఎస్సీ సివిల్స్ వేరు అని తెలుసుకున్నాను. లోపాలు, పొరపాట్లు అన్నీ తెలిశాయి. కానీ ఉన్నది ఒకే ఛాన్స్. వెంటనే రాస్తే.. పూర్వ అనుభవం ఎదురవుతుందనే భయం నెలకొంది. దీంతో రెండేళ్లు గ్యాప్ ఇచ్చాను. నాలుగోసారి సైకాలజీ బదులు ఫిలాసఫీతో హాజరయ్యాను. పొలిటికల్ సైన్స్ నా కోర్ సబ్జెక్టు కావడంతో దాన్ని మరో ఆప్షనల్‌గా తీసుకున్నాను.
ప్రిపరేషన్ సాగిందిలా..
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటే ఒక పోరాటమే. ఎంత కోచింగ్ తీసుకున్నప్పటికీ స్వీయ ప్రణాళిక లేకపోతే వృథానే. అందుకే కోచింగ్ తీసుకుంటూనే, అటు జనరల్ స్టడీస్, ఇటు ఆప్షనల్స్ విషయంలో ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించి ప్రామాణిక పుస్తకాలను చదివి, సొంత నోట్స్ రూపొందించుకున్నాను. ప్రతి రోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు చదివాను.
ఇంటర్వ్యూ 25 నిమిషాలు:
ప్రొఫెసర్ పురుషోత్తమ్ అగర్వాల్ బోర్డ్ నన్ను ఇంటర్వ్యూ చేసింది. మొత్తం 25 నిమిషాలపాటు సాగిన ఇంటర్వ్యూలో నేను చెప్పే ప్రతి సమాధానాన్ని వారెంతో సహనంతో విన్నట్లే అనిపించింది. దీంతో ఇంటర్వ్యూలోనూ రాణిస్తానని, తుది ఫలితాల్లో నిలుస్తాననే నమ్మకం కలిగింది.
ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు..
➤ చాణక్య పొలిటికల్ ఫిలాసఫీ ఏంటి?
➤ పర్యావరణ సమస్య, అభివద్ధిపై ప్రభావం?
➤ ఆంధ్రప్రదేశ్‌లో నక్సలిజం తగ్గుముఖం పడుతోంది. కారణమేంటి?
➤ మహిళా సాధికారత అంటే ఏంటి?
➤ వరకట్న నిషేధ చట్టం గురించి చెప్పండి?
➤ కర్నాటక్ మ్యూజిక్ గురించి వివరించండి?
ఇదే నా అదృష్టం..
మూడుసార్లు ఓటమి ఎదురైనా ఎప్పుడూ ఒత్తిడికి గురి కాకపోవడమే నా అదృష్టం. ఈ విషయంలో ప్రధానంగా నాన్న బలరామయ్య, ఇతర స్నేహితులు అందించిన సహకారం మరవలేనిది. ఎన్నడూ, ఎవ్వరూ నిరుత్సాహపరచలేదు. దానికి బదులు నువ్వు సాధిస్తావు అని వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఇదే నా విజయానికి ప్రధాన కారణం.
ప్రశ్న : ఐఏఎస్‌కు ఎలా సన్నద్ధమయ్యారు...?
జవాబు : నా చదవంతా హైదరాబాదులోనే కొనసాగింది. బీఏ సైకాలజీ డిగ్రీ హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్ హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీ, పీహెచ్‌డీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పూర్తి చేశాను. ఐఏఎస్ అధికారి కావాలనే సంకల్పంతో పట్టుదలతో చదివాను. పొలిటికల్ సైన్స్, సైకాలజీ సబ్జెక్టులను ఎంచుకుని సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను. ఎంత సబ్జెక్టు ఉంది, ఎన్ని గంటలు చదవాలి అన్న అంశాలను ముందస్తుగానే ప్రణాళిక రూపొందించుకుని రోజుకు ఏడు నుంచి 8 గంటల పాటు చదివాను. ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు.
ప్రశ్న : ఐఏఎస్ అధికారే ఎందుకు కావాలని అనుకున్నారు?
జవాబు : మా నాన్న బలరామయ్య ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. ఐఏఎస్ అధికారికి ఎన్ని అధికారాలు ఉంటాయో, ప్రజాసమస్యలను పరిష్కరించడానికి ఎంత అవకాశం ఉంటుందో ఆయన పనిచేసినప్పుడే గమనించాను. ఆయన స్ఫూర్తితో నేను కూడా ఐఏఎస్ అధికారి కావాలనుకున్నా. ఆ సంకల్ప బలం నన్ను ముందుకు నడిపింది. ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా సివిల్స్ రాయడంతో తొలి రెండు ప్రయత్నాల్లో విఫలమయ్యా. ఓ సంవత్సరం సివిల్స్ రాయకుండా గ్రూప్-1 పరీక్ష రాసి వైద్యశాఖలో ఉద్యోగం సాధించా. ఆ ఉద్యోగం చేస్తూనే ఆఖరి ప్రయత్నంగా సివిల్స్ రాసి 44వ ర్యాంకు సాధించా.
ప్రశ్న : రాజకీయాలపై మా అభిప్రాయం?
జవాబు : మా అమ్మ సుగుణశీల చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం పూడి గ్రామ సర్పంచిగా ఉన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అనేక మార్గాలున్నాయి. రాజకీయాల్లోకి వెళితే ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలనే పరీక్షలను ఎదుర్కోవాలి. అదే ఐఏఎస్ అధికారిగా ఏంపికైతే ప్రజాసేవ చేయడానికి 30 సంవత్సరాల సమయం ఉంటుంది. ప్రజాసమస్యలను అర్థం చేసుకుని నూతన పథకాలను ప్రవేశపెడితే దీర్ఘకాలంపాటు ప్రజలకు ఉపయోగ పడతాయనేది నా నమ్మకం.
నా సలహా:
సివిల్స్ అభ్యర్థులకు నేను చెప్పే సలహా.. పుస్తకాలతో గంటలకొద్దీ కుస్తీ పడే వారిని చూసి ఆందోళన చెందొద్దు. చదివిన కొద్దిసేపైనా ఏకాగ్రతతో, నిజాయతీగా కష్టపడి చదివి విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. సిలబస్‌ను నిర్దిష్ట సమయంలోపు పూర్తి చేసుకునేలా స్వీయ ప్రణాళిక అనుసరించాలి. ఈసారి మెయిన్స్ ప్యాట్రన్ మారి జీఎస్‌కు ప్రాధాన్యం పెరిగింది కాబట్టి ఇప్పట్నుంచే పకడ్బందీ వ్యూహం పాటించాలి.
సృజన కుటుంబ నేపథ్యం:
తండ్రి: జి. బలరామయ్య ఐఏఎస్ అధికారి
తల్లి: సుగుణశీల (గృహిణి)
భర్త: రవితేజ (హైకోర్ట్ అడ్వకేట్)
సోదరుడు: చార్వాక్ (ఎంబీఏ)
అకడెమిక్ ప్రొఫైల్..
☛ పదో తరగతి (2000)- 520 మార్కులు
☛ ఇంటర్మీడియెట్ (2002)- 899 మార్కులు
☛ బీఏ (2005)- 69 శాతం
☛ హెచ్‌సీయూలో ఎంఏ(పొలిటికల్ సైన్స్-2007)- 85 శాతం (యూనివర్సిటీ టాపర్)
☛ 2008లో శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో పీహెచ్‌డీకి నమోదు
☛ 2009-11: రెడ్డీస్ ఫౌండేషన్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా విధులు
☛ 2013 ఏప్రిల్‌లో పీహెచ్‌డీ ప్రదానం.
☛ 2013 మేలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో లే సెక్రటరీగా నియామకం.
నా భర్త రవితేజ కూడా...
ఈ ఇద్దరి కుటుంబ నేపథ్యాలు వేరువేరు కాదు కొంచెం ఘనమైనవి కూడా. రవితేజ ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు వాసిరెడ్డి కృష్ణారావు మనవడు. సృజన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గుమ్మళ్ల బలరామయ్య కూతురు. ఈ భిన్నాలు వీళ్లలోనూ ఉన్నాయి. రవితేజ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకు. సృజన.. పుస్తకాల పురుగు. ఆ సంఘజీవికి.. ఈ ఇంట్రావర్టిస్ట్‌కి స్నేహం ఎలా కుదిరింది?.
సెంట్రల్ యూనివర్సిటీలో..
‘నేను అప్పుడు పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. తేజ.. విజయవాడలో లా చదువుతున్నాడు. సమతా విద్యార్థి సమాఖ్య మీటింగ్స్ కోసం తరచుగా యూనివర్సిటీకి వచ్చేవాడు. నేను స్టూడెంట్ పాలిటిక్స్‌లో యాక్టివేం కాదు.. కానీ సంఘీభావం తెలపడానికి మీటింగ్స్‌కు అటెండ్ అయ్యేదాన్ని. అలా అతను పరిచయం’ అని చెప్తుంది సృజన.
ప్రణయం.. పరిణయం..
‘ఓ మూడు నెలల తర్వాత అనుకుంటా.. నేనే చెప్పాను తనతో నువ్వంటే ఇష్టం అని’ సృజన అంటుంటే.. ‘అలా ఏం లేదు.. నాకూ అనిపించింది. నేను మొదటి నుంచి ఫంకి, చింకి, కెరీరిస్ట్ అమ్మాయిలకు చాలా దూరం. సృజన అందుకు భిన్నం. అందుకే చాలా నచ్చింది’ అన్నాడు రవితేజ. ‘కాబట్టే నేను ప్రపోజ్ చేసిన మూడు నెలలకు ఆలోచించుకుని ఓకే చెప్పాడు’ నవ్వుతూ సృజన. ‘ఒక రోజు ఈవెనింగ్ చెప్పాను.. నాతో కలసి ఉంటావా? మనిద్దరం కలసి ఉండగలం అని. విని పొద్దున్నే నువ్వన్నది నిజమేనా అని రీకన్‌ఫర్మ్ చేసుకుంది’ రవితేజ. ‘అలా నిర్ణయించుకున్న అయిదేళ్లకు పెళ్లయింది. పెళ్లనే ఫ్రేమ్‌లోకి వచ్చి మూడేళ్లయినా.. మా సహజీవనం మాత్రం ఎనిమిదేళ్ల నుంచి’ అని ప్రీషియస్ పోస్ట్‌ను జ్ఞాపకం చేసుకుంది సృజన.
నా ఈ చర్యల వల్ల సృజనకు..
‘పెళ్లికి ముందు మూడుసార్లు సివిల్స్ రాశాను.. రాలేదు. గ్రూప్‌వన్ రాసి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను కూడా. సివిల్స్‌కి ఇంకో చాయిస్ ఉంది కదా అని తేజ గుర్తు చేస్తే అప్పుడు మళ్లీ దాని మీద దృష్టి పెట్టాను. వచ్చింది. ఆ క్రెడిట్ తేజాదే’ అంటుంది ఇంతకన్నా భాగస్వామి సహకారం ఏముంటుంది అన్నట్టు. మరి తేజకు? ‘నేను హైకోర్ట్ అడ్వొకేట్‌ని. ఎన్‌కౌంటర్స్‌కి, సోంపేట ఫైరింగ్‌కు వ్యతిరేకంగా కేసులు టేకప్ చేశాను. నా ఈ చర్యల వల్ల సృజన మీద ఎంత ఒత్తిడి ఉంటుందో తెలుసు. అయినా తను ఏనాడు క్వశ్చన్ చేయలేదు. అసలు ఆ ప్రెషర్స్ తాలూకు ప్రభావం ఏదీ నా మీద పడనీయదు’ గర్వంగా చెప్తాడు రవితేజ.
కంప్లయింట్స్ అండ్ డిమాండ్స్
‘అస్సలు లేవు’ ఇద్దరూ చెప్తారు ఏక కంఠంతో. ‘తను నా ప్రిన్సిపుల్స్‌ని రెస్పెక్ట్ చేస్తుంది. నగలు, షాపింగ్‌లాంటివేమీ నా నుంచి ఎక్స్‌పెక్ట్ చేయదు’ అంటాడు. ‘తను ఏం చెప్పినా, ఏం చేసినా ఓ క్లారిటీ ఉంటుంది. ఆలోచించి చెప్తాడు, చేస్తాడు. ఒకరిపట్ల ఒకరికి ఇలాంటి గౌరవం, నమ్మకం ఉంటాయి కాబట్టి కంప్లయింట్స్, డిమాండ్స్ ఉండవ్’ అని చెప్తుంది సృజన.
కాంప్లిమెంట్స్.. ఇన్‌స్పిరేషన్..
‘నాలో నాకన్నా తేజానే ఎక్కువుంటాడు’ అని ఆమె తన ప్రేమకు కాంప్లిమెంట్ ఇస్తే, ‘ఐ లవ్ లివింగ్ విత్ హర్’ అని అతని మాట. ‘పెళ్లికి ముందు అమ్మానాన్న, ఇప్పుడు తేజ.. అమ్మానాన్న, కొడుకు, స్నేహితుడు ఎవ్రీథింగ్.. ఆయన సహచర్యం అందించిన గిఫ్ట్ ఇది’ భర్త ప్రభావం ఆమెను మురిపిస్తుంటే.. ‘సృజన వల్ల విషయాలను సిస్టమేటిక్‌గా ఎలా డీల్ చేయగలరో తెలుసుకున్నాను’ అని భార్య ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌ను ఒప్పుకుంటాడు రవితేజ నిజాయితీగా..
Manu Chowdary, IAS : అమ్మ కోసం..తొలి ప్రయత్నంలోనే
IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్ టూ 'ఐఏఎస్'..సెలవుల్లో పొలం పనులే...
Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్..
Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్ వైపు..నా సక్సెస్‌కు కారణం వీరే..
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...