IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్ టూ 'ఐఏఎస్'..సెలవుల్లో పొలం పనులే...
IAS Lakshmisha Biography In Telugu: ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘సాక్షి’తో తన జీవన ప్రయాణాన్ని పంచుకున్నారు. పేపర్‌బాయ్ నుంచి ఐఏఎస్‌గా సాగిన ప్రయాణంలో ఎదురైన ఆటుపోట్లను వివరించారు.
కుటుంబ నేపథం:
కర్ణాటక రాష్ట్రంలోని హోలుగుండనహళ్లి అనే చిన్న కుగ్రామం మాది. అమ్మ లక్ష్మమ్మ కాయకష్టం చేసి మాకు ఆకలి తీర్చేది. నాన్న గంగముత్తయ్యతో కలిసి రోజూ కూలిపనులకు వెళ్లేది. రోజంతా కష్టపడేది. అన్నయ్య, నేను తిన్న తర్వాత మిగిలింది అమ్మ తినేది. వెక్కిరించిన పేదరికాన్ని దాటుకుంటూ వ్యవసాయ శాస్త్రవేత్తగా.. ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్‌గా.. తర్వాత ఐఏఎస్ అధికారిగా సాగిన ప్రయాణంలో.. ప్రతి అడుగులోనూ అమ్మ ఆశీస్సులే కనిపిస్తాయి.
అక్కడే నా జీవితం మరో మలుపు..
అప్పట్లో వ్యవసాయ డిగ్రీకి ఎక్కువ క్రేజ్ ఉండేదని, ఈ డిగ్రీ పూర్తి చేస్తే బ్యాంకులో ఉద్యోగం వస్తుందని చెప్పేవారు. అందుకే బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకున్నాను. డిగ్రీ అయ్యాక జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ రావడంతో ఎమ్మెస్సీ కోసం అలహాబాద్ వెళ్లాను. అక్కడి నుంచి పీహెచ్‌డీ కోసం ఢిల్లీ వెళ్లాను. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్ ఫెలోషిప్ వచ్చింది. అగ్రికల్చర్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా ప్రయాణం ప్రారంభించాను. మధ్యలో సైకాలజీ కూడా చదివాను. అక్కడే నా జీవితం మరో మలుపు తిరిగింది.
నా మూలాలు మరిచిపోను...
ఎక్కడి నుంచి నా ప్రయాణం ప్రారంభమైందో నేను ఎప్పటికీ మరిచిపోను. అందుకే సమాజానికి సేవ చేయాలన్న సంకల్పంతో ఐఏఎస్ అధికారిగా మారాను. పార్వతీపురంలో పనిచేసినప్పుడు అక్కడ గిరి గ్రామాలు చూస్తే.. సొంత ఊరిలో ఉన్నట్లుగానే అనిపించింది. అందుకే ఎక్కడ పనిచేసినా ఆ ప్రాంతంలోని అన్ని సామాజిక వర్గాలను అభివృద్ధి చేయాలన్న కాంక్షతో ముందడుగు వేస్తున్నాను.
ఐఎఫ్‌ఎస్ వచ్చినా.. ఐఏఎస్ లక్ష్యంగా..
సైంటిస్టుగా చేస్తున్న రోజుల్లో సివిల్స్ ఎందుకు రాయకూడదన్న ఆలోచన మా స్నేహితుల మధ్య సరదాగా చర్చ వచ్చింది. అన్నయ్య వెంకటరమణయ్యతో మాట్లాడాను. అప్పటి వరకూ నాకున్న సందేహాల్ని అన్నయ్య మాటలతో నివృత్తి అయిపోయాయి. అప్పుడే నా మైండ్‌లో బలమైన లక్ష్యం స్థిరపడిపోయింది. 2009లో సివిల్స్ రాసినా ఫలితం లేదు. పట్టుదలతో రాస్తే 2010లో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యాను. హిమాచల్ ప్రదేశ్ క్యాడర్‌గా పోస్టింగ్ వచ్చినా సంతృప్తి కలగలేదు. ప్రయత్నం ఆపలేదు.
ఎట్టకేలకు నాలుగో ప్రయత్నంలో 2013లో 275వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఏపీ క్యాడర్‌కు ఎంపికయ్యాను. నా ఆనందానికి అవధులు లేవు. నా కంటే ఎక్కువ అమ్మ పడిన సంతోషం వెలకట్టలేనిది. కర్నూలు జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకొని కృష్ణా జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్ వచ్చింది. తర్వాత పార్వతీపురం ఐటీడీఏ పీవోగా, తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా.. ఇప్పుడు ఇలా.. మీముందు జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాను.
నా భార్య సహకారంతో..
ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత కర్ణాటకకు చెందిన జ్ఞానేశ్వరి లక్ష్మితో వివాహం జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు. పాప పేరు ఆద్వి, బాబు పేరు సిద్ధార్థ చక్రవర్తి. ఆమె గృహిణే అయినా నాకు అడుగడుగునా అందిస్తున్న సహకారం మాత్రం ఎప్పటికీ మరిచిపోలేను.
సెలవుల్లో పొలం పనులే...
పిల్లలకు సెలవొస్తే ఆటపాటలే ప్రధానం. కానీ మా జీవితంలో వాటికి తావుండేది కాదు. బడికి సెలవొస్తే.. చిన్నపాటి వ్యవసాయం చేసే నాన్న, అమ్మతో కలిసి పొలం పనులకు వెళ్లేవాళ్లం. అప్పుడప్పుడు ఊరిబయటికి వెళ్లి కట్టెలు కొట్టుకొని తీసుకొచ్చే వాళ్లం.
పేపర్ బాయ్‌గా రూ.300 వేతనం..
చిన్నతనంలో అనుభవించిన పేదరికంపై పగతోనే పగలు రాత్రి కష్టపడి చదివేవాడిని. ఇంటర్ చదివే సమయంలో నా ఖర్చుల కోసం ఇంటిపై ఆధారపడకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే మా ఫ్రెండ్స్‌తో కలిసి పేపర్ బాయ్‌గా చేరాను. నెలకు రూ.300 ఇస్తే.. వంద రూపాయిలు అమ్మకు ఇచ్చి.. మిగిలిన రూ.200 నా ఖర్చులకు ఉంచుకునేవాడిని. ఉదయం 4 గంటలకు లేచి పేపర్ వేసి.. మళ్లీ తయారై.. కాలేజీకి వెళ్లేవాడిని. ఇంటర్ పూర్తయ్యేంత వరకు ఇలానే చేశాను.