Skip to main content

Telangana Government: పాత సీనియారిటీనీ లెక్కించాలి.. విరి నియామకంలో చిక్కుముడి..

సాక్షి, హైదరాబాద్‌: గ్రామానికో రెవెన్యూ అధికారి నియామక ప్రక్రియలో సీనియారిటీ అంశం సమస్యగా మారుతోంది. మళ్లీ మాతృశాఖలోకి వస్తున్నందున తమ పాత సీనియారిటీని కూడా పరిగణనలోకి తీసుకోవాలని పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఏలు కోరుతున్నారు.
Revenue Officers issues

గత ప్రభుత్వ హయాంలో ఇతర శాఖల్లోకి వెళ్లిన తమకు సీనియారిటీ వర్తింపచేయని కారణంగా సర్వీసు కోల్పోయామని, ఇప్పుడు సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 


అయితే రెవెన్యూ ఉన్నతాధికారులు మాత్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. నియామక ప్రక్రియ ఇప్పుడే మొదలైందని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా రూపొందించలేదని, అప్పుడే సీనియారిటీ అంశాన్ని తెరపైకి తీసుకురావద్దని, ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని దాటవేస్తుండడం గమనార్హం.  

సీనియారిటీ లేకుండానే ఇతర శాఖల్లోకి.. 

గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న చాలా మంది వీఆర్వోలు, వీఆర్‌ఏల సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా జీరో సర్వీసుతో ఇతర శాఖల్లోకి పంపారు. విద్యాశాఖ, మున్సిపల్‌.. తదితర శాఖల్లోకి వెళ్లిన వీఆర్వోలు, వీఆర్‌ఏల సర్వీసు కలపకుండానే జూనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌లో నియమించారు. 

వీరికి రెవెన్యూలో పనిచేసిన సర్వీసును కలిపితే అప్పటికే ఆయా శాఖల్లో పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్లు నష్టపోతారని, ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారి కంటే ముందు కొత్తగా రెవెన్యూ నుంచి వచి్చన వారు పదోన్నతులకు అర్హత పొందుతారనే కారణంతో సీనియారిటీ ఇవ్వకుండానే ఇతర శాఖల్లో విలీనం చేశారు. 
ఈ విషయంలో అప్పుడే వివాదం ఏర్పడింది. అయినా ఆ సమస్యను గత ప్రభుత్వం పరిష్కరించలేదు. ఇప్పుడు జూనియర్‌ రెవెన్యూ అధికారి పేరుతో గ్రామానికో రెవెన్యూ అధి కారి నియామకం కోసం ఇతర శాఖల్లోకి వెళ్లిన వీఆర్వోలు, వీఆర్‌ఏల నుంచి సుముఖత పత్రాలను రెవెన్యూ వర్గాలు సేకరించాయి. 

చదవండి: TeamLease Services: ఈ రంగంలో భారీగా కొలువులు.. 80 వేల పైచిలుకు కొలువులు..

సుముఖత వ్యక్తం చేసిన వారిలో డిగ్రీ, ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారికి పరీక్ష పెట్టి మళ్లీ రెవెన్యూలోకి తీసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే, తమ పాత శాఖలోకి మళ్లీ తీసుకునేందుకు పరీక్ష ఎందుకని ప్రశ్నిస్తున్న పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఏలు ఇప్పుడు సీనియారిటీ అంశాన్ని ముందుకు తీసుకువస్తున్నారు. 

గతంలో రెవెన్యూలో పనిచేసినప్పుడు ఏడాదిన్నర నుంచి పదేళ్ల వరకు సర్వీసును కోల్పోయామని, ఇతర శాఖల్లో దాదాపు రెండేళ్లు పనిచేశామని, మళ్లీ ఇప్పుడు జీరో సర్వీసుతో రెవెన్యూలోకి రావడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశి్నస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా పరీక్ష పెట్టినా రాసేందుకు చాలా మంది సుముఖంగా లేరని తెలుస్తోంది. 
ఇతర శాఖల్లోనే ఉంటే గత రెండేళ్ల సర్వీసుతో పదోన్నతులకు వీలుంటుందనే భావనలో పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఏలు ఉన్నారు. పరీక్ష పెట్టాలా వద్దా అన్నదానిపైనే ఇంకా నిర్ణయం తీసుకోని పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా సీనియారిటీ సమస్య తెరపైకి రావడం ప్రభుత్వ వర్గాలకు తలనొప్పిగా మారనుంది.  

చదవండి: Foreign Affairs: 13 ఏళ్లలో భారత పౌరసత్వం వదులుకున్న 18 లక్షల మంది ప్రవాసులు.. కార‌ణం ఇదే..

కోదండరాంను కలసి విన్నపం..

సీనియారిటీ అంశంపై కొందరు పూర్వ వీఆర్వోలు బుధవారం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాంను కలిశారు. రెవెన్యూ శాఖలోకి తీసుకుంటున్న తమకు సీనియారిటీ వర్తింపజేసేలా ప్రభుత్వంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. కోదండరాంను కలసిన వారిలో రీడిప్లాయ్‌డ్‌ వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్, నేతలు ముత్యా లు, బసవరాజు, భానుశ్రీ, మాధవి, హైమావతి తదితరులున్నారు.

Published date : 03 Jan 2025 10:14AM

Photo Stories