Tenth Class Preparation Tips: పదో తరగతి.. మంచి మార్కులకు మార్గమిదే!!
గ్రేడ్ బదులు మార్కులు
తెలంగాణ రాష్ట్రంలో 2024–25 పదో తరగతి వార్షిక పరీక్షల విషయంలో కీలకమైన మార్పులను విద్యాశాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఇస్తున్న గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికి.. మళ్లీ పాత పద్ధతిలోనే మార్కులు ఇవ్వనున్నారు. గ్రేడింగ్ విధానం వల్ల ఉన్నత విద్య ప్రవేశ పరీక్షల సమయంలో వాటిని క్రోడీకరించే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ నిర్ణయం తీసుకున్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ఆన్సర్ షీట్.. ఇకపై ఒకటే
పరీక్ష హాల్లో విద్యార్థులకు ఇచ్చే ఆన్సర్ షీట్‌కు సంబంధించి కూడా మార్పులు చేశారు. నూతన విధానంలో విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్ బుక్‌లెట్‌ను ఇస్తారు. ఇందులోనే మొత్తం అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అడిషనల్ షీట్ విధానాన్ని తొలగిస్తున్నారు.
గత వార్షిక పరీక్షల వరకు ముందుగా నాలుగు పేజీల ఆన్సర్ షీట్‌ను, తర్వాత మరో నాలుగు పేజీల వరకు అడిషనల్ షీట్స్‌ను ఇచ్చే వారు. అడిషనల్ షీట్స్‌ను జత చేయడం (ట్యాగ్ చేయడం)లో ఇబ్బందులు.. కొన్ని సందర్భాల్లో అవి గల్లంతవుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో.. 24 పేజీల ఆన్సర్ బుక్‌లెట్ విధానానికి శ్రీకారం చుట్టారు.
పాత విధానంలోనే పరీక్షలు
వాస్తవానికి తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలను 100 మార్కులకు నిర్వహించాలని, ఇంటర్నల్స్‌కు 20 మార్కుల విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం భావించింది. కానీ.. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో ఇంటర్నల్స్ తుది దశకు చేరుకున్నాయి. దీంతో ఈ ఏడాది పరీక్షలను పాత విధానంలోనే 80 మార్కులకు నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్స్ ఉండవని.. అన్ని సబ్జెక్ట్‌లలో 100 మార్కులకు వార్షిక పరీక్షలే ఉంటాయని స్పష్టం చేశారు.
ఆ మూడు ప్రధానం
పదో తరగతి విద్యార్థులు మంచి మార్కుల సాధనకు మూడు అంశాలపై నైపుణ్యం సాధించాలి. అవి..అవగాహన, ప్రతిస్పందన, స్వీయ విశ్లేషణ. వార్షిక పరీక్షల్లో ఈ తరహా ప్రశ్నలే ఎదురవుతున్నాయి. కాబట్టి విద్యార్థులు ఒక పాఠాన్ని చదువుతున్నప్పుడే.. సదరు పాఠంలో పేర్కొన్న సందర్భం, సంఘటనపై సొంత వాక్యాల్లో అభిప్రాయాలు రాయగలిగేలా చదవాలి.
పదో తరగతిలో అవగాహన, ప్రతిస్పందన, స్వీయ విశ్లేషణకు ప్రాధాన్యం ఉంది, కాబట్టి టెన్త్‌క్లాస్ సబ్జెక్టులపై పట్టు సాధించాలంటే.. పాఠ్యాంశాలు చదువుతూనే.. సొంత వాక్యాలు, అభిప్రాయాలు రాసే విధంగా నైపుణ్యాలు పెంచుకోవాలి. మాతృభాష ‘తెలుగు’ సబ్జెక్ట్ నుంచి సోషల్ స్టడీస్ వరకూ.. అన్నింటిలోనూ ఈ దృక్పథం అవసరం. అప్పుడే సబ్జెక్టుపై పట్టుతోపాటు మంచి మార్కులు సాధించేందుకు వీలవుతుంది.
చదవండి: Exam Tension: ఈ 10 లక్షణాలు ఉంటే మీరు ఒత్తిడిలో ఉన్నట్టే... ఇలా అధిగమించండి!
ప్రశ్నల సరళి ఇలా
తెలంగాణ పదో తరగతి ప్రశ్నల సరళిని పరిశీలిస్తే.. ప్రతి సబ్జెక్ట్‌లో 20 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు–20 మార్కులు; ప్రతి సబ్జెక్ట్‌లో 60 మార్కులకు స్వల్ప, అతి స్వల్ప, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఉంటాయి.
వ్యాసరూప ప్రశ్నలు 6(24 మార్కులు); లఘు ప్రశ్నలు 6 (24 మార్కులు); అతి లఘు ప్రశ్నలు 6 (12 మార్కులు) అడుగుతారు.
సబ్జెక్ట్ వారీగా ప్రిపరేషన్
తెలుగు
ఈ పేపర్‌లో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు..ముందుగా పద్యభాగం, గద్యభాగంలోని అన్ని అంశాలను చదవాలి. వాటిని పునశ్చరణ చేసుకోవాలి. పాఠాన్ని చదవడంతోనే సరి పెట్టకుండా.. సారాంశాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ప్యాసేజ్ పేరిట ఉండే అపరిచిత గద్యం ఎంతో ముఖ్యం. ఉపవాచకానికి సంబంధించి ఇతివృత్తం, ప్రాముఖ్యత, పాత్రలు, వాటి ప్రాధాన్యత, వ్యక్తుల ప్రవర్తన శైలి తదితర అంశాల ద్వారా ఇచ్చే సందేశాన్ని తెలుసుకోవాలి. వ్యాకరణంలో ప్రతిభ చూపాలంటే.. సంధులు, సమాసాలు, సంయుక్తార్థాలు, ఉత్పత్యర్థాలు, జాతీయాలు బాగా చదవాలి.
ఇంగ్లిష్
ఇంగ్లిష్ సబ్జెక్టులో కొద్దిపాటి చిట్కాలతో మంచి మార్కులు పొందొచ్చు. ఇందులో వెర్బల్, నాన్–వెర్బల్ అంశాలు బాగా చదవాలి. పొయెట్రీ ప్రశ్నల్లో మంచి మార్కుల సాధన కోసం సదరు పద్యంలో ముఖ్య పదాలు, యాంటానిమ్స్, సినానిమ్స్‌పై దృష్టి సారించాలి. వీటితోపాటు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఫ్రేజల్ వెర్బ్స్‌పైనా అవగాహన పెంచుకోవాలి. వీటిని అధ్యయనం చేయడంతోపాటు ప్రాక్టీస్ కూడా చేస్తే మెరుగైన మార్కులు పొందేందుకు ఆస్కారం లభిస్తుంది. అదే విధంగా అపరిచిత గద్యం (అన్‌నోన్ ప్యాసేజెస్) సారాంశాన్ని గ్రహించేలా చదవాలి. లెటర్ రైటింగ్‌కు సంబంధించి పంక్చుయేషన్స్, బాడీ ఆఫ్ ది లెటర్ వంటి అంశాలపైనా పట్టు పెంచుకోవాలి.
మ్యాథమెటిక్స్
ప్రతి చాప్టర్‌ను సిలబస్‌కు అనుగుణంగా పూర్తిగా అధ్యయనం చేయాలి. ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. పేపర్–2లో రేఖా గణితం, క్షేత్రమితి, త్రికోణమితి, సంభావ్యత, సాంఖ్యకశాస్త్రంపై పట్టు సాధించడం ఎంతో మేలు చేస్తుంది. సాధన చేయడంతోపాటు కారణాల నిరూపణ, వ్యక్తీకరణ, సమస్యను ఇతర అంశాలతో అనుసంధానం చేయడం వంటి నైపుణ్యాలు పెంచుకోవాలి. ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలను నోట్స్ రూపంలో రాసుకుంటే.. రివిజన్ సమయంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పాఠ్యపుస్తకంలో ప్రతి చాప్టర్ చివరన ఇచ్చే సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. గ్రాఫ్‌లు, నిర్మాణాత్మక సమస్యలకు సమాధానాలు కనుగొనేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, రెండు చరరాశులలోని రేఖీయ సమీకరణాల జత అధ్యాయాలలోని గ్రాఫ్ ఆధారిత సమస్యలు, సంభావ్యత, సాంఖ్యక శాస్త్రం, త్రికోణమితి, క్షేత్రమితిలోని ముఖ్యమైన సమస్యలను సాధన చేయాలి.
ఫిజికల్ సైన్స్
ఫిజికల్ సైన్స్‌లో మంచి మార్కులు సాధించాలంటే.. అప్లికేషన్ అప్రోచ్‌ను అనుసరించాలి. ఆయా చాప్టర్లకు సంబంధించిన అంశాలను నిజ జీవిత సంఘటనలతో అన్వయించుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. విషయ అవగాహనతోపాటు, ప్రశ్నించడం–పరికల్పన చేయడం, ప్రయోగాలు–క్షేత్ర పర్యటనలు, సమాచార నైపుణ్యాలు–ప్రాజెక్ట్ పనులు, పటాలు–వాటి ద్వారా భావ ప్రసారం వంటి వాటిపైనా దృష్టిపెట్టాలి. కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, విద్యుత్ ప్రవాహం, రసాయన బంధం, పరమాణు నిర్మాణం, కార్బన్ సమ్మేళనాలపై పట్టు సాధించాలి. మూలకాల ధర్మాలు–వర్గీకరణ, రసాయన సమీకరణాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల లఘు, అతి స్వల్ప, బహుళైచ్ఛిక ప్రశ్నలకు సులువుగా సమాధానాలిచ్చే పట్టు లభిస్తుంది.
నేచురల్ సైన్సెస్
జీవశాస్త్రం సబ్జెక్ట్‌లో అవగాహన, సొంత విశ్లేషణ నైపుణ్యాలు కీలకంగా మారుతున్నాయి. ఇందుకోసం ఫ్లో చార్ట్‌లు, బ్లాక్ డయాగ్రమ్స్‌లను సొంతంగా రూపొందించుకోవాలి. విశ్లేషణాత్మక, తులనాత్మక అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నేర్చుకున్న అంశాలను వాస్తవ పరిస్థితులతో అన్వయించే విధంగా చదవాలి. ప్రయోగాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ప్రయోగ నిర్వహణ ప్రక్రియపై అవగాహన పొందడం ఎంతో మేలు చేస్తుంది. విశ్లేషణ, కారణాలు, పోలికలు, బేధాలు తెలుసుకుంటూ చదవాలి. డయాగ్రమ్స్ విషయంలో భాగాలను గుర్తించడమే కాకుండా.. వాటి ప్రాముఖ్యతను వర్ణించగలిగే విధంగా ప్రాక్టీస్ చేయాలి.
సోషల్ స్టడీస్
సోషల్ స్టడీస్‌లో మంచి మార్కులు సాధించడానికి విద్యార్థులు సమకాలీన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. సమకాలీన అంశాల విషయంలో ప్రతిస్పందన, ప్రశ్నించడం, ప్రశంస/అభినందనలపై సాధన చేయాలి.
అవగాహనకు సంబంధించి ఒక నిర్దిష్ట అంశాన్ని చదివి, సొంత పరిజ్ఞానంతో రాసే విధంగా నైపుణ్యం పెంచుకోవాలి. జాగ్రఫీ, ఎకనామిక్స్‌లో భారతదేశం –భౌగోళిక స్వరూపం, శీతోష్ణస్థితి, భారతదేశ నీటి వనరులు, వలసలు, ఆహార భద్రత, ఉత్పత్తి–ఆదాయం, సుస్థిరాభివృద్ధి పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. హిస్టరీలో రెండు ప్రపంచ యుద్ధ కాలాల సమయంలో ప్రపంచం, సమకాలీన సామాజిక ఉద్యమాలపై దృష్టి పెట్టాలి. భారత జాతీయోద్యమ చరిత్రపై ప్రత్యేక దృష్టితో చదవాలి. సివిక్స్‌కు సంబంధించి రాజ్యాంగం మూల సూత్రాలు, రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను ఏఏ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించారు వంటి కోణాల్లో చదవాలి.
పదో తరగతి.. ప్రిపరేషన్ టిప్స్
- సిలబస్‌లో ఆయా సబ్జెక్ట్‌లు, చాప్టర్లలో సిలబస్‌ను పరిశీలించాలి.
- ముఖ్యమైన చాప్టర్లను వెయిటేజీ ఆధారంగా వర్గీకరించుకోవాలి.
- ముందుగా అత్యధిక వెయిటేజీ ఉండే అంశాలపై దృష్టి పెట్టాలి.
- ఇప్పటి నుంచే ప్రాక్టీస్ ఆధారిత ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
- అవగాహన,ప్రతిస్పందన,స్వీయ విశ్లేషణ నైపుణ్యాలు సాధించేలా కృషి చేయాలి.
- అనువర్తిత నైపుణ్యం పెంపొందించుకునేలా చదవాలి.
- మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్‌లకు సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్, థీరమ్స్‌ను బాగా అధ్యయనం చేయాలి.
- ప్రతి అంశాన్ని సొంతగా విశ్లేషించే విధంగా ప్రాక్టీస్ చేయాలి.
Tags
- 10th class
- Class 10 preparation tips
- 10th class preparation tips
- Class 10 preparation tips 2025
- How to prepare for Class 10 board exam
- 10th class preparation tips maths
- How to prepare for board exams
- 10 Essential Study Tips
- Class 10 board exam Preparation tips
- Telangana News
- Tenth Class Guidance
- TenthClassExams
- TelanganaEducation
- 10thClassMarks
- TelanganaExams2025
- exampreparation
- TenthClassSuccess
- StudyTipsFor10th
- Telangana10thClass
- CareerOpportunities
- SubjectwiseStudy