KGBV School: మా టీచర్లు మాకు కావాలి.. విద్యార్థులు ఆందోళన
ఎంఈఓ అశోక్ కుమార్ కేజీవీబీని సందర్శించిన సమయంలో ఇంటర్, 10వ తరగతి విద్యార్థులు ఎంఈఓను చుట్టుముట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. మాకు తాత్కాలిక ఉపాధ్యాయులు వద్దని పాఠశాల ఆవరణలోనే బైఠాయించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేజీబీవీ బోధన సిబ్బంది గత 18 రోజులుగా సమ్మె చేస్తున్నారు.
విద్యార్థినులకు ఇబ్బందులు కలగకుండా విద్యాశాఖ ఆయా మండల పరిధిలోని ఉపాధ్యాయులను తాత్కాలికంగా సర్దుబాటు చేయాలని ఆదేశించించారు. అందులో భాగంగా అలంపూర్‌లోని జడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలకు చెందిన లక్ష్మమ్మను తాత్కాలిక ప్రత్యేక అధికారిగా నియమించారు.
చదవండి: COE Notification: సీవోఈ నోటిఫికేషన్ ఎప్పుడో?.. ప్రవేశం దక్కితే విద్యార్థులకు వరం..
ఈ క్రమంలో విద్యార్థులు మా ఉపాధ్యాయులు మాకు కావాలని తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించవద్దని కోరారు. పరీక్షలు సమీపిస్తుండటంతో మా ఉపాధ్యాయులతో మాకు మేలు జరుగుతుందన్నారు.
ఈ సమయంలో కొత్త వారు వస్తే మా చదువులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న ఎంఈఓ అశోక్‌కుమార్.. విషయాన్ని డీఈఓ అబ్దుల్ గని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆయన సూచన మేరకు ఎంఈఓ కేజీబీవీని సందర్శించి విద్యార్థులతో మాట్లాడినట్లు తెలిపారు. విద్యార్థులు సిలబస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాత్కాలిక ఉపాధ్యాయులతో బోధన కొనసాగించాలని సూచించినట్లు పేర్కొన్నారు.