Skip to main content

Question Paper Leak : ఈ ప్రశ్నపత్రం లీక్‌... ఎక్క‌డంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ మధ్యకాలంలో పోటీప‌రీక్ష‌లు, అకడమిక్ ప‌రీక్ష‌లకు సంబంధించిన ప్ర‌శ్నప‌త్రాల లీకుల వార్త‌లు ఎక్కువ‌గా వినిపిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో మ‌రో ప్ర‌శ్న‌ప‌త్రం లీక్ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. పాఠశాలల్లో ప్రభుత్వం ఎస్‌ఏ– 1 (సమ్మెటీవ్‌ అసెస్‌మెంట్‌) పరీక్ష నిర్వహిస్తోంది. అయితే చాలా పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వ సమయం ప్రకారం పరీక్షలు నిర్వహించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Exam Question Paper Leak

ఈ నేపథ్యంలో అక్టోబ‌ర్ 24వ తేదీన (గురువారం) ఉదయం జరిగిన పదో తరగతి సోషల్‌ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నపత్రంపేపర్‌, జవాబులు సమయం కంటే ముందే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఉదయం 9.15 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సి ఉంది. ఈ విషయాన్ని ‘సాక్షి’ ప్రతినిధులు జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పేపర్‌ భూత్పూర్‌లోని పలు ప్రైవేటు పాఠశాలల నుంచి లీక్‌ అయినట్లు అనుమానం కలగడంతో అక్కడి పాఠశాల కాంప్లెక్సు హెచ్‌ఎం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అయితే అక్కడ ఎలాంటి లీక్‌ లేనట్లు కాంప్లెక్సు హెచ్‌ఎం పేర్కొన్నారు. 

జవాబులు కూడా సోషల్‌ మీడియాలో..
మహబూబ్‌నగర్‌ జిల్లా డీసీఈబీ (డిస్ట్రిక్ట్‌ కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు, మహబూబ్‌నగర్‌) ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షల నిర్వహణపై విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల వారికి పేపర్‌ ముందే లీక్‌ చేస్తున్నారని మండిపడుతున్నారు. గురువారం పాఠశాలల విద్యార్థులకు ముందే ప్రశ్నపత్రాలను ఇవ్వడంతో వాటికి సంబంధించిన జవాబులు కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ప్రశ్నపత్రాన్ని భూత్పూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు చేరవేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. 

ఈ పరీక్ష మార్కులకు ప్రాధాన్యత లేకపోయినా.. పేపర్‌ను ముందే లీక్‌ చేయడాన్ని విద్యాశాఖ అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ వ్యవహారంలో జిల్లా కేంద్రంలోని పలు ప్రముఖ పాఠశాలల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే చాలా పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించడం లేదని, విద్యాశాఖ అధికారుల ఆదేశాలు ఖాతరు చేయడం లేదని ఆరోపణలు రావడంతో గురువారం ఏఎంఓ శ్రీనివాస్‌ పలు పాఠశాలలను తనిఖీ చేశారు.

ఈ 20 మార్కులు మొత్తం రావాలంటే..
విద్యార్థులకు పదో తరగతిలో ఎక్కువ మార్కులు రావాలని కొందరు ముందే ప్రశ్నపత్రాలను లీక్‌ చేస్తున్నట్ల ఆరోపణలు వస్తున్నాయి. సీసీఈ (కంటిన్యూ కాంప్రహెన్‌షన్‌ ఎలివేషన్‌) విధానంలో విద్యార్థులకు ఒక్క సబ్జెక్టుకు సంబంధించి మొత్తం 100 మార్కులు ఉంటే అందులో 20 మార్కులు పాఠశాలలో విద్యార్థి చేసే పలు యాక్టివిటీస్‌కు సంబంధించి వేస్తారు. ఇందులో నోట్‌ పుస్తకాలు రాసేందుకు, ప్రాజెక్టులు, ఫార్మటివ్‌ అసెస్‌మెంట్‌, సమ్మెటీవ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షల ద్వారా వేస్తారు. ఈ 20 మార్కులు మొత్తం రావాలంటే పాఠశాల యాజమాన్యాలు నేరుగా సమ్మెటీవ్‌ అసెస్‌మెంట్‌, ఫార్మటీవ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ముందే లీక్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

20 మార్కులు నేరుగా విద్యార్థికి వస్తే ఇక చివరి పరీక్షలో ఎలాగైనా పాస్‌ అవుతారనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఎస్‌ఏ పరీక్ష ఫీజు చెల్లించకుండా తక్కువ మందిని చూపించి తక్కువ ఫీజులు విద్యాశాఖకు చెల్లించి.. మిగతా విద్యార్థులకు జిరాక్సు పేపర్‌ ద్వారా పరీక్ష నిర్వహిస్తున్నారని తెలిసింది.

కఠిన చర్యలు ఉంటాయి.. : రవీందర్‌, డీఈఓ, మహబూబ్‌నగర్‌

DEO

ఎస్‌ఏ–1 పరీక్షల్లో ప్రశ్నపత్రం కేవలం 15 నిమిషాల ముందే సీల్‌ ఓపెన్‌ చేసి ఇవ్వాలి. అయితే ఈ రోజు పరీక్ష ప్రశ్నపత్రం ముందే పేపర్‌ లీక్‌ అయినట్లు తెలుస్తోంది. భూత్పూర్‌లో అనుమానం వచ్చిన పాఠశాలల్లో కాంప్లెక్స్‌ హెచ్‌ఎం ద్వారా విచారణ చేయించాం. ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై స్పష్టత రాలేదు. హెచ్‌ఎం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయి.

Published date : 25 Oct 2024 06:08PM

Photo Stories