JRO Jobs: తేలుతున్న JRO ‘లెక్క’.. మళ్లీ రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు సమ్మతి ఇచ్చిన వారు సంఖ్య ఇలా..

ఈ పోస్టుల భర్తీకి గతంలో వీఆర్వో, వీఆర్‌ఏలుగా పనిచేసిన ఉద్యోగుల నుంచి ‘రెవెన్యూ శాఖ సమ్మతి సేకరణ’ కార్యక్రమం పూర్తయింది. డిసెంబర్ 28న గడువు ముగిసే సమయానికి మొత్తం 11,783 మంది మళ్లీ రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు సమ్మతి తెలుపుతూ ఆప్షన్ ఇచ్చారు.
అయితే, వీరిలో డూప్లికేట్ దరఖాస్తులు, మల్టీ ఆప్షన్లు ఇచ్చినవి, ఉద్యోగి ఐడీలు చెప్పనివి, సర్టిఫికెట్లు జత చేయనివి అధికారులు తిరస్కరించినట్టు తెలిసింది. ఇవిపోను 9,654 దరఖాస్తులు నికరంగా మిగిలాయని ఆయా వర్గాల ద్వారా తెలిసింది.
ఇందులో డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణులయిన వారు 6,162 మంది ఉన్నారని సమాచారం. వీరు కాకుండా మరో 3,492 మంది ఇంటర్‌కంటే తక్కువ చదువుకున్న వారు మళ్లీ శాఖలోకి వచ్చేందుకు సమ్మతి తెలిపారు. డిగ్రీ చదివిన వారు 3,498 మంది, ఇంటర్ చదివిన వారు 2,664 మంది ఆప్షన్లు ఇవ్వగా, వీరికి పరీక్ష పెట్టి ఎంపిక చేయాలా? లేక నేరుగా విధుల్లోకి తీసుకోవాలా అన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.