Skip to main content

5600 JRO Jobs: గ్రామాల్లో ‘జూనియర్‌ రెవెన్యూ అధికారుల’.. డిగ్రీ చదివిన 5,600 మందికి నేరుగా ఉద్యోగ అవకాశం..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో తిరిగి గ్రామ రెవెన్యూ అధికారుల నియామకానికి రంగం సిద్ధమైంది. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామన్న రాష్ట్ర సర్కారు... ఆ దిశగా చర్యలకు ఉపక్రమించింది.
Junior Revenue Officers in villages   Re-appointment of village revenue officers in Telangana  Steps for re-appointment of village revenue officers in Telangana  Telangana government moves to re-appoint village revenue officers

ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండేలా... ‘జూనియర్‌ రెవెన్యూ అధికారి (జేఆర్‌ఓ)’ పేరుతో పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్రంలో మొత్తం 10,911 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనుంది. దీనిపై విధాన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా.. గతంలో వీఆర్వోలు, వీఆర్‌ఏలుగా పనిచేసి, ఇతర శాఖల్లోకి మార్చి న వారి నుంచి ఆప్షన్లు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నవీన్‌ మిత్తల్‌ సోమవారం జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్‌ పంపారు. 

చదవండి: Agniveer Vayu Jobs: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్‌వాయు ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

కొత్త చట్టం మేరకు నియామకాలు:

ఇటీవల అసెంబ్లీ ఆమోదం పొందిన భూభారతి చట్టం–2024 ద్వారా సంక్రమించే అధికారాల మేరకు గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. గతంలో వీఆర్వో వ్యవస్థ రద్దుకు ముందు ఆ పోస్టుల్లో పనిచేసినవారు, వీఆర్‌ఏలుగా పనిచేస్తూ వివిధ శాఖల్లోకి పంపిన వారికి ఈ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వనుంది. డిగ్రీ చదివిన పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏలను నేరుగా రెవెన్యూ శాఖలోకి తీసుకోనున్నారు. ఈ క్రమంలో 3,600 మంది పూర్వ వీఆర్వోలు, 2,000 మంది వరకు పూర్వ వీఆర్‌ఏలకు ఈ అర్హత ఉన్నట్టు అంచనా. మిగతా సుమారు 5,300 పోస్టులను ఏ విధంగా భర్తీ చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇంటర్‌ పూర్తిచేసిన వారు, ముఖ్యంగా ఇంటర్మీడియట్‌లో గణిత శాస్త్రం చదివిన వారిని కూడా నేరుగా తీసుకునే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు వీరిలో కొందరిని సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉంది.

చదవండి: Indian Army Jobs: పదో తరగతి/ఇంటర్మీడియట్‌ అర్హతతో ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది కొత్త సర్వేయర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో... ఇంటర్‌ పూర్తి చేసిన పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఏలను సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉందని సమాచారం. ఇలా నేరుగా భర్తీ చేసే జూనియర్‌ రెవెన్యూ అధికారి, సర్వేయర్‌ పోస్టులు పోగా... మిగతా పోస్టులకు రాతపరీక్ష నిర్వహించి భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో ఓపెన్‌గా దరఖాస్తులు స్వీకరించి ఈ పోస్టులను భర్తీ చేస్తారా? లేక పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఏలకు మాత్రమే పరీక్ష నిర్వహించి, అందులో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

అంగీకారం తెలిపితేనే! 

పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఏలలో తిరిగి రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన వారినే జూనియర్‌ రెవెన్యూ అధికారులుగా నియమించనున్నారు. వాస్తవానికి 2022కు ముందు రాష్ట్రంలో 5వేల మందికిపైగా ‘గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో)’గా పనిచేశారు. అయితే రెవెన్యూ శాఖలో పెరిగిపోయిన అవినీతిని నియంత్రించడం కోసమంటూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసింది. ఆ పోస్టుల్లో ఉన్నవారిని వివిధ ప్రభుత్వ శాఖల్లోకి పంపింది.

ఆ నిర్ణయంపై కోర్టుకు వెళ్లిన సుమారు 70 మంది కోర్టు తీర్పు ఆధారంగా రెవెన్యూ శాఖలోనే కొనసాగుతున్నారు. మిగతా వారంతా వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్‌ అసిస్టెంట్లు, రికార్డ్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. మున్సిపాలిటీలలో వార్డు అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కూడా పొందారు.

ఈ క్రమంలో మళ్లీ రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన వారిని మాత్రమే జూనియర్‌ రెవెన్యూ అధికారులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వీఆర్‌ఏల విషయానికొస్తే... 2023 జూలై నాటికి 22 వేల మందికిపైగా వీఆర్‌ఏలుగా పనిచేస్తున్నారు. అందులో 61 ఏళ్లలోపు వయసున్న, 2011 సంవత్సరంలోపు నియమితులైన 16,758 మందిని వివిధ ప్రభుత్వ శాఖల్లోకి పంపారు. మరో 3,797 మంది వయసు 61 ఏళ్లు దాటడంతో.. వారి వారసులకు వేరే శాఖలో ఉద్యోగాలు ఇస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఇలా వివిధ శాఖల్లోకి వెళ్లిన వీఆర్‌ఏలలో కూడా సుముఖత వ్యక్తం చేసినవారిని మాత్రమే మళ్లీ రెవెన్యూ శాఖలోకి తీసుకోనున్నారు. 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులపై భారం 

గత ప్రభుత్వం వీఆర్‌ఏ, వీఆర్వోలను రెవెన్యూ శాఖ నుంచి పంపించేశాక.. గ్రామస్థాయిలో రెవెన్యూ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతల్లో కొన్నింటిని పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. చాలా చోట్ల పెద్ద గ్రామ పంచాయతీలు ఉండటం, రెవెన్యూ వ్యవహారాలపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన లేకపోవడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తాయి.

ప్రభుత్వ భూములను కాపాడటం, గ్రామాల్లోని రెవెన్యూ అంశాలను ప్రభుత్వానికి నివేదించడం వంటి పనులతో పంచాయతీ కార్యదర్శులపై అదనపు భారం పడింది. మరోవైపు గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది లేని కారణంగా ధ్రువీకరణ పత్రాల జారీ, సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపిక, వివిధ ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

కాంగ్రెస్‌ ప్రభుత్వం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తిరిగి గ్రామ రెవెన్యూ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ మినహా గతంలో వీఆర్వోలు, వీఆర్‌ఏలు నిర్వహించిన బాధ్యతలన్నీ ‘జూనియర్‌ రెవెన్యూ అధికారుల’కు అప్పగించే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

ప్రభుత్వ నిర్ణయం పట్ల టీజీఆర్‌ఎస్‌ఏ హర్షం 

భూభారతి చట్టం కింద రాష్ట్రంలో గ్రామానికో రెవెన్యూ అధికారిని నియమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (టీజీఆర్‌ఎస్‌ఏ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం హర్షం వ్యక్తం చేశారు.

పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల నుంచి ఆప్షన్లను కోరుతూ సీసీఎల్‌ఏ ఉత్తర్వులు జారీ చేశారని.. తెలంగాణ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. పూర్వ వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర సలహాదారు వింజమూరు ఈశ్వర్‌ కూడా మరొక ప్రకటనలో ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  

వీఆర్వోలు, వీఆర్‌ఏలను గూగుల్‌ ఫామ్‌లో ఏమడిగారంటే..

గ్రామ రెవెన్యూ అధికారి లేదా సర్వేయర్‌ పోస్టులలో పనిచేసేందుకు సుముఖంగా ఉన్న పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఏల నుంచి వివరాలు తీసుకోవాలంటూ సీసీఎల్‌ఏ కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకోసం గూగుల్‌ ఫామ్‌ ద్వారా ప్రత్యేక ఫార్మాట్‌ను పంపారు. ఈ నెల 28లోగా జిల్లాల వారీగా వివరాలన్నీ సేకరించి, ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. అయితే ఈ ఫార్మాట్‌లో... వీఆర్వో/వీఆర్‌ఏ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగం, ప్రస్తుతం పనిచేస్తున్న శాఖ, ఎంప్లాయి ఐడీ, ఆ శాఖలో చేరిన తేదీ, రెవెన్యూ శాఖలో నియమితులైన తేదీ, విద్యార్హతలు, ఫోన్‌ నంబర్, సర్వేయర్‌గా పనిచేసేందుకు అంగీకారమా లేదా?, వారి సొంత జిల్లా, ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా, ప్రస్తుత చిరునామా వంటివి అడుగుతూ గూగుల్‌ ఫామ్‌ను రూపొందించారు. ఇందులో విద్యార్హతలపై ప్రత్యేకంగా ఫోకస్‌ చేశారు. ముఖ్యంగా మేథమేటిక్స్‌ సబ్జెక్టుకు ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారా? అనే అంశంలో మేథమేటిక్స్‌ సబ్జెక్టుతో గ్రాడ్యుయేటా? అని.. ఇంటర్‌ పూర్తి చేశారా అనే అంశంలో మేథమేటిక్స్‌ సబ్జెక్టు ఉందా? అని అదనపు ప్రశ్నలు అడిగారు. ఇక సర్వేయర్‌ పోస్టుకు సుముఖత వ్యక్తం చేసేవారిని కూడా గ్రాడ్యుయేషన్‌/ ఇంటర్మీడియట్‌లో మేథమేటిక్స్‌ సబ్జెక్టు ఉందా? అని అడగటం గమనార్హం.

Published date : 24 Dec 2024 12:33PM

Photo Stories