Skip to main content

Government Employee Benefits : ఏం ప్రయోజనం... మేం ప్రభుత్వ ఉద్యోగులమైనా కూడా...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మహిళా ఉద్యోగి ఒకరు అనారోగ్య కారణాలతో వాలంటరీ రిటైర్మెంట్‌ స్కీమ్‌ (వీఆర్‌ఎస్‌) కింద విధుల నుంచి తప్పుకొన్నారు.
telangana government employees benefits problems

తద్వారా అందే సొమ్ముతో తన ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయించుకోవచ్చని భావించారు. ఆమెకు గ్రాట్యుటీ, టీజీఎల్‌ఐసీ, లీవ్స్‌ ఎన్‌క్యాష్‌మెంట్, కమ్యూటేషన్‌ తదితర ప్రయోజనాల కింద మొత్తంగా రూ.60 లక్షల వరకు అందాల్సి ఉంది. కానీ ఏడాదిన్నర గడిచినా పెన్షన్‌ మినహా ఇతర ప్రయోజనాలేవీ అందలేదు. దీనితో తన ఆరోగ్య సమస్యకు పరిష్కారం లభించలేదని నల్లగొండ జిల్లాకు చెందిన‌ ఆమె వాపోతున్నారు.

రూ.20 లక్షల మేర అప్పులు చేసి..
రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రానికి చెందిన ఓ టీచర్‌ (స్కూల్‌ అసిస్టెంట్‌) ఈ ఏడాది ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్‌ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాలను ముందే లెక్కలు వేసుకుని.. జూన్‌లో కుమార్తె వివాహం జరిపించేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్‌లో రిటైర్‌ అయినా.. తర్వాతి రెండు నెలల్లో తనకు ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని భావించారు. కానీ పెళ్లి తేదీ సమీపిస్తున్నా ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందలేదు. దీంతో రూ.20 లక్షల మేర అప్పులు చేసి కుమార్తె పెళ్లి చేశాడు. ప్రభుత్వం నుంచి సొమ్ము అందగానే అప్పులు తిరిగి కట్టేయవచ్చని అంచనా వేసుకున్నారు. కానీ ఇంకా అందలేదు. అప్పులపై ఇప్పటికే రూ.2 లక్షలకుపైగా వడ్డీలు కట్టారు. ప్రభుత్వం నుంచి సొమ్ము ఇంకెప్పుడు వస్తుందోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

➤☛ APPSC Exams Process : ఇక‌పై ఏపీపీఎస్సీ నిర్వ‌హించే ప‌రీక్ష‌ల‌న్నీ ఈ విధానంలోనే...! ఇంకా...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. కేవలం నెలవారీ వేతనాలు, రిటైర్డ్‌ ఉద్యోగులకు పెన్షన్లు తప్ప మిగతా ప్రయోజనాలేవీ అందడం లేదు. ఆయా బిల్లుల చెల్లింపును ఆర్థిక శాఖ నిలువరించడంతో వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. దీనితో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత చదువులు, ఇల్లు కట్టుకోవడం సహా ముఖ్యమైన అవసరాలకు సొమ్ము అందక.. బయట అడ్డగోలు వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.

మూడేళ్లుగా ఉద్యోగులకు..
సాధారణంగా ఉద్యోగులకు ఏటా ఆర్జిత సెలవులను నగదు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఇలా సుమారు ఒక నెల వేతనానికి సరిపడా సొమ్ము అందుతుంది. వైద్య చికిత్సలకు సంబంధించిన మెడికల్‌ రీయింబర్స్‌మెంట్, ఉద్యోగుల జీవిత బీమా పథకం కింద బాండ్స్‌ మెచ్యూరిటీ అయితే అందాల్సిన సొమ్ము, పదవీ విరమణ పొందితే వచ్చే గ్రాట్యుటీ తదితర ప్రయోజనాలు రావాల్సి ఉంటుంది. కానీ సుమారు మూడేళ్లుగా ఉద్యోగులకు వేతనాలు, రిటైరైన వారికి పెన్షన్‌ డబ్బులు మినహా ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు అందడం లేదు. మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పదవీ విరమణ పొందిన వారికి సంబంధించి వివిధ రకాల బిల్లులు కలిపి సుమారు రూ.3,800 కోట్ల మేర ప్రభుత్వం బకాయిపడినట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.

క‌నీసం దాచుకున్న డబ్బులు కూడా..
ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాల కింద అందేవాటిలో మెజారిటీ అంశాలు ఉద్యోగులు వ్యక్తిగతంగా జమ చేసుకున్నవే. ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి (జీపీఎఫ్‌), జీవిత బీమా (టీజీఎల్‌ఐ) పథకాల కింద నెలవారీ వేతనాల నుంచి నిధులు జమ అవుతాయి. ఇలా దాచుకున్న నిధి నుంచి అత్యవసర పరిస్థితిలో కొంత మేర రుణరూపంలో వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక జీవిత బీమా పథకానికి సంబంధించి ఉద్యోగి వయసు 58 సంవత్సరాలు నిండితే.. ఆ బాండ్‌ కాలపరిమితి పూర్తి కావడంతో అందుకు సంబంధించి ఆర్థిక ప్రయోజనం వెంటనే ఉద్యోగి ఖాతాలో జమ కావాలి.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లుగా ఉన్న నేపథ్యంలో.. జీవితబీమా పథకం బాండ్లు మెచ్యూరిటీ అయిన ఉద్యోగుల సంఖ్య సుమారు 25 వేల మంది వరకు ఉంటుంది. వీరికి జీవిత బీమా పథకం కింద చెల్లించాల్సిన బకాయిలు రూ.850 కోట్లుగా అంచనా. జీపీఎఫ్‌ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రెండేళ్లుగా పైసా అందలేదు. ఇలా రూ.450 కోట్ల మేర చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నట్లు ఉద్యోగ సంఘ నేతలు అంచనా వేస్తున్నారు.

మెడికల్‌ రీయింబర్స్‌మెంట్ కూడా..
ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి నగదు రహిత కార్డుల అంశం కొలిక్కి రాలేదు. దీంతో ఉద్యోగులు వారి వైద్య చికిత్సల కోసం చేసిన ఖర్చులను తిరిగి పొందేందుకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ బిల్లులు కూడా రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రూ.లక్ష లోపు ఉన్నవాటిలో కొ న్నింటిని కొత్త ప్రభుత్వంలో చెల్లించినా.. అంతకంటే ఎక్కు వ మొత్తంతో కూడిన బిల్లులు మాత్రం పరిష్కారం కాలేదు.

రిటైర్డ్‌ ఉద్యోగుల ప‌రిస్థితి అయితే.. దారుణం
2021 ఏప్రిల్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. దానితో మూడేళ్లపాటు రిటైర్మెంట్లు ఆగిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఉద్యోగుల పదవీ విరమణలు మొదలయ్యాయి. ఈ ఏడాది నవంబర్‌ నెలాఖరు నాటికి దాదాపు 9,500 మంది పదవీ విరమణ పొందారు. వీరిలో 90శాతం మంది ఉద్యోగులకు ఇంకా రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందలేదు. ఈ రూపంలో దాదాపు రూ.875 కోట్లు రావాల్సి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. వాస్తవానికి పదవీ విరమణ పొందిన నెలరోజుల్లోనే ఈ ప్రయోజనాలు ఉద్యోగులకు అందాలి. ఇలా సమకూరే నిధితో వారు తదుపరి జీవన ప్రణాళికను అమలు చేసుకుంటారు. కానీ ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంతో రిటైర్డ్‌ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంపై ఉద్యోగులలో అసంతృప్తి పెరుగుతోంది. డీఏ బకాయిలు, పీఆర్సీ అమల్లో జా ప్యంపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు.. బిల్లుల చెల్లింపులన్నీ నిలిచిపోవడంతో సంఘాల నేతలను నిలదీస్తున్నారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జిల్లాల వారీగా వివిధ ఉద్యోగ సంఘాల కార్యవర్గాల ఎన్నికల సమయంలో.. పోటీ చేసినవారంతా ఉద్యోగుల ఆర్థిక అంశాలే ఎజెండాగా ముందుకు సాగారని గుర్తు చేస్తున్నాయి.
అయితే ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపుపై స్పందన లేకపోవడంతో ఇబ్బందిగా మారిందని వరంగల్‌ జిల్లా ఉద్యోగ సంఘ నేత ఎ.జగన్మోహన్‌రావు పేర్కొన్నారు. జిల్లాల్లో కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలన్నా ఉద్యోగులు నిలదీసే పరిస్థితి ఉందని వాపోయారు.

ఈ బిల్లులు చెల్లించకుంటే..  : ఏలూరి శ్రీనివాసరావు, టీజీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు
ప్రభుత్వ ఉద్యోగుల చెల్లింపులకు సంబంధించి ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం (ఐఎఫ్‌ఎంఐఎస్‌) అమల్లోకి వచ్చిన తర్వాత నుంచీ సమస్యలు పెరిగాయి. అంతకు ముందు జిల్లా ఖజానా విభాగం(డీటీఓ) లేదా ఉప ఖజానా కార్యాలయాల (ఎస్టీఓ) పరిధిలో బిల్లుల చెల్లింపుల ప్రక్రియ వేగంగా జరిగేది. గత ప్రభుత్వంలో ఐఎఫ్‌ఎంఐఎస్‌ విధానాన్ని తెచ్చి, చెల్లింపులన్నీ కేంద్రీకృతం చేశారు. ఎలాంటి బిల్లును క్లియర్‌ చేయాలన్నా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నెల, రెండు నెలల్లో పరిష్కారం కావాల్సిన అంశాలు.. ఇప్పుడు ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కావడం లేదు. అన్నింటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో ముడిపెట్టడం వల్ల ఉద్యోగులకు చెల్లింపులు భారీగా పేరుకుపోయాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం రేవంత్‌ను కలసి ఉద్యోగుల సమస్యలను నివేదించాం. చిన్నపాటి బిల్లులు మాత్రమే క్లియర్‌ అయ్యాయి. ఈ నెలాఖరు కల్లా మెజార్టీ బిల్లులు పరిష్కరిస్తామన్నారు. లేకుంటే వచ్చే నెలలో జేఏసీ తరపున సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించి ఉద్యమిస్తామ‌ని ఏలూరి శ్రీనివాసరావు టీజీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు తెలిపారు.

Published date : 31 Dec 2024 09:23AM

Photo Stories