Skip to main content

Jobs: 2,118 పోస్టుల మంజూరు.. మరో మూడు కొత్త కళాశాలల

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో మూడు వైద్య కళాశాలలను కొత్తగా ప్రారంభించేందుకు వీలుగా కీలక ముందడుగు పడింది. ఇందులో భాగంగా ప్రభుత్వం 2,118 పోస్టులను కొత్తగా మంజూరు చేసింది.
Jobs
2,118 పోస్టుల మంజూరు.. మరో మూడు కొత్త కళాశాలల

ఈ మేరకు జూలై 5న ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడం కోసం ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడేళ్ల వ్యవధిలో ఈ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు చేపట్టి కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళికలు రచించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే మచిలీపట్నం, నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఒక్కోచోట 150 సీట్ల చొప్పున 750 ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు చేపట్టనున్నారు.

చదవండి: 7,500 Jobs in SSC CGL: ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌...

ఇదిలావుండగా వచ్చే విద్యా సంవత్సరంలో ఏఎస్‌ఆర్‌ జిల్లా పాడేరు, వైఎస్సార్‌ జిల్లా పులివెందుల, కర్నూలు జిల్లా ఆదోని వైద్య కళాశాలల కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఒక్కో చోట వైద్య కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 2,118 పోస్టులను కొత్తగా సృష్టించారు. ఇప్పటికే ఈ మూడు చోట్ల ఉన్న ప్రభుత్వాస్పత్రులను ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా 330 పడకల స్థాయికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో 16 యూనిట్‌లతో ఆయా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడానికి వీలుగా అడిషనల్‌ డీఎంఈ హోదాలో సూపరింటెండెంట్, వివిధ పోస్టులను సృష్టించారు.

చదవండి: SSC CHSL Notification 2023: కేంద్రంలో 1600 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివ‌రాలు ఇవే..

అదేవిధంగా వైద్య కళాశాలకు సంబంధించి అడిషనల్‌ డీఎంఈ హోదాలో ప్రిన్సిపాల్, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రో బయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్‌ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్‌ సర్జరీ వంటి వివిధ విభాగాలు ఏర్పాటు, పరిపాలన విభాగాలకు సంబంధించిన పోస్టులను మంజూరు చేశారు.ఇదిలావుండగా అన్నమయ్య జిల్లా మదనపల్లి, ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏర్పాటు చేస్తున్న కొత్త వైద్య కళాశాలల్లో కూడా వచ్చే ఏడాది నుంచి అకడమిక్‌ కార్యకలాపాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఎంఈ డాక్టర్‌ నరసింహం ‘సాక్షి’తో చెప్పారు.

కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణ పనులు ఈ రెండుచోట్ల వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో 2025–26కు బదులు 2024–25లో వీటిని అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ రెండు చోట్ల పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నామన్నారు.  

చదవండి: 5369 Central Government Jobs 2023: విజయం సాధించే మ‌ర్గాలు ఇవే..

Published date : 06 Jul 2023 03:50PM

Photo Stories