Training Teachers: శిక్షణ ఉపాధ్యాయులకు ‘శిక్ష’
అదే ఉత్సాహంతో కళాశాలలో చేరేటప్పుడు ఇచ్చిన బోనఫైడ్స్, టెన్త్, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లతోపాటు బీఎడ్ ఉత్తీర్ణత పత్రం ఇవ్వమని ప్రిన్సిపాల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ‘మీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉంది. అది వచ్చాకే ఏ సర్టిఫికెట్ అయినా ఇచ్చేది.
అత్యవసరమైతే ఫీజు కట్టి సర్టిఫికెట్లు పట్టుకెళ్లు..’అంటూ ప్రిన్సిపాల్ తేల్చిచెప్పడంతో ఆ విద్యార్థులు ఏడాదిగా నిరీక్షిస్తున్నారు. సెప్టెంబర్ 9న కలెక్టర్ వెంకటేశ్ దోత్రేను కలిసి తమ సర్టిఫికెట్లను ఇప్పించాలని వేడుకోవడంతో నిబంధనకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న జిల్లా కేంద్రంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్ బీఎడ్ కళాశాల తీరు వెలుగులోకి వచ్చింది.
చదవండి: Rajarshi Shah, IAS: ఉపాధ్యాయులు సమాజ మార్గదర్శకులు.. ఉపాధ్యాయురాలి వద్దకు వెళ్లి అవార్డు ప్రదానం
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉండే పీజీ, యూజీ కళాశాలల్లో నిబంధనల ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన బీసీ, ఓబీసీ విద్యార్థుల నుంచి ఎలాంటి ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజు తీసుకోవద్దు. అలాగే వారి ఒరిజినల్ సర్టిఫికెట్లను పరీక్ష హాల్‌టికెట్లను కళాశాల వద్ద ఉంచుకోరాదు. కానీ జిల్లా కేంద్రంలోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ బీఎడ్ కళాశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం ఇందుకు భిన్నంగా నడుచుకుంటున్నారు.
విద్యార్థుల బోనఫైడ్, ఉత్తీర్ణణ సర్టిఫికెట్లను తమ వద్దే ఉంచుకుంటోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదన్న సాకుతో వారికి సర్టిఫికెట్లను ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తోంది. ఆరు నెలలుగా విద్యార్థులు నిత్యం కళాశాల ప్రిన్సిపాల్‌ను కలిసి సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు అందజేసినా ఫలితం లేకుండా పోతోంది. ఫీజు కట్టనిదే సర్టిఫికెట్లు ఇవ్వమని, లేదంటే కరస్పాండెంట్‌ను అడగాలని ప్రిన్సిపాల్ చెబుతున్నారు.
కరస్పాండెంట్‌ను అడిగితే.. ప్రిన్సిపాల్‌తో మాట్లాడుకోండంటూ తేగేసి చెబుతున్నారు. ఇలా ఇరువురు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల సర్టిఫికెట్లను కళాశాల యాజమాన్యాలు ఉంచుకోరాదని నిబంధనలు చెబుతున్నా.. వాటిని కళాశాల ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ బేఖాతారు చేస్తుండటం గమనార్హం. 2021– 23 బ్యాచ్‌కు చెందిన సుమారు 25 మందికి పైగా విద్యార్థులు తమ సర్టిఫికెట్లు లేకపోవడంతో ఏడాదిగా పైచదువులకు దూరమయ్యారు.
చదవండి: National Teachers Awards 2024: ఉత్తమ అధ్యాపకురాలు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం.. నగదు బహుమతి ఎంతో తెలుసా?
కలెక్టర్ వద్ద కన్నీళ్లు..
కొన్ని నెలలుగా కళాశాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్న బీఎడ్ విద్యార్థులు సెప్టెంబర్ 9న కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా తమను కాలేజీ కరస్పాండెంట్, ప్రిన్పిపాల్ వేధింపులకు గురిచేస్తున్నారని విన్నవించుకున్నారు.
స్పందించిన కలెక్టర్ వెంకటేశ్ దోత్రే జిల్లా ఇన్‌చార్జి బీసీ డెవలప్‌మెంట్ అధికారి గోరంట్ల సజీవన్ కళాశాలకు వెళ్లి వివరాలు సేకరించి.. విద్యార్థులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
సాయంత్రం ఆయన కళాశాలకు వెళ్లి ప్రిన్సిపాల్ రాజేశ్‌ను కలిసి వివరాలు అడగ్గా.. అప్పుడు సైతం ఫీజు ఇవ్వనిదే సర్టిఫికెట్లు ఇవ్వమని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. ఆ తర్వాత మాట మార్చి ఈ– పాస్ ప్రస్తావన తెచ్చి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.