Skip to main content

Inter Board: స్పెషల్‌ క్లాసులు.. ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రత్యేక కార్యాచరణ

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ పరీక్షలు దగ్గర పడుతుండటంతో ఉత్తీర్ణతా శాతం పెంచే దిశగా అధ్యాపకులను బోర్డు అప్రమత్తం చేసింది.
Special activity till completion of inter exams

పరీక్షలు పూర్తయ్యే వరకూ అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించింది. జిల్లా అధికారులకు అవసరమైన దిశానిర్దేశం చేసింది. విద్యార్థుల హాజరుపై దృష్టి పెట్టాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, అధ్యాపకులు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవులు పెట్టొద్దని ఆదేశించింది.

అత్యవసరమైతే ఇంటర్‌ బోర్డు జిల్లా అధికారి అనుమతి తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా కాలేజీల్లో విద్యార్థుల హాజరు 90 శాతానికి తగ్గకుండా జాగ్రత్త తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రతి విద్యార్థి విధిగా తరగతులకు హాజరయ్యేలా చూడాలని పేర్కొంది. గైర్హాజరైతే ప్రిన్సిపాల్‌ బాధ్యత వహించాలని తెలిపింది.  

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2025 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి 

జూనియర్‌ కాలేజీల్లో ఈసారి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని బోర్డు కార్యదర్శి నేతృత్వంలో ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ప్రతిఏటా ఉత్తీర్ణత ఎందుకు తగ్గుతుందో సమీక్షించారు. పరీక్షల చివరి దశలో నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణమవుతోందని భావించిన అధికారులు, ఈసారి అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలోనే.. విద్యార్థి తరచూ కాలేజీకి రాని పక్షంలో తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాలని ప్రిన్సిపాల్స్‌కు బోర్డు సూచించింది. రాష్ట్రంలో మొత్తం 428 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలున్నాయి. ఈ కాలేజీల్లో ఫస్టియర్, సెకండియర్‌ కలిపి 1.80 లక్షల మంది చదువుతున్నారు. అయితే గత రెండు నెలల విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలిస్తే సగం మంది క్లాసులకు హాజరు కావడం లేదని తేలింది. అలాగే గత ఏడాది ఉత్తీర్ణతా శాతం 50కి మించలేదు.

2023 ఇంటర్‌ ఫస్టియర్‌లో 40శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. గత మూడేళ్లుగా చూసినా ప్రభుత్వ కాలేజీల్లో సగటు ఉత్తీర్ణత శాతం 45కు మించలేదు. ఈ పరిస్థితులపై బోర్డు దృష్టి సారించింది. అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులకు సూచించింది. అదే సమయంలో కొన్ని సమస్యలు కూడా గుర్తించింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 26 జిల్లాలకు ఇంటర్‌ విద్య అధికారులు లేరు. కేవలం ఏడు జిల్లాలకు మాత్రమే ఉన్నారు. ఇది పర్యవేక్షణ లోపానికి దారితీస్తోందనే అభిప్రాయానికి వచ్చిన బోర్డు ప్రస్తుతానికి ఇన్‌చార్జి అధికారుల ద్వారా కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించింది. 

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

జిల్లా అధికారులు చేయాల్సిన పనులు 

  • సంక్రాంతి సెలవుల తర్వాత కాలేజీలు మొదలవ్వగానే ప్రతి కాలేజీలోనూ తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి. విద్యార్థులు చదువులో ఎలా ఉన్నారు? ఎక్కడ లోపాలున్నాయి? అనేది ఆరా తీయడంతో పాటు వాటిని ఎలా సరిదిద్దాలో వివరించాలి. 
  • వీలైనంత త్వరగా సిలబస్‌ పూర్తి చేసి రివిజన్‌ చేపట్టాలి. ఈ క్రమంలో బాగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించారు. ఏయే చాప్టర్లలో వారు వెనుకబడ్డారో అంచనా వేయాలి. ప్రత్యేక క్లాసులను నిర్వహించాలి. 
  • ప్రతి కాలేజీలోనూ అధ్యాపకులను కౌన్సెలింగ్‌ కోసం నియమించాలి. మానసిక ఒత్తిడికి గురయ్యే విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. అవసరమైతే సైకాలజిస్టులతో కూడా కౌన్సెలింగ్‌ ఇప్పించాలి.  
  • పరీక్షలు అయ్యే వరకూ విద్యార్థులను గమనించేలా కాలేజీల్లో సీసీ కెమెరాలు అమర్చాలి. అవసరమైతే ప్రత్యేక బడ్జెట్‌ను ఇస్తారు.  
  • ప్రయోగశాలల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి. ప్రయోగశాలల్లో ప్రాక్టీస్‌ పరీక్షలు నిర్వహించే విధానం అనుసరించాలి. దీనివల్ల పరీక్షల సమయంలో భయం లేకుండా ఉంటుంది.  
  • ఆయా అంశాలపై జిల్లా అధికారులు ప్రతిరోజు బోర్డుకు నివేదిక ఇవ్వాలి. బోర్డు ఆదేశాలను బేఖాతరు చేసే అధ్యాపకులు, ప్రిన్సిపాల్స్‌పై వీరు చర్యలను సూచించడానికి అవకాశం ఉంది.
Published date : 18 Jan 2025 01:02PM

Photo Stories