Good news for Anganwadi Job Aspirants: అంగన్‌వాడీల్లో కొలువుల భర్తీ!.. టీచర్లు, హెల్పర్లు..
పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) విద్యను పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకంపై దృష్టిపెట్టింది.
ఈ మేరకు అంగన్‌వాడీల్లో పనిచేస్తున్న సిబ్బంది, ఖాళీలు, రిటైర్మెంట్ల వివరాల సేకరణ చేపట్టింది. లెక్కలపై స్పష్టత వచ్చాక భర్తీకి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
చదవండి: Anganwadi Centers: అంగన్‌వాడీ కేంద్రాలను సక్రమంగా పర్యవేక్షించాలి.. ఈ పిల్లలను గుర్తించాలి..
పనిచేస్తున్నది ఎందరు.. ఖాళీలెన్ని?
రాష్ట్రంలో 149 సమీకృత శిశు అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. ఇందులో 31,711 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు.
వీటన్నింటిలో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ తాజాగా క్షేత్రస్థాయిలో శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారు(సీడీపీఓ)లను ఆదేశించింది.
ఆయా ప్రాజెక్టుల వారీగా వివరాలను సమర్పించాలని సూచించింది. ప్రస్తుతం పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ల వివరాలు, ఖాళీలు, సెంటర్‌లోని రిజర్వేషన్లు, ఈ ఏడాదిలో పదవీ విరమణ పొందుతున్న వారు, ఇప్పటికే పదవీ విరమణకు అర్హత సాధించి విధుల్లో కొనసాగుతున్న వారి వివరాలన్నీ సమర్పించాలని ఆదేశించింది.
చదవండి: Anganwadi Workers : పెంచని జీతాలు.. భర్తీకాని పోస్టులు.. ఆందోళనబాటలో అంగన్వాడీలు..!
ఇప్పటికే పలు ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం జిల్లా సంక్షేమాధికారులకు చేరగా.. త్వరలో కమిషనరేట్‌కు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఖాళీల లెక్కలు తేలితే.. అక్కడున్న రిజర్వేషన్లకు అనుగుణంగా టీచర్, హెల్పర్ ఖాళీల భర్తీకి చర్యలు వేగవంతం చేయవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,800 అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ ఖాళీలు ఉన్నట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
మినీ కేంద్రాల అప్‌గ్రేడేషన్‌తో..
రాష్ట్రంలో 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిని ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది.
కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. ప్రధాన అంగన్‌వాడీ కేంద్రంలో ఒక టీచర్, ఒక హెల్పర్ పనిచేస్తుంటే... మినీ అంగన్‌వాడీ కేంద్రంలో ఒక టీచర్ మాత్రమే ఉంటారు.
ఈ మినీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేశాక హెల్పర్ పోస్టు కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఈ పోస్టుల లెక్కలు తేలలేదు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
అప్‌గ్రెడేషన్ ప్రక్రియ పూర్తయితే మొత్తంగా హెల్పర్ పోస్టుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.
రిటైర్మెంట్ల వివరాలపైనా..
అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణకు సంబంధించిన ప్యాకేజీ పెంచనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పలు సందర్భాల్లో వెల్లడించారు.
ఆ ఫైలు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. దీనితో గడువు తీరినా చాలా మంది పదవీ విరమణ తీసుకోలేదు. ఈ క్రమంలో పదవీ విరమణ పొందాల్సినవారి వివరాలను కూడా సమర్పించాలని, ఇప్పటికే రిటైర్ అయినవారి వివరాలను అందించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.