UPSC ESE-2023 Notification: ఇంజనీరింగ్ కొలువులకు మార్గాలు.. విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్...
ఇంజనీరింగ్ విద్యార్థులకు.. మరో జాబ్ నోటిఫికేషన్! సర్కారీ కొలువు సొంతం చేసుకోవాలనుకునే వారికి చక్కటి అవకాశం! కెరీర్ ప్రారంభంలోనే..గ్రూప్-ఎ, గ్రూప్-బి గెజిటెడ్ హోదాలో.. ఉద్యోగం అందుకోవచ్చు. అందుకు మార్గం.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే.. ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్‌ఈ)! కేంద్ర ప్రభుత్వ పరిధిలోని..పలు శాఖల్లో ఇంజనీర్ పోస్ట్‌ల భర్తీకి యూపీఎస్సీ ప్రతి ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తుంది. తాజాగా ఈఎస్‌ఈ-2023 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఈఎస్‌ఈ పరీక్ష, ఎంపిక విధానం, భర్తీ చేసే పోస్ట్‌లు, కేటగిరీలు, విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్...
- ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 నోటిఫికేషన్
- బీటెక్ అర్హతతో పోటీ పడే అవకాశం
- ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక ప్రక్రియ
- విజయం సాధిస్తే.. గ్రూప్-ఎ,బి గెజిటెడ్ ఉద్యోగం
బీటెక్ ఉత్తీర్ణులు ఇటు కార్పొరేట్ కొలువులతోపాటు అటు సర్కారీ కొలువులపైనా దృష్టి పెడుతుంటారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను అన్వేషిస్తుంటారు. వాటిలో విజయానికి కృషి చేస్తుంటారు. అలాంటి వారికి చక్కటి అవకాశం.. యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.
327 పోస్ట్‌లు, 4 విభాగాలు
యూపీఎస్‌సీ తాజాగా విడుదల చేసిన ఈఎస్‌ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 327 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు.
అర్హతలు
- దరఖాస్తు చేయదలచుకుంటున్న విభాగానికి సంబంధించిన బ్రాంచ్‌తో బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఇండియన్ నేవల్ అర్మమెంట్ సర్వీస్(ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) పోస్ట్‌లకు వైర్‌లెస్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్/రేడియో ఫిజిక్స్/రేడియో ఇంజనీరింగ్ స్పెషలైజేషన్‌తో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఇండియన్ రేడియో రెగ్యులేటరీ సర్వీస్ గ్రూప్- ఎ పోస్ట్‌లకు వైర్‌లెస్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్/రేడియో ఫిజిక్స్/రేడియో ఇంజనీరింగ్/ఫిజిక్స్/రేడియో కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్ స్పెషలైజేషన్‌తో ఎమ్మెసీ లేదా ఎంఎస్ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయసు: జనవరి 1, 2023 నాటికి 21-30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు అయిదేళ్ల సడలింపు లభిస్తుంది.
మూడంచెల ఎంపిక ప్రక్రియ
- ఈఎస్‌ఈ ఎంపిక ప్రక్రియ మూడంచెల విధానంలో జరుగుతుంది. మొదటి రెండు దశలు రాత పరీక్షలుగా, మూడో దశ పర్సనల్ ఇంటర్వ్యూ. స్టేజ్-1(ప్రిలిమినరీ ఎగ్జామినేషన్),స్టేజ్-2(మెయిన్ ఎగ్జామినేషన్), స్టేజ్-3(పర్సనాలిటీ టెస్ట్).
చదవండి: Recruitment Trends: ఆఫ్–క్యాంపస్... రూ.కోట్లలో ప్యాకేజీలు అందుకోండిలా!
ప్రిలిమినరీ.. ఆబ్జెక్టివ్ తరహా
- ఎంపిక ప్రక్రియలో స్టేజ్-1గా పేర్కొనే ప్రిలిమినరీ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. ఈ దశలో రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది. అవి.. పేపర్-1(జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్), పేపర్-2(ఇంజనీరింగ్ సంబంధిత సబ్జెక్ట్).
- పేపర్-1ను 200 మార్కులు, పేపర్-2ను 300 మార్కులకు నిర్వహిస్తారు.
- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లోని పేపర్1 అన్ని విభాగాల అభ్యర్థులకు కామన్‌గా ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ విధానం కూడా అమలవుతోంది.
- పేపర్-2 మాత్రం అభ్యర్థి దరఖాస్తు సమయంలో పేర్కొన్న సబ్జెక్ట్‌పై జరుగుతుంది.
- ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు ఏడుగురు లేదా ఎనిమిది మందిని చొప్పున మెయిన్‌కు ఎంపిక చేస్తారు.
మెయిన్ ఎగ్జామినేషన్.. ఇలా
రెండో దశగా(స్టేజ్-2)గా పేర్కొనే మెయిన్ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. అభ్యర్థులు తమ సబ్జెక్ట్‌కు సంబంధించి రెండు పేపర్లలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక్కో పేపర్‌కు 300 మార్కులు చొప్పున మొత్తం ఆరు వందల మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న విభాగానికి సంబంధించిన పేపర్లలో ఈ పరీక్ష జరుగుతుంది.
చదవండి: IIT Jobs: ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.. ఏడాదికి రూ.2కోట్లకు పైగా వేతనం..
పర్సనల్ ఇంటర్వ్యూ
ఎంపిక ప్రక్రియలో చివరి, మూడో దశ.. పర్సనాలిటీ టెస్ట్‌గా పిలిచే పర్సనల్ ఇంటర్వ్యూ. స్టేజ్-2 మెయిన్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా.. ఒక్కో పోస్ట్‌కు ఇద్దరిని చొప్పున(1:2 నిష్పత్తిలో) ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థులకు ఇంజనీరింగ్ సర్వీసెస్ పట్ల ఉన్న ఆసక్తి, అందులోనూ ప్రభుత్వ రంగంలో పని చేయాలనుకునేందుకు గల కారణాలు, వ్యక్తిత్వం వంటి అంశాలను పరిశీలిస్తారు.
విజయానికి అడుగులు.. ఇలా
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరింగ్ కొలువులకు నిర్వహించే ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు దరఖాస్తు సమయం నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. సిలబస్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ పేపర్‌లో పూర్తి పట్టు సాధించాలి.
ప్రిలిమ్స్ పక్కాగా
- ప్రిలిమ్స్ పేపర్-1(జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్).. మొత్తం పది అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.వీటిలో మొదటి టాపిక్‌గా పేర్కొన్న జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు; ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధిని మినహాయిస్తే.. మిగతా తొమ్మిది టాపిక్స్ కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు తమ అకడమిక్స్‌లో అభ్యసించేవే. అకడమిక్స్ పరంగా బేసిక్స్, అప్లికేషన్ ఓరియెంటేషన్ ఉంటే ఈ పేపర్‌లో రాణించడం సులభమే.
- ప్రిలిమ్స్ పేపర్-2.. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న విభాగానికి సంబంధించిన ప్రశ్నలతో ఉంటుంది. అకడమిక్‌గా సంబంధిత సబ్జెక్ట్‌లో పట్టున్న అభ్యర్థులు సులభంగా ఈ పేపర్‌ను గట్టెక్కొచ్చు.
మెయిన్.. పటిష్టంగా
- మెయిన్ ఎగ్జామినేషన్‌కు అభ్యర్థులు పూర్తిగా అనలిటికల్ అప్రోచ్, అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ముందుకు సాగాలి. ఆయా టెక్నికల్ టాపిక్స్‌కు సంబంధించి.. తాజా సామాజిక పరిస్థితులను అన్వయిస్తూ చదవడం కూడా ఉపకరిస్తుంది. ఉదాహరణకు టెలికమ్యూనికేషన్స్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకున్న 5-జి టెక్నాలజీస్ వంటి అంశాలను అకడమిక్ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ చదవడం లాభిస్తుంది. అదే విధంగా మెకానికల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి.. రోబోటిక్స్ వంటి వాటిని అన్వయించుకుంటూ అభ్యసనం సాగించాలి.
- ఇదే వ్యూహాన్ని ఇతర విభాగాల (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్)అభ్యర్థులు కూడా అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
అనుసంధాన దృక్పథం
ఈఎస్‌ఈ ప్రిపరేషన్‌లో అనుసంధాన దృక్పథంతో అడుగులు వేయాలి. స్టేజ్-1 ప్రిలిమ్స్‌లోని పేపర్-2, మెయిన్‌లోని రెండు సబ్జెక్ట్ పేపర్లు అభ్యర్థులు ఇంజనీరింగ్‌లో చదివినవే. వీటిని అనుసంధానం చేసుకుంటూ చదివే అవకాశం ఉంది. అభ్యర్థులు ముందుగా ప్రిలిమ్స్‌లో గట్టెక్కే విధంగా దృష్టి పెట్టాలి. యూపీఎస్‌సీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్‌కు దాదాపు ఆరు నెలల సమయం అందుబాటులో ఉంది. కాబట్టి ప్రిలిమ్స్ పూర్తి చేసిన తర్వాత మెయిన్స్‌పై దృష్టి సారించాలి.
భావనలు, అన్వయ దృక్పథం
ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో విజయానికి ఆయా సబ్జెక్ట్‌లలోని కాన్సెప్ట్స్‌పై పూర్తి అవగాహన పొందడమే కాకుండా.. వాటిని అన్వయ దృక్పథంతో అధ్యయనం చేయడం కూడా చాలా ముఖ్యం. ఫలితంగా పరీక్షల్లో ప్రశ్నలు ఎలా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. ప్రీవియస్ పేపర్లను సాధన చేయడం, మాక్ టెస్ట్‌లకు హాజరవడం మేలు చేస్తుంది. ప్రిలిమ్స్‌లో నెగెటివ్ మార్కింగ్ ఉందనే విషయాన్ని గుర్తించాలి. మెయిన్స్‌లో.. అకడమిక్‌గా తమకు పట్టున్న టాపిక్స్‌పై మరింత అవగాహన పెంచుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 4, 2022
- ఆన్‌లైన్ దరఖాస్తు ఉపసంహరణ: అక్టోబర్ 12-అక్టోబర్ 18
- ప్రిలిమినరీ(స్టేజ్-1) పరీక్ష తేదీ: ఫిబ్రవరి 19, 2023
- మెయిన్ ఎగ్జామినేషన్(స్టేజ్-2) పరీక్ష తేదీ: జూన్ 25, 2023
- వివరాలకు వెబ్‌సైట్: https://www.upsc.gov.in/
- ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: www.upsconline.nic.in
ఇంజనీరింగ్ సర్వీసెస్ 2023 పరీక్ష విధానం
- మూడు దశలుగా ఈఎస్‌ఈ ఎంపిక ప్రక్రియ
- మొదటి దశ ప్రిలిమ్స్ రెండు పేపర్లలో 500 మార్కులకు నిర్వహణ
- రెండో దశ మెయిన్స్ రెండు పేపర్లలో 600 మార్కులకు పరీక్ష
- చివరి దశ పర్సనల్ ఇంటర్వ్యూకు 200 మార్కులు
- మెయిన్స్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 04,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |