Skip to main content

Recruitment Trends: ఆఫ్‌–క్యాంపస్‌... రూ.కోట్లలో ప్యాకేజీలు అందుకోండిలా!

Campus Recruitment Process in Top Institutes
Campus Recruitment Process in Top Institutes

జాతీయ స్థాయిలో.. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఐఐటీలు వంటి టాప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో రూ.కోట్ల ప్యాకేజీలు సైతం లభిస్తున్న పరిస్థితి. స్టార్టప్‌ల నుంచి ఎంఎన్‌సీల వరకు.. అనేక సంస్థలు నియామకాలు చేపడుతున్నాయి. మరోవైపు.. క్యాంపస్‌ సెలక్షన్స్‌లో.. విజయం సాధించకపోతే.. ఆఫర్‌ లభించకుంటే.. ఏం చేయాలి అనే ఆందోళన ఎంతో మంది విద్యార్థుల్లో కనిపిస్తోంది. మెచ్చిన కంపెనీలో నచ్చిన కొలువు దక్కించుకోవడం ఎలా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఇక ఇలాంటి ఆందోళనలకు, సందేహాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేయొచ్చు. నచ్చిన కొలువు దక్కించుకునేలా అడుగులు వేయొచ్చు. అందుకు మార్గం.. ఆఫ్‌–క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌!! ఈ నేపథ్యంలో.. ఆఫ్‌ క్యాంపస్‌ నియామక విధానం.. దరఖాస్తుకు మార్గం.. కోరుకుంటున్న నైపుణ్యాలు తదితర అంశాలపై ప్రత్యేక కథనం...

  • క్యాంపస్‌ ఆఫర్‌ రాలేదా.. నో టెన్షన్‌
  • అందుబాటులో ఎన్నో ఆఫ్‌ క్యాంపస్‌ మార్గాలు
  • సంస్థల ఆధ్వర్యంలో టాలెంట్‌ టెస్ట్‌లు
  • ఆదరువుగా నిలుస్తున్న సోషల్‌ మీడియా వేదికలు
  • పూర్వ విద్యార్థులు, ప్లేస్‌మెంట్‌ వర్గాల సహకారం కూడా

క్యాంపస్‌ డ్రైవ్‌లో కొలువు రాకపోతే నిరుత్సాహ పడనక్కర్లేదు. అవకాశాలు మూసుకుపోతున్నాయనే ఆందోళన అసలే అక్కర్లేదు. ఎందుకంటే.. ఇప్పుడు జాబ్‌ మార్కెట్‌లో ఉద్యోగాలు సొంతం చేసుకునేందుకు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. అభ్యర్థులు వాటిపై అవగాహన పెంచుకొని.. దానికి తగినట్లుగా తమను మలచుకుంటే.. నైపుణ్యాలు పెంచుకుంటే.. ఉద్యోగం సొంతం చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది అంటున్నారు నిపుణులు. 

ఆఫ్‌–క్యాంపస్‌ నియామకాల దిశగా

ప్రస్తుతం జాబ్‌ మార్కెట్‌ను పరిశీలిస్తే.. ఆయా రంగాల్లోని అనేక కంపెనీలు ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాలు చేపడుతున్నాయి. ఈ ధోరణి ఐటీ సెక్టార్‌తోపాటు బ్యాంకింగ్, తయారీ, రిటైల్‌ తదితర రంగాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఐటీ రిక్రూట్‌మెంట్స్‌ అంటే కేవలం క్యాంపస్‌ డ్రైవ్స్‌ ద్వారానే జరుగుతాయనే అభిప్రాయం ఉంటుంది. కాని ఇటీవల కాలంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ప్రతిభావంతుల కోసం ఆఫ్‌–క్యాంపస్‌ నియామకాలు కూడా చేపడుతున్నాయి. అందుకోసం ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. 

చ‌ద‌వండి: Industry 4.0: 5జీ టెక్నాలజీ.. రెండు కోట్ల కొలువులు రెడీ!

టాప్‌ కంపెనీల్లో సైతం

ఐటీ రంగంలో దిగ్గజ సంస్థలుగా పేరొందిన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, కాగ్నిజెంట్‌ వంటి సంస్థలు సంప్రదాయ డిగ్రీలు మొదలు ఇంజనీరింగ్, టెక్నికల్‌ కోర్సుల ఉత్తీర్ణులను అర్హులుగా పేర్కొంటూ.. ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. వీటిలో ప్రతిభ చూపిన వారికి తదుపరి దశలో తమ సంస్థల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి.. వారి అర్హతలకు సరితూగే కొలువులు ఖరారు చేస్తున్నాయి. బీపీఓ మొదలు కీలకమైన కోడింగ్, ప్రోగ్రామింగ్‌ వరకూ.. పలు జాబ్‌ ప్రొఫైల్స్‌తో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.

వయా హ్యాకథాన్స్‌

ఐటీ సంస్థలు కోడింగ్, ప్రోగ్రామింగ్‌లో నిపుణులైన అభ్యర్థుల ఎంపిక కోసం ఆన్‌లైన్‌ బాట పడుతున్నాయి. హ్యాకథాన్స్‌ పేరిట కోడింగ్, ప్రోగ్రామింగ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తూ.. స్కిల్స్‌ ఉన్న వారిని గుర్తించి నియామకాలు ఖరారు చేస్తున్నాయి. దీనికి సంబంధించి సంస్థలు ఆయా టెస్ట్‌లు, హ్యాకథాన్స్‌ వివరాలను తమ వెబ్‌సైట్స్‌ తోపాటు ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా వెల్లడిస్తున్నాయి. వీటిలో పాల్గొని ప్రతిభను నిరూపించుకోవడం ద్వారా ఆఫర్లు ఖాయం చేసుకోవచ్చు. 

రిఫరల్‌ ఎంట్రీ

కంపెనీలు ఓపెన్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో.. రిఫరల్‌ ఎంట్రీ పేరుతో నియామకాలు చేపడుతున్నాయి. అంటే.. తమ సంస్థలోని ఖాళీల సమాచారాన్ని సంస్థలోని సిబ్బందికి తెలియజేసి.. వారికి తెలిసిన నైపుణ్యవంతులైన అభ్యర్థులను సూచించమని కోరుతున్నాయి. ఈ అవకాశాన్ని కూడా ఫ్రెషర్స్‌ వినియోగించుకోవచ్చు. ఆయా కంపెనీల్లోని తమ పరిచయస్తుల ద్వారా రిఫరల్‌ ఎంట్రీ విధానంలో అవకాశాలు దక్కించుకోవచ్చు. 

చ‌ద‌వండి: Industry 4.0: బ్రాంచ్‌ ఏదైనా.. ఈ స్కిల్స్‌పై పట్టు సాధిస్తేనే అవకాశాలు

ఇంటర్న్‌షిప్స్‌ మార్గం

ఆఫ్‌–క్యాంపస్‌ ఉద్యోగాన్వేషణలో ఇంటర్న్‌షిప్‌ అనుభవం అత్యంత కీలకంగా మారుతోంది. ప్రస్తుతం ప్రొఫెషనల్‌ డిగ్రీ కోర్సుల విద్యార్థులు కరిక్యులంలో భాగంగా పలు సంస్థల్లో ఇంటర్న్‌షిప్స్‌ చేయాల్సి ఉంటుంది. అలా ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులు.. అప్పటికే సదరు సంస్థలోని సిబ్బంది, ఉన్నతాధికారులతో ఏర్పడిన పరిచయాలను ఉపయోగించుకుని ఉద్యోగావకాశాల విషయంలో వారి సహకారాన్ని కోరొచ్చు. అంతేకాకుండా ఇంటర్న్‌షిప్‌ సమయంలో మంచి ప్రతిభ కనబరిస్తే.. సదరు సంస్థ ఖాళీలు ఉంటే ఆఫర్‌ ఇచ్చేందుకు మొగ్గు చూపుతుంది. అదే విధంగా ఇంటర్న్‌షిప్‌ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని అనేక సంస్థలు ఉద్యోగాలు ఇస్తున్నాయి. 

జాబ్‌ సెర్చ్‌ పోర్టల్స్‌

ఉద్యోగాన్వేషణకు చక్కటి మార్గం.. జాబ్‌ సెర్చ్‌ పోర్టల్స్‌. మాన్‌స్టర్‌ డాట్‌ కామ్, ఇండీడ్, నౌకరీ, షైన్‌ డాట్‌ కామ్, టీమ్‌లీజ్‌ వంటి జాబ్‌ పోర్టల్స్‌లో ఉద్యోగ ఖాళీల సమాచారం అందుబాటులో ఉంటుంది. వీటిలో తమ ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేసుకొని రెజ్యుమే/సీవీని అప్‌లోడ్‌ చేసుకుంటే.. అర్హతలకు తగ్గ ఉద్యోగాల సమాచారం జాబ్‌ పోర్టల్స్‌లో లభిస్తుంది. ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకునేటప్పుడే ‘కీ స్కిల్స్‌’ పేర్కొనడం ద్వారా.. వాటికి సంబంధించిన ఉద్యోగాల సమాచారం అందుబాటులోకి వస్తుంది. దీని ఆధారంగా సదరు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని.. తదుపరి ఎంపిక ప్రక్రియకు సన్నద్ధమవ్వాలి. జాబ్‌ సెర్చ్‌ పోర్టల్స్‌లో అలర్ట్‌ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ‘అలర్ట్స్‌’ ఆప్షన్‌ను ఎంచుకుంటే.. అభ్యర్థులు పేర్కొన్న అర్హతలకు సరితూగే ఉద్యోగావకాశాలు లిస్ట్‌ అయినప్పుడు.. సదరు కొత్త ఉద్యోగాల సమాచారం ఈ–మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌ల రూపంలో పంపిస్తారు. 

చ‌ద‌వండి: Resume: మీ రెజ్యూమ్‌ ఎందుకు సెలక్ట్‌ కావట్లేదో తెలుసా..?

రెజ్యుమే ఆకట్టుకునేలా

ఆఫ్‌–క్యాంపస్‌ విధానంలో ఉద్యోగాన్వేషణ సాగించే విద్యార్థులు రెజ్యుమేపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. రెజ్యుమే రిక్రూటర్స్‌ను ఆకట్టుకునేలా రూపొందించుకోవాలి. అనుభవం, అకడమిక్‌గా చేసిన ప్రాజెక్ట్‌ వర్క్స్‌ లేదా ఇతర ఎచీవ్‌మెంట్స్‌ను, ఇంటర్న్‌షిప్స్, అనుభవం, ప్రత్యేక నైపుణ్యాలను రెజ్యుమేలో తప్పనిసరిగా పొందుపర్చాలి. అప్పుడే రిక్రూటర్స్‌ సదరు అభ్యర్థులను ఎంపిక ప్రక్రియకు పిలిచే అవకాశం ఉంటుంది. 

సోషల్‌ మీడియా

ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్‌ క్యాంపస్‌ విధానంలో ఉద్యోగార్థులకు అందుబాటులో ఉన్న మరో చక్కటి మార్గం.. సోషల్‌ మీడియా. ముఖ్యంగా లింక్డ్‌ఇన్, ట్విటర్‌ వంటి ప్రొఫెషనల్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్లలో ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేసుకుంటే.. పలు రంగాలకు చెందిన నిపుణులను ఫాలో అయ్యే అవకాశం లభిస్తుంది. ఇలా వారితో ఏర్పడిన పరిచయాల ద్వారా తమకు సరితూగే రంగాల్లోని సీనియర్లను ఆన్‌లైన్‌లోనే సంప్రదిస్తూ.. ఉద్యోగావకాశాల అన్వేషణ సాగించొచ్చు. వారిచ్చే సలహాలు కూడా కెరీర్‌కు ఉపయోగపడతాయి. అదే విధంగా ప్రొఫెషనల్‌ సోషల్‌ మీడియా సైట్స్‌ ప్రొఫైల్‌కు తగిన కొత్త ఉద్యోగావకాశాల సమాచారాన్ని అందిస్తున్నాయి. కాబట్టి సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ను విస్తృతం చేసుకుంటే.. కొలువుల సమాచారం తెలుస్తుంది. 

అలూమ్నీ రిలేషన్స్‌

ఉద్యోగాన్వేషణలో అలూమ్నీ అసోసియేషన్స్‌ ద్వారా ప్రయోజనం పొందొచ్చు. అప్పటికే తమ ఇన్‌స్టిట్యూట్‌లో చదివి..ఆయా రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను(అలూమ్నీ) సంప్రదించడం ద్వారా అవకాశాలు అందుకునే వీలుంది. అకడమిక్‌గా పొందిన నైపుణ్యాలు తెలియజేసి.. అవకాశాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఐఐటీలు, ఐఐఎంలు, ఇతర ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన పూర్వ విద్యార్థులు ప్రత్యేకంగా అలూమ్నీ అసోసియేషన్‌లను ఏర్పాటు చేసుకుని.. వాటి ద్వారా ఉద్యోగ సాధనలో తోడ్పాటును అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 

చ‌ద‌వండి: ఎవర్‌గ్రీన్ సివిల్ ఇంజనీరింగ్.. కెరీర్ అవకాశాలు ఇలా..

క్యాంపస్‌ వర్గాలు

ఫ్రెషర్స్‌కు ఉద్యోగాన్వేషణలో కలిసొచ్చే మరో మార్గం..క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ప్రతినిధులను సంప్రదించడం. సదరు ప్లేస్‌మెంట్స్‌ ప్రతినిధులకు, సంస్థల రిక్రూటింగ్‌ ప్రతినిధులతో ఉన్న పరిచయాల ద్వారా ఏఏ సంస్థల్లో అవకాశాలున్నాయి.. ఎలాంటి నైపుణ్యాలు అవసరమో తెలుస్తుంది. ఈ సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా ఉద్యోగార్థులు తమకు సరితూగే సంస్థల్లో అవకాశాల గురించి అన్వేషించొచ్చు. ఇటీవల కాలంలో కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ విభాగాలను కెరీర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్స్‌గా మార్చాయి. వీటి ద్వారా సంస్థలకు సరితూగే నైపుణ్యాలపై విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు శిక్షణ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి.

ఎంపికలో.. ఐఏ

కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) టూల్స్‌ను వినియోగిస్తున్నాయి. దరఖాస్తుల వడపోత, అభ్యర్థుల అప్టిట్యూడ్, అటిట్యూడ్‌ను తెలుసుకునేందుకు హెచ్‌ఆర్‌ విభాగంలో ఆటోమేషన్‌ టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. దీనివల్ల ఎంపిక ప్రక్రియలో జరిగే జాప్యాన్ని నివారించడమే కాకుండా.. నిజమైన టాలెంట్‌ను గుర్తించేందుకు వీలవుతోంది. 

ఆన్‌లైన్‌లో ‘వర్చువల్‌’గా

ఆఫ్‌–క్యాంపస్‌ విధానంలో నియామకాలు చేపడుతున్న సంస్థలు.. ఆ ప్రక్రియను మాత్రం ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నాయి. ఉద్యోగానికి సరితూగుతారనుకున్న అభ్యర్థులను వర్చువల్‌గా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. ఈ వర్చువల్‌ సెలక్షన్‌ ప్రాసెస్‌లో భాగంగా ఆన్‌లైన్‌లోనే గ్రూప్‌ టాస్క్స్, గ్రూప్‌ డిస్కషన్స్‌ వంటి పరీక్షలు పెడుతున్నాయి. వీటిలో విజయం సాధించాలంటే.. ముందుగానే వీటిపై అవగాహన ఏర్పరచుకోవాలి. వర్చువల్‌ ఇంటర్వ్యూలకు సంబంధించిన సాంకేతికతలపై ముఖ్యంగా జూమ్, ఎంఎస్‌టీమ్స్‌ వంటి వాటిలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. వర్చువల్‌ ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్‌ వంటి విషయాల్లో పక్కా ప్రొఫెషనల్‌గా వ్యవహరించాలి. 

ఆఫ్‌–క్యాంపస్‌.. ముఖ్యాంశాలు

  • ఉద్యోగార్థులకు ప్రయోజనకరంగా ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌లు.
  • ఇంటర్న్‌షిప్,రిఫరల్స్‌ ద్వారా ఉద్యోగాలు దక్కించుకునే అవకాశం.
  • ఉద్యోగార్థులకు, రిక్రూటర్స్‌కు అనుసంధానంగా నిలుస్తున్న జాబ్‌ సెర్చ్‌ పోర్టల్స్‌.
  • ఆఫ్‌–క్యాంపస్‌ నియామకాల్లోనూ కంపెనీల ఎంపిక ప్రక్రియలో మార్పులు.
  • వర్చువల్, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలకు పెరుగుతున్న ప్రాధాన్యం.

అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌

జాబ్‌ మార్కెట్‌లో అడుగు పెట్టాలనుకుంటున్న విద్యార్థులు.. ముందుగా అవుట్‌ ఆఫ్‌ ద బాక్స్‌ థింకింగ్‌ను అలవర్చుకోవాలి. కేవలం క్యాంపస్‌ డ్రైవ్స్‌తోనే ఉద్యోగాలొస్తాయనే భావన వీడాలి. ఇప్పుడు ఆన్‌లైన్‌ టెస్ట్స్, టాలెంట్‌ టెస్ట్‌ల పేరిట సంస్థలే నేరుగా ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాలు చేపడుతున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. జాబ్‌ సెర్చ్‌ పోర్టల్స్‌ కూడా ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తున్నాయి. వీటిని ఎంచుకునే క్రమంలో వాటికున్న ప్రామాణికతను పరిగణనలోకి తీసుకొని.. ప్రొఫైల్‌ అప్‌లోడ్‌ చేసుకోవాలి. 
–రమేశ్‌ లోగనాథన్, ఐటీ రంగ నిపుణులు

చ‌ద‌వండి: Full Stack Developers: ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌... రూ.లక్షల్లో వార్షిక వేతన ప్యాకేజీలు

Published date : 30 Dec 2021 06:15PM

Photo Stories