Industry 4.0: 5జీ టెక్నాలజీ.. రెండు కోట్ల కొలువులు రెడీ!
5జీ(జనరేషన్).. ఐదో తరం సెల్యులార్ నెట్‌వర్క్ టెక్నాలజీ! టెలికం రంగంలో నూతన విప్లవానికి తెరదీస్తున్న టెక్నాలజీ ఇది!! 4జీ కంటే 100 రెట్ల వేగవంతమైంది. ఇప్పటికే ఈ టెక్నాలజీ ప్రపంచంలోని పలు దేశాల్లో వినియోగంలోకి వస్తోంది. 5జీ కారణంగా 2025 నాటికి దేశంలో రెండు కోట్లకు పైగా కొత్త కొలువులు అందుబాటులోకి రానున్నాయని టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ తాజా అంచనా. ఆయా ఉద్యోగాలు సొంతం చేసుకునేందుకు కావల్సిందల్లా.. ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌ను ఒడిసి పట్టుకోవడమే! ఈ నేపథ్యంలో.. 5జీ టెక్నాలజీ.. భవిష్యత్తు అవకాశాలు.. అవసరమైన నైపుణ్యాలు తదితర అంశాలపై విశ్లేషణ...
- టెలికం రంగంలో నూతన విప్లవంగా 5జీ టెక్నాలజీ
- ఐఓటీ, రోబోటిక్స్, ఏఐ, క్లౌడ్ స్కిల్స్‌తో కొలువు ఖాయం
నేడు దేశంలో నూటికి 80 శాతం మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. అరచేతిలోని స్మార్ట్‌ఫోన్‌తోనే అనేక సేవలు పొందుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఇవన్నీ 4జీ టెక్నాలజీ ఆధారిత మొబైల్ డివైజ్‌లతోనే జరుగుతున్నాయి. 4జీ టెక్నాలజీకి అడ్వాన్స్‌డ్ వెర్షన్‌గా 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఫలితంగా అత్యంత వేగంగా అన్ని రకాల సేవలు, సదుపాయాలు పొందొచ్చు. 5జీ టెక్నాలజీ.. ఇండస్ట్రీ 4.0(నాలుగో పారిశ్రామిక విప్లవం)కు మరింత ఊతమిస్తుందని.. ఫలితంగా లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.
చదవండి: Industry 4.0: బ్రాంచ్ ఏదైనా.. ఈ స్కిల్స్‌పై పట్టు సాధిస్తేనే అవకాశాలు
5జీ కొలువులు
- టెలికం కంపెనీలు 5జీ టెక్నాలజీ ఆధారిత డివైజ్‌లను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన సంస్థలు కూడా ఇదే సాంకేతికత ఆధారంగా తమ సేవలను విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఫలితంగా వివిధ రంగాల్లో భారీగా కొత్త కొలువులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
- టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ అంచనాల ప్రకారం–5జీ టెక్నాలజీ కారణంగా 2025 నాటికి 2.2 కోట్ల మేర కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.
- ముఖ్యంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ విభాగాల్లో ఈ కొలువులు లభించనున్నాయి.
- ఇప్పటికే 40 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న టెలికం రంగంలో.. 5జీ టెక్నాలజీతో ఈ కొలువుల సంఖ్య మరింత పెరగనుంది.
- టెలికం సెక్టార్ మాత్రమే కాకుండా.. ఈ కొత్త టెక్నాలజీతో సేవలందిస్తున్న ఇతర రంగాల్లోని సంస్థలు కూడా నైపుణ్యాలున్న వారికి అవకాశాలు కల్పించనున్నాయి.
వ్యవసాయం మొదలు వైద్యం వరకూ
- 5జీ టెక్నాలజీ.. వ్యవసాయం నుంచి వైద్యరంగం వరకూ.. అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులకు నాంది పలికే అవకాశం ఉంది.
- వైద్య రంగంలో ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ ద్వారా టెలిమెడిసిన్ సేవలు పొందుతున్న సంగతి తెలిసిందే. 5జీ టెక్నాలజీ ప్రవేశంతో రానున్న రోజుల్లో కీలకమైన శస్త్రచికిత్సలు, 3–డి ఎక్స్‌రేలు, ఇతర స్కానింగ్‌లు కూడా తీసే అవకాశం లభించనుంది.
- వ్యవసాయ రంగంలో.. ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) సాంకేతికత ఆధారంగా.. వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తూ.. సరితూగే పంటలు వేయడం, పర్యవేక్షణ ద్వారా దిగుబడులు భారీగా పెంచేందుకు అవకాశం ఉంటుంది.
- రిటైల్ రంగంలో.. వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాల్టీ ఆధారంగా..ఏదైనా ఒక వస్తువు లేదా ఉత్పత్తిని కళ్లకు కట్టినట్లు చూపి..ఆయా వస్తువుల నాణ్యతను లోతుగా పరిశీలించేందుకు 5జీ టెక్నాలజీ దోహదపడుతుంది.
చదవండి: Full Stack Developers: ఫుల్ స్టాక్ డెవలపర్... రూ.లక్షల్లో వార్షిక వేతన ప్యాకేజీలు
అంతా ఐఓటీ మహిమే
5జీ విస్తరణతో వైద్య రంగం, రిటైల్, అగ్రి, ఫార్మా.. ఇలా అన్ని రంగాల్లోనూ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) వినియోగం మరింతగా పెరగనుంది. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్(ఎంఎల్) వంటి సాంకేతికతలు విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ సాంకేతికతల ఆధారంగా సేవలందిస్తున్న సంస్థలు.. నిపుణులైన మానవ వనరుల కోసం అన్వేషిస్తున్నాయి. దాంతో సంబంధిత నైపుణ్యాలున్న అభ్యర్థులు చక్కటి కొలువులు అందుకునే అవకాశం ఉంది.
క్లౌడ్ కంప్యూటింగ్
క్లౌడ్ కంప్యూటింగ్ అంటే.. ఇంటర్నెట్ లేదా ఆన్‌లైన్ ద్వారా సాఫ్ట్‌వేర్ సర్వీస్‌లను అందించడం. 5జీ కారణంగా క్లౌడ్ కంప్యూటింగ్ స్మార్ట్ ఫోన్లనోనూ కనిపించనుంది. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్.. వినియోగదారులకు మరింత సులభంగా, వేగంగా సేవలు అందించే అవకాశం ఉంటుంది. స్మార్ట్ ఫోన్ యూజర్స్‌కు మరిన్ని సౌలభ్యాలు, ఆఫ్షన్స్ అందుబాటులోకి వస్తాయి. ఉదాహరణకు.. ఇప్పుడు మార్కెట్లో ఉన్న హైఎండ్ ఫోన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. ఎంఎస్ ఆఫీస్ టూల్స్, పీడీఎఫ్ వ్యూయర్స్, పీడీఎఫ్ డ్రైవ్స్‌ను అప్పటికప్పుడు ఫోన్‌లోనే పొందే అవకాశం లభిస్తోంది. దీంతో.. సదరు యూజర్లు తాము డౌన్‌లోడ్ చేసుకున్న విభిన్న వెర్షన్ల డాక్యుమెంట్లను ఎలాంటి ప్రీ–లోడెడ్ సాఫ్ట్‌వేర్ లేకుండానే వీక్షించే సదుపాయం కలుగుతోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
4.0 స్కిల్స్‌లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటున్న టెక్నాలజీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). మానవ ప్రమేయం లేకుండా రోబోలు, మెషీన్లతో..ముందస్తు ప్రోగ్రామింగ్ ద్వారా పని చేయించే నైపుణ్యమే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు బ్యాంకింగ్ నుంచి ఐటీ వరకూ.. అన్ని రంగాల్లోని సంస్థలు ఏఐ వినియోగానికి ప్రాధాన్యమిస్తున్నాయి. ఫలితంగా వినియోగదారులు కోరుకునే సేవలు వేగంగా అందించే వీలవుతోంది. తద్వారా మార్కెట్ పోటీలో ముందంజలో నిలవొచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. 5జీ కారణంగా ఏఐ మరింతగా విస్తరిస్తుంది. అన్ని ఉత్పత్తులు, సేవలు, కార్యకలాపాల్లో ఈ టెక్నాలజీ వినియోగం పెరుగుతుంది.
రోబోటిక్స్
రోబోటిక్ టెక్నాలజీ..ప్రధానంగా పారిశ్రామిక ఉత్పత్తుల్లో కీలకంగా నిలుస్తోంది.గత కొంత కాలంగా రోబో ఆధారిత సేవలు అన్ని రంగాల్లోనూ వినియోగంలోకి వస్తున్నాయి. ఈ సేవలను మరింతగా విస్తరించేందుకు 5జీ టెక్నాలజీ దోహదపడుతుంది.
చదవండి: Robotics and AI: పది లక్షల ఉద్యోగాలకు వేదిక... రూ. 12 లక్షల వార్షిక వేతనం
సువర్ణావకాశం
- 5జీ టెక్నాలజీస్‌కు సంబంధించి ప్రస్తుత జాబ్ మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. తాజా గ్రాడ్యుయేట్లకు సువర్ణావకాశంగా పేర్కొనొచ్చు. వీరు రోబోటిక్స్, ఏఐ–ఎంఎల్, క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటీ తదితర అంశాల్లో వాస్తవ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. చక్కటి కొలువులు దక్కించుకునే వీలుంది.
- ఐఓటీ, ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాలున్న వారికి వివిధ రంగాలకు చెందిన సంస్థలు ఆకర్షణీయ వేతనాలతో ఆఫర్స్ ఇస్తున్నాయి. నైపుణ్యం, కొంత అనుభవం ఉన్న వారికి రెట్టింపు వేతనాలు అందిస్తున్నాయి. ఒరాకిల్, టీసీఎస్ వంటి సంస్థలు 5జీ టెక్నాలజీకి అవసరమైన నైపుణ్యాలున్న వారికి స్వాగతం పలుకుతున్నాయి.
నిపుణుల కోసం
- 5జీ ప్రవేశంతో ఐఓటీ, ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ తదితర నైపుణ్యాలకు మరింత డిమాండ్ పెరుగుతోంది. సంస్థలు నిపుణుల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. పలు కంపెనీలు.. అంతర్గతంగా రీస్కిల్లింగ్ పేరుతో లేటెస్ట్ టెక్నాలజీస్‌పై తమ సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిస్తున్నాయి.
- టాటా సన్స్‌కు చెందిన పానటోన్ ఫిన్‌వెస్ట్ లిమిటెడ్.. తేజస్ నెట్‌వర్క్‌తో ఒప్పందం చేసుకుని 4.0 స్కిల్స్‌పై శిక్షణ అందిస్తోంది.
- హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ కూడా తమ ఇంజనీరింగ్, ఆర్ అండ్ డీ విభాగం ద్వారా 5జీ టెక్నాలజీస్‌పై ఉద్యోగులకు శిక్షణ ఇస్తోంది.
నైపుణ్యార్జనకు మార్గాలు
- 5జీ టెక్నాలజీస్‌లో కీలకంగా నిలుస్తున్న రోబోటిక్స్, ఏఐ–ఎంఎల్, క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటీ నైపుణ్యాలను సొంతం చేసుకోవడానికి ఇప్పుడు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి.
- సిస్కో, ఒరాకిల్ ఇండియా, ఐబీఎం, టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో పలు ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
- ఐఐటీ–రూర్కీ, ఢిల్లీలు కూడా సర్టిఫికెట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ స్థాయిలో 5జీ టెక్నాలజీ అండ్ ఐఓటీ కోర్సులను అందిస్తున్నాయి.
- అదే విధంగా కోర్స్‌ఎరా, ఉడెమీ తదితర సంస్థలు మూక్స్ విధానంలో ఐఓటీ సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి.
5జీ టెక్నాలజీ– ముఖ్యాంశాలు
- టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ అంచనా ప్రకారం– 5జీ టెక్నాలజీతో 2025 నాటికి 2.2 కోట్ల కొత్త ఉద్యోగాలు.
- టెలికం రంగంలోనే ఈ ఏడాది దాదాపు లక్ష ఉద్యోగాలు.
- గత ఏడాది సిస్కో ఇండియా నియామకాల్లో 30 శాతంపైగా కొలువులు 5జీ టెక్నాలజీ విభాగంలోనే లభించాయి.
- స్కిల్ గ్యాప్ నేపథ్యంలో అంతర్గత శిక్షణ కేంద్రాల ద్వారా తమ ఉద్యోగులకు అప్–స్కిల్లింగ్ అవకాశం కల్పిస్తున్న ఐటీ రంగ సంస్థలు.
చదవండి: TCS-NQT: డిగ్రీ లేదా ఇంజనీరింగ్ చదివిన వారికి గుడ్ న్యూస్.. కార్పొరేట్ రంగంలో కొలువు..