Government Jobs after B.Tech: బీటెక్‌తో.. సర్కారీ కొలువుల బాట!
- బీటెక్ అర్హతగా పలు ప్రభుత్వ ఉద్యోగాలు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అవకాశాలు
- బ్యాంకులు, పీఎస్‌యూలలోనూ నియామకాలు
- ఎంపిక పరీక్షల్లో విజయంతో కొలువుదీరొచ్చు
బీటెక్ చదివే విద్యార్థులు చాలామంది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విజయం కోసం కృషి చేస్తుంటారు. ఒకవేళ ఆ ప్రక్రియలో నిరాశాజనక ఫలితం ఎదురైతే.. నిస్పృహకు గురవుతుంటారు. అయితే ఇంజనీరింగ్ అభ్యర్థులు ప్రభుత్వ రంగ కొలువులపై దృష్టి సారిస్తే.. చక్కటి అవకాశాలు దక్కించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
సెంట్రల్ టు స్టేట్
కేంద్ర ప్రభుత్వ విభాగాలు మొదలు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, త్రివిధ దళాలు, రైల్వేలు.. ఇలా ఎన్నో విభాగాల్లో బీటెక్ అర్హతగా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. ఇందుకోసం సంబంధిత విభాగాలు ఎంపిక ప్రక్రియలు నిర్వహిస్తున్నాయి. వీటిల్లో ప్రతిభ ద్వారా డివిజనల్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి.
చదవండి: Engineering Students: బీటెక్ నాలుగేళ్ల ప్రణాళిక ఇలా..
ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
బీటెక్ విద్యార్థులకు జాతీయ స్థాయిలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు అందించే పరీక్షగా ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(ఈఎస్‌ఈ)ను పేర్కొనొచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరింగ్ విభాగాల్లో కొలువుదీరేందుకు చక్కటి మార్గం. ఈ పరీక్ష మూడు దశలుగా ఉంటుంది. మొదటి దశలో ఆబ్జెక్టివ్ విధానంలో జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ పేపర్(పేపర్-1), పేపర్-2(సంబంధిత ఇంజనీరింగ్ విభాగంపై) ఉంటాయి. వీటిలో ప్రతిభ ఆధారంగా తదుపరి దశలో మెయిన్ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు. మెయిన్‌లో ఇంజనీరింగ్ సబ్జెక్ట్ నుంచే రెండు పేపర్లు ఉంటాయి. మెయిన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు చివరి దశలో పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులోనూ ప్రతిభ చూపితే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-ఎ, గ్రూప్-బి కేడర్‌లలో ఇంజనీర్లుగా కొలువు దీరొచ్చు.
గేట్ స్కోర్‌తో పీఎస్‌యూల్లో
అధిక శాతం మంది బీటెక్ అభ్యర్థులు రాసే జాతీయ స్థాయి పరీక్ష.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్). వాస్తవానికి ఐఐటీలు, నిట్‌లు వంటి ప్రముఖ విద్యా సంస్థల్లో ఎంటెక్/పీహెచ్‌డీలో ప్రవేశాలకు ఉద్దేశించిన పరీక్ష ఇది. అయితే దీని స్కోర్ ఆధారంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు కూడా పోటీ పడొచ్చు. గేట్‌లో మెరుగైన స్కోర్‌తో మహారత్న, నవరత్న, మినీరత్న హోదాలు పొందిన ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ఇతర పీఎస్‌యూలలోనూ ట్రైనీ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వంటి కొలువులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. గేట్ పరీక్షలో మూడు విభాగాల(జనరల్ ఆప్టిట్యూడ్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, సబ్జెక్ట్ పేపర్) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో పొందిన స్కోర్ ఆధారంగా ఆయా పీఎస్‌యూలకు దరఖాస్తు చేసుకుంటే.. మలి దశలో గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు ఖరారు చేస్తున్నారు.
చదవండి: Career Opportunities: 5జీ టెక్నాలజీలో రానున్న మూడేళ్లలో 2.2 కోట్ల ఉద్యోగాలు..
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్
బీటెక్ ఉత్తీర్ణులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరంగా అందుబాటులో ఉన్న మరో మార్గం.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్. బీఎస్సీ, బీటెక్ అర్హతతో నిర్వహించే ఈ ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ.. ఇలా మొత్తం మూడు దశలుగా ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్షను రెండు పేపర్లుగా నాలుగు వందల మార్కులకు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో అర్హత పొందిన వారికి తదుపరి దశలో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్‌లో ఆరు పేపర్లు(జనరల్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, నాలుగు ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్లు) ఉంటాయి. వీటిలో జనరల్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ పేపర్లకు 300 మార్కులు చొప్పున, నాలుగు ఆప్షనల్ సబ్జెక్ట్‌లకు 200 మార్కులు చొప్పున కేటాయించారు. మెయిన్‌లో విజయం సాధించిన వారికి చివరగా పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. మెయిన్, పర్సనాలిటీ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా తుది విజేతలను ప్రకటించి ఐఎఫ్‌ఎస్‌కు ఎంపిక చేస్తారు.
బ్యాంకింగ్ రంగం-స్పెషలిస్ట్ ఆఫీసర్స్
బీటెక్ అభ్యర్థులకు బ్యాంకింగ్ రంగంలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఐటీ ఆఫీసర్స్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్, నెట్‌వర్క్ ఇంజనీర్స్, డేటాఇంజనీర్స్ వంటి స్కేల్-1 స్థాయి కొలువులు లభిస్తున్నాయి. కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ బ్రాంచ్‌లతో బీటెక్ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియను ఐబీపీఎస్ మూడు దశలుగా చేపడుతుంది. తొలి రెండు దశలు ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ పేరుతో రాత పరీక్షలుగా.. మూడో దశలో పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
ప్రిలిమ్స్ మూడు విభాగాల్లో(ఇంగ్లిష్ లాంగ్వేజ్- 50 ప్రశ్నలు-25 మార్కులు; రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులు) ఉంటుంది. రెండో దశ మెయిన్‌లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 60 మార్కులకు-60 ప్రశ్నలు అడుగుతారు. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ విజయం సాధిస్తే.. చివరగా 100 మార్కులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ మూడు విభాగాల్లోనూ విజయం సాధించి తుది విజేతలుగా నిలిస్తే కొలువు ఖరారైనట్లే.
చదవండి: Coding and Programming Skills: ఐటీలో కొలువులు.. లక్షల్లో వేతనం..
డీఆర్‌డీఓ.. సైంటిస్ట్
బీటెక్ ఉత్తీర్ణులైన వారికి అందుబాటులో ఉన్న మరో ప్రత్యేక అవకాశం.. డీఆర్‌డీఓ సైంటిస్ట్-బి ఉద్యోగాలు. మొత్తం 17 సబ్జెక్ట్ విభాగాల్లో ఉద్యోగ నియామకాలను డీఆర్‌డీఓకు చెందిన ఆర్‌ఏసీ చేపడుతుంది. ఆయా సబ్జెక్ట్‌లు, విభాగాలకు సంబంధించి బీటెక్‌తోపాటు తాము దరఖాస్తు చేయదలచుకున్న సబ్జెక్ట్ పేపర్‌లో గేట్‌లోనూ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. పలు పోస్టులకు నేరుగా గేట్ స్కోర్ ఆధారంగా, మరికొన్ని పోస్ట్‌లకు గేట్ స్కోర్‌తోపాటు పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాలకే నిర్వహిస్తారు. ఈ రాత పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. మిగిలిన సబ్జెక్ట్ విభాగాలకు గేట్ స్కోర్ ఆధారంగానే పర్సనల్ ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.
ఎస్‌ఎస్‌సీ.. సీజీఎల్
బీటెక్ విద్యార్థులు..స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్(సీజీఎల్) ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొలువులకు దక్కించుకోవచ్చు.ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్మర్మేషన్ టెక్నాలజీ సహా పలు శాఖల్లో గ్రూప్-బి స్థాయి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఈ పరీక్ష ద్వారా నియామకాలు చేపడతారు. రాత పరీక్ష టైర్-1, టైర్-2 పేరుతో రెండు దశలుగా ఉంటుంది. టైర్-1 పరీక్షను 100 ప్రశ్నలు-200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్(25 ప్రశ్నలు), జనరల్ అవేర్‌నెస్(25 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్(25 ప్రశ్నలు), ఇంగ్లిష్ కాంప్రహెన్షన్(25 ప్రశ్నలు) నుంచి ప్రశ్నలు అడుగుతారు. టైర్-2 పరీక్ష నాలుగు పేపర్లలో నిర్వహిస్తారు. పేపర్-1..సెషన్-1, సెషన్-2లుగా ఉంటుంది. అదే విధంగా ప్రతి సెషన్‌ను రెండు సెక్షన్‌లుగా వర్గీకరిస్తారు. సెషన్-1(సెక్షన్-1)లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్(మాడ్యూల్-1), రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్(మాడ్యూల్-2) విభాగాల నుంచి 30 ప్రశ్నలు చొప్పున మొత్తం 60 ప్రశ్నలు అడుగుతారు. సెషన్-1 సెక్షన్-2లో మాడ్యూల్-1 పేరుతో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్‌లో 45 ప్రశ్నలు, మాడ్యూల్-2 పేరిట జనరల్ అవేర్‌నెస్ విభాగాల్లో 25 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 70 ప్రశ్నలకు 210 మార్కులు ఉంటాయి. సెషన్-1 సెక్షన్-3లో మాడ్యూల్-1 పేరుతో కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలతో 60 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
చదవండి: Best Engineering Branch: బీటెక్... కాలేజ్, బ్రాంచ్ ఎంపిక ఎలా
రాష్ట్రాల స్థాయిలో ఉద్యోగాలు
- బీటెక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోనూ ఇంజనీర్‌లుగా కొలువుదీరే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి టీఎస్‌పీఎస్‌సీ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఏపీపీఎస్సీ ద్వారా ఈ నియామకాలు చేపడతారు.
- ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్,భూగర్భ జల వనరులు, రవాణ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తదితర శాఖల్లో ఏఈ హోదాలో నియామకాలు జరుగుతాయి. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి రెండు పేపర్లలో రాత పరీక్ష ఉంటుంది. ఒక పేపర్ జనరల్ స్టడీస్‌గా.. మరో పేపర్ సబ్జెక్ట్ పేపర్‌గా నిర్వహిస్తారు.
- ఇటీవల ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఏఈఈ నోటిఫికేషన్‌లో రాత పరీక్ష మూడు పేపర్లుగా 450 మార్కులకు ఉంటుందని పేర్కొన్నారు.
- అదే విధంగా టీఎస్‌పీఎస్‌సీ ఏఈఈ నోటిఫికేషన్ ప్రకారం-రాత పరీక్ష రెండు పేపర్లుగా 300 మార్కులకు ఉంటుందని తెలిపారు.
- విద్యుత్ శాఖకు సంబంధించి ట్రాన్స్‌కో, జెన్‌కోలలోనూ అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ నియామకాలు జరుగుతాయి. ఈ పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియ కూడా రెండు పేపర్ల రాత పరీక్ష విధానంలో ఉంటుంది. ఒక పేపర్‌లో జనరల్ స్టడీస్ అంశాలు, మరో పేపర్‌లో కోర్ సబ్జెక్ట్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
చదవండి: Engineering Special: 'సీఎస్‌ఈ'కే.. సై అంటున్న విద్యార్థులు