Skip to main content

Tech skills: సైబర్‌ సెక్యూరిటీ.. కెరీర్‌ అవకాశాలు, అర్హతలు, నైపుణ్యాలు అందుకునేందుకు మార్గాలు

Career Opportunities in Cyber ​​Security

నేడు డిజిటల్‌ యుగం. ఇంటర్నెట్‌ ఆధారితంగా ఆన్‌లైన్‌ కార్యకలాపాలు! చిన్న తరహా సంస్థల నుంచి బహుళ జాతి కంపెనీల వరకూ.. అంతా ఆన్‌లైన్‌మయం! స్మార్ట్‌ ఫోన్‌ మొదలుస్పేస్‌ రీసెర్చ్‌ దాకా.. అన్నింటా డిజిటల్‌ అడుగులు!! ఇలాంటి పరిస్థితుల్లో ఎదురవుతున్న ప్రధాన సమస్య.. హ్యాకింగ్, ఫిషింగ్‌! వ్యక్తుల నుంచి మొదలు వ్యవస్థల వరకూ అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న అంశం.. సైబర్‌ అటాక్స్‌! ఈ సైబర్‌ దాడులను అడ్డుకునే వారే.. సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు!! ఈ విభాగంలో నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. ఉజ్వల అవకాశాలు అందుకోవచ్చు. ఈ నేపథ్యంలో..సైబర్‌ సెక్యూరిటీలో కెరీర్‌ అవకాశాలు, అవసరమవుతున్న అర్హతలు, టెక్‌ స్కిల్స్, నైపుణ్యాలు అందుకునేందుకు మార్గాలు తదితర అంశాలపై విశ్లేషణ..

  • సరిపడ నైపుణ్యాలుంటే అద్భుత ఆఫర్స్‌
  • డిజిటలైజేషన్‌తో పెరుగుతున్న డిమాండ్‌
  • నిపుణుల కోసం అన్వేషిస్తున్న సంస్థలు

'మీ ఫోన్‌లో అవాంఛిత యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేయొద్దు. అలా చేస్తే హ్యాకర్ల బారిన పడి.. మీ వ్యక్తిగత డేటా చౌర్యానికి గురయ్యే ప్రమాదం ఉంది'-ఇటీవల కాలంలో తరచూ వస్తున్న మెసేజ్‌లు!! మరోవైపు హ్యాకింగ్‌ బారిన పడి కోట్లు కోల్పోయిన సంస్థలు, లక్షలు పోగొట్టుకుంటున్న వ్యక్తుల గురించి రోజూ వార్తల్లో వింటూనే ఉన్నాం. అందుకే సంస్థలు ప్రస్తుతం సైబర్‌ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయి.

చ‌ద‌వండి: Coding and Programming Skills: ఐటీలో కొలువులు.. లక్షల్లో వేతనం..

ఐటీ టు ఎడ్‌టెక్‌

ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్‌ సెక్యూరిటీ అనేది ఐటీ నుంచి సర్వీస్‌ సెక్టార్‌ వరకూ.. అన్ని రంగాల్లోనూ తప్పనిసరిగా మారింది. ఐటీ, క్లౌడ్‌ సర్వీసెస్, ఈ-కామర్స్, రిటైల్‌ సెక్టార్, హెల్త్‌కేర్, ఎడ్‌టెక్, ఫిన్‌టెక్, బీఎఫ్‌ఎస్‌ఐలలో సైబర్‌ భద్రత అత్యంత కీలకం. కారణం.. ఈ రంగాల్లోని సంస్థలు ఆన్‌లైన్‌ విధానంలో ఎంతో విలువైన సేవలు అందిస్తుండటమే. 

'ఆన్‌లైన్‌' భద్రతే.. సైబర్‌ సెక్యూరిటీ

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పరికరాలను వినియోగించి.. ఆన్‌లైన్‌ కార్యకలాపాల భద్రతను కాపాడటాన్ని సైబర్‌ సెక్యూరిటీగా పేర్కొనొచ్చు. కంప్యూటర్లు, నెట్‌వర్క్‌ సిస్టమ్స్,సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్స్,డేటా.. చోరీ(హ్యాకింగ్‌)కి గురికాకుండా... సైబర్‌ సెక్యూరిటీ రక్షణగా నిలుస్తుంది. దీంతో ఆన్‌లైన్‌ విధానంలో కార్యకలాపాలు నిర్వహించే చిన్నపాటి సంస్థల నుంచి బహుళ జాతి కంపెనీలు, ప్రభుత్వ శాఖల్లో సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల అవసరం పెరిగింది.

భారీగా నియామకాలు

  • పలు రిక్రూటింగ్, స్టాఫింగ్‌ సంస్థల అంచనాల ప్రకారం- ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో 30 లక్షల మంది సైబర్‌ నిపుణుల కొరత నెలకొంది. 
  • రానున్న మూడేళ్లలో మన దేశంలో 15 లక్షల మంది సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఉంటుందని అంచనా.
  • గత ఏడాది కాలంలోనే ఈ విభాగంలో నియామకాలు దాదాపు 40 శాతం మేర వృద్ధి చెందాయి.
  • డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అంచనా ప్రకారం-2022 చివరికి దాదాపు పది లక్షల మంది సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఉంటుంది
  • టీమ్‌లీజ్‌ సంస్థ అంచనా ప్రకారం-ఈ రంగంలో డిమాండ్‌-సప్లయ్‌ మధ్య వ్యత్యాసం 70 శాతంగా ఉంది.

చ‌ద‌వండి: Career Opportunities in Mobile App Development... నైపుణ్యాలు, కొలువులకు మార్గాలు..

నిపుణుల కొరత

ఈ రంగంలో భారీగా నియామకాలు జరుగుతున్నప్పటికీ.. సంస్థలు నిపుణుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల ఐఎస్‌ఏసీఏ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం-సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో నిపుణుల పోస్టులను భర్తీ చేయలేకపోతున్నామని 49 శాతం సంస్థలు చెప్పడమే ఇందుకు నిదర్శనం. అదే విధంగా సోఫోస్‌ సర్వే ప్రకారం-60 శాతం సంస్థలు సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల కొరతను ఎదుర్కొంటున్నాయి.

ఎవరైనా నేర్చుకోవచ్చు

సైబర్‌ సెక్యూరిటీ పేరు వినగానే కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ కోర్సుల విద్యార్థులే సరితూగుతారు అనే అభిప్రాయం కలగడం సహజం. వాస్తవానికి అన్ని నేపథ్యాల విద్యార్థులు ఈ విభాగంలో కొలువుదీరే అవకాశం ఉంది. అయితే టెక్నికల్‌ గ్రాడ్యుయేట్స్‌కు కొంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఐటీ అప్లికేషన్స్‌కు సంబంధించిన బేసిక్స్‌పై టెక్నికల్‌ గ్రాడ్యుయేట్స్‌కు అవగాహన ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. సంప్రదాయ డిగ్రీ విద్యార్థులు సైతం సైబర్‌ సెక్యూరిటీ సంబంధిత కోర్సుల్లో అడుగు పెట్టి..ఇంటర్నెట్, డేటా మేనేజ్‌మెంట్‌/ఇన్ఫర్మేషన్,ఎథికల్‌ హ్యాకింగ్‌ తదితర అంశాల్లో పట్టు సాధిస్తే.. కెరీర్‌ అవకాశాలు దక్కించుకోవచ్చు. 

చ‌ద‌వండి: Job Skills: టెక్‌ నైపుణ్యాలతో టాప్‌ కొలువులు.. ప్రత్యేకతలు, నైపుణ్యాలు, భవిష్యత్‌ అవకాశాలు..

ప్రధాన విభాగాలు ఇవే

సైబర్‌ సెక్యూరిటీలో ప్రధానమైనవి.. 

  • డేటా సెక్యూరిటీ 
  • అప్లికేషన్‌ సెక్యూరిటీ 
  • ఇన్సిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ సెక్యూరిటీ మానిటరింగ్‌
  • క్లౌడ్‌ సెక్యూరిటీ.

డేటా సెక్యూరిటీ

సైబర్‌ సెక్యూరిటీ కోణంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన విభాగంగా దీన్ని పేర్కొనొచ్చు. ఆన్‌లైన్‌ సేవలు అందించే క్రమంలో సంస్థలు డేటా మేనేజ్‌మెంట్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తాయి. ఆయా సంస్థల క్లయింట్‌ కంపెనీలు, వారి యూజర్లకు సంబంధించిన వివరాలు, అదే విధంగా తాము వారికి అందిస్తున్న సర్వీసులకు సంబంధించిన ప్రాథమిక సమాచారం భద్రంగా నిక్షిప్తం చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవడం కూడా తప్పనిసరే. ఇలా డేటా నిక్షిప్తం, అప్‌డేట్‌ సమయంలో చిన్నపాటి తప్పిదం జరిగినా.. ఎంతో విలువైన సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కే ఆస్కారముంది. ఇలాంటి పరిస్థితుల్లో డేటా పటిష్ట నిర్వహణ, ఏ స్థాయిలోనూ డేటా ఇతరులకు చిక్కే వీలు లేకుండా చూసే విభాగమే.. డేటా సెక్యూరిటీ. ఇన్సిడెంట్‌ మేనేజ్‌మెంట్,సెక్యూరిటీ మానిటరింగ్‌ ఇది పూర్తిగా కోర్‌ డొమైన్స్‌కు సంబంధించిన విభాగం. సంస్థలు సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చిన సమాచారంలో మార్పుచేర్పులు, భద్రత విషయంలో తీసుకోవాల్సిన చర్యలను సదరు ప్రోగ్రామర్స్‌/సంస్థలకు సూచించే నైపుణ్యాలు ఈ విభాగంలో ఉంటాయి.

అప్లికేషన్‌ సెక్యూరిటీ

ఒక ప్రోగ్రామ్‌ను రూపొందించే క్రమంలో అప్లికేషన్‌ సమయంలోనే పటిష్టమైన భద్రత విధానాలు సిద్ధం చేసే విభాగం.. అప్లికేషన్‌ సెక్యూరిటీ.

ఐటీ సెక్యూరిటీ

ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టడం, సురక్షిత అప్లికేషన్స్‌ను రూపొందించడం వంటి కార్యకలాపాలను ఐటీ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌ నిర్వహిస్తారు. హ్యాకింగ్‌ చేసిన డొమైన్‌ /ఐపీ వివరాలు; ఎక్కడ నుంచి హ్యాక్‌ చేశారు అనే విషయాలు గుర్తించడం; హ్యాకింగ్‌ క్రమంలో సదరు సంస్థ వెబ్‌సైట్‌లో హ్యాకర్లు అప్‌లోడ్‌ చేసిన ఫేక్‌ అంశాలను గుర్తించి తొలగించడం వంటివి చేస్తారు. అంతేకాకుండా లాన్‌(లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌) సెక్యూరిటీ; సర్వర్‌ సెక్యూరిటీ; రూటర్‌ సెక్యూరిటీ; డిజిటల్‌ సెక్యూరిటీ విభాగాల్లోనూ ఐటీ సెక్యూరిటీ నిపుణుల అవసరం పెరుగుతోంది.

చ‌ద‌వండి: Career Opportunities: సైబర్‌ సెక్యూరిటీ.. భవితకు భరోసా!

సర్కారీ కొలువులు కూడా

సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు సర్కారీ కొలువులు కూడా లభిస్తున్నాయి. ప్రభుత్వ విభాగాలు సైతం డిజిటలైజేషన్‌ దిశగా అడుగులు వేస్తుండటమే ఇందుకు కారణం. ప్రభుత్వాలు అమలు చేస్తున్న డీబీటీ(డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) పథకాలు, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ వినియోగం తదితరాల కారణంగా.. ప్రభుత్వ విభాగాల్లో కూడా సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఏర్పడింది. 

అకడమిక్‌ మార్గాలు

సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్‌ ఏర్పడిన నేపథ్యంలో ప్రస్తుత పలు యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు అకడమిక్‌ స్థాయిలోనే సదరు సైబర్‌ స్కిల్స్‌ నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నాయి. సైబర్‌ సెక్యూరిటీ/ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లను రూపొందిస్తున్నాయి.

సర్టిఫికేషన్లు తప్పనిసరి

  • సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో ప్రవేశించడానికి జనరల్‌ డిగ్రీ మొదలు, ఐటీ ప్రొఫెషనల్స్‌ వరకు అందరూ అర్హులే. ఈ విభాగంలో ప్రత్యేకంగా శిక్షణనిచ్చే సర్టిఫికేషన్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి.. 
  • సిస్కో సంస్థ అందించే.. సీసీఎన్‌ఏ సెక్యూరిటీ; సీసీఎన్‌పీ సెక్యూరిటీ; సీసీఐఈ సెక్యూరిటీ: వెబ్‌సైట్‌: www.cisco.com
  • EC కౌన్సిల్‌ నిర్వహించే.. సర్టిఫైడ్‌ ఎథికల్‌ హ్యాకర్‌: వెబ్‌సైట్‌: www.eccouncil.org
  • ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ కోర్సులు: వెబ్‌సైట్‌: www.iisecurity.in
  • డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ అందించే సర్టిఫికేషన్‌ కోర్సులు; వెబ్‌సైట్‌: www.dsci.in

పీజీలో ప్రత్యేక స్పెషలైజేషన్‌గా

  • పీజీ స్థాయిలో ఎంటెక్, ఎంసీఏలలో ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని అందిస్తున్న కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు..
  • జేఎన్‌టీయూ-హైదరాబాద్‌: వెబ్‌సైట్‌: www.jntuh.ac.in
  • ఐఐఐటీ-అలహాబాద్‌: వెబ్‌సైట్‌: www.clis.iiita.ac.in
  • సీడాక్‌: వెబ్‌సైట్‌: www.cdac.in
  • ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ టెక్నాలజీ: వెబ్‌సైట్‌: www.imt.edu
  • ఐఐటీలు, ఎన్‌ఐటీలు కూడా ఎంటెక్‌ స్థాయిలో సైబర్‌ సెక్యూరిటీ/ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ పేరుతో స్పెషలైజేషన్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. గేట్‌ స్కోర్‌ ఆధారంగా వీటిలో ప్రవేశం పొందొచ్చు.

చ‌ద‌వండి: Tech Skills: పైథాన్‌.. కొలువుల కొండ!

సైబర్‌ సెక్యూరిటీ.. ముఖ్యాంశాలు

  • ఈ ఏడాది చివరి నాటికి పది లక్షల మంది సైబర్‌ నిపుణుల అవసరం.
  • కన్సల్టింగ్‌ సంస్థ మైకేల్‌ పేజ్‌ అంచనా ప్రకారం-2025 చివరికి భారత్‌లో 15 లక్షల మంది సైబర్‌ నిపుణుల కొరత.
  • పలు రిక్రూటింగ్, కన్సల్టింగ్‌ సంస్థల అంచనా ప్రకారం-గతేడాది కాలంలో ఈ రంగంలో 40 శాతం మేర నియామకాల సంఖ్య పెరిగింది. 
  • మానవ వనరుల డిమాండ్‌-సప్లయ్‌ మధ్య వ్యత్యాసం 70 శాతంగా నమోదు. 
  • పీజీ స్థాయిలో స్పెషలైజేషన్‌గా సైబర్‌ సెక్యూరిటీ.
  • పలు సంస్థల ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్స్‌.
     
Published date : 19 Oct 2022 06:45PM

Photo Stories