Skip to main content

Job Skills: టెక్‌ నైపుణ్యాలతో టాప్‌ కొలువులు.. ప్రత్యేకతలు, నైపుణ్యాలు, భవిష్యత్‌ అవకాశాలు..

job skills career opportunities in digital tech jobs
job skills career opportunities in digital tech jobs

డిజిటల్‌ టెక్‌ కొలువులు.. ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న మాట! భవిష్యత్తు అంతా ఈ కొలువులదే అనే అంచనాలు! రూ.లక్షల వేతనాలతో ఆఫర్లు అందిస్తున్న కంపెనీలు! దీంతో.. టెక్‌తోపాటు నాన్‌ టెక్‌ 
గ్రాడ్యుయేట్లు సైతం.. డిజిటిల్‌ కొలువులు దక్కించుకోవాలని ఆశిస్తున్న వైనం! ప్రస్తుతం అన్ని రంగాల్లో డిజిటల్‌ కొలువులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా సైబర్‌ సెక్యూరిటీ, ఏఐ, రోబోటిక్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, డెవాప్స్‌ తదితర విభాగాల్లో కొలువులకు డిమాండ్‌ నెలకొంది. ఈ నేపథ్యంలో.. లేటెస్ట్‌ క్రేజీ టెక్‌ కొలువులు, వాటి ప్రత్యేకతలు, నైపుణ్యాలు పొందేందుకు మార్గాలు, భవిష్యత్‌ అవకాశాలపై ప్రత్యేక కథనం.. 

  • డిజిటల్‌ టెక్‌ కొలువులపై యువత ఆసక్తి
  • ఏఐ, డెవాప్స్, రోబోటిక్స్‌ తదితర విభాగాలపై దృష్టి
  • జాబ్‌ మార్కెట్లోనూ ఈ ప్రొఫైల్స్‌కు డిమాండ్‌

2023 నాటికి మొత్తం ఉద్యోగాల్లో దాదాపు 60 శాతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్‌ తదితర డిజిటల్‌ కొలువులే ఉంటాయి. కాబట్టి టెక్నికల్‌ గ్రాడ్యుయేట్స్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌లో నైపుణ్యాలు పెంచుకుంటూ ముందడుగు వేయాలి. అప్పుడే కెరీర్‌ అవకాశాల పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. దీనికి తగ్గట్టుగానే నేటి యువతలో అధికశాతం మంది డిజిటల్‌ నైపుణ్యాలు సొంతం చేసుకుని సంబంధిత కొలువుల్లో చేరాలని కోరుకుంటున్నారు.

డెవాప్స్‌ ఇంజనీర్స్‌

టెక్‌ కొలువుల్లో అత్యంత కీలకమైన జాబ్‌ ప్రొఫైల్‌.. డెవాప్స్‌ ఇంజనీర్‌. ఈ కొలువు సొంతం చేసుకుంటే.. ప్రారంభంలోనే నెలకు సగటున రూ.60 వేల వేతనం ఖాయం. వాస్తవానికి డెవాప్స్‌ అనేది.. ఐటీకి సంబంధించి డెవలప్‌మెంట్, ఆపరేషన్స్‌ అనే రెండు విభాగాల సమాహారం. ఈ రెండింటినీ కలిపి సంక్షిప్తంగా డెవాప్స్‌గా పిలుస్తున్నారు. ఐటీ అప్లికేషన్‌ను నిరంతరం మార్పులు చేస్తూ.. క్లయింట్స్‌ లేదా యూజర్లకు అనుకూలంగా బాధ్యతలు నిర్వర్తించే వారే.. డెవాప్స్‌ ఇంజనీర్స్‌. డెవలపర్స్, ఆపరేషన్‌ టీమ్స్‌ ఆలోచనలకు అనుగుణంగా..అప్లికేషన్‌ మేనేజ్‌మెంట్, కోడింగ్, అప్లికేషన్‌ మెయింటనెన్స్‌ వంటి విధులు నిర్వహిస్తారు. వారు యునిఫికేషన్, అలైనింగ్‌ వంటి ప్రక్రియలను అనుసరిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. 

  • డెవాప్స్‌ నైపుణ్యాలు పొందేందుకు ఐబీఎం డెవాప్స్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌–డెవాప్స్‌ ఆన్‌ ఏడబ్ల్యూఎస్, సింప్లీ లెర్న్, కోర్స్‌ఎరా, మైక్రోసాఫ్ట్‌ వంటివాటి ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ విధానంలో సర్టిఫికేషన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తి చేసుకోవడం ద్వారా ఐటీ సంస్థల్లో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, అప్లికేషన్‌ మెయింటనెన్స్‌ విభాగాల్లో.. డెవాప్స్‌ ఇంజనీర్లుగా కొలువులు సొంతం చేసుకోవచ్చు.

క్లౌడ్‌ ఇంజనీర్స్‌

  • క్లౌడ్‌ కంప్యూటింగ్‌.. పూర్తిగా ఇంటర్నెట్‌ ఆధారంగానే.. ఆన్‌లైన్‌ విధానంలోనే క్లయింట్‌ సంస్థలకు,యూజర్లకు సంబంధిత సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్స్‌ను, అప్లికేషన్స్‌ను అందించే విధానం. ఈ క్లౌడ్‌ కంప్యూటింగ్‌కు సంబంధించిన విధులు నిర్వర్తించే వారే.. క్లౌడ్‌ ఇంజనీర్స్‌. వీరు క్లౌడ్‌ కంప్యూటింగ్‌కు సంబంధించి డిజైనింగ్, మెయింటనెన్స్, ప్లానింగ్‌ వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ జాబ్‌ ప్రొఫైల్స్‌లో ఖాళీల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఈ ఉద్యోగం సొంతం చేసుకుంటే నెలకు రూ.50 వేల వరకు వేతనం లభిస్తుంది.
  • ఈ విభాగంలో రాణించేందుకు సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ యాజ్‌ ఎ సర్వీస్, ప్లాట్‌ఫామ్‌ యాజ్‌ ఎ సర్వీస్‌ వంటి అంశాలపై నైపుణ్యం సాధించాలి. ఈ స్కిల్స్‌ సొంతం చేసుకోవాలంటే.. డెవాప్స్, ప్రోగ్రామింగ్, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్, లినక్స్, సిస్టమ్‌ ఆటోమేషన్, క్వాలిటీ అష్యూరెన్స్, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ వంటి వాటిపై అవగాహన తప్పనిసరి.
  • ఐబీఎం సర్టిఫైడ్‌ క్లౌడ్‌ సెక్యూరిటీ నాలెడ్జ్, హెచ్‌పీ ఎక్స్‌పర్ట్‌ వన్‌ క్లౌడ్‌ సర్టిఫికేషన్, వీఎం వేర్‌ క్లౌడ్‌ సర్టిఫికేషన్, ఈఎంసీ క్లౌడ్‌ ఆర్కిటెక్ట్, ఈఎంసీ క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ సర్వీసెస్‌ సర్టిఫికేషన్, ఈఎంసీ వర్చువలైజ్డ్‌ డేటా సెంటర్‌ అండ్‌ క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్టిఫికేషన్‌ కోర్సుల ద్వారా ఈ నైపుణ్యాలు పొందొచ్చు.

Robotics and AI: పది లక్షల ఉద్యోగాలకు వేదిక‌... రూ. 12 లక్షల వార్షిక వేతనం

రోబోటిక్‌ ఇంజనీర్స్‌

  • ప్రస్తుత టెక్‌ యుగంలో కోర్‌ టెక్నికల్‌ విభాగాలు మొదలు సర్వీస్‌ సెక్టార్‌ వరకూ.. అంతా ఆటోమేషన్‌ మయం. అన్ని సంస్థలు రోబో ఆధారిత సేవలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో.. టెక్‌ గ్రాడ్యుయేట్లకు రోబోటిక్‌ ఇంజనీర్స్‌గా కొలువులు లభిస్తున్నాయి. రోబోల తయారీ, నిర్వహణ, నియంత్రణకు మానవ ప్రమేయం తప్పనిసరి. రోబో ఆధారిత సేవలను అందుబాటులోకి తెచ్చే క్రమంలో.. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా స్పందించేలా వాటిని ముందుగానే ప్రోగ్రామింగ్, కోడింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ విధులు నిర్వర్తించే వారే.. రోబోటిక్‌ ఇంజనీర్స్‌.
  • రోబోటిక్‌ ఇంజనీర్స్‌కు సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్, కోడింగ్‌ స్కిల్స్, నానో టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీలకు సంబంధించిన నైపుణ్యాలు అవసరం. సాఫ్ట్‌వేర్‌ రంగంలో రోబోటిక్స్‌ విభాగంలో రాణించాలంటే.. రోబోల రూపకల్పనకు అవసరమైన స్పీచ్‌ రికగ్నిషన్, వాయిస్‌ రికగ్నిషన్‌ వంటి వాటిపై అవగాహన ఉండాలి. దీంతోపాటు ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, మెషీన్‌ లెర్నింగ్‌ నైపుణ్యాలు తప్పనసరి. ఎందుకంటే.. రోబోల రూపకల్పన, నిర్వహణ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారితంగా ఉండటమే.
  • ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు బీటెక్‌ స్థాయిలోనే రోబోటిక్స్‌ను మైనర్‌గా అందిస్తున్నాయి. ఎంటెక్‌లో రోబోటిక్స్‌ స్పెషలైజేషన్‌తో పూర్తి స్థాయి ప్రోగ్రామ్‌ల్లో పలు ఇన్‌స్టిట్యూట్‌లు ప్రవేశం కల్పిస్తున్నాయి.  మూక్స్, ఆన్‌లైన్‌ కోర్సుల విధానంలో రోబోటిక్స్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు ఉన్నాయి. రోబోటిక్‌ ఇంజనీర్‌గా నియమితులైన వారికి సగటున రూ.ఐదు లక్షల వార్షిక వేతనం లభిస్తోంది.

సైబర్‌ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌

  • ఆన్‌లైన్‌ ఆధారిత సేవలు పెరుగుతున్న నేపథ్యంలో.. సదరు వెబ్‌సైట్లు, అప్లికేషన్లు, ప్రోగ్రామ్‌లు హ్యాకింగ్‌కు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో టెక్‌ రంగంలో సైబర్‌ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌ అత్యంత కీలకంగా మారుతోంది. ఈ కొలువు కోసం ఇంటర్నెట్, డేటా మేనేజ్‌మెంట్‌/ఇన్ఫర్మేషన్,ఎథికల్‌ హ్యాకింగ్‌పై పట్టుసాధించాలి. ఇంటర్నెట్, డేటా ఇన్ఫర్మేషన్, దాని ప్రాధాన్యతకు సంబంధించి స్పష్టత ఉండాలి. ముఖ్యంగా డేటా సెక్యూరిటీ, అప్లికేషన్‌ సెక్యూరిటీ, ఇన్సిడెంట్‌ ఇన్‌సిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ సెక్యూరిటీ మానిటరింగ్‌ అంశాల్లో నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి.
  • ప్రస్తుతం బీటెక్, ఎంటెక్‌ స్థాయిలో సైబర్‌ సెక్యూరిటీని ఒక సబ్జెక్ట్‌ లేదా స్పెషలైజేషన్‌గా పలు యూనివర్సిటీలు అందిస్తున్నాయి. వీటితోపాటు.. సిస్కో సీసీఎన్‌ఏ సెక్యూరిటీ; సీసీఎన్‌పీ సెక్యూరిటీ; సీసీఐఈ సెక్యూరిటీ, ఈసీ కౌన్సిల్‌ సర్టిఫైడ్‌ ఎథికల్‌ హ్యాకర్, డేటాసెక్యూరిటీ కౌన్సిల్‌ అందించే సర్టిఫికేషన్‌ వంటి ఆన్‌లైన్‌ కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. సైబర్‌ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌గా సగటున రూ.ఐదు లక్షల వార్షిక వేతనంతో కొలువులు సొంతం చేసుకోవచ్చు. 

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)

  • గత కొంత కాలంగా తరచూ వినిపిస్తున్న మాట.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌. మానవ ప్రమేయం లేకుండా అత్యంత వేగంగా సేవలు అందించడంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ దోహదపడుతుంది. ముందుగానే రూపొందించిన నిర్దిష్ట ప్రోగ్రామింగ్‌ ద్వారా.. ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా.. కార్యకలాపాలను సులువుగా పూర్తి చేసుకునే అవకాశం ఏఐతో లభిస్తోంది. అందుకు సంబంధిత ప్రోగ్రామ్‌ల రూపకల్పనలో మానవ మేథస్సు అవసరం. 
  • ఏఐకి అవసరమైన ప్రోగ్రామింగ్, కోడింగ్‌ రూపకల్పనలో మ్యాథమెటికల్‌ స్కిల్స్, అల్గారిథమ్‌ స్కిల్స్, లాజికల్‌ థింకింగ్, అనలిటికల్‌ స్కిల్స్‌ కీలకం. పలు ఇన్‌స్టిట్యూట్‌లు పీజీ, పీజీ డిప్లొమా స్థాయిలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సును అందిస్తున్నాయి. బీటెక్‌లోనూ ఏఐ–ఎంఎల్‌ బ్రాంచ్‌ను ప్రవేశపెట్టారు. వీటితోపాటు.. ఐబీఎం, ఇంటెల్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలు ఏఐలో ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. వీటి కాల వ్యవధి నెల రోజుల నుంచి నాలుగు నెలల వరకు ఉంటోంది. వీటిని పూర్తి చేసుకుని సంబంధిత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి గుర్తింపు లభిస్తోంది. మన దేశంలోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో స్వల్ప కాలిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి ప్రత్యేక నైపుణ్యాలు సొంతం చేసుకున్న వారికి.. ఏఐ ఎక్స్‌పర్ట్స్‌గా.. ప్రారంభంలోనే.. సగటున రూ.8 లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. 

డిమాండింగ్‌ టెక్‌ జాబ్స్‌.. ముఖ్యాంశాలు

  • డిమాండింగ్‌ జాబ్స్‌గా నిలుస్తున్న ఏఐ,సైబర్‌ సెక్యూరిటీ,క్లౌడ్‌ ఇంజనీరింగ్,రోబోటిక్స్, డెవాప్స్‌.
  • నిర్దిష్ట నైపుణ్యాలతో ప్రారంభంలోనే నెలకు సగటున రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు వేతనం పొందే అవకాశం.
  • నాస్‌కామ్, రాండ్‌స్టాండ్‌ ఇండియా, టీమ్‌లీజ్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ వంటి సంస్థల అంచనాల ప్రకారం–2023 చివరి నాటికి ఈ టెక్‌ విభాగాల్లో దాదాపు 20 లక్షల ఉద్యోగాలు.
  • అకడమిక్‌గా, ఆన్‌లైన్‌ విధానంలో డిజిటల్‌ టెక్‌ నైపుణ్యాలు సొంతం చేసుకునే అవకాశం.

ఎమర్జింగ్‌ ప్రొఫైల్స్‌

రానున్న రెండేళ్లలో ఏఐ, రోబోటిక్‌ ఆధారిత సేవలు దాదాపు యాభై శాతం మేరకు పెరుగుతాయి. ఆన్‌లైన్‌ అప్లికేషన్స్, సంబంధిత సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్స్‌లో నైపుణ్యాలు పెంచుకుంటే.. కొలువులు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా బీటెక్‌ విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే ఈ నైపుణ్యాలు పెంచుకోవడంపై దృష్టిపెట్టాలి. 
–ప్రొఫెసర్‌.సి.వి.జవహర్, డీన్, ట్రిపుల్‌ఐటీ–హైదరాబాద్‌

Published date : 03 Aug 2022 08:03PM

Photo Stories