Skip to main content

ChatGPT: ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్‌జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి!

ఒకప్పటి నుంచి మనకు ఏ ప్రశ్నకు సమాధానం కావాలన్నా.. గూగుల్ మీద ఆధారపడేవాళ్లం. అయితే ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది. ఈ సమయంలో చాలామంది ప్రతి ప్రశ్నకు 'చాట్‌జీపీటీ' ద్వారా సమాధానం తెలుసుకుంటున్నారు. ఈ కథనంలో 'చాట్‌జీపీటీ' ద్వారా ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.
ChatGPT interface showing a user asking interview-related questions, How To Use ChatGPT For Interview Preparation, Interview preparation checklist with ChatGPT,

ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేవారికి చాట్‌జీపీటీ ఎలా ఉపయోగపడుతుందంటే..
ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం సిద్ధం కావడానికి చాట్‌జీపీటీ చాలా ఉపయోగపడుతుంది. సాధారణ ఇంటర్వ్యూ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం దగ్గర నుంచి మీ విశ్వాసాన్ని పెంచుకోవడం వరకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది.

  • ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేటప్పుడు మీ బలం ఏమిటి? బలహీనత ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి చాట్‌జీపీటీ సహాయపడుతుంది. చాట్‌జీపీటీతో మీరు పరస్పరం చర్చించుకుంటూ పోతే నైపుణ్యాలను తప్పకుండా మెరుగుపరుచుకోవచ్చు.
  • మీరు ఏ కంపెనీ ఇంటర్వ్యూ కోసం సిద్దమవుతున్నారో.. ఆ సంస్థకు సంబంధించిన చాలా విషయాలను కూడా చాట్‌జీపీటీ తెలియజేస్తుంది. కంపెనీ కల్చర్ ఏమిటి? కంపెనీ గోల్స్ గురించి కూడా వివరిస్తుంది. దీని ప్రకారం ఇంటర్వ్యూ చేసేవారి అంచనాలకు అనుగుణంగా ప్రిపేర్ అవ్వొచ్చు.
  • ఇంటర్వ్యూకి వెళ్లే సమయంలో ఏలాంటి డ్రెస్ (వస్త్రధారణ) వేసుకోవాలనేది కూడా చాట్‌జీపీటీ చెబుతుంది. ఇంటర్వ్యూకి వెళ్లే సమయంలో డ్రెస్ కోడ్ చాలా ముఖ్యమైన అంశం.
  • ఇంటర్వ్యూకి సిద్ధమయ్యేవారికి కావలసిన మరో ముఖ్యమైన అంశం 'బాడీ లాంగ్వేజ్'. బాడీ లాంగ్వేజ్ ఇంప్రూ చేసుకోవడంలో కూడా చాట్‌జీపీటీ ఉపయోగపడుతుంది. సరైన బాడీ లాంగ్వేజ్ మెయింటేన్ చేసేవారు ఎదుటివారికి హుందాగా కనిపిస్తారు. 
  • ఇంటర్వ్యూలో ఎప్పుడూ మీ గురించి లేదా ఉద్యోగానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడుగుతారని భావించకూడదు. ఎందుకంటే మీ ఆలోచనకు పదునుపెట్టే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాట్‌జీపీటీ సాయంతో అలాంటి ప్రశ్నలకు సిద్దమవ్వొచ్చు.
  • ఆత్మ విశ్వాసం ఆయుధంగా మారితే.. ఏదైనా సాధించవచ్చనే ధైర్యం వస్తుంది. ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి సిద్ధమయ్యే సమయంలో లేదా ఇంటర్వ్యూకు వెళ్ళేటప్పుడు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే మాత్రమే సరిపోదు. 'సెల్ఫ్ కాన్ఫిడెన్స్' (ఆత్మ విశ్వాసం) కూడా చాలా అవసరం. కేవలం ప్రశ్నలకు, బాడీ లాంగ్వేజ్ వంటి వాటికి మాత్రమే కాకుండా.. మీ మీద మీకు విశ్వాసం పెరగటానికి కూడా చాట్‌జీపీటీ ఒక ఆయుధంగా పనికొస్తుంది. మొత్తం మీద వినియోగించుకునే విధానాన్ని బట్టి చాట్‌జీపీటీ మీకు ఆత్మబంధువులా పనికొస్తుంది.

చ‌ద‌వండి: Science And Technology: గూగుల్‌కు మూడినట్లే... సవాల్‌ చేస్తోన్న చాట్‌జీపీటీ... చాట్‌జీపీటీ అంటే ఏంటో తెలుసా..?

చాట్‌జీపీటీ..
చాట్‌జీపీటీ అనేది GPT (జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్‌ఫార్మర్) ఆర్కిటెక్చర్ ఆధారంగా OpenAI చేత అభివృద్ధి చేసిన పెద్ద లాంగ్వేజ్ మోడల్. మనిషి భాషను అర్థం చేసుకోవడానికి అల్గారిథమ్‌లను ఉపయోగించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ప్రశ్నలకు సమాధానమివ్వడం, టాస్క్‌లను పూర్తి చేయడం వంటి విషయాలను అవలీలగా పూర్తి చేస్తుంది. వెబ్‌సైట్‌, యాప్స్, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో సహా వివిధ ఇంటర్‌ఫేస్‌ల ద్వారా దీన్ని యాక్సెస్ చేయవచ్చు. వినియోగదారుడు అడిగే ప్రశ్నలకు దాని శిక్షణ, భాషపై అవగాహన ఆధారంగా రెస్పాండ్ అవుతుంది.

Published date : 11 Nov 2023 10:14AM

Photo Stories