Skip to main content

Humane AI Pin: ఇకపై అరచేతిలో సమాచారం.. ఏఐ పిన్‌ ఎలా పనిచేస్తుందంటే..

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్‌ పరికరాల్లో మరిన్ని ఫీచర్లు ప్రవేశపెడుతున్నారు. ఆ పరికరాలను మరింత చిన్నగా మారుస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా హ్యుమని అనే స్టార్టప్‌ కంపెనీ ప్రవేశపెట్టిన ఏఐ పిన్‌ చాలా చిన్నగా ఉండి అన్ని స్మార్ట్‌ పరికరాలను నియంత్రిస్తుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
What is Humane AI Pin, how it works and what it does

ఇద్దరు ఆపిల్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు స్థాపించిన హ్యుమని అనే స్టార్టప్ కంపెనీ ద్వారా ఏఐ పిన్‌ను ఆవిష్కరించారు. ఇది చిన్న, తేలికైన పరికరం. దీన్ని మన దుస్తులతోపాటు చాలా తేలికగా ధరించేలా తయారుచేశారు. ఇది అయస్కాంతం మాదిరి దుస్తువులకు అట్టే అతుక్కుపోతుంది. యూజర్లకు వివిధ ఫీచర్లు అందించడానికి సెన్సార్లు, ఏఐ సాంకేతికతను వినియోగించారు.

ఏఐ పిన్‌ అంటే...
ఏఐ పిన్ అనేది తేలికగా దుస్తులపై ధరించే స్క్రీన్‌లెస్  పరికరం. ఇందులో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌ వినియోగించారు. దీనిలో కెమెరా, మైక్రోఫోన్, యాక్సిలరోమీటర్‌ వంటి సెన్సార్‌లు ఉన్నాయి. ఇది మీ అరచేతిలో లేదా ఇతర ప్రదేశాలపై సమాచారాన్ని ప్రదర్శించేలా ప్రొజెక్టర్‌ను కలిగి ఉంటుంది.

ఎలా పని చేస్తుందంటే..
ఏఐ పిన్‌.. సెన్సార్లు, ఏఐ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. వీటి సహాయంతో కావాల్సిన సమాచారం తేలికగా అందిస్తుంది. ఉదాహరణకు, వీధిలో నడుస్తుంటే ఏఐ పిన్‌ కెమెరాల ద్వారా చుట్టూ ఉన్న వస్తువులు, ల్యాండ్‌మార్క్‌లను గుర్తిస్తుంది. దాని సహాయంతో దగ్గరలోని రెస్టారెంట్ పేరు,  లేదా బస్ స్టాప్‌నకు ఎంత దూరంగా ఉన్నమనే వివరాలను విశ్లేషించి వినియోగదారులకు అందిస్తుంది. అయితే 2024లో ఏఐ పిన్‌లో నావిగేషన్‌ ఫీచర్లను సైతం ప్రవేశపెడతామని కంపెనీ తెలిపింది.

చదవండి: Mobile Manufacturers in India : ప్రపంచంలో రెండవ అతి పెద్ద మొబైల్‌ ఉత్పత్తి దేశం ఇదే..

ఏఐ పిన్ ద్వారా ఇతర స్మార్ట్‌ పరికరాలను కూడా నియంత్రించవచ్చు. ఉదాహరణకు మీరు కాల్స్‌, మెసేజ్‌లు చేసేలా, స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించేలా, స్మార్ట్‌ఫోన్‌లో మ్యూజిక్‌ వినేలా టెక్నాలజీని వాడారు. ట్రాన్స్‌లేషన్‌ సేవలు, వర్చువల్ అసిస్టెంట్‌ వంటి వివిధ రకాల ఏఐ సంబంధిత అప్లికేషన్‌లను యాక్సెస్ చేయడానికి ఏఐ పిన్‌ని ఉపయోగించవచ్చు.

స్మార్ట్‌ఫీచర్లతోపాటు ఏఐ పిన్‌ వినియోగదారుల గోప్యతకు ప్రాధాన్యం ఇస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. స్మార్ట్‌ డివైజ్‌లోని కెమెరా, మైక్రోఫోన్ లేదా ఇన్‌పుట్ సెన్సార్‌లు పనిచేస్తున్న విషయాన్ని యూజర్లకు తెలియజేస్తుంది. ఎప్పుడైనా ఏఐ పిన్ సెన్సార్‌లను నిలిపేసే అవకాశం ఉంటుంది. హ్యూమని ఏఐ పిన్ ప్రారంభ ధర రూ.58300గా ఉందని కంపెనీ అధికారులు తెలిపారు. 2024లో దీన్ని వినియోగదారులకు డెలివరీ ఇవ్వనున్నారు. 

చదవండి: Red light on, Gaadi off in Delhi: ఢిల్లీలో కాలుష్య విముక్తికి ‘రెడ్ లైట్ ఆన్- వెహికల్ ఆఫ్’

Published date : 11 Nov 2023 07:32PM

Photo Stories