DAP Prices: జనవరి నుంచి డీఏపీ ధర పెంపు.. ఎంతంటే..

యాభై కిలోల బ్యాగ్‌పై కనీసంగా రూ.200 వరకు పెరిగే అవకాశముందని సమాచారం. డీఏపీ దిగుమతులకు కేంద్రం ఇప్పటివరకు అందించిన ప్రత్యేక ప్రోత్సాహకాల గడువు డిసెంబర్‌తో ముగియనుంది. దీని పొడిగింపుపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాదు, డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింతగా పడిపోయింది.
ఈ నేపథ్యంలో దిగుమతి వ్యయం పెరిగి ఆమేరకు డీఏపీ ధర పెరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫాస్ఫేటిక్ ఎరువుల్లో 90 శాతం వరకు దిగుమతి చేసుకునేవే. దేశంలో ఏటా 100 లక్షల టన్నుల డీఏపీ వినియోగం అవుతుండగా, అందులో 60 లక్షల టన్నుల మేర దిగుమతి అవుతోంది. దేశీయ ఉత్పత్తికి ఉపయోగించే ముడి పదార్థాలైన రాక్ ఫాస్ఫేట్, ఫాస్ఫారిక్ యాసిడ్ కూడా దిగుమతి చేసుకునేవే.
Indian Oil Corp: వీటి ఏర్పాటుకు.. ఐవోసీ రూ.21,000 కోట్ల పెట్టుబడి
రైతులకు అందుబాటులో..
డీఏపీ ధరను రైతులకు అందుబాటులో ఉంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దిగమతులపై టన్నుకు రూ.3,500 ప్రత్యేక ప్రోత్సాహకం అందిస్తోంది. ఈ గడువు డిసెంబర్‌తో 31తో ముగియనుంది. ఈ ప్రోత్సాహకాల కొనసాగింపుపై ఇంతవరకు కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 50 కిలోల బ్యాగ్ ధర రూ.1,350 ఉండగా, అది 12–15 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
అంటే సుమారు రూ.200 మేర పెరిగి రూ.1,550కి చేరే అవకాశముందని అంటున్నారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలు, చైనా నుంచి తగ్గిన ముడి సరుకు సరఫరా, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఎర్ర సముద్రంలో రవాణా పరమైన సవాళ్లు సైతం ధరల పెరుగుదలకు కారణాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.