EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఆధార్ లింకు ఉంటేనే ఈపీఎఫ్ ప్రోత్సాహకాలు

ఉద్యోగులుగా కొత్తగా చేరే వారికి కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ లింక్‌డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (ఈఎల్‌ఐ) కింద ఒక నెల వేతనం (గరిష్టంగా రూ.15 వేలు) మూడు వాయిదాల్లో అందిస్తుంది. ఇది నేరుగా ఉద్యోగి బ్యాంకు ఖాతాలోకి ఈపీఎఫ్‌ఓ అధికారులు బదిలీ చేస్తారు.
ఈ పథకానికి అర్హత సాధించాలంటే సదరు ఉద్యోగి తన పూర్తి వివరాలను సమర్పించి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)ను యాక్టివ్ చేసుకోవాలి. కానీ మెజార్టీ ఉద్యోగులు ఈ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో ప్రోత్సాహకాల పంపిణీ ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో ఉద్యోగంలో చేరిన మూడు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఈపీఎఫ్‌ఓ పలుమార్లు సూచించినప్పటికీ స్పందన అంతంతమాత్రంగానే ఉంది.
ఈ క్రమంలో ఈఎల్‌ఐ పథకానికి అర్హత సాధించిన వారు ఫిబ్రవరి 15వ తేదీలోగా యూఏఎన్ యాక్టివేషన్, బ్యాంకు ఖాతాను ఆధార్‌తో సీడింగ్ ప్రక్రియను తప్పకుండా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈమేరకు ఈపీఎఫ్‌ఓ ప్రధాన కార్యాలయంలోని అదనపు ప్రావిడెంట్ కమిషనర్ అనిల్ ఓ.కే. తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
Uniform Civil Code: దేశంలో తొలిసారి అమల్లోకి 'ఉమ్మడి పౌరస్మృతి చట్టం'
ఈడీఎల్‌ఐ పథకానికీ లింకు తప్పనిసరి..
ఈపీఎఫ్‌ఓ చందాదారులకు బీమా పథకంలో భాగంగా ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈడీఎల్‌ఐ)ను అందిస్తోంది. పీఎఫ్ చందాదారుడైన ప్రతి ఉద్యోగికి ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. వివిధ కారణాలతో ఉద్యోగి మరణిస్తే గరిష్టంగా రూ.7 లక్షల వరకు బీమా డబ్బులు సదరు చందాదారుడి నామినీకి అందుతాయి.
ఈ పథకం కింద పలు క్లెయిములు ఆధార్ సీడింగ్ లేకపోవడం, ఉద్యోగికి సంబంధించిన సరైన వివరాలు లేకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగి యూఏఎన్ యాక్టివేషన్ పూర్తి చేసుకోవాలని ఈపీఎఫ్‌ఓ సూచిస్తుంది. అదేవిధంగా ఆధార్ సీడింగ్ ప్రక్రియ సైతం అత్యవసరంగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Beti Bachao, Beti Padhao: ‘బేటీ బచావో-బేటీ పడావో’ పథకానికి పదేళ్లు పూర్తి