Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్ 2025–26.. పూర్తి వివరాలు ఇవే..

భట్టి విక్రమార్క మార్చి 19వ తేదీ 2025–26 ఆర్థిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్‌ను రూ.3,04,965 కోట్ల అంచనాలతో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగెత్తించే కార్యాచరణతో ముందుకొచ్చామని చెప్పారు.
అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన.. తమ ప్రాథమ్యాలని, ఈ మూడు అంశాలతో కూడిన తమ పాలన నమూనా యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచేలా ముందుకు సాగుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల కారణంగా.. గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలన పర్యవసానాలను మార్చుకునేందుకు కొంత ఇబ్బంది ఎదురైందని, అయినా ‘చేతి’లో ఉన్న మిగతా కాలంలో పాలనను పరుగుపెట్టిస్తామని చెప్పారు.
‘రాష్ట్రం పురోగమించేందుకు వేస్తున్న అడుగుల్లో మాకు ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నాయి. గత పాలకులు సృష్టించిన సవాళ్లన్నింటినీ సమర్థంగా ఎదుర్కొంటూ మా పాలన సత్తా చాటుతున్నాం. విధ్వంసం నుంచి వికసిత తెలంగాణగా రాష్ట్రాన్ని మారుస్తున్నాం. తెలంగాణ రైజింగ్–2050 ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం..’ అని భట్టి పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం 200 బిలియన్ డాలర్లు అని.. పదేళ్లలో దీనిని వెయ్యి బిలియన్ డాలర్ (ట్రిలియన్ డాలర్) వ్యవస్థగా మార్చే దిశలో సాగుతున్నామని తెలిపారు.
బడ్జెట్ ప్రసంగం భట్టి మాటల్లోనే..
‘‘ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా, పారదర్శకత, జవాబుదారీతనంతో సాగుతున్న మా ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతోంది. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలనా రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అయ్యాం.
‘భారతదేశాన్ని ఒక రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలనుకుంటున్నా’అని నాడు అంబేడ్కర్ పేర్కొన్నారు. రాజ్యాంగ నైతికతను పదే పదే నొక్కిచెప్పారు. ఆ నైతిక విలువలనే పాటిస్తూ ప్రజాపాలన సాగిస్తున్నాం. దశాబ్దకాలం వ్యవస్థల విధ్వంసం, ఆర్థిక అరాచకత్వంతో ఛిద్రమైన తెలంగాణ పాలనా, ఆర్థిక వ్యవస్థలను గాడిలో పెడుతూ ముందుకు సాగుతున్నాం.

స్వార్థపరుల అబద్ధపు ప్రచారం..
నిజం కూడా ప్రతి రోజూ ప్రచారంలో ఉండాలి. లేదంటే అబద్ధమే నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుంది. ప్రభుత్వం చేసే ప్రతి చర్యను శంకిస్తూ, నిరాధార విమర్శలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో, సొంత పత్రికలలో అబద్ధపు వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ కుట్రను సమర్థంగా తిప్పికొడుతూ, వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచడం మా బాధ్యత. ప్రజలకు వాస్తవాలు చెప్పకపోతే.. ఆ స్వార్థపరులు ప్రచారం చేసే అబద్ధాలే నిజాలుగా భ్రమించే ప్రమాదం ఉంది.
కేవలం కేటాయింపులకే పరిమితం కాదు..
మేం బడ్జెట్‌లో ప్రస్తావించిన ప్రణాళికలు కేవలం ఆర్థిక కేటాయింపులు మాత్రమే కాదు. అవి సమాన అభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి, సామాజిక న్యాయానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. మా ప్రభుత్వం సామాజిక న్యాయం, అభివృద్ధి, సంక్షేమ సమ్మిళిత విధానాలతో ప్రగతివైపు అడుగులు వేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తోంది. రైతులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, దినసరి కూలీలు, ఐటీ నిపుణులు.. ఇలా ప్రతి ఒక్కరినీ ఈ పథకాలు బలోపేతం చేస్తాయి. సమష్టి కృషితో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
జాతీయ సగటు కంటే మన వృద్ధి రేటు ఎక్కువ
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా వస్తున్న మార్పుల పర్యవసానాలను సమర్థంగా ఎదుర్కొంటూ.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. 2024–25లో తెలంగాణ జీఎస్‌డీపీ ప్రస్తుత ధరల ప్రకారం రూ.16,12,579 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే 10.1 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఇదే సమయంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 9.9 శాతంగానే ఉంది.
2024–25లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,79,751, వృద్ధిరేటు 9.6 శాతం అయితే.. దేశ తలసరి ఆదాయం రూ.2,05,579, వృద్ధి రేటు 8.8 శాతం మాత్రమే. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,74,172 (1.8 రెట్లు) మేర ఎక్కువగా ఉంది.
రాష్ట్ర పన్నుల వాటా 50శాతానికి పెంచాలని కోరాం
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు న్యాయమైన భాగం దక్కాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘానికి సమరి్పంచిన సమగ్ర నివేదికలో కోరింది. కేంద్రం విధిస్తున్న సెస్సులు, అదనపు చార్జీల వల్ల రాష్ట్రాలకు వస్తున్న ఆదాయం గణనీయంగా తగ్గుతోందని రాష్ట్రం తరఫున వివరించాం. ప్రస్తుతం రాష్ట్రాలకు ఇస్తున్న 41 శాతం పన్నుల వాటాను 50 శాతానికి పెంచాలని కోరాం.
తెలంగాణకు 14వ ఆర్థిక సంఘం ద్వారా 2.437 శాతం నిధుల పంపిణీ జరిగితే.. 15వ ఆర్థిక సంఘం కాలంలో 2.102 శాతానికి తగ్గింది. అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు తక్కువ నిధులు కేటాయించడం అన్యాయం. దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించే విధంగా పన్నుల పంపిణీ విధానాన్ని హేతుబద్ధం చేయాలన్నది మా వాదన.
ధరణి కష్టాలకు చెక్ పెట్టాం..
భూమి కేవలం స్థిరాస్తి కాదు. ఒక భావోద్వేగం. భూమితో బంధం కన్నతల్లితో, సొంత ఊరితో ఉన్న అనుబంధంతో సమానం. గత ప్రభుత్వ హయాంలో ధరణి ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాల వల్ల భూసంబంధిత సమస్యలు ప్రజలకు వేదన మిగిల్చాయి. ఆ సమస్యలకు చెక్ పెడుతూ మా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెచ్చింది. ఇందులో నిబంధనలు పారదర్శకంగా, సమగ్రంగా.. భూవివాదాలకు తావులేకుండా, భూ యజమానుల హక్కులు పూర్తిగా పరిరక్షించడానికి వీలుగా ఉన్నాయి.
ఎన్నడూ లేని స్థాయిలో కులగణన
అసమానతలను రూపుమాపే లక్ష్యంతో.. గతంలో ఎన్నడూ చేపట్టని విధంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. మొత్తం 1.12 కోట్ల కుటుంబాల వివరాలను సేకరించింది. సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేందుకు, సమర్థవంతమైన పాలన కోసం ఈ సర్వే కీలక డేటా అందించింది.
వచ్చే పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల వారికి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అందించడానికి అవకాశం ఏర్పడింది. భవిష్యత్తులో సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు, సమగ్ర ఆర్థిక పురోగతి విధానాల రూపకల్పనకు ఇది ఆధారంగా మారనుంది.
‘ఫ్యూచర్’లో ఏఐ సిటీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీలో అంతర్భాగంగా 200 ఎకరాల్లో ప్రత్యేకంగా ఏఐ సిటీని నిర్మిస్తాం. అది ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజ కంపెనీలకు కేంద్రంగా మారుతుంది. గూగుల్ కంపెనీ ఇక్కడ ఏఐ ఆధారిత యాక్సిలరేటర్ సెంటర్‌ను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంది’’ అని భట్టి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
విధ్వంసం నుంచి వికసిత తెలంగాణగా..
‘‘గత దశాబ్దంలో ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లను అధిగమించి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో కొనసాగుతోంది. ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ.. సుసంపన్నత, సమగ్రత, స్థిరమైన అభివృద్ధితో కూడిన తెలంగాణను నిర్మిస్తాం. ప్రతి పౌరుడికి విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక భద్రతను కల్పించే స్థాయికి ఈ రాష్ట్రాన్ని తీసుకువెళ్లడమే మా లక్ష్యం.’’
ఇంటి దగ్గర గుడిలో పూజలు చేసి..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి హోదాలో మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బుధవారం ఉదయం తమ ఇంటి దగ్గరున్న దేవాలయంలో భట్టి విక్రమార్క దంపతులు పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి అసెంబ్లీకి వచ్చిన భట్టికి ఆర్థిక శాఖ అధికారులు, శాసనసభ అధికారులు స్వాగతం పలికారు.
తోటి మంత్రులతో కలసి అల్పాహార విందు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బడ్జెట్ పుస్తకాలున్న బ్యాగ్‌ను అందచేశారు. తర్వాత మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం కోసం శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబుకు బడ్జెట్ ప్రతులను అందచేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌లకు కూడా బడ్జెట్ ప్రతులతో కూడిన బ్యాగును అందించారు.
ఈ క్రమంలో మంత్రి మండలి భేటీ అయి బడ్జెట్‌ను ఆమోదించింది. ఈ సందర్భంగా సహచర మంత్రులంతా భట్టిని అభినందించారు. కాగా.. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఏకంగా 14వ సారి బడ్జెట్ రూపకల్పనలో పాలు పంచుకోవడం విశేషం. ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన బడ్జెట్ రూపకల్పనలో భాగమవుతూ వచ్చారు.


ఆరు గ్యారంటీలకు రూ.56,000 కోట్లు..
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీల పేరుతో రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలతో పాటు మహిళలు, రైతులు, విద్యార్థులకు వర్తించే ఇతర సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ 2025–26 సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం తదితర రంగాలకు చూపెట్టిన గణాంకాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని అంటున్నాయి.
ఆరు గ్యారెంటీలతో పాటు అన్ని సంక్షేమ పథకాలకు కలిపి ఈసారి బడ్జెట్‌లో రూ.90,500 కోట్లు ప్రతిపాదించినట్లు వెల్లడించాయి. ఆరు గ్యారంటీల కింద రూ.56,084 కోట్లు, స్కాలర్ షిప్‌లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రాజీవ్ యువ వికాసం (కొత్త పథకం), డైట్ చార్జీలు, రైతు బీమా, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, విద్యుత్ సబ్సిడీలు, రేషన్ బియ్యానికి మరో రూ. 34,416 కోట్లు ప్రతిపాదించినట్లు చెబుతున్నాయి.
ఆరు గ్యారంటీల్లో భాగంగా రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహలక్ష్మి, గృహజ్యోతి, సన్న ధాన్యానికి బోనస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలకు నిధులు కేటాయించినట్లు ఆ వర్గాలు వివరిస్తున్నాయి.
రుణ సేకరణ లక్ష్యమూ పెరిగింది
అప్పుల విషయానికి వస్తే 2024–25లో ప్రతిపాదించిన మొత్తానికి రూ.7,500 కోట్లు అదనంగా రూ.69 వేల కోట్లకు పైగా సమీకరించాలని ఈ బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో బహిరంగ మార్కెట్ రుణాలు రూ.64,539 కోట్లు కాగా, కేంద్రం నుంచి, ఇతర రుణాలు కలిపి మొత్తం రూ.69 వేల కోట్లు చూపెట్టారు.
ఇది మొత్తం బడ్జెట్‌లో 21 శాతం కంటే ఎక్కువ కావడం గమనార్హం. అప్పులు తీసుకోవడంతో పాటు అప్పులు చెల్లించే పద్దును కూడా ఈసారి పెంచారు. గతంలో చేసిన అప్పులకు వడ్డీ, అసలు చెల్లింపు కింద రూ. 35,217 కోట్లు చూపెట్టారు. ఇది మొత్తం బడ్జెట్‌లో దాదాపు 11.5 శాతం.
పెరిగిన పన్ను ఆదాయం అంచనాలు
బడ్జెట్‌లో పేర్కొన్న రెవెన్యూ రాబడుల గణాంకాలను పరిశీలిస్తే..ఈసారి రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం పద్దు భారీగా కనిపిస్తోంది. గత బడ్జెట్‌తో పోలిస్తే సుమారు రూ.7 వేల కోట్లు అదనంగా పన్ను రాబడుల కింద చూపెట్టారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.1.38 లక్షల కోట్ల పన్ను ఆదాయ ప్రతిపాదనలు చేయగా, రూ.1.29 లక్షల కోట్లు వసూలు అయ్యాయి.
ఈ నేపథ్యంలో ఈసారి రూ.1.45 లక్షల కోట్లను రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం కింద చూపెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర పన్నుల్లో వాటాను కలుపుకొంటే ఈ ఆదాయ గణాంకాలు రూ.1.75 లక్షల కోట్లకు చేరాయి. వీటికి తోడు పన్నేతర ఆదాయం, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లను కలిపి మొత్తం రూ.2.29 లక్షల కోట్ల రెవెన్యూ రాబడులను ప్రతిపాదించారు.
గత ప్రతిపాదనల కంటే ఇది రూ.8 వేల కోట్లు ఎక్కువ. గత బడ్జెట్‌లో రూ.2.21 లక్షల కోట్లు రెవెన్యూ రాబడుల కింద చూపెట్టగా, సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.2.02 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. అంటే రెవెన్యూ రాబడులు అంచనాల కంటే రూ.20 వేల కోట్లు తగ్గాయి. అయినా, ఈసారి రెవెన్యూ రాబడులను రూ.2.29 లక్షల కోట్లుగా ప్రతిపాదించారు.
విద్య, వైద్యానికి కాస్త ఎక్కువగా..
ప్రధాన శాఖల వారీగా పరిశీలిస్తే విద్యా శాఖకు గత ఏడాది కంటే రూ.2 వేల కోట్లు అధికంగా రూ.23 వేల కోట్ల వరకు ప్రతిపాదించారు. వైద్యరంగానికి గత ఏడాది కంటే రూ.800 కోట్లు అధికంగా రూ.12,393 కోట్లు ప్రతిపాదించారు. రైతు రుణమాఫీ చేసిన నేపథ్యంలో వ్యవసాయ రంగానికి గత ఏడాది కంటే కొంచెం తక్కువ నిధులను కేటాయించారు. గత ఏడాది వ్యవసాయ శాఖకు రూ.26,500 కోట్లు ప్రతిపాదించగా, ఈసారి రూ.24,500 కోట్లు చూపెట్టారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు కలిపి ఈసారి రూ.34,070 కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 31,605 కోట్లను ప్రతిపాదించారు. ఈసారి కల్యాణలక్ష్మి పథకానికి ప్రత్యేకంగా రూ.3,683 కోట్లు, విద్యార్థుల స్కాలర్షిప్లు, డైట్ చార్జీల కింద రూ.7 వేల కోట్లకు పైగా నిధులు చూపెట్టారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.12 వేల కోట్లు, ఆర్టీసీకి రూ.4,305 కోట్లు కేటాయించారు.
సవరణల బడ్జెట్‌లో భారీ వ్యత్యాసం
2024–25 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలను పరిశీలిస్తే ప్రతిపాదనలకు, సవరణల బడ్జెట్‌కు మధ్య భారీ వ్యత్యాసం కన్పిస్తోంది. 2024–25 వార్షిక బడ్జెట్‌లో మొత్తం వ్యయం రూ.2,91,059 కోట్లుగా ప్రతిపాదించగా, సవరించిన అంచనాల మేరకు అది రూ.2,66,034.51 కోట్లకు తగ్గింది. ఈ సవరించిన అంచనాలకు మరో రూ.40 వేల కోట్లను కలిపి ఈసారి బడ్జెట్ మొత్తం వ్యయాన్ని రూ.3,04,965 కోట్లుగా ప్రతిపాదించారు.
పన్ను రాబడుల కింద రూ.1.38 లక్షల కోట్లు వస్తాయని 2024–25 బడ్జెట్‌లో ప్రతిపాదించగా, సవరించిన బడ్జెట్‌లో అది రూ.1.29 లక్షల కోట్లకు తగ్గింది. పన్నేతర ఆదాయం రూ.35 వేల కోట్ల వరకు వస్తుందని అంచనా వేయగా, రూ.10 వేల కోట్ల మేర తగ్గి రూ.25 వేల కోట్లుగా నమోదైంది.
2024–25లో రూ.21,636 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు కింద వస్తాయని అంచనా వేయగా, రూ.19,836 కోట్లు మాత్రమే సమకూరినట్లు సవరించిన అంచనాలు వెల్లడిస్తున్నాయి. అప్పుల కింద 2024–25లో ప్రతిపాదించిన మొత్తంలో సింహభాగం సమకూరింది. అన్ని రకాల రుణాలు కలిపి రూ.62 వేల కోట్ల వరకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.60 వేల కోట్లకు పైగా సమకూరాయి.
విద్యకు రూ.23,108 కోట్లు
బడ్జెట్‌లో ప్రభుత్వం విద్యా రంగానికి రూ.23,108 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.1,816 కోట్లు ఎక్కువని పేర్కొంది. మొత్తం బడ్జెట్‌లో విద్యాశాఖ వాటా 7.57 శాతంగా ఉంది. అయితే గత బడ్జెట్‌తో పోలిస్తే కేటాయింపు పెరిగినా, మొత్తం బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఈసారి కేటాయింపుల శాతం తగ్గింది. 2024–25 బడ్జెట్ మొత్తం రూ.2,74,058 కోట్లు. ఇందులో విద్యా రంగం కేటాయింపులు రూ.21,292 కోట్లు అంటే మొత్తం బడ్జెట్‌లో 7.77 శాతం. కానీ 2025–26 మొత్తం బడ్జెట్ రూ.3,04,965 కోట్లు.
ఇందులో విద్యారంగానికి కేటాయింపులు రూ.23,108 కోట్లు. అంటే 7.57 శాతం. అంటే 2024–25తో పోల్చుకుంటే ఈసారి విద్యకు 0.20 శాతం మేర కేటాయింపులు తగ్గాయన్నమాట. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ విద్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బోధన, విశ్వవిద్యాలయాల ఆధునీకరణ, బోధనా సిబ్బంది నియామకాలు, ఉన్నత విద్యలో సాంకేతిక పురోగతి, నైపుణ్యాభివృద్ధి కల్పన, ప్రభుత్వ వర్సిటీల పరిధిలో తీసుకొచ్చే కొత్త కంప్యూటర్ కోర్సులకు మౌలిక వసతులు కల్పనకు సరిపడా నిధుల కేటాయింపు జరగలేదని విద్యారంగ నిపుణులు అంటున్నారు.

విద్య పద్దులో ఇవీ కీలకాంశాలు..
పాఠశాల విద్యకు రూ.19,341.23 కోట్లు కేటాయించారు.గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.13,763 కోట్లు ఎక్కువ. కేటాయింపుల్లో 91 శాతం టీచర్లు, సిబ్బంది వేతనాలకే ఖర్చవుతుంది. గత ఏడాది కొత్తగా 10 వేల మంది టీచర్ల
నియామకం చేపట్టారు. దీంతో వేతనాల ఖర్చు పెరగనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా26 వేల ప్రభుత్వస్కూళ్ళున్నాయి.వీటిల్లో 3 వేల స్కూళ్ళల్లో డిజిటల్ విద్య, మరో 1,500 స్కూళ్ళల్లో ఏఐ టెక్నాలజీతో బోధనచేపడతామని ప్రభుత్వం తెలిపింది. తొలిదశలో రూ.50 కోట్లు ఖర్చవుతుందని విద్యాశాఖ అంచనా వేయగా..ప్రస్తుతబడ్జెట్‌లో రూ.40 లక్షలు కేటాయించారు. పరీక్షల నిర్వహణకు రూ.6 కోట్ల నుంచి రూ.7.50 కోట్లకు నిధులు పెంచారు.
ఉన్నత విద్యలో సమూల మార్పుల దిశగా అనేకనివేదికలు రూపొందించారు. ఇప్పటికే వర్సిటీల్లో కొత్త కోర్సులు తీసుకొచ్చారు. కంప్యూటర్ అనుబంధ కోర్సులకు ప్రత్యేక మౌలిక వసతుల కల్పన అవసరం. వీటికోసం రూ.500 కోట్లు కావాలని ప్రతిపాదించినా వాటి ఊసు లేదు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు రూ.2,900 కోట్లే..
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గానికి ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రూ.11,600 కోట్ల మంజూరుకు పాలనపరమైన అనుమతులూ ఇచ్చింది. కానీ ప్రస్తుత బడ్జెట్‌లో ఈ స్కూళ్ళ నిర్మాణానికి ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.2,900 కోట్లే కేటాయించింది.
ఒక్కో స్కూల్‌కు రూ.200 కోట్లు వెచ్చించినా, ఈ ఏడాది మొదలు పెట్టే స్కూళ్ళ సంఖ్య 15కు మించే అవకాశం లేదు. నైపుణ్యాభివృద్ధి దిశగా కాలేజీల్లో స్కిల్ కోర్సులు, ఏఐ విద్యా విధానం ప్రతిపాదనలు సిద్ధం చేసినా... వీటికి నిధుల కేటాయింపును చూపించలేదు. పారిశ్రామిక కార్పస్ ఫండ్ నుంచి వీటిని అమలు చేయాలనే ఆలోచనతో ఉంది.
6 గ్యారంటీలు.. 56 వేల కోట్లు..
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన ప్రధాన హామీలైన ఆరు గ్యారంటీల కోసం బడ్జెట్‌లో రూ.56,084 కోట్లు కేటాయించారు. వీటికి వరుసగా రెండో ఏడాది కూడా ప్రాధాన్యమిస్తూ గత బడ్జెట్‌లో కేటాయించిన దాని కంటే రూ.9వేల కోట్ల వరకు అదనంగా ప్రతిపాదించడం విశేషం. రైతుభరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు, సన్నధాన్యానికి బోనస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలకు ఈ నిధులను కేటాయిస్తున్నట్టు బడ్జెట్ పత్రంలో పేర్కొన్నారు.

రైతు భరోసాకు గత ఏడాది కంటే రూ.3వేల కోట్లు పెంచగా, గత ఏడాది తరహాలోనే పింఛన్లకు నిధులు చూపెట్టారు. అంటే ఈసారి కూడా పింఛన్ల పెంపు హామీ పరిష్కారమయ్యే అవకాశాలు కనిపించడం లేదని బడ్జెట్ గణాంకాలు చెబుతున్నాయి. ఇక, నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అవసరమయ్యే 4 లక్షలకుపైగా ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.12,571 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.
ఇళ్ల నిర్మాణంలో కేంద్రమిచ్చే సాయం పోను ఈ నిధులు సరిపోతాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహజ్యోతి, గృహలక్ష్మికి తగిన కేటాయింపులు చేశామని అంటున్నాయి. అయితే, మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున భృతి ఇస్తామనే ముఖ్యమైన గ్యారంటీతోపాటు ఆరు గ్యారంటీల్లోని ఇతర అంశాలను బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హం. అంటే ఆ గ్యారంటీల అమలుకు మరో ఏడాది ఆగాల్సిందేనన్న మాట.
రోడ్లు, భవనాల శాఖకు రూ.5,907 కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు ప్రభుత్వం రూ.5,907 కోట్లను ప్రతిపాదించింది. ఇందులో రీజినల్ రింగురోడ్డుకు గత బడ్జెట్‌లో చూపినట్టుగానే రూ.1,525 కోట్లను చూపింది. భూసేకరణకు వీటిని వినియోగించనున్నారు. గత బడ్జెట్‌లో ఈ నిధులను చూపినా, వాటిని వినియోగించలేదు. ఇక మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రోడ్ల నిర్మాణానికి రూ. 50 కోట్లను మాత్రమే ప్రతిపాదించింది.
జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాల కోసం రూ.300 కోట్లు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.251 కోట్లు కేటాయించింది. హైబ్రిడ్ యాన్యూట్ మోడ్‌లో రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకుగాను రూ.300 కోట్లను బడ్జెట్‌లో చూపింది.
రాష్ట్ర వృద్ధిరేటు 10.1%!
తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్టీపీ) ప్రస్తుత ధరల వద్ద 2024-250 10.1 % చేయనుంది. ఇదే కాలంలో దేశ స్థూల జాతీ యోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 9.9 శాతానికే పరిమితం కానుంది. రాష్ట్ర జీఎస్టీపీ విలువ రూ.16,12,579 కోట్లు ఉండనుండగా, జీడీపీ విలువ రూ.3,31,03,215 కోట్టు ఉండనుంది. స్థిర ధరల వద్ద రాష్ట్ర జీఎస్టీపీ 6.8 శాతం వృ దీని నమోదు చేయనుండగా, దాని విలువ రూ.8, 16,835 కోట్లుగా ఉంటుందని ఆం చనా. స్థిర ధరల వద్ద జీడీపీ 6.5 శాతం వృద్ధి నమోదు చేయనుండగా, దాని విలువ రూ.1,87,95,085 కోట్లు ఉండనుంది. డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభలో 'తెలంగాణ ఆర్ధిక సామాజిక సర్వే 2025' నివేదికను ప్రవేశపెట్టారు. కేంద్ర అర్థగణాంక, కార్యక్రమాల అమలు మం త్రిత్వ శాఖ వేసిన ముందస్తు అంచనాల ప్రకారం.. 2024-25లో జాతీయ, రాష్ట్ర వృద్ధి రేటు అంచనాలను ప్రభుత్వం ఇందులో వెల్లడించింది.
జీఎస్టీ రాబడి రూ.59 వేల కోట్లు
వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రూపంలో రూ.50,704 కోట్లు సమకూరుతాయని రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో అందనా వేసింది. ఇందులో రాష్ట్ర రాష్ట్ర జీఎస్టీ (ఎస్ఎస్టీ) కింద రూ.51,000 కోట్లు, కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ)లో వాటా కింద రూ.8,000 కోట్లు అందుతాయని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2304-25) బడ్జెట్‌లో ఎస్సీఎస్టీ కింద రూ.50.762 కోట్లు, సీజీఎస్టీ కింద రూ.7,832 కోట్లు కలిపి మొత్తం రూ.58,594 కోట్లు వస్తాయని ప్రభుత్వం ఆంచనా వేసింది.
అయితే.. సవరించిన అంచనాల్లో జీఎస్టీ రూపంలో రూ.53,66 కోట్లు మాత్రమే సమకూరుతున్నట్టు పేర్కొంది. ఇందులో సీజీఎస్టీ అంతరాల కంటే కొంచెం ఎక్కువ రాగా, రాష్ట్ర జీఎస్టీ రూ.5 వేల కోట్ల మేర తగ్గడం గమనార్హం. అయినా ఈసారి గత ఏడాది ప్రతిపాదనల కంటే రూ.250 కోట్లు ఎక్కువగా రూ.2 వేల కోట్లు ఎస్బీఎస్టీ వస్తుందని ప్రతిపాదించడం గమనార్హం. మరోవైపు కార్పొరేషన్ పన్ను కింద రూ.8,349 కోట్లు, ఆదాయ పన్ను కింద రూ.11,140 కోట్లు, కస్టమ్స్ కింద రూ.1,876 కోట్లు కేంద్రం నుంచి వస్తాయని ప్రభుత్వం బడ్జెట్ అండనాల్లో పేర్కొంది.
లోటు భారీగానే..
రాష్ట్రంలో ద్రవ్యలోటు వాటికి పెరుగుతోందని బడ్జెట్ గణాంకాలు చెబుతున్నాయి. 2025-20 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఏకంగా రూ.51,000.74 చోటు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుత (3324-25) ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ద్రవ్యలోటు రూ.48,761.16 కోట్లుగా నమోదుకానున్నట్లు సవరించిన అంచనాల్లో వెల్లడించింది. ఇక 2025-26లో ఖర్చులన్నీ పోను రూ.2,788 కోట్లు రెవెన్యూ మిగులు ఉంటుందని తాజా బడ్జెట్‌లో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,888.71 కోట్లు బెవెన్యూ మిగులు ఉన్నట్లు సవరించిన అంధనాల్లో తెలిపింది. ఇక 2023-24లో రూ.4,881 కోట్లు రెవెన్యూ మిగులు ఉంటుందని అప్పట్లో అంచనా వేసినా.. సవరించిన అంచనాల్లో అది రూ.1,704.88 కోట్లకు తగ్గింది.
తలసరి ఆదాయంలో 9.6% వ`ద్ధి
రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద 2024-25లో 9.6% వ`ద్ధితో రూ.3,79,751కు పెరగనుందని అంచనా. ఇదే కాలంలో జాతీయ తలసరి ఆదాయం రూ.2,05,579కే పరిమితం కానుంది. జాతీయ స్థాయితో పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం 1.8 రెట్లు అధికం కావడం గమనార్హం. రాష్ట్రం మెరుగైన జీవన ప్రమాణాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఆర్థికాభివృద్ధిని కలిగి ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
జీడీపీ/జీఎస్టీపీ అంటే?
ఒక ఆర్థిక సంవత్సరంలో దేశం/రాష్ట్రం ఉత్పత్తి చేసిన వస్తు, సేవల మొత్తం విలువే జీడీపీ/జీఎస్టీపీ. దేశం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ముఖ్య కొలమానంగా వీటిని పరిగణిస్తారు.
తగ్గిన జీఎస్‌డీపీ వృద్ధి
రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధిలో తగ్గుదల నమోదయింది. 2023-24లో 11.1 శాతం వృద్ధి రేటు నమోదవగా.. 2024-25లో 10.1 శాతంగా నమోదైనట్టు ప్రభుత్వం అసెంబ్లీ ముందు పెట్టిన ఆర్ధిక విధాన పత్రంలో వెల్లడించింది. గత ఏడాది తెలంగాణ జీఎస్‌డీపీ రూ.14,64,378 కోట్లుకాగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10.12,579 కోట్లుగా నమోదయింది. ఇక రాష్ట్ర తలసరి ఆదాయంలోనూ కొంత మేర తగ్గుదల కనిపించింది. 2023-24లో 10.3 శాతం వృద్ధితో తలసరి ఆదాయం రూ.3,46,457గా నమోదవగా.. 2024-25లో 9.6 శాతం వృద్ధితో రూ.3,79,751కి చేరింది. అంటే తలసరి ఆదాయం రూ.36 వేలకుపైగా పెరిగింది.
రాష్ట్ర ప్రధాన ఆర్థిక సూచీల గణాంకాలను శాతాల్లో..
సూచి | 2023-24 | 2024-25 |
---|---|---|
జీఎస్టీ పేలో స్థూల ద్రవ్యలోటు | 3.41% | 2.90% |
స్థూల ద్రవ్యలోటులో రెవెన్యూ మిగులు | 1.56% | 12.59% |
జీఎస్ఓస్లోలో రెవెన్యూ మిగులు | 0.05% | 0.37% |
జీఎస్టీపీలో మొత్తం అప్పులు | 27.57% | 27.98% |
రెవెన్యూ ఆదాయంతో పోలిస్తే అప్పులు | 238.44% | 223.25% |
సొంత పన్ను రాబడులతో పోలిస్తే అప్పులు | 297.65% | 290.68% |
రెవెన్యూ వ్యయంలో సొంత పన్నుల రాబడులు | 80.48% | 79.11% |
రెవెన్యూ రాబడుల్లో వడ్డీల చెల్లింపులు | 14.38% | 8.77% |
రెవెన్యూ రాబడుల్లో జీతాలు చెల్లింపులు | 23.62% | 20.16% |
రెవెన్యూ రాబడుల్లో పింఛన్ల చెల్లింపులు | 9.95% | 5.76% |
పన్నేతర ఆదాయం | 14.07% | 12.77% |
ఉద్యోగ కల్పనలో వ్యవసాయమే టాప్
జూలై 2023-జూన్ 2024 మధ్యకాలంలో నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం రాష్ట్రంలో 42.7 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రాథమిక రంగాలైన వ్యవసాయ, అనుబంధ రంగాలే కల్పిస్తున్నాయి. సేవల రంగం (తృతీయ రంగం) 34.8 శాతం, ద్వితీయ రంగం 22.5 శాతం అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇక రాష్ట్రంలోని మొత్తం మహిళా ఉద్యోగుల్లో 23.9 శాతం, మొత్తం పురుష ఉద్యోగుల్లో 41.5 శాతం సేవల రంగంలోనే పనిచేస్తున్నారు.
భవిష్యత్తు ఈ రంగాలదే..
హైదరాబాద్‌లో 30 వేల మంది విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్), గేమింగ్, యానిమేషన్ వంటి ఎమర్జింగ్ రంగాల్లో పనిచేస్తుండగా, రానున్న సంవత్సరాల్లో ఈ సంఖ్య లక్షకు పెరగనుందని అంచనా.
మూలధన వ్యయం రూ.36 వేల కోట్లు
రాష్ట్ర బడ్జెట్ పరిమాణంలో దాదాపు 12 శాతాన్ని ప్రభుత్వం మూలధన వ్యయం కింద చూపింది. 2025-26 బడ్జెట్‌లో రూ.36,504.45 కోట్లను మూలధన వ్యయం కింద ప్రతిపాదించింది. ఇది 2024-25 బడ్జెట్ ప్రతిపాదనలతో పోలిస్తే రూ.3 వేల కోట్లు ఎక్కువ. 2024-25 బడ్జెట్‌లో రూ.33.486.50 కోట్లను ఈ పద్దు కింద ప్రతిపాదించగా.. సవరించిన అంచనాల ప్రకారం రూ.33,087.85 కోట్లు ఖర్చవుతోంది.
ఈసారి మూలధన వ్యయంలో రూ.12,652 కోట్లు సాగునీటి శాఖ పరిధిలోనే ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. రూ.3,859 కోట్లు గ్రామీణాభివృద్ధి, రూ.3,431.47 కోట్లు రవాణా, రూ.3.458 కోట్లు ఆర్థిక సేవల రంగాల్లో వ్యయం అవుతుందని ప్రతిపాదించింది. సాధారణ సేవలు, సాంఘిక సేవల రంగాల్లో మిగతా మొత్తం ఖర్చవుతుందని అంచనా వేసింది.
అప్పుల పద్దు.. మరింత!
రాష్ట్ర అప్పుల పడ్డు ఈసారి కూడా పెరిగిపోయింది. 2004-25 బడ్జెట్ కంటే రూ.7,500 కోట్లు ఎక్కువగా... 2025-26లో రూ.69,539 కోట్లు సమీకరణను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో రూ.64,539 కోట్లు బహిరంగ మార్కెట్ రుణాలు కాగా.. రూ.4 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి, మరో రూ.1,000 కోట్లను ఇతర రూపాల్లో సమీకరించనుంది. 2024-25లో రూ.62,012 కోట్ల రుణాలను లక్ష్యంగా పెట్టుకోగా.. సవరించిన అంచనాల ప్రకారం రూ.60,440 కోట్లకు తగ్గుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

గత అప్పుల చెల్లింపులకు అధికంగానే..
పాత అప్పుల తిరిగి చెల్లింపులకు కూడా ఈసారి బడ్జెట్‌లో భారీ పద్దునే చూపెట్టారు. ఈసారి రుణ లక్ష్యంలో సగం మేర అంటే సుమారు రూ.35వేల కోట్లు పాత అప్పుల అసలు, వడ్డీల రెంద చెల్లించాల్సి ఉండనుంది. బడ్జెట్‌లో ప్రజారుణం పద్దు కింద రూ.15,848 కోట్లు చూపారు. ఇవి అప్పుల అసలు చెల్లించేందుకు ప్రతిపాదించగా, వడ్డీల చెల్లింపుకోసం మరో రూ.19,369 కోట్లు రూపారు.
ఏడాదికేడాది పెరుగుతూనే..
రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచీ అప్పుల చిట్టా పెరిగిపోతోందని.. ఏటికేడు. రుణ పద్దు పెరుగుతోందన్న ఆందోళనకు తాజా బడ్జెట్ కూడా ఉపశమనం ఇవ్వలేదు. అప్పులు 2022-23లో రూ.44,060, 2023-24లో రూ.52,576 కోట్లు, 2024-25లో రూ.60,440 కోట్లు కాగా.. ఈసారి రూ.69,539 కోట్లుగా ప్రతిపాదించారు. అంటే నాలుగేళ్లలో ఏటా చేస్తున్న అప్పుల పద్దు రూ.26 వేల కోట్ల మేర (50 శాతానికిపైగానే) పెరగడం గమనార్హం.
హోం శాఖకు స్వల్పంగా పెంపు
హోంశాఖకు ఈ బడ్జెట్‌లో నిధులు స్వల్పంగా పెరిగాయి. గత వార్షిక బడ్జెట్‌లో రూ.9.564 కోట్లు కేటాయించగా, 2025-28 బడ్జెట్‌లో రూ.10,188 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్‌లో సిబ్బంది జీతభత్యాలు ఇతర ఖర్చులు కలిపి నిర్వహణ పద్దు కింద రూ.9,337 కోట్లు, ప్రగతి పద్దు కింద పలు పనులకు రూ.851 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్‌లోనూ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చారు.
సైబర్ నేరాల కట్టడితోపాటు డ్రగ్స్ ముఠాలను అడ్డుకోవడం.. మత్తు పదార్థాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్రెడ్డి పలు సందర్భాల్లో ప్రస్తావించారు. అందుకు తగ్గట్టుగానే ఈ రెండు విభాగాలకూ గత బడ్జెట్‌తో పోలిస్తే ఎలాంటి కోత విధించలేదు. సముచిత స్థానం కల్పించారు. 2024-25 బడ్జెట్ మాదిరే ఈ బడ్జెట్‌లోనూ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు రూ.15 కోట్లు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు రూ.20 కోట్లు కేటాయించారు.
కొత్త పోలీస్ స్టేషన్లు, కార్యాలయాలు, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి గత బడ్జెట్‌లో రూ.90 కోట్లు కేటాయించి.. అందులో రూ.49 కోట్ల 81 లక్షలు ఖర్చు చేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ రూ.90 కోట్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కమ్యూనికేషన్ నెట్వర్క్ టెక్నాలజీ, ఇతర పరికరాల కొనుగోలుకు రూ.21.55 కోట్లు కేటాయించారు.
గత బడ్జెట్‌లో మాదిరిగానే ఈసారి కూడా జైళ్లశాఖకు రూ.16.78 కోట్లు, అగ్నిమాపకశాఖకు రూ.26.39 కోట్లు కేటాయించారు. ఇంటెలిజెన్స్ విభాగానికి రూ.108.70 కోట్లు కేటాయించారు. గ్రేహౌండ్స్‌కు గత బడ్జెట్‌లో రూ.3.17 కోట్లు కేటాయించగా.. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.6 కోట్లు కేటాయించారు.
కల్యాణ లక్ష్మికి పెరిగిన కేటాయింపులు
సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో కేటాయింపులు స్వల్పంగా పెంచింది. ఈ రెండింటికి కలిపి రూ.3,683 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో రూ.3,585 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.98 కోట్లు పెంచింది తాజాగా కల్యాణలక్ష్మి పథకం కింద అత్యధికంగా బీసీ సంక్షేమ శాఖకు రూ.2,178 కోట్లు, ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.600 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.280 కోట్లు, షాదీముబారక్ కింద మైనార్టీ సంక్షేమ శాఖకు రూ.650 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు.
గత బడ్జెట్‌తో పోలిస్తే బీసీ సంక్షేమ శాఖకు కేటాయింపుల్లో రూ.2 కోట్లు కోత పడగా.. ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.100 కోట్లు అదనంగా కేటాయించారు. మరోవైపు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం లబ్దిదారులకు ఆర్ధిక సాయంతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్పటికీ... తాజా బడ్జెట్‌లో ఇందుకు సంబంధించిన ప్రస్తావన లేదు.

వేతనాలకు రూ.40 వేల కోట్లు.. పెన్షన్లకు రూ.11 వేల కోట్లు
రాష్ట్ర బడ్జెట్‌లో రూ.50 వేల కోట్లకుపైగా ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగ విరమణ చేసిన వారి పెన్షన్ల చెల్లింపులకు వెళుతున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థలు, వర్సిటీలు ఇలా మొత్తం రాష్ట్రంలో 8,09,861 మంది ఉద్యోగులున్నట్టు తెలిపింది. ఉద్యోగులపై ఏటా రూ.40,739 కోట్లు, పెన్షన్ల కింద రూ.11,642 కోట్లు చెల్లిస్తున్నట్టు పేర్కొంది. పెన్షన్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉంటే, ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారి సంఖ్య ఉంది.
ఉద్యోగుల వివరాలు ఇలా..
- ప్రభుత్వ ఉద్యోగులు : 2,34,597
- పెన్షనర్లు: 2.88.169
- ప్రభుత్వ రంగ సంస్థలు: 1,14,869
- న్యాయ వ్యవస్థ: 9,557
- ఎయిడెడ్ విద్యా సంస్థలు: 2,220
- జిల్లా, మండల పరిషత్లు: 98,278
- గ్రామ పంచాయతీలు : 13,512
మునిసిపాలిటీలు,
- కార్పొరేషన్లు : 5,712
- పట్టణాభివృద్ధి సంస్థలు: 323
- జిల్లా గ్రంథాలయ సంస్థలు: 324
- విశ్వవిద్యాలయాలు: 5,266
- సహకార సంస్థలు,
- ఇతర ప్రభుత్వ బాడీస్: 34,516
- దేవాలయాలు: 2,518
రుణాలు..: ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎస్ఆర్టీఎం) కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం అప్పులు జీఎస్డీపీలో 27.38 శాతంగా అంచనా వేస్తే.. సవరించిన అంచనాలకు వచ్చేసరికి అది కాస్తా 27.98 శాతానికి పెరిగినట్టు చూపించారు.
అడవులకు అంతంతే..
రాష్ట్ర బడ్జెట్‌లో అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు రూ.1,023 కోట్లు ప్రతిపాదించారు. గత బడ్జెట్‌తో పోల్చితే (రూ.1,063.87 కోట్లు) రూ.40.87 కోట్లు తక్కువ. ఇందులో భాగంగా.. ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కింద రూ.162.13 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో స్టేట్సెక్టర్ స్కీమ్స్ కింద రూ.128.64, మ్యాచింగ్ స్టేట్ షేర్ కింద రూ.13.88 కోట్లు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రూ.19.61 కోట్లుగా ఉంది. అయితే గత బడ్జెట్‌లోనూ రూ.162.13 కోట్లుగా చెప్పి, సవరించిన బడ్జెట్‌లో రూ.149.49 కోట్లుగా చూపారు.
➣ తెలంగాణ బయో డైవర్సిటీ బోర్డుకు రూ.27 కోట్లు ప్రతిపాదించారు. 13వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు (గత బడ్జెట్లోనూ అంతే).
➣ రాష్ట్రంలోని అటవీ విస్తీర్ణాన్ని 24.05 శాతం నుంచి 33 శాతం వరకు పెంచేందుకు జాతీయ అటవీ విధాన లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రాంతాలను ఎకో టూరిజం కేంద్రాలుగా పర్యావరణ హితం, వన్యప్రాణుల సంరక్షణ నిబంధనల మేరకు అభివృద్ధి చేయను న్నట్టు ప్రకటించారు.
యువజనాభ్యుదయం, పర్యాటక శాఖకు రూ.1,411 కోట్లు
పర్యాటక శాఖకు ప్రభుత్వం రూ.775 కోట్లు కేటాయించింది. పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పీపీపీ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించినందున ప్రైవేట్ నిధులు వస్తాయని అంచనా వేస్తోంది. దీంతో ప్రభుత్వపరంగా పరిమిత మొత్తంలోనే నిధులు కేటాయించిం ది. దీంతోపాటు యువజనాభ్యుదయం, పురావస్తు, సాంస్కృతిక విభాగాలకు కలిపి రూ.1,411 కోట్లు కేటాయించింది. దేవాదాయ శాఖకు రూ.190 కోట్లు ప్రతిపాదించింది.
ఏటేటా పెరుగుతూనే ఉన్న రాష్ట్ర అప్పు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ.1,57,351 కోట్లు. ఇదే సమయంలో గతంలో చేసిన అప్పులకు అసలు, వడ్డీ కింద చేసిన చెల్లింపులు రూ.1,09,812 కోట్లు. సుమారు మరో రూ.48 వేల కోట్లు అవసరాల కోసం వాడుకుంది. ఈ మేరకు రాష్ట్ర మొత్తం అప్పు పెరిగింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది.
'ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్‌బీఎం) చట్టానికి లోబడి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రూ.4,51,203 కోట్లకు చేరాయి. 2023-24లో రూ.4,03,664 కోట్లు మాత్రమే. ఇక కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ)కు గ్యారంటీలు ఇచ్చి తెచ్చిన రుణాలు రూ.2,41,528 కోట్లు. ఇవి కూడా కలిపి రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.6,92,731 కోట్లకు చేరాయి.

బీసీలకు సంక్షేమం.. రూ.11,405 కోట్లు కేటాయింపు
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు తాజా బడ్జెట్ భారీ ఊరటనిచ్చింది. 2025– 26 బడ్జెట్‌లో బీసీ సంక్షేమ శాఖకు రూ.11,405 కోట్లు కేటాయించారు. ఇందులో శాఖాపరమైన అవసరాల కోసం రూ.1,008 కోట్లు కేటాయించగా.. సంక్షేమ పథకాల కోసం రూ.10,397 కోట్లు కేటాయించారు. 2024–25 బడ్జెట్‌లో బీసీ సంక్షేమ శాఖకు రూ.9,200.32 కోట్లు కేటాయించగా ప్రస్తుతం రూ.2,204 కోట్లు అదనంగా ప్రతిపాదించారు.
వివిధ కులాలకు చెందిన ఒక్కో ఆర్థిక సహకార సంస్థకు రూ.50 కోట్లు చొప్పున కేటాయించారు. వడ్డెర, కృష్ణబలిజ, వాల్మీకి బోయ, భట్రాజు, విశ్వబ్రాహ్మణ, శాలివాహన, కల్లుగీత, సగర, నాయీబ్రాహ్మణ, వాషర్‌మెన్, ముదిరాజ్, కుమ్మర, మున్నూరుకాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేర, గంగపుత్ర కార్పొరేషన్లకు నిధులు ప్రతిపాదించారు. రజక, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్లకు విద్యుత్ చార్జీల రాయితీకి రూ.100 కోట్లు చొప్పున కేటాయించారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు కేటాయించారు.

‘రాజీవ్ యువ వికాసం’తో స్వయం ఉపాధి
4 ప్రధాన సంక్షేమ శాఖలకు తాజా బడ్జెట్‌లో రూ.34,079 కోట్లు కేటాయించారు. ఇందులో బీసీ శాఖకు రూ.11,405 కోట్లు, ఎస్సీడీడీకి రూ.11,561 కోట్లు, గిరిజన సంక్షేమానికి రూ.7,522 కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖకు రూ.3,591 కోట్లు కేటాయించారు. షెడ్యూల్డ్ కులాల అభి వృద్ధి శాఖకు తాజా బడ్జెట్‌లో రూ.11,561 కోట్లు కేటా యించారు. ఇందులో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురు కుల విద్యా సంస్థల సొసైటీకి రూ.4,394.68 కోట్లు కేటా యించారు. దళితబంధు పథకానికి (అంబేడ్కర్ అభయ హస్తం) రూ.1,000 కోట్లు ప్రతిపాదించారు.
గతేడాది రూ.2 వేల కోట్లు ప్రతిపాదించినప్పటికీ నిధులు విడుదల చేయకపోవడం గమనార్హం. కాగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖకు రూ.7,522 కోట్లు కేటాయించారు. గిరిజన గురు కుల సొసైటీకి రూ.667.89కోట్లు ప్రతిపాదించారు. మైనార్టీ సంక్షేమ శాఖకు రూ.3,591 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే మైనార్టీ సంక్షేమానికి రూ.589 కోట్లు అధికంగా కేటాయించారు.
రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ రాజీవ్ యువ వికాసాన్ని కొత్తగా ఆవిష్కరించింది. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.6వేల కోట్లు కేటాయించింది. సంక్షేమ శాఖలకు సంబంధించి కార్పొరేషన్ల ద్వారా రాయితీ పద్ధతిలో ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందించనుంది
➤ రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖకు ఈసారి బడ్జెట్‌లో రూ.2,862 కోట్లు కేటాయించారు. ఇందులో శాఖాపరమైన నిర్వహణకు రూ.973 కోట్లు, సంక్షేమ పథకాల కోసం రూ.1,888 కోట్లు కేటాయించారు.
➤ కార్మిక సంక్షేమ శాఖకు రూ.900 కోట్లు కేటాయించారు. ఇందులో నిర్వహణ కింద రూ.479 కోట్లు, పథకాల కింద రూ.421 కోట్లు ప్రతిపాదించారు.
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధికి రూ.57,400 కోట్లు
దళిత, గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి ఈసారి భారీగా పెరిగింది. 2025–26 వార్షిక బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీఎఫ్ కింద రూ.57,400.43 కోట్లు కేటాయించింది. గత వార్షిక బడ్జెట్‌లో ఎస్‌డీఎఫ్ కింద 50,180.13 కోట్లు కేటాయింపులు జరపగా.. ప్రస్తుత బడ్జెట్లో ప్రభుత్వం రూ.7,220.30 కోట్లు అదనంగా కేటాయింపులు చేసింది.
ఇందులో షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీ ఎస్‌డీఎఫ్) కింద రూ.40,231.61 కోట్లు కేటాయించగా, గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీ ఎస్‌డీఎఫ్) కింద రూ.17,168.82 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపుల్లోనూ ఎస్సీ ఎస్‌డీఎఫ్‌కు అధిక ప్రాధాన్యం దక్కింది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఎస్సీ ఎస్‌డీఎఫ్ కింద రూ.7,107.57 కోట్ల మేర కేటాయింపులు పెరిగాయి. ఎస్టీ ఎస్‌డీఎఫ్‌కు మాత్రం 112.73 కోట్లు మాత్రమే పెరిగాయి.
➽ తాజా బడ్జెట్‌లో ఎస్సీ ఎస్ఎఫ్ కొత్తగా యంగ్ ఇండియా ఇంటిగ్రే టెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కోసం రూ.2,400 కోట్లు కేటాయించింది. దీంతో ఎస్సీ ఎస్‌డీఎఫ్‌కు బడ్జెట్ కేటాయింపులు కాస్త పెరిగాయి. సాధారణంగా బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం నిధులు కేటాయించి ఖర్చు చేస్తుంది.
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద వరుసగా ఐదేళ్లలో బడ్జెట్ కేటాయింపులు ఇలా... (రూ.కోట్లలో)
కేటగిరీ | 2021-22 | 2022-23 | 2023-24 | 2024-25 | 2025-26 |
---|---|---|---|---|---|
ఎస్సీ ఎస్ఎఫ్ | 21,306.84 | 33,937.75 | 36,750.48 | 33,124.04 | 40,231.61 |
ఎస్టీ ఎస్ఎఫ్ | 12,304.22 | 36,750.48 | 15,232.61 | 17,056.09 | 17,168.82 |
పరిశ్రమలకు రూ.3,527 కోట్లు
➤ ప్రగతి పద్దు కింద 2024–25 వార్షిక బడ్జెట్‌లో పరిశ్రమల శాఖకు 2,248.13 కోట్లు కేటాయించి, తర్వాత రూ.1,321.57 కోట్లకు సవరించారు. తాజా బడ్జెట్‌లో పరిశ్రమల శాఖకు ప్రగతిపద్దు కింద రూ.2,383.42 కోట్లు ప్రతిపాదించారు.
➤ పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రాయితీల బకాయిలు రూ.4,236 కోట్ల మేర పేరుకుపోయిన నేప థ్యంలో ప్రస్తుత బడ్జెట్‌లో వీటికి రూ.1,730 కోట్లు కేటాయించారు.
➤ టీ హబ్ ఫౌండేషన్‌కు గత ఏడాది బడ్జెట్‌లో రూ.40 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో నయాపైసా ఇవ్వలేదు.
➤ ఐటీ శాఖకు 2024–25 బడ్జెట్‌లో ప్రగతిపద్దు కింద రూ.771.20 కోట్లు ప్రతిపాదించి, చివరకు 337.30 కోట్లకు సవరించారు. తాజా బడ్జెట్‌లోనూ ప్రగతిపద్దు కింద ఈ శాఖకు రూ.771.20 కోట్లు ప్రతిపాదించారు.
➤ కొత్త పారిశ్రామిక పార్కుల్లోని ప్లాట్లలో 5 శాతం మహిళా పారిశ్రామికవేత్తలకు, 15 శాతం ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తారు.
➤ ప్రైవేటు ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు స్టాంప్ డ్యూటీ, విద్యుత్ చార్జీలు, భూమి ధరల్లో రాయితీలు ఇస్తామని ప్రకటించారు.
➤ 2050 నాటికి రాష్ట్రమంతటా పారిశ్రామిక అభివృద్ధి కోసం ‘మెగా మాస్టర్‌ప్లాన్ 2050’ పాలసీ తెస్తామని ప్రభుత్వం తెలిపింది.
➤ పాలసీలో భాగంగా ఐటీ, ఫార్మా, హెల్త్, ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, మెటల్, చేనేత, ఆభరణాల తయారీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తారు.
➤ జాతీయ రహదారి 163కు ఇరువైపులా హైదరాబాద్– వరంగల్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటును ప్రతిపాదించారు.

రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో రైతుకు పెట్టుబడి సాయం అందించే 'రైతుభరోసా' పథకానికి రూ.18 వేల కోట్లు కేటాయించింది. ఒక్కో ఎకరాకు సంవత్సరానికి రూ.12 వేల చొప్పున కోటిన్నర ఎకరాలకు చెల్లించే విధంగా ఈ కేటాయింపులు జరిపారు. రైతు రుణమాఫీ కింద రూ.23 వేల కోట్లకు పైగా రైతుల రుణాలను చెల్లించిన నేపధ్యంలో ఈసారి వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులను తగ్గించారు. గతసారి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం రూ.32,479 కోట్లు కేటాయించిన ప్రభుత్వం సవరించిన బడ్జెట్‌లో ఆ మొత్తాన్ని రూ.26.550 కోట్లకు పరిమితం చేసింది.
కానీ ఈసారి వ్యవసాయ, అనుబంధ రంగాలన్నింటికీ కలిపి రూ.24,439 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఇందులో వ్యవసాయ అభివృద్ధికి రూ.16,962.87 కోట్లు మాత్రమే కేటాయించింది. నిర్వహణ పద్దు కింద రూ.1,138 కోట్లు పోగా, సహకార శాఖ కోసం రూ.22.65 కోట్లు కేటాయించింది. పౌరసరఫరాల శాఖకు రూ.5,734 కోట్లు కేటాయించగా, అందులో రూ.3.835.64 కోట్లను ప్రగతి పద్దు కింద చూపించింది.
ఈ మొత్తంలో బియ్యం సబ్సిడీకి చెల్లించే మొత్తమే రూ.3,000 కోట్లుగా పేర్కొనడం గమనార్హం. ఎల్పీజీ సబ్సిడీ పథకం మహాలక్ష్మి కోసం మరో రూ.723 కోట్లు కేటాయించారు. సన్న ధాన్యం పండిం చిన రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ గా ఇస్తుండగా, ఆ మొత్తాన్ని పౌరసరఫరాల శాఖ పద్దు నుంచి కాకుండా ప్రభుత్వమే నేరుగా ఆర్థిక శాఖ నుంచి ఇస్తుండడంతో అందుకయ్యే రూ.3,000 కోట్లను విడిగా చూపించారు.
వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయింపులు..
కేటగిరీ | కేటాయింపు (రూ. కోట్లు) |
---|---|
ఉద్యానవన శాఖకు | 646.24 |
పట్టు పరిశ్రమ శాఖకు | 21.08 |
రైతులకు విత్తన సరఫరాకు రాయితీ | 106.22 |
విత్తనం నాటే మెటీరియల్కు ఇచ్చే మొత్తం | 18.69 |
జాతీయ ఆహార భద్రతా మిషన్, ఇతర ఒప్పంద సేవలు | 27.55 |
పంటల బీమా | 981.11 |
రైతు బీమా | 1167.92 |
వ్యవసాయ యాంత్రీకరణ, క్రాప్ డైవర్సిఫికేషన్ నేషనల్ మిషన్ | 47.35 |
వ్యవసాయ యాంత్రీకరణ (స్టేట్) | 25.47 |
నూనెగింజలు, ఆయిల్పామ్ | 10.81 |
రైతు వేదికల వద్ద అభివృద్ధి | 43.03 |
ఇతర సేవలు, సహాయక గ్రాంట్లు | 37.98 |
పింఛన్లకు పెరిగింది కొంతే..
బడ్జెట్‌లో సామాజిక పింఛన్లకు రూ.14,861 కోట్లు కేటాయించారు. 2024-25 బడ్జెట్లో కేటాయించిన 5.14.628.91 కోట్లతో పోల్చితే.. రూ.232.09 కోట్లు మాత్రమే అధికంగా కేటాయించారు. దీనినిబట్టి చూస్తే ఈ ఏడాది కూడా చేయూత పింఛన్ల మొత్తం పెంపుదల లేనట్టేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంటే ప్రస్తుతం ఇస్తున్న పాత పింఛన్లే ఇకమీదట కూడా చెల్లించనున్నారు. దీంతో వృద్దులు ఇతర కేటగిరీల పింఛన్లను రూ.2,016 నుంచి రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్లు రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంపుదల ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై స్పష్టత కొరవడింది.
అలాగే.. మహిళలకు ప్రతినెలా రూ.2,500 చెల్లిస్తామన్న హామీకి కూడా ఈసారి ఎలాంటి కేటాయింపులు లేవు. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చేయూత పింఛన్ల పెంపు ఇప్పట్లో ఉండకపోవచ్చునని అంటున్నారు. అలాగే వృద్ధాప్య పింఛను అర్హత వయస్సు 57 ఏళ్లకు తగ్గింపు, ఇతర కేటగిరీల వారీగా కొత్త పింఛనుదారుల ఎంపిక, వారికి పింఛను మంజూరుపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తంగా చూస్తే... 2025-26 బడ్జెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.31,605 కోట్లు కేటాయించారు. 2024-25లో ఈ మొత్తం రూ.29,816 కోట్లు కావడం గమనార్హం. కాగా గత బడ్జెట్‌తో పోల్చితే ఈసారి రూ.1,789 కోట్లు అధికంగా కేటాయించారు.
ముఖ్యమైన కేటాయింపులు ఇలా..
కేటగిరీ | కేటాయింపు (రూ. కోట్లు) |
---|---|
చేయూత పింఛన్లు | 14,861 |
మిషన్ భగీరథ బకాయిల చెల్లింపు | 6,000 |
స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ | 2,062 |
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా | 600 |
మహిళా సంఘాలకు వడ్డీలు | 1,511 |
గ్రామీణ రోడ్ల నిర్మాణం, నిర్వహణ | 1,220 |
హామ్ విధానంలో గ్రామీణ రోడ్ల నిర్మాణం | 200 |
గ్రామీణ అభివృద్ధికి రూ.13,376.35 కోట్లు
గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి రూ.13,376.35 కోట్లు కేటాయించగా.. 2024-25 సవరించిన అంచనాలతో పోల్చితే రూ.879 కోట్లు అధికంగా కేటాయించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు గత బడ్జెట్ సవరించిన అంచనాల్లో చూపిన ట్టుగా ఈ బడ్జెట్‌లోనూ రూ.295 కోట్లు కేటాయించారు.
పథకాల వారీగా ఇలా..
- స్వయం సహాయ సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) వడ్డీలేని రుణాలకు రూ.892 కోట్లు
- ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం రూ.413.52 కోట్లు
- విలేజీ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు హానరోరియమ్ కింద రూ.108 కోట్లు
- ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రుణబీమా కింద రూ.55.41 కోట్లు
- ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ప్రమాదబీమా కోసం రూ.96.53 కోట్లు
- తెలంగాణ మహిళాశక్తి కింద రూ.80.39 కోట్లు
- నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద రూ.119.87 కోట్లు
- స్వచ్ఛ భారత్ గ్రామీణ్ కింద రూ.120 కోట్లు
- మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 5.1,026.32 5
- పంచాయతీలకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రూ.1,114.69 కోట్లు
వీటికి కేటాయింపుల్లేవు
గ్రామీణాభివృద్ధి శాఖాపరంగా అమలు చేసే వివిధ పథకాల విషయాని కొస్తే... స్త్రీనిధి, డ్వాక్రా మహిళలకు (అభయహస్తం) ఇన్సూరెన్స్/పింఛను స్కీమ్కు గత బడ్జెట్లో మాదిరి ఈసారి కూడా కేటాయింపులు చేయలేదు. శ్యామాప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద కూడా గతంలో మాదిరిగానే ఈసారీ కేటాయింపులు లేవు. డీఆర్డీఏలకు సహాయ సహకారం కోసం కూడా ఎలాంటి కేటాయింపులు లేవు.
‘చేప’కు రూ.250 కోట్లు
రాష్ట్ర వార్షిక బడ్జెట్లో మత్స్యశాఖకు కేటాయింపుల్లో ఎలాంటి మార్పు చేర్పులు చేయలేదు. గత ఏడాది రూ.250 కోట్లు కేటాయిస్తే.. ఈ ఏడాది కూడా ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించింది. 2024-25లో రూ.250 కోట్లు కేటాయిస్తే.. అందులో రూ.231 కోట్లు మాత్రమే ఖర్చు చేసిం ది. మత్స్యశాఖ ఇంకా రూ.20 కోట్లు ఖర్చు చేయలేదు. దీంతో ప్రభుత్వం ఆ శాఖకు ఎలాంటి బడ్జెట్ పెంపు లేకుండా.. రూ.250 కోట్లు కేటాయించింది.
నీటిపారుదల శాఖకు రూ.23,372 కోట్లు
రాష్ట్ర బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు రూ.23,372.7 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రగతి పద్దు కింద రూ.11,786.77 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.11,543.87 కోట్లు చూపించింది. చార్జ్‌డ్ మొత్తం కింద రూ.42.06 కోట్లు కేటాయించింది. అయితే ఈ కేటాయింపుల్లో సింహభాగం రుణాల తిరిగి చెల్లింపులకే పోనున్నాయి.
ప్రాధాన్య ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేస్తామన్న ప్రభుత్వ హామీకి తగ్గట్లుగా నిధుల కేటాయింపులు జరగలేదు. 2024–25 బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు రూ.22,301 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్‌లో రూ.1,071 కోట్లు పెంచారు. ఈ శాఖకు 2022–23లో రూ.19,349.24 కోట్లు, 2023–24లో రూ.29,766 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి.

రుణమే పెనుభారం
కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డితో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి తీసుకున్న భారీ రుణాలు తిరిగి చెల్లించడానికి సాగునీటి శాఖ బడ్జెట్ కేటాయింపుల్లోని సింహభాగం నిధులు వెళ్లనున్నాయి. రుణాల తిరిగి చెల్లింపులకు రూ.9,877.01 కోట్లు అవసరమని బడ్జెట్‌లో ప్రభుత్వం తెలిపింది.
మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల రుణాల తిరిగి చెల్లింపులకు రూ.2,962.47 కోట్లు, కాళేశ్వరం కార్పొరేషన్ రుణాల తిరిగి చెల్లింపులకు రూ.6,914.54 కోట్లు కేటాయించారు. ఇక తెలంగాణ జలవనరుల సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీడబ్ల్యూఆర్‌ఐడీసీఎల్)కు రుణం కింద రూ.2,962.47 కోట్లు ప్రతిపాదించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణకు నిధులు రూ.385.38 కోట్లకు తగ్గాయి.
ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.7,120 కోట్లు..
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి మూలధన పెట్టుబడుల కింద బడ్జెట్‌లో రూ.12,652 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.7120.27 కోట్లు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుల పూర్తితో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 6,55,895 ఎకరాలు, 2025–26లో 9,42,778 ఎకరాలను సాగులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా 2025–26 నాటికి మొత్తం 15,98,673 ఎకరాల ఆయకట్టు సాగులోకి రావాల్సి ఉంది.
అయితే, నిధులు అరకొరగానే కేటాయించటంతో గడువులోగా ఆయా ప్రాజెక్టులను పూర్తిచేయటం అనుమానంగా మారింది. ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టులో భాగంగా వచ్చే నెలలో తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్‌లో మాత్రం ఈ ప్రాజెక్టుకు నిధులను రూ.248.99 కోట్ల నుంచి రూ.32.22 కోట్లకు తగ్గించడం గమనార్హం.
వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12,393 కోట్లు
వైద్య ఆరోగ్యశాఖకు 2025–26 సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.12,393 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ రూ.11,468 కోట్లతో పోలిస్తే రూ.825 కోట్లు అధికం. ఈ కేటాయింపుల్లో నిర్వహణ పద్దు కింద రూ. 5,666.86 కోట్లు కేటాయించగా, అభివృద్ధి కోసం రూ. 6,070 కోట్లు కేటాయించారు. ఇందులో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు కలిపి రూ. 680.63 కోట్లు కేటాయించగా.
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ (డీఎంఈ)కు రూ. 3,011 కోట్లు కేటాయించారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాధిపతికి రూ. 554.24 కోట్లు కేటాయించారు. ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ కమిషనర్ పరిధిలోని కార్యక్రమాలకు రూ. 1686.80కోట్లు కేటాయించడం గమనార్హం. ఇవి కాకుండా ఆయుష్ కోసం రూ.133.52 కోట్లు, డ్రగ్స్ కంట్రోల్ విభాగాధిపతికి రూ.2.10 కోట్లు కేటాయించారు.
ఆరోగ్యశ్రీ చెల్లింపులకు ఎలా?
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 1,143 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచడంతోపాటు వైద్యం ఖర్చుల స్లాట్లను కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా ఆసుపత్రులతోపాటు కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా రోగులకు చికిత్సలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1200 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా.
తమకు బకాయిలు చెల్లించాలని రెండు నెలల క్రితం నెట్‌వర్క్ ఆసుపత్రులు సమ్మె కూడా చేశాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో కేవలం రూ.1,143 కోట్లను కేటాయించడాన్ని ఆరోగ్య శ్రీ చెల్లింపులకు కొంత ఇబ్బంది కలిగించే విషయంగా ప్రైవేటు ఆసుపత్రులు చెపుతున్నాయి. ఇందులో నిర్వహణ ఖర్చులు పోను మిగిలే రూ. 695.79 కోట్లు మాత్రమే ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌కు చేరే అవకాశం ఉంది.
ఇంధన శాఖకు రూ.21,221 కోట్లు
భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో సొంత ఇందన శాఖకు అగ్ర తాంబూలం ఇచ్చారు. ప్రగతి పద్దు కింద రూ.19,590 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.1,630 కోట్లు కలిపి ఇంధన శాఖకు మొత్తం రూ.21,221 కోట్లను కేటాయించారు. ఈ శాఖ బడ్జెట్ రూ.20 వేల కోట్లను దాటడం ఇదే తొలిసారి. ఇంధన శాఖలో 2023-24లో రూ.12.727 కోట్లు, 2024-25లో రూ.16,410 కోట్లను కేటాయించగా, తాజాగా కేటాయింపులు గణనీయంగా పెరిగాయి.
ఇక రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహించేందుకు తెచ్చిన గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025 కింద పెట్టుబడిదారులకు రాయితీ, ప్రోత్సాహకాలను అందించడానికి ప్రభుత్వం రూ.754.7 కోట్లను కేటాయించింది. ఎంపిక చేసిన గ్రామాలను 100 శాతం సౌర విద్యుదీకరించడానికి మరో రూ.1,182,05 కోట్లను కేటాయించింది.
వ్యవసాయ సబ్సిడీలు యథాతథం
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నందుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు చెల్లిస్తున్న రూ.8,260 కోట్ల సబ్సిడీలను ప్రభుత్వం యథాతథంగా కొనసాగించిం ది. గృహజ్యోతి పథకం కింద పేదల గృహాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా చేసినందుకు డిస్కంలకు చెల్లిస్తున్న సబ్సిడీలను మాత్రం రూ.1825.01 కోట్ల నుంచి రూ.1509.4 కోట్లకు తగ్గించింది. విద్యాసం స్థలకు ఉచిత విద్యుత్ సరఫరాకి కొత్తగా రూ.198,87 కోట్లను కేటాయించింది.
పట్టణాలకు రూ.17.677 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో పురపాలక శాఖకు రూ.17,677 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు రూ.7,6939.96 కోట్లు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి పనుల కోసం ప్రగతి పద్దు కింద రూ.8,796.78 కోట్లు ప్రతిపాదించింది. 2024-25 బడ్జెట్‌లో ఈ శాఖకు ప్రగతి పద్దు రూ.5,642.35 కోట్లు ఉండగా, ఈసారి రూ.3 వేల కోట్లు అదనంగా కేటాయించారు.
ఇందులో పట్టణాభివృద్ధి కోసం రూ.2,957.58 కోట్లు, ప్రజారోగ్యం కోసం రూ.525.47 కోట్లు ప్రతిపాదించారు. గత సంవత్సరం సవరించిన అంచనాల్లో ఈ మొత్తం రూ.106.07 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. తాజా బడ్జెట్‌లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నిర్వహణ ఖర్చుల కోసం రూ.2,700 కోట్లు, వాటర్బోర్డుకు రూ.635 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
పేదింటికి రూ.12,571 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లతోపాటు గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేసేందుకు రూ.22,500 కోట్లు అవసరమన్నది గృహనిర్మాణ శాఖ లెక్కలు, కానీ, తాజా బడ్జెట్లో ప్రభుత్వం రూ.12,571 కోట్లను ప్రతిపాదించింది. అయితే గత బడ్జెట్‌తో పోలిస్తే ఈ మొత్తం చాలా ఎక్కువ. గత బడ్జెట్‌లో రూ.7,740 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవ త్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాదని ప్రభుత్వానికి స్పష్టత ఉంది.
అయితే ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల తర్వాత ఎట్టకేలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. ఇందులో 72 వేల ఇళ్లకు సంబంధించి ముగ్గు పోసుకునే పనిని లబ్దిదారులు ప్రారంభించారు. ఈనెలాఖరుకు తొలివిడత రూ.లక్ష వారి ఖాతాల్లో వేయాల్సి ఉంది. ఇప్పుడు నిధుల అవ సరం చాలా ఉంది. దీంతో ప్రతిపాదించిన నిధులు, మంజూరు చేస్తున్న ఇళ్ల సంఖ్య ప్రకారం చూస్తే సరిపోదు. అయితే, ఈ ఆర్ధిక సంవత్సరం ఆ ఇళ్లన్నీ పూర్తయ్యే పరిస్థితి ఉండవచన్న అంచనాలో ప్రభుత్వం ఉంది.
రెండు మూడు విడతల నిధుల విడుదలతోనే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. దీంతో ఈ కేటాయిం పులు సరిపోతాయన్న అంచనాతో ఉన్నట్టు సమాచారం. ఇక, ఈ ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇవ్వాల్సి ఉంది. అక్కడి నుంచి ఎన్ని నిధులు వస్తాయో ఇంకా స్పష్టత రాలేదు.
Tags
- Telangana Budget 2025-26
- Telangana Budget 2025 Highlights
- Telangana Budget 2025
- Telangana Assembly Budget Session 2025
- Telangana Budget
- Telangana Finance Minister Bhatti Vikramarka
- Deputy CM Bhatti Vikramarka
- Telangana Budget Highlights
- cm revanth reddy
- State Budget 2025
- Telangana Annual Budget
- economic growth
- Sakshi Education News
- Budget News in Telugu
- TSBudget2025