Skip to main content

Balance, Vision Issues: అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉంటే.. ఎదురయ్యే సమస్యలు ఇవే..

అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో తొమ్మిది నెలలున్నాక తిరిగి భూమికి వచ్చారు.
What Happens To Human Body After 9 Months In Space

ఈ తరుణంలో వారు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలను ఎదుర్కోనున్నారనేది కీలకంగా మారింది. ప్రధానంగా వారు ఎముకలు, కండరాల క్షీణత, రేడియేషన్ ఎక్స్‌పోజర్, దృష్టి లోపం మొదలైన సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే ఇన్నాళ్లూ ఒంటరిగా ఉన్నందున పలు మానసిక రుగ్మతలను కూడా చవిచూడనున్నారు.

అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 9 నెలల 13 రోజుల తర్వాత భూమికి తిరిగి వచ్చారు. వారు అంతరిక్షంలోకి  ఎనిమిది రోజులు మాత్రమే ఉండేందుకు వెళ్లారు. కానీ అక్కడే చిక్కుకుపోయారు. సునీతతో పాటు మొత్తం నలుగురు వ్యోమగాములు మార్చి 19న తెల్లవారుజామున 3:27 గంటలకు డ్రాగన్ అంతరిక్ష నౌకలో ఫ్లోరిడా తీరంలో దిగుతారు. తొమ్మిది నెలలుగా భూ వాతావరణానికి దూరంగా ఉన్న ఈ వ్యోమగాములు ఎటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోనున్నారనే విషయానికి వస్తే..
 
1. నడక మర్చిపోవచ్చు
మనం భూమిపై నడుస్తున్నప్పుడు, పరిగెత్తేటప్పుడు, లేచినప్పుడు లేదా కూర్చున్నప్పుడు కండరాలు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. కానీ అంతరిక్షంలో సున్నా-గురుత్వాకర్షణ కారణంగా కండరాలు పనిచేయవు. ఫలితంగా కండరాలు బలహీనపడతాయి. అలాగే ప్రతి నెలా ఎముక సాంద్రత దాదాపు ఒక శాతం తగ్గుతుంది. ఇది కాళ్ళు, వీపు, మెడ కండరాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా ఈ వ్యోమగాములు భూమిపై వెంటనే నడవలేని స్థితిలో ఉంటారు.

Sunita Williams: సునీత విలియమ్స్ చెందిన ఈ విషయాలు.. మీకు తెలుసా..?

2. నిలబడేందుకూ ఇబ్బంది
మన మెదడులో వెస్టిబ్యులర్ వ్యవస్థ ఉంటుంది. ఇది శరీరంలో సమతుల్యతను కాపాడేలా పనిచేస్తుంది. అంతరిక్షంలో సున్నా-గురుత్వాకర్షణ కారణంగా ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. ఫలితంగా భూమికి తిరిగి వచ్చే కొంతమంది వ్యోమగాములు కొంతకాలం పాటు నిలబడలేరు. చేతులు,  కాళ్లను బ్యాలెన్స్‌ చేయలేరు. 2006లో అమెరికన్ వ్యోమగామి హెడెమేరీ స్టెఫానిషిన్-పైపర్ 12 రోజుల అంతరిక్షంలో ఉండి, ఆ తర్వాత భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు.

3. వస్తువులను గాలిలో వదిలేస్తారు
దీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల వ్యోమగాముల శరీరం సూక్ష్మ గురుత్వాకర్షణకు అనుగుణంగా మారుతుంది. అంతరిక్షంలో ఏదైనా వస్తువు గాలిలో ఉంచినప్పుడు, అది పడిపోకుండా తేలుతూనే ఉంటుంది. దీంతో వారికి భూమికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ అలవాటు కొంతకాలం  కొనసాగుతుంది.

4. అంధత్వం వచ్చే ప్రమాదం
అంతరిక్షం(Space)లో సున్నా-గురుత్వాకర్షణ కారణంగా, శరీర ద్రవం తల వైపు కదులుతుంది. ఇది కళ్ల వెనుక ఉన్న నరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనిని స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో-ఓక్యులర్ సిండ్రోమ్ (ఎస్‌ఏఎన్‌ఎస్‌) అని పిలుస్తారు. భూమికి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాముల శరీరాలు ఇక్కడికి అనుగుణంగా సర్దుబాటు  అయ్యేందుకు ప్రయత్నిస్తాయి. తద్వారా వారి కళ్లు ప్రభావితమవుతాయి. కంటి సమస్యలు లేదా అంధత్వం వచ్చే అవకాశం కూడా ఏర్పడవచ్చు.

Sunita Williams: భూమిపైకి క్షేమంగా తిరిగొచ్చిన సునీత విలియమ్స్.. అలాగే..

ఈ వ్యాధులు మాత్రమే కాదు.. ఎముక బలహీనత, అధిక రేడియేషన్‌కు గురికావడం వల్ల క్యాన్సర్ ముప్పు, డీఎన్‌ఏ దెబ్బతినడం, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం, గాయాలను నయం చేసుకునే సామర్థ్యం తగ్గడం,ఒంటరితనం, మానసిక ఒత్తిడి, నిద్ర సమస్యలు, దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది లాంటి సమస్యలను వ్యోమగాములు ఎదుర్కొంటారు. 

Published date : 20 Mar 2025 11:56AM

Photo Stories