Skip to main content

Career Opportunities in Mobile App Development... నైపుణ్యాలు, కొలువులకు మార్గాలు..

Career Opportunities in Mobile App Development

స్మార్‌ ఫోన్‌ వినియోగం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ కనిపిస్తోంది! నేటి డిజిటల్‌ యుగంలో దైనందిన అవసరంగా మారిపోయింది ఫోన్‌. అరచేతిలో ఇమిడే..స్మార్ట్‌ ఫోన్‌ మొబైల్‌ యాప్స్‌తో.. విభిన్న సేవలు పొందే అవకాశం లభిస్తోంది! ఇదే ఇప్పుడు యువతకు.. సరికొత్త కెరీర్‌ అవకాశాలకు మార్గమైంది.నేడు మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌ విభాగం.. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో.. మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో ఉద్యోగాలు, అవసరమైన నైపుణ్యాలు, కొలువులకు మార్గాలపై ప్రత్యేక కథనం.. 

  • మొబైల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌లో పెరుగుతున్న అవకాశాలు
  • సూపర్‌ మార్కెట్‌ మొదలు సాఫ్ట్‌వేర్‌ సంస్థల వరకు సొంత యాప్‌లు
  • ప్రోగ్రామింగ్, లాంగ్వేజ్‌ నైపుణ్యాలతో కొలువుదీరే అవకాశం

ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమకు అవసరమైన సేవలు పొందేందుకు మొబైల్‌ ఫోన్‌నే ఎక్కువగా వినియోగిస్తున్నారు.ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచంలో.. ఏ రంగంలో చూసినా..యాప్‌ ఆధారిత సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. స్టార్టప్స్‌ నుంచి ఎంఎన్‌సీల వరకు.. ఓ మోస్తరు సూపర్‌ మార్కెట్‌ మొదలు.. ఈ కామర్స్‌ సంస్థల దాకా.. అన్నీ తమ సొంత యాప్‌లను రూపొందించి.. వాటి ద్వారా వినియోగదారులకు నిరంతరం సేవలందిస్తున్నాయి. ఒక్కసారి మనం గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళితే.. వేల సంఖ్యలో యాప్‌లు కళ్ల ముందు కనిపిస్తాయి. ఇది యాప్‌ డెవలప్‌మెంట్‌ పెరిగిందనడానికి నిదర్శనం. ఈ యాప్‌లు రూపొందించే నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది.

చ‌ద‌వండి: Job Skills: టెక్‌ నైపుణ్యాలతో టాప్‌ కొలువులు.. ప్రత్యేకతలు, నైపుణ్యాలు, భవిష్యత్‌ అవకాశాలు..

సాఫ్ట్‌వేర్‌ కొలువు మాదిరిగానే

యాప్‌ డెవలప్‌మెంట్‌ను సాఫ్ట్‌వేర్‌ కొలువుగానే పరిగణిస్తున్నారు. దీనికి కారణం.. యాప్‌ డెవలప్‌మెంట్‌కు అవసరమయ్యే నైపుణ్యాలే. నిర్దిష్టంగా ఏదైనా ఒక మొబైల్‌ అప్లికేషన్‌ను రూపొందించాలంటే.. ప్రోగ్రామింగ్‌పై పట్టు ఉండాలి. సీ, సీ++, జావా వంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లు తెలిసుంటే యాప్‌ను అన్ని హంగులతో తీర్చిదిద్దే సామర్థ్యం లభిస్తుంది. ఫుల్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో నైపుణ్యాలుంటే.. యాప్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో ప్రత్యేక ప్రాధాన్యత సొంతం చేసుకోవచ్చు.

సిస్టమ్‌ టు.. స్మార్ట్‌ ఫోన్‌

మనందరం సిస్టమ్‌గా పిలిచే కంప్యూటర్‌ బదులుగా ఈ రంగంలో స్మార్ట్‌ ఫోన్‌నే సిస్టమ్‌గా భావిస్తున్నారు. ప్రధానంగా ఈమెయిల్స్, మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ టూల్స్, సోషల్‌ మీడియా అప్‌డేట్స్, న్యూస్‌ అప్‌డేట్స్‌ వంటి పలు సేవల కోసం సంబంధిత యాప్స్‌నే వినియోగిస్తున్నారు. సోషల్‌ మీడియానే పరిగణనలోకి తీసుకుంటే..లింక్డ్‌ఇన్, ఫేస్‌బుక్, ట్విటర్‌ వంటి సంస్థలు యాప్‌లను కూడా అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అదే విధంగా హైఎండ్‌ మొబైల్స్‌లో మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ అప్లికేషన్స్, పీడీఎఫ్‌ క్రియేషన్‌ తదితర సేవలు సైతం అందుతున్నాయి. వీటన్నిటికీ కారణం.. ఆయా సంస్థల యాప్‌ ఆధారిత కార్యకలాపాలే.

డిజైన్, డెవలప్‌మెంట్‌

యాప్‌ డెవలపర్‌గా రాణించడానికి.. డిజైన్, డెవలప్‌మెంట్‌ నైపుణ్యాలు అత్యంత కీలకం. ఒక సంస్థకు సంబంధించిన అన్ని సేవలను వినియోగదారులు యాప్‌లో యాక్సెస్‌ చేసే విధంగా.. పొందుపరచడమే కాకుండా.. యాప్‌ హోంస్క్రీన్‌ మొదలు, ఇతర ఫీచర్స్‌ అన్నీ ఆకర్షణీయంగా ఉండేలా రూపొందిస్తేనే... వినియోగదారుల ఆదరణ లభిస్తుంది. కాబట్టి యాప్‌ డెవలప్‌మెంట్‌లో కెరీర్‌ కోరుకునే వారు వెబ్‌ డిజైన్‌ నైపుణ్యాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. 

చ‌ద‌వండి: Coding and Programming Jobs: కోడింగ్‌తో కొలువులు.. నైపుణ్యాలు, సొంతం చేసుకునేందుకు మార్గాలు..

రెగ్యులర్‌ అప్‌డేట్‌

యాప్‌ డెవలపర్‌గా కెరీర్‌ కోరుకునే సదరు యాప్స్‌ను నిరంతరం అప్‌డేట్‌ చేయగలిగే నైపుణ్యం కలిగుండాలి. యాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త, కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టడం, వినియోగదారులు సులువుగా నేవిగేషన్‌ చేసేలా వాటిని అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ప్రస్తుతం పలు సంస్థల యాప్‌లను ఓపెన్‌ చేసినప్పుడు.. యాప్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ అందుబాటులో ఉం టుంది. దాన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోమని పాప్‌అప్‌ నోటిఫికేషన్‌ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అంటే.. నిరంతరం యాప్‌ను అన్ని కోణాల్లో అభివృద్ధి చేస్తూ.. వినియోగదారులు, యూజర్లకు దగ్గరవడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

ఐటీ విభాగాలతో కలిసి

యాప్‌ డెవలప్‌మెంట్‌లో అడుగుపెట్టిన వారు.. సంస్థకు సంబంధించిన ఐటీ, లేదా సాఫ్ట్‌వేర్‌ విభాగంతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఐటీ విభాగం వినియోగిస్తున్న టెక్నాలజీ, ప్రోగ్రామింగ్, వెబ్‌ డిజైనింగ్‌ వంటి అంశాలతో అనుసంధానం చేసుకుంటూ..నిర్దిష్టంగా ఒక యాప్‌ను రూపొందించాల్సి ఉంటుంది. వారు వినియోగిస్తున్న బ్యాక్‌ ఎండ్‌ టెక్నాలజీస్‌ను తెలుసుకుంటూ.. యాప్‌ రూపకల్పనకు ఉపక్రమించాల్సి ఉంటుంది. అందుకే.. మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌ను సాఫ్ట్‌వేర్‌ కొలువుగానే భావిస్తున్నారు. అందుకే వీరికి యాప్‌ ప్రోగ్రామర్, యాప్‌ డెవలప్‌మెంట్‌ ఇంజనీర్‌ వంటి జాబ్‌ ప్రొఫైల్స్‌ లభిస్తున్నాయి.

చ‌ద‌వండి: Tech Skills: ఎథికల్‌ హ్యాకింగ్‌లో పెరుగుతున్న డిమాండ్‌.. అర్హతలు, నైపుణ్యాలు.. 

విస్తరిస్తున్న అవకాశాలు

మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో యాప్‌ డెవలపర్స్‌కు అవకాశాలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా 5జి టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న తరుణంలో గేమింగ్, యానిమేషన్, 3డి, ఆటోమేషన్‌ వంటి విభాగాల్లో వేల సంఖ్యలో కొలువులు అందుబాటులోకి రానున్నాయి. అదే విధంగా.. బ్యాంకింగ్, ఈకామర్స్, ఎడ్‌టెక్, హెల్త్‌కేర్, మెడ్‌టెక్‌.. ఇలా దాదాపు అన్ని రంగాల్లోనూ ఇప్పుడు మొబైల్‌ యాప్స్‌ అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే.

వేల సంఖ్యలో కొలువులు

యాప్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించి మానవ వనరుల డిమాండ్, సప్లయ్‌ కోణాలను పరిగణనలోకి తీసుకుంటే.. వేల సంఖ్యలో కొరత కనిపిస్తోందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మొబైల్‌ తయారీ పరిశ్రమ, ఐఏఎంఏఐ వంటి సంస్థల అంచనాల ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి దేశంలో యాప్‌ డెవలప్‌మెంట్‌ రంగం మిలియన్‌ల డాలర్ల మార్కెట్‌ సొంతం చేసుకోనుంది. అదే విధంగా 2024 నాటికి ప్రపంచంలో యాప్‌ డెవలపర్స్‌ కోణంలో రెండో స్థానంలో నిలవనుంది. టెలికం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ అంచనాల ప్రకారంయాప్‌ డెవలప్‌మెంట్‌లో 2024 చివరి 1.5 లక్షల ఉద్యోగాలు లభించనున్నాయి. యాప్‌ యూజర్స్‌లో భారత్‌ ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలుస్తుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ గణాంకాలన్నీ.. యాప్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో కెరీర్‌ అవకాశాలు విస్తృతం అవుతాయని చెప్పడానికి నిదర్శనాలుగా పేర్కొనొచ్చు.

నేర్చుకునేందుకు మార్గాలు

యాప్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన నైపుణ్యాలు పొందేందుకు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. కోర్స్‌ఎరా, ఉడెమీ, ఎడెక్స్‌ వంటి పలు సంస్థలు ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ కోర్సులను అందిస్తున్నాయి. అదే విధంగా అకడమిక్‌గానూ ఈ నైపుణ్యాలు సొంతం చేసుకునే అవకాశం ఉంది. పలు ఇన్‌స్టిట్యూట్‌లు బీఎస్సీ(కంప్యూటర్స్‌), బీటెక్‌ స్థాయిలో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌తోపాటు మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులను కూడా బోధిస్తున్నాయి.

చ‌ద‌వండి: Coding and Programming Jobs: కోడింగ్‌తో కొలువులు.. నైపుణ్యాలు, సొంతం చేసుకునేందుకు మార్గాలు.. 

కోడింగ్‌ స్కిల్స్‌

యాప్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో కొలువులు, విధుల కోణంలో పరిశీలిస్తే.. బీటెక్‌ సీఎస్‌ఈ విద్యార్థులకు కొంత అనుకూలత ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. యాప్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్, కోడింగ్‌ స్కిల్స్‌ను వినియోగించాల్సి ఉండడం, అదే విధంగా హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌ వంటి వెబ్‌ డిజైనింగ్‌ అంశాలపై సీఎస్‌ఈ విద్యార్థులకు అకడమిక్‌గా నైపుణ్యాలు లభిస్తుండడమే ఇందుకు మరో కారణంగా చెప్పొచ్చు.

వేతనాలు ఆకర్షణీయం

యాప్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో కొలువులు సొంతం చేసుకున్న వారికి వేతనాలు కూడా ఆకర్షణీయంగానే లభిస్తున్నాయి. సగటున రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వార్షిక వేతనం అందుతోంది. బీటెక్‌ సీఎస్‌ఈ సర్టిఫికెట్‌తో కొలువులు సొంతం చేసుకుంటే సగటున రూ.నాలుగు లక్షల వేతనం ఖాయం. ప్రాజెక్ట్‌ మేనేజర్, డెవలపర్, డిజైనర్, టెస్టర్, బ్యాక్‌ ఎండ్‌ డెవలపర్‌ వంటి జాబ్‌ ప్రొఫైల్స్‌ లభిస్తున్నాయి.

టాప్‌ జాబ్‌ ప్రొఫైల్‌

తాజా రిక్రూట్‌మెంట్‌ ట్రెండ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే..యాప్‌ డెవలప్‌మెంట్‌.. టాప్‌10 రిక్రూటింగ్‌ ప్రొఫైల్స్‌ జాబితాలో నిలుస్తోంది. ఇది ఈ విభాగంలో పెరుగుతున్న అవకాశాలకు నిదర్శనంగా పేర్కొనొచ్చు. ముఖ్యంగా కోవిడ్‌ సమయంలో.. దాదాపు అన్ని రంగాల్లోని సంస్థలూ ఆన్‌లైన్‌ బాట పట్టడం, ఇందుకోసం యాప్‌లను ప్రధాన మార్గంగా ఎంచుకోవడంతో గత రెండేళ్లుగా టాప్‌10 రిక్రూటింగ్‌ ప్రొఫైల్స్‌ జాబితాలో నిలిచింది. రానున్న రోజుల్లోనూ ఇదే ధోరణి కొనసాగనుందని పలు రిక్రూటింగ్, స్టాఫింగ్‌ సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

చ‌ద‌వండి: Robotics and AI: పది లక్షల ఉద్యోగాలకు వేదిక‌... రూ. 12 లక్షల వార్షిక వేతనం 

మొబైల్‌ యాప్‌.. ముఖ్యాంశాలు

  • టెలికం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ అంచనా ప్రకారం 2024 చివరికి యాప్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో 1.5 లక్షల కొలువులు.
  • ప్రపంచంలో యాప్‌ డెవలప్‌మెంట్‌లో అగ్రస్థానంలో నిలుస్తున్న భారత్‌.
  • నిర్దిష్ట నైపుణ్యాలతో సగటున రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వేతనం.
  • ప్రోగ్రామింగ్, కోడింగ్‌ లాంగ్వేజ్‌లపై పట్టుతో నైపుణ్యాలు పెంచుకునే అవకాశం
  • పలు ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు.
Published date : 29 Aug 2022 04:09PM

Photo Stories