Coding and Programming Jobs: కోడింగ్‌తో కొలువులు.. నైపుణ్యాలు, సొంతం చేసుకునేందుకు మార్గాలు..
కోవిడ్ మహమ్మారి.. జాబ్ మార్కెట్‌ను కుదేలు చేసింది. దాదాపు అన్ని రంగాల్లోనూ..నూతన నియామకాల్లో కోతలు.. ఉద్యోగుల తొలగింపు.. సంస్థల మూసివేత.. ఇదంతా గతం!! ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతున్నాయి. సంస్థల కార్యకలాపాలు పూర్వ స్థితికి చేరుకున్నాయి. మరోవైపు డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యం పెరుగుతోంది. దీంతో జాబ్ మార్కెట్‌లో డిజిటల్ నైపుణ్యాలకు డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా.. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), ఎంఎల్(మెషిన్ లెర్నింగ్), సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, కోడింగ్ నిపుణులకు సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. జాబ్ మార్కెట్‌లో తాజా ట్రెండ్స్, అవసరమవుతున్న నైపుణ్యాలు, సొంతం చేసుకునేందుకు మార్గాలపై ప్రత్యేక కథనం...
- ఏఐ, ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, అనలిటిక్స్, కోడింగ్‌లో హైరింగ్ హవా
- అన్ని రంగాల్లో ఆధునిక నైపుణ్యాలకు డిమాండ్
- డిజిటల్ కార్యకలాపాలు పెరగడమే కారణం అంటున్న నిపుణులు
కరోనా మహమ్మారి అనంతర పరిస్థితుల్లో వర్చువల్ కార్యకలాపాలకు డిమాండ్ పెరుగుతోంది. కంపెనీలు డిజిటలైజేషన్æప్రక్రియ నిర్వహించేందుకు వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, కోడింగ్ విభాగాల్లో నియామకాలు చేపడుతున్నాయి. టెక్నికల్ నేపథ్యం ఉన్న అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశంగా చెప్పొచ్చు. లేటెస్ట్ టెక్ నైపుణ్యాలను సొంతం చేసుకుంటే.. ఉజ్వల కెరీర్ అవకాశాలు ఖాయం అంటున్నారు నిపుణులు.
చదవండి: TCS National Qualifier Test: ఎన్‌క్యూటీతో టీసీఎస్ కొలువు..
డిజిటల్ బాట
- ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటాఅనలిటిక్స్, కోడింగ్ విభాగాల్లో నియామకాల వృద్ధికి ప్రధాన కారణం.. సంస్థలూ డిజిటల్ బాట పట్టడమే! వాస్తవానికి కోవిడ్ పరిస్థితులు మొదలైనప్పటి నుంచి సంస్థలు తమ కార్యకలాపాలను డిజిటల్ విధానంలో నిర్వహించడం ప్రారంభించాయి. ఇదే పంథాను ఇప్పుడూ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం మరింత ఆటోమేషన్ దిశగా అడుగులు వేస్తున్నాయి.
- ఎడ్‌టెక్ సెక్టార్‌లో.. వర్చువల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ వంటివి అందుబాటులోకి వచ్చాయి.
- ఫిన్‌టెక్, బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ కార్యకలాపాలు పెరుగుతున్నాయి.యూపీఐ పేమెంట్స్ ద్వారా వినియోగదారులు బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లకుండానే తమకు అవసరమైన సేవలు పొందుతున్నారు.
- ఆరోగ్య రంగంలోనూ రోబోటిక్ ప్రాసెస్ విధానంలో శస్త్రచికిత్సలు చేస్తున్న పరిస్థితి తెలిసిందే.
ఏఐకు ప్రాధాన్యం
నేడు టెక్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)అత్యంత కీలకంగా మారుతోంది. ఏఐ ద్వారా అప్పటికే రూపొందించిన నిర్దిష్ట ప్రోగ్రామింగ్‌తో మానవ ప్రమేయం లేకుండానే కార్యకలాపాలను సులువుగా పూర్తి చేసే అవకాశం ఉంది. దీంతో కస్టమర్ డేటా అనాలిసిస్ నుంచి కోర్ తయారీ వరకు.. అన్ని రంగాల్లోనూ ఏఐ ఆధారిత కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. ఉదాహరణకు.. స్పీచ్ టు టెక్స్‌ట్, గూగుల్ ట్రాన్స్‌లేట్ వంటి వాటిని ఏఐ ఆధారిత కార్యకలాపాలకు నిదర్శనంగా చెప్పొచ్చు. మరోవైపు..కోర్ సెక్టార్స్‌లో సైతం ఏఐ ఆధారిత రోబోటిక్స్, 3–డి డిజైన్ ప్రింటింగ్,డ్రైవర్ లెస్ కార్లు వంటివి ఆవిష్కృతమవుతున్నాయి. ఇలా..ప్రతి రం గంలోనూ.. ఏఐ అత్యంత ఆవశ్యకంగా మారింది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంలో ఏఐ కార్యకలాపాలు విస్తృతం అవుతున్నాయి. క్లయింట్ సంస్థలకు వేగంగా సేవలు, ప్రొడక్ట్‌లు అందించే క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కార్యకలాపాలకు ఐటీ సంస్థలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. పలు సంస్థల్లో ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ఐవీఆర్‌ఎస్, ఆన్‌లైన్ చాట్ వంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలే.
చదవండి: Tech Skills: ఎథికల్ హ్యాకింగ్‌లో పెరుగుతున్న డిమాండ్.. అర్హతలు, నైపుణ్యాలు..
ఏఐ.. నైపుణ్యాలు పెంచుకోవాలంటే
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలు సొంతం చేసుకోవడానికి ఇప్పుడు అనేక మార్గాలు అందుబాటులోకి వచ్చాయి.
- ఐఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రత్యేకంగా ఏఐ–ఎంఎల్ స్పెషలైజేషన్‌తో బీటెక్,పీజీ డిప్లొమా స్థాయి కోర్సులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది.
- ⦁ ఐబీఎం, ఇంటెల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఏఐలో ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి. వీటి కాల వ్యవధి నెల రోజుల నుంచి నాలుగు నెలల వరకు ఉంటోంది. వీటిని పూర్తి చేసుకుని సంబంధిత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే.. జాబ్ మార్కెట్‌లో మంచి గుర్తింపు లభిస్తోంది. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనూ పలు స్వల్పకాలిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
మెషిన్ లెర్నింగ్
ప్రస్తుతం డిమాండింగ్ జాబ్స్‌లో ముఖ్యమైనది.. మెషిన్ లెర్నింగ్. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో భాగమే. ఎందుకంటే.. మెషిన్ లెర్నింగ్‌లోనూ మానవ ప్రమేయం లేకుండా కార్యకలాపాల నిర్వహణ జరుగుతుంది. మెషిన్ లెర్నింగ్ మరో ప్రత్యేకత.. ప్రోగ్రామ్‌లను కంప్యూటర్లే స్వయంగా రాసుకునే సామర్థ్యం ఉండటం. దీనికి ఆరంభ దశలో మానవ ప్రమేయం అవసరం. మెషిన్ లెర్నింగ్‌కు అవసరమైన ప్రత్యేక అల్గారిథమ్స్‌ను రూపొందించి..సిస్టమ్స్‌లో నిక్షిప్తం చేస్తారు. వీటి ఆధారంగా భవిష్యత్తులో సదరు సిస్టమ్స్, సంబంధిత అంశాలను స్వయంగా విశ్లేషించడం, ప్రోగ్రామింగ్, నిర్ణయాలు తీసుకోవడం చేస్తాయి.
చదవండి: Industry 4.0 Skills: బీటెక్ తర్వాత వెంటనే కొలువు కావాలంటే.. ఈ 4.0 స్కిల్స్ ఉండాల్సిందే!
ఎంఎల్ స్కిల్స్‌కు మార్గాలు
ప్రస్తుతం మెషిన్ లెర్నింగ్ నైపుణ్యాలు సొంతం చేసుకోవడానికి కూడా ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. మెషిన్ లెర్నింగ్‌లో కెరీర్ కోరుకునే అభ్యర్థులు తొలుత కంప్యూటర్ బేసిక్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ నైపుణ్యాలను పెంచుకోవాలి. మ్యాథమెటికల్ స్కిల్స్, కంప్యుటేషనల్ స్కిల్స్, డేటా మోడలింగ్, సాఫ్ట్‌వేర్ డిజైన్, డెవలప్‌మెంట్ వంటి వాటి బేసిక్‌పై పట్టు సాధిస్తే.. మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, కోడింగ్, ప్రోగ్రామింగ్ పరంగా మరింత మెరుగ్గా రాణించే అవకాశం ఉంటుంది. ఈ నైపుణ్యాలను అందించేలా ఐబీఎం, సిస్కో, అమెజాన్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలు సర్టిఫికేషన్ కోర్సులను ప్రవేశపెట్టాయి. అలాగే పలు ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంటెక్ స్థాయిలో ఏఐ/ఎంఎల్ స్పెషలైజేషన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఆన్‌లైన్ సర్టిఫికేషన్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. ఐబీ ఎం; ఇంటెల్, సిస్కో, అమెజాన్ లెర్నింగ్, సింప్లీ లెర్న్, కోర్స్ ఎరా, ఉడాసిటీ, ఎడెక్స్‌లలో మూక్స్ విధానంలో మెషిన్ లెర్నింగ్‌ను అభ్యసించే అవకాశం ఉంది.
చదవండి: Cyber Security: ఈ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే... జాబ్ గ్యారెంటీ!
సైబర్ సెక్యూరిటీ
కరోనా అనంతర పరిస్థితుల్లో డిమాండ్ నెలకొన్న మరో విభాగం..సైబర్ సెక్యూరిటీ. డిజిటలైజేషన్, ఆటోమేషన్ ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో.. అంతే వేగంతో హ్యాకింగ్, సైబర్ అటాక్స్ వంటివి కూడా పెరుగుతున్నాయి. డిజిటల్ కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలు.. తమ ఆన్‌లైన్ సేవలు, వెబ్ సైట్స్ హ్యాకర్ల బారిన పడకుండా సైబర్ సెక్యూరిటికీ ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకోసం సైబర్ నిపుణులను నియమించుకుంటున్నాయి. ఈ విభాగంలో నైపుణ్యాలు ఉన్న వారికి రూ.లక్షల వేతనంతో కొలువులు ఆఫర్ చేస్తున్నాయి. ప్రధానంగా.. డేటాసెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ, ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్యూరిటీ మానిటరింగ్, ఐటీ సెక్యూరిటీ విభాగాల్లో నిపుణుల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి.
- సైబర్ సెక్యూరిటీలో నైపుణ్యాలు సొంతం చేసుకోవడానికి.. పలు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సీసీఎన్‌ఏ సెక్యూరిటీ;సీసీఎన్‌పీ సెక్యూరిటీ; సీసీఐఈ సెక్యూరిటీ;ఈసీ కౌన్సిల్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్,ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లు సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తున్నాయి.
డేటా అనలిటిక్స్
- డిజిటల్ యుగం,ఆటోమేషన్ నేపథ్యంలో.. మరో కీలక విభాగం డేటా అనలిటిక్స్. సంస్థలు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వస్తు,సేవలు అందించేందుకు ఉపయోగపడుతునన మార్గం.. డేటాఅనలిటిక్స్. అంటే.. వినియోగదారుల అభిరుచులు, వారి కొనుగోలు ఆసక్తులు, అంతకుముందు కాలంలో వారు ఎక్కువగా కొనుగోలు చేసిన ఉత్పత్తుల సమాచారాన్ని క్రోడీకరించేందుకు డేటా అనలిటిక్స్ కీలకంగా నిలుస్తోంది. ఇలా విస్తృతమైన డేటాను విశ్లేషించి.. ఉపయుక్తమైన ప్యాట్రన్స్ గుర్తించి.. దాని ఆధారంగా కంపెనీలు వ్యాపార నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీంతో డేటా అనలిటిక్స్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా ఐటీ, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ అభ్యర్థులకు డేటా అనలిటిక్స్ అద్భుతమైన కెరీర్ అవకాశంగా మారుతోంది.
డేటా అనలిటిక్స్.. నైపుణ్యాలు ఇలా..
డేటా ఆధారంగా ఒక వ్యాపార నిర్వహణకు సంబంధించిన ప్రజెంటేషన్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ , క్వాంటిటేటివ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ స్కిల్స్, చక్కటి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, విభిన్న టెక్నాలజీలపై అవగాహన పెంచుకోవాలి. పైథాన్, సీ++, ఎస్‌క్యూఎల్, పెర్ల్, ఆర్, జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్ వంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ తెలిసి ఉండాలి. ఐటీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథ«మెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ/పీజీ చేసిన డేటా అనలిస్టులకు ప్రస్తుతం కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. డేటా అనాలిసిస్, డేటా మేనేజ్‌మెంట్‌కు సంబంధించి పలు సర్టిఫికేషన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
చదవండి: Career Opportunities: సైబర్ సెక్యూరిటీ.. భవితకు భరోసా!
కోడింగ్.. ఎనీ వేర్
- ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను వినియోగిస్తూ.. నిర్దిష్టంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే కోడింగ్ నిపుణుల అవసరం పెరుగుతోంది. ఇలా కోడింగ్ స్క్రిప్ట్ ఆధారంగా నిర్దిష్టంగా ఒక బ్రౌజర్‌లో లక్షిత వినియోగదారులు,క్లయింట్లకు సులువుగా సేవలందించొచ్చు. ప్రస్తుతం ఐటీ రంగంలో అత్యధిక శాతం కొలువులు కోడింగ్ ప్రొఫైల్‌లోనే ఉంటున్నాయి. వీటిని అందిపుచ్చుకునేందుకు కోడింగ్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆయా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో పట్టు సాధించాల్సిన ఆవశ్యకత నెలకొంది. ప్రస్తుతం పైథాన్, జావా, ఆర్, పీహెచ్‌పీ, స్విఫ్ట్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌కు మార్కెట్లో డిమాండ్ కనిపిస్తోంది. వీటితోపాటు హెచ్‌టీఎంఎల్, సీ++, ఎస్‌క్యూఎల్ వంటివి కూడా కొలువుల సాధనలో కీలకంగా గుర్తింపు పొందుతున్నాయి.
- కోడింగ్ నైపుణ్యాలు సొంతం చేసుకోవడానికి అభ్యర్థులకు పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. జావా, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, రెడ్ హ్యాట్, ఐబీఎం, జెట్ కింగ్ వంటి సంస్థలు కోడింగ్ స్కిల్స్ సమ్మిళితంగా ఉండే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. ఆన్‌లైన్ విధానంలోనూ వీటిని నేర్చుకునే అవకాశం ఉంది. వీటిలో వర్చువల్ క్లాస్ రూమ్స్,లైవ్ లెక్చర్స్,వర్చువల్ లేబొరేటరీస్ అందుబాటులో ఉంటున్నాయి. మరోవైపు.. ఏఐ–ఎంఎల్,ఐఓటీ బ్రాంచ్‌లతో పూర్తి స్థాయి బీటెక్ కోర్సులను పలు ఇన్‌స్టిట్యూట్స్ అందిస్తున్నాయి.
నాన్–టెక్నికల్ స్కిల్స్
ఆటోమేషన్, సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి టెక్ జాబ్స్ ప్రొఫైల్స్‌లో నియామకాలు చేపడుతున్న సంస్థలు.. అభ్యర్థుల నుంచి నాన్–టెక్నికల్ స్కిల్స్‌ను కూడా కోరుకుంటున్నాయి. ప్రధానంగా ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంటరాక్షన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివ్ థింకింగ్‌లకు ప్రాధాన్యమిస్తున్నాయి. సర్వీస్ సెక్టార్‌లో ఉన్న సంస్థలు.. మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో నియామకాలకు వీటిని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అదే విధంగా ఐటీ ప్రొఫైల్స్‌లోనూ క్లయింట్స్‌తో సంప్రదింపులు చేసే విధంగా నెగోషియేషన్ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టితో పరిశీలన చేస్తున్నాయి.
హైరింగ్స్‌లోనూ.. ఏఐ
ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థల హెచ్‌ఆర్ విభాగాలు కూడా ఆటోమేషన్ బాట పడుతున్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్లకు వచ్చిన దరఖాస్తులను డేటా అనలిటిక్స్ ద్వారా వడపోసి..ఆ తర్వాత దశలోనూ వర్చువల్ ఇంటర్వ్యూలు నిర్వహించి తమ అవసరాలకు సరితూగే వారిని గుర్తిస్తున్నాయి. అదే విధంగా పెర్ఫార్మెన్స్ అప్రైజల్,వర్క్ డిస్ట్రిబ్యూషన్ వంటి కీలక అంశాల్లో సైతం ఆటోమేషన్‌ను అనుసరిస్తున్నాయి.
చదవండి: Robotics and AI: పది లక్షల ఉద్యోగాలకు వేదిక... రూ. 12 లక్షల వార్షిక వేతనం
నిరంతరాయంగా
ఆటోమేషన్ ఆధారిత కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగనున్నాయి. దీనికి కారణం.. వినియోగదారుల్లోనూ డిజిటైజేషన్‌పై అవగాహన పెరగడమే. సేవలను వేగంగా అందించడం, డోర్ స్టెప్ సర్వీసెస్ వంటి విధానాలను సంస్థలు కొనసాగించనున్నాయి. ఫలితంగా రానున్న రోజుల్లో ఈ విభాగాల్లో నియామకాలు ఏటేటా వృద్ధి చెందుతాయి. ఇప్పటి నుంచే ఈ నైపుణ్యాలు సొంతం చేసుకోవడంతోపాటు.. అప్‌డేట్ అవ్వాలి. ఇలా చేస్తే జాబ్ మార్కెట్ పోటీలో ముందంజలో నిలవడం ఖాయం.
–రమేశ్ లోగనాథన్, ప్రొఫెసర్, ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్