Skip to main content

Tech Skills: ఎథికల్‌ హ్యాకింగ్‌లో పెరుగుతున్న డిమాండ్‌.. అర్హతలు, నైపుణ్యాలు..

డిజిటల్‌ యుగం.. సంస్థల కార్యకలాపాల నిర్వహణ అంతా వెబ్‌సైట్లు, కంప్యూటర్ల ఆధారంగా ఆన్‌లైన్‌లోనే జరుగుతోంది! ఇప్పుడు ఏ రంగంలో చూసినా.. ప్రతి కంపెనీకి సొంత వెబ్‌సైట్‌ తప్పనిసరిగా మారింది. కస్టమర్లకు, క్లయింట్లకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విధానంలో సంస్థలు సేవలు అందిస్తున్నాయి! ఇదే అదనుగా ఆయా సంస్థల వెబ్‌సైట్స్‌పై సైబర్‌ దాడులు పెరుగుతున్న పరిస్థితి! ర్యాన్సమ్‌వేర్, మాల్‌వేర్, ఫిషింగ్‌.. ఇలా నిత్యం సైబర్‌ దాడులు! వీటి బారి నుంచి తమ విలువైన సమాచారాన్ని కాపాడుకోవటం సంస్థలకు కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సైబర్‌ దాడుల నుంచి రక్షణ కోసం కంపెనీలు ఎథికల్‌ హ్యాకింగ్‌ వైపు దృష్టి పెడుతున్నాయి. దాంతో ఎథికల్‌ హ్యాకింగ్‌ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. ఎథికల్‌ హ్యాకింగ్‌ అంటే ఏమిటి.. జాబ్‌ మార్కెట్‌లో ఎథికల్‌ హ్యాకింగ్‌ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌.. అవసరమైన అర్హతలు, నైపుణ్యాలపై ప్రత్యేక కథనం...
 Tech Skills: Ethical Hacking Professionals, Necessary Qualifications, Skills
Tech Skills: Ethical Hacking Professionals, Necessary Qualifications, Skills
  • డిజిటల్‌ యుగంలో ఎథికల్‌ హ్యాకర్లకు పెరుగుతున్న డిమాండ్‌
  • సైబర్‌ దాడుల నుంచి రక్షణకు.. ఎథికల్‌ హ్యాకర్ల నియామకం
  • సైబర్‌ సెక్యూరిటీ స్కిల్స్‌ పెంచుకోవడమే అవకాశాలకు మార్గం

ఎలాంటి అనుమతులు లేకుండా కంప్యూటర్‌లోని సమాచారాన్ని తస్కరించడాన్ని హ్యాకింగ్‌ అంటారు. ఎథికల్‌ హ్యాకింగ్‌ అంటే.. నిర్దిష్టంగా ఒక కంప్యూటర్‌ లేదా వెబ్‌సైట్‌కు సంబంధించి వాటి యజమానుల అనుమతితోనే యాక్సెస్‌ చేసి.. అందులోని డేటాను,ఇతర సాంకేతిక అంశాల భద్రతను తెలుసుకోవడం! ఒక ప్రోగ్రామ్‌ను రూపొందించాక.. దాన్ని అందుబాటులోకి తెచ్చే ముందే సదరు ప్రోగ్రామ్‌ను హ్యాకింగ్‌ చేయడం.. అలా హ్యాకింగ్‌ చేయడానికి వీలు కల్పిస్తున్న అంశాలను పరిశీలించి.. వాటిని సదరు యజమానులకు తెలియజేయడాన్ని ఎథికల్‌ హ్యాకింగ్‌ అంటారు.అంటే.. హ్యాకింగ్‌కు పూర్తి భిన్నమైన విధానంగా ఎథికల్‌ హ్యాకింగ్‌ను పేర్కొనొచ్చు. మున్ముందు హ్యాకింగ్‌కు గురికాకుండా కంప్యూటర్‌ ఎంత సురక్షితంగా ఉంది.. దానిలో ఎలాంటి లోపాలు ఉన్నాయి.. వాటిని ఎలా సరిచేయాలి.. అనే ప్రక్రియలు ఎథికల్‌ హ్యాకింగ్‌లో భాగంగా ఉంటాయి. వీటిని నిర్వర్తించే నిపుణులనే ఎథికల్‌ హ్యాకర్లుగా పిలుస్తారు.

పెరుగుతున్న డిమాండ్‌

  • ప్రస్తుతం అన్ని రంగాల్లోని సంస్థలు కంప్యూటర్లు, వెబ్‌సైట్ల ఆధారంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సదరు సంస్థలు వారి ప్రొడక్ట్‌లు, సేవలకు అనుగుణంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్స్‌ను, ప్రోగ్రామ్స్‌ను రూపొందిస్తున్నాయి. వాటి పటిష్టతను, సెక్యూరిటీ ఫీచర్స్‌ను పరీక్షించేందుకు ఎథికల్‌ హ్యాకర్లను నియమించుకుంటున్నాయి. ఫలితంగా వీరికి జాబ్‌ మార్కెట్లో డిమాండ్‌ పెరుగుతోంది. 
  • ఇప్పుడు అన్ని సంస్థలు సమాచార భద్రత కోరుకుంటున్నాయి. దాంతో సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు, ఎథికల్‌ హ్యాకర్లకు విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. నాస్‌కామ్, పీడబ్ల్యూసీ, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ తదితర సంస్థల అంచనా ప్రకారం–2022 చివరి నాటికి దేశంలో పది లక్షల మంది సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఉంటుంది.

ఈ రంగాల్లో అధికంగా

  • పలు సంస్థల అంచనా ప్రకారం–ప్రస్తుతం బీపీఓ, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఐటీ రంగాలు ఎథికల్‌ హ్యాకర్ల నియామకాల్లో ముందంజలో నిలుస్తున్నాయి. 
  • ఇటీవల కాలంలో డిజిటల్‌ ఇండియా మిషన్‌లో భాగంగా ప్రభుత్వ కార్యకలాపాలు సైతం ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. దాంతో ఎథికల్‌ హ్యాకర్లకు ప్రభుత్వ కొలువులు కూడా లభిస్తున్నాయి. ప్రధానంగా రక్షణ రంగం, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు, ఫోరెన్సిక్‌ విభాగాలు, ఆర్థిక రంగం, ఐటీ శాఖల్లో ఎథికల్‌ హ్యాకింగ్‌ నిపుణులకు డిమాండ్‌ నెలకొంది. 

ఈ నైపుణ్యాలు కీలకం
ఎథికల్‌ హ్యాకింగ్‌ విభాగంలో స్థిరపడాలనుకునే వారు ప్రధానంగా కొన్ని నైపుణ్యాలు పెంచుకోవాలి. వీరికి కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌ నాలెడ్జ్‌ సంపూర్ణంగా ఉండాలి. జావా, సీ++ వంటి కంప్యూటర్‌ అప్లికేషన్లపై పూర్తి పట్టు అవసరం. కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ‘యూనిక్స్‌’పై పరిజ్ఞానం సంపాదించాలి. తార్కిక ఆలోచనా విధానం, విశ్లేషణాత్మక వైఖరి ఉండాలి. సైబర్‌ దాడుల గురించి తెలుసుకోవడం, దానికి సంబంధించి హ్యాకర్లు అవలంబిస్తున్న విధానాలను పసిగట్టే పరిశీలన నైపుణ్యాలు ఎంతో కీలకంగా మారుతున్నాయి.

ఎథికల్‌ హ్యాకర్లు.. విధులు
నెట్‌వర్క్‌ వ్యవస్థలో భద్రత లోపాలను గుర్తించడం, వాటికి పరిష్కారాలను సిద్ధం చేయడం.. సదరు వెబ్‌సైట్‌ లేదా ప్రోగ్రామింగ్‌ రూపకర్తలకు నివేదిక ఇవ్వడం వంటివి ఎథికల్‌ హ్యాకర్ల ముఖ్యమైన విధులుగా చెప్పొచ్చు. ఎథికల్‌ హ్యాకింగ్‌ విభాగంలో అడుగుపెట్టిన వారికి సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్, వెబ్‌ సెక్యూరిటీ మేనేజర్, వెబ్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ సిస్టమ్స్‌ మేనేజర్‌ తదితర కొలువులు లభిస్తున్నాయి.

చ‌ద‌వండి: Cyber Security: ఈ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే... జాబ్‌ గ్యారెంటీ!
 

‘సైబర్‌’ సెక్యూరిటీ ఆదరవుగా
సైబర్‌ దాడులను నుంచి తప్పించుకోవడానికి ముందు జాగ్రత్తగా ఎథికల్‌ హ్యాకింగ్‌వైపు దృష్టి పెడుతున్నప్పటికీ.. ఇందులో రాణించడానికి సైబర్‌ సెక్యూరిటీ నైపుణ్యాలే ఆదరవుగా మారుతున్నాయి. డేటా సెక్యూరిటీ; అప్లికేషన్‌ సెక్యూరిటీ; ఇన్సిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ సెక్యూరిటీ మానిటరింగ్‌ స్కిల్స్‌ కీలకంగా నిలుస్తున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు...

డేటా సెక్యూరిటీ
సైబర్‌ సెక్యూరిటీలో అత్యంత ప్రాధాన్యం కలిగిన విభాగంగా డేటా సెక్యూరిటీని పేర్కొనొచ్చు. సంస్థలు ఆన్‌లైన్‌లో సేవలు అందించే క్రమంలో.. డేటా మేనేజ్‌మెంట్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తాయి. ఆయా సంస్థల క్లయింట్‌లు, యూజర్లకు సంబంధించిన వివరాలు, తాము వారికి అందిస్తున్న సర్వీసులకు సంబంధించిన డేటాను భద్రంగా నిక్షిప్తం చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవడం కూడా తప్పనిసరే. ఇలా డేటా నిక్షిప్తం, అప్‌డేట్‌ సమయంలో చిన్నపాటి తప్పిదం జరిగినా.. హ్యాకర్ల చేతిలో చిక్కినట్లే. క్షణాల్లో ఈ వివరాలన్నీ హ్యాకింగ్‌కు గురవుతాయి. కాబట్టి డేటా వివరాలను పటిష్టంగా నిర్వహించడం, డేటాను ఇతరులు యాక్సెస్‌ చేసే వీలు లేకుండా చూసే విభాగం.. డేటా సెక్యూరిటీ.

ఇన్సిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ సెక్యూరిటీ మానిటరింగ్‌
ఇది పూర్తిగా కోర్‌ డొమైన్స్‌కు సంబంధించిన విభాగంగా చెప్పొచ్చు. సంస్థలు సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చిన సమాచారంలో మార్పుచేర్పులు, భద్రత విషయంలో తీసుకోవాల్సిన చర్యలను సదరు ప్రోగ్రామర్స్‌/సంస్థలకు సూచించే నైపుణ్యాలు లభిస్తాయి. 

అప్లికేషన్‌ సెక్యూరిటీ
సాఫ్ట్‌వేర్‌ సర్వీసులు హ్యాకింగ్‌కు గురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఇందుకు ప్రాథమిక స్థాయిలోనే భద్రత విధానాలు రూపొందించడమే.. అప్లికేషన్‌ సెక్యూరిటీ. ఒక ప్రోగ్రామ్‌ను రూపొందించే క్రమంలో అప్లికేషన్‌ సమయంలోనే పటిష్టమైన భద్రత విధానాలు, వాటి నైపుణ్యాలు అందించే విభాగం ఇది. 

ఐటీ సెక్యూరిటీ
సైబర్‌ సెక్యూరిటీ పరంగా మరో ప్రధాన విభాగం.. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సెక్యూరిటీ. ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టడం, సురక్షిత అప్లికేషన్స్‌ను రూపొందించడం వంటి కార్యకలాపాలను ఐటీ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌ నిర్వహిస్తారు. హ్యాకింగ్‌ చేసిన డొమైన్‌ /ఐపీ వివరాలు; ఎక్కడ నుంచి హ్యాక్‌ చేశారు అనే విషయాలు గుర్తించడం; హ్యాకింగ్‌ క్రమంలో సదరు సంస్థ వెబ్‌సైట్‌లో హ్యాకర్లు అప్‌లోడ్‌ చేసిన ఫేక్‌ అంశాలను గుర్తించి తొలగించడం వంటివి చేస్తారు. లాన్‌(లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌) సెక్యూరిటీ; సర్వర్‌ సెక్యూరిటీ; రూటర్‌ సెక్యూరిటీ; డిజిటల్‌ సెక్యూరిటీ విభాగాల్లోనూ ఐటీ సెక్యూరిటీ నిపుణుల అవసరం పెరుగుతోంది.

నైపుణ్యాలు పొందాలంటే
సైబర్‌ సెక్యూరిటీ, ఎథికల్‌ హ్యాకింగ్‌.. ఐటీ డొమైన్‌ సబ్జెక్ట్‌లు చదివిన వారికి అనుకూలంగా ఉంటాయని భావిస్తారు. ఇందులో కొంత వాస్తవమున్నప్పటికీ.. ఇతర అకడమిక్‌ నేపథ్యాల విద్యార్థులు కూడా ఈ విభాగాల్లో రాణించే అవకాశం ఉంది. సంప్రదాయ డిగ్రీ విద్యార్థులు సైతం సైబర్‌ సెక్యూరిటీ సంబంధిత కోర్సుల్లో చేరి.. సాంకేతిక అంశాల పరంగా, ముఖ్యంగా ఇంటర్నెట్, డేటా మేనేజ్‌మెంట్‌/ఇన్ఫర్మేషన్, ఎథికల్‌ హ్యాకింగ్‌ తదితర అంశాల్లో పట్టు సా«ధించడం ద్వారా కొలువులు సొంతం చేసుకోవచ్చు. అయితే వీరికి ఇంటర్నెట్, డేటా ఇన్ఫర్మేషన్, వాటి ప్రాధాన్యతకు సంబంధించి స్పష్టత ఉండాలి.

అకడమిక్‌గా మార్గాలు
సైబర్‌ సెక్యూరిటీ, ఎథికల్‌ హ్యాకింగ్‌ నైపుణ్యాలను అకడమిక్‌ స్థాయిలోనే అందుకునే అవకాశం ఉంది. సైబర్‌ సెక్యూరిటీ/ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లను రూపొందించాలని ఏఐసీటీఈ, యూజీసీలు సైతం తమ పరిధిలోని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లకు సూచిస్తున్నాయి. దాంతో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాచిలర్‌ స్థాయి నుంచే సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించిన కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఐఐటీలు, టెక్నికల్‌ యూనివర్సిటీల్లో బీటెక్‌ స్థాయిలోనే సైబర్‌ సెక్యూరిటీని మైనర్‌ కోర్సుగా అభ్యసించే అవకాశం ఉంది.

ఆకర్షణీయ వేతనాలు
ప్రస్తుతం మన దేశంలో ఎంట్రీ లెవల్‌(ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌ హోదా);మిడిల్‌ లెవల్‌(మేనేజర్‌ హోదా); సీనియర్‌ లెవల్‌; సీనియర్‌ లెవల్‌లోనే మరో రెండు హోదాలు.. సెక్యూరిటీ అడ్వయిజర్స్, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్స్‌..ఇలా వివిధ స్థాయిల్లో నియామకాలు జరుగుతున్నాయి.ఎంట్రీ లెవల్‌లో రూ.30 వేలతో కెరీర్‌ ప్రారంభించొచ్చు. ఆ తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా మూడేళ్లలోనే నెలకు రూ. 50 వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది.

సర్టిఫికేషన్లు తప్పనిసరి

  • సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో ప్రవేశించడానికి జనరల్‌ డిగ్రీ మొదలు, ఐటీ ప్రొఫెషనల్స్‌ వరకు అందరూ అర్హులే. ఈ విభాగంలో ప్రత్యేకంగా శిక్షణనిచ్చే సర్టిఫికేషన్లు ఉన్నాయి. 
  • సిస్కో సంస్థ అందించే సీసీఎన్‌ఏ సెక్యూరిటీ; సీసీఎన్‌పీ సెక్యూరిటీ; సీసీఐఈ సెక్యూరిటీ; వెబ్‌సైట్‌: www.cisco.com
  • EC కౌన్సిల్‌ నిర్వహించే సర్టిఫైడ్‌ ఎథికల్‌ హ్యాకర్‌; వెబ్‌సైట్‌: www.eccouncil.org
  • ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ కోర్సులు; వెబ్‌సైట్‌: www.iisecurity.in
  • డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ అందించే సర్టిఫికేషన్‌ కోర్సులు; వెబ్‌సైట్‌: www.dsci.in

చ‌ద‌వండి: Career Opportunities: సైబర్‌ సెక్యూరిటీ.. భవితకు భరోసా!

Published date : 09 Mar 2022 12:35PM

Photo Stories