Technology Jobs: బ్లాక్‌చైన్ డెవలపర్.. ఐబీఎం, అసెంచర్ వంటి కంపెనీల్లో ఉద్యోగం.. లక్షల్లో వేతనం..
బ్లాక్‌చైన్ టెక్నాలజీకి ఇటీవలి కాలంలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దాంతో బ్లాక్‌చైన్ నిపుణులకు మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడుతోంది. బ్లాక్ చైన్ టెక్నాలజీని డిజిటల్ సమాచారాన్ని భద్రపరచడానికి ఉపయోగిస్తారు. క్రిప్టో కరెన్సీ, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ రంగాల్లో దీని వినియోగం ఎక్కువైంది. డిజిటల్ కరెన్సీ వార్తల నేపథ్యంలో ఈ టెక్నాలజీ మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ అంటే ఏమిటి.. దీని ఉపయోగాలేవి.. డిమాండ్ పెరగడానికి కారణాలు.. బ్లాక్‌చైన్ టెక్నాలజీతో అందుబాటులో ఉన్న అవకాశాలపై ప్రత్యేక కథనం...
బ్లాక్ చైన్ అంటే
డబ్బు, వస్తువులు తదితర సమాచారాన్ని ఎలక్ట్రానిక్, డిజిటల్ ఫార్మాట్‌లో, కంప్యూటర్ నెట్‌వర్క్‌లో సురక్షితంగా నిల్వ చేయడానికి ఉపయోగించే సాంకేతికతే.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ. ఇలా నిల్వ చేసిన సమాచారాన్ని, డేటాను సవరించడానికి వీలుండదు. తద్వారా రికార్డు చేసిన డేటా లావాదేవీలన్నీ భద్రంగా ఉంటాయి.
ఎందుకు సురక్షితం
టేబుల్స్ రూపంలో సమాచారాన్ని భద్రపరిచే ఇతర డేటాబేస్‌లకు భిన్నంగా బ్లాక్‌చైన్ ఉంటుంది. దీనిలో ‘బ్లాక్స్’ రూపంలో సమాచార సేకరణ జరుగుతుంది. ఈ బ్లాక్‌లు డేటాతో నిండినప్పుడు అవి సవరించడానికి వీలులేకుండా మూతపడతాయి. ఇలా
బ్లాక్‌లన్నీ మునుపటి బ్లాక్‌కు అనుసంధానమవుతూ..బ్లాక్‌చైన్ అనే డేటా గొలుసు ఏర్పరుస్తాయి.
బ్లాక్‌చైన్ ఉపయోగాలు
- ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్‌లను బ్లాక్‌చైన్ టెక్నాలజీ సహాయంతో సదరు విద్యాసంస్థల్లోని రికార్డులతో పోల్చి ధ్రువీకరించవచ్చు. తద్వారా నకిలీ సర్టిఫికెట్‌ల తయారీని అడ్డుకోవచ్చు.
- మెరుగైన ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంలను సృష్టించడంలో బ్లాక్‌చైన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. డేటా వికేంద్రీకరణతో విద్యార్థులు, అధ్యాపకులు రియల్‌టైమ్‌లో సమాచారాన్ని పంచుకోవడానికి వీలు కల్పిస్తోంది. విద్యార్థులు సురక్షితంగా స్టడీ మెటీరియల్‌ను యాక్సెస్ చేయడానికి దోహదపడుతుంది.
- బ్లాక్‌చైన్ టెక్నాలజీతో కాపీరైట్, డిజిటల్ హక్కుల ఉల్లంఘన నుంచి రక్షణ పొందొచ్చు.
డెవలపర్‌కు నైపుణ్యాలు
- ఆబ్జెక్ట్–ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్, వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్,బ్లాక్‌చైన్, బిట్‌కాయిన్‌లపై అవగాహన, గో, జావా, సీ ప్లస్‌ప్లస్, సీయాష్, ఆండ్రాయిడ్/ఐవోఎస్ డెవలప్‌మెంట్‌లలో నైపుణ్యం సాధిస్తే.. సీ++ లేదా గో డెవలపర్‌గా పనిచేయొచ్చు.
- ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మంచి ప్రావీణ్యం, వాలెట్‌లు, ఐసీవో(ఇనీషియల్ కాయిన్ ఆఫరింగ్స్)లలో అనుభవం, వికేంద్రీకృత అనువర్తనాల ను సృష్టించే సామర్థ్యం, పైథాన్ లేదా జావాస్క్రిప్ట్ వంటి వెబ్ ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం ఉన్నవారు ఎథిరియం డెవలపర్‌గా అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
- ఐసీవో(ఇనీషియల్ కాయిన్ ఆఫరింగ్స్)లలో సాంకేతిక పరిజ్ఞానం, స్మార్ట్ కాంట్రాక్టులతో పనిచేసిన అనుభవం, ఎథిరియం పరీక్షలను సృష్టించడంపై నైపుణ్యం ఉన్నవారు డెవలపర్‌గా రాణించొచ్చు.
చదవండి: Blockchain Jobs: బ్లాక్‌చైన్ టెక్నాలజీ నిపుణులకు డిమాండ్.. అవసరమైన నైపుణ్యాలు ఇవే...
కెరీర్ అవకాశాలు
బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో మాత్రమే కాకుండా.. ఆరోగ్య సంరక్షణ, విద్య, సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, స్టాక్ ట్రేడింగ్, రియల్ ఎస్టేట్, ప్రభుత్వ విభాగాల్లోనూ బ్లాక్ చైన్ అవసరం ఏర్పడుతోంది. కాబట్టి బ్లాక్‌చైన్ డెవలపర్‌గా కెరీర్ సొంతం చేసుకోవాలనుకునేవారికి ఇది మంచి సమయం. ప్రతి ఐదుగురు బ్లాక్‌చైన్ డెవలపర్‌లలో సంస్థల అవసరాలకు తగిన విధంగా అర్హతలు కలిగిన వారు ఒకరు మాత్రమే ఉన్నారు. కాబట్టి ఈ డొమైన్‌లో నైపుణ్యాలు సాధిస్తే అవకాశాలకు కొదవలేదు. ఐబీఎం, అసెంచర్, క్యాప్‌జెమినీ మొదలైన ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. బ్లాక్‌చైన్ ఇంజనీర్‌లకు ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరం కంటే 57శాతం డిమాండ్ పెరిగింది.
రెట్టింపు వేతనాలు
సంప్రదాయ డెవలపర్ ఉద్యోగాల కంటే బ్లాక్‌చైన్ నిపుణులు దాదాపు రెట్టింపు వేతనాలు అందుకుంటున్నారు. పరిశ్రమలకు తగిన సామర్థ్యాలు అందిపుచ్చుకుంటే బ్లాక్‌చైన్ డెవలపర్‌లు లక్షల్లో వేతనాలు పొందొచ్చు. పని చేసే సంస్థ, ప్రాంతం, అనుభవం
ఆధారంగా బ్లాక్‌చైన్ ఇంజనీర్ల ఆదాయం మారుతూ ఉంటుంది.
చదవండి: Career Opportunities: సైబర్ సెక్యూరిటీ.. భవితకు భరోసా!