Skip to main content

Prompt Engineering: ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌!.. స‌రికొత్త కెరీర్‌ మార్గంగా ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌..

ఆధునిక టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. చాట్‌ జీపీటీ, ఏఐతో క్షణాల్లో కోరుకున్న సమాచారం ప్రత్యక్షమవుతోంది. ఇదే ఇప్పుడు యువతకు సరికొత్త కెరీర్‌ అవకాశాలకు మార్గం వేస్తోంది. ఆ అవకాశాల పేరే.. ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌! ఇందులో నైపుణ్యాలుంటే నేటి ఏఐ యుగంలో.. ఎవర్‌గ్రీన్‌ కెరీర్స్‌ సొంతం చేసుకోవచ్చు!! ఇటీవల కాలంలో.. సంస్థల్లో ఏఐ విభాగాల్లో..ప్రాంప్ట్‌ ఇంజనీర్స్‌ నియామకాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌ అంటే ఏమిటి.. వీరికి ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయి.. ఇందులో రాణించేందుకు ఎలాంటి నైపుణ్యాలు కావాలి.. వాటిని అందుకోవడానికి మార్గాలు తదితర అంశాలపై విశ్లేషణ..
prompt engineering course guidance  Key skills for prompt engineering   Types of industries hiring prompt engineers for AI applications.

ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌ అంటే

ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌.. ఇటీవల కాలంలో సాఫ్ట్‌వేర్‌ రంగంలో తరచూ వినిపిస్తున్న మాట! దీంతో అసలు ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌ అంటే ఏమిటి? అనే ప్రశ్న ఎదురవుతుంది. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ సంస్థలు ఏఐ ఆధారిత సేవలు అందిస్తున్నాయి. అదే సమయంలో వ్యక్తులు సైతం తమకు అవసరమైన సమాచారం కోసం చాట్‌ జీపీటీ, గూగుల్‌ సెర్చ్‌ తదితర టూల్స్‌ను వినియోగిస్తున్నారు. 
పాఠకులు అడిగే ప్రశ్నలు, సందేహాలకు చాట్‌ జీపీటీ, ఏఐ టూల్స్‌ క్షణాల్లో సమాధానాలు ఇస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మనం అడిగే ప్రశ్నలు లేదా సమాచారం ఇన్‌పుట్‌ సరిగా లేకపోతే కచ్చితత్వంతో కూడిన సమాధానం లభించదు. దీంతో సంబంధిత వ్యక్తులు గందగగోళానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. దీనికి పరిష్కారంగా తెరపైకి వచ్చిన సాంకేతికతే.. ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌.

చదవండి: ఇంజనీరింగ్‌ - జాబ్ గైడెన్స్ | ప్రాజెక్ట్ గైడెన్స్ | సక్సెస్ స్పీక్స్ | గెస్ట్ స్పీక్స్ | న్యూస్

కచ్చితమైన సమాచారం

వ్యక్తులు లేదా వినియోగదారులు ఏఐ టూల్స్‌ వినియోగించి అడిగే ప్రశ్నలకు కచ్చితమైన సమాచారాన్ని ఇచ్చే విధంగా సదరు టూల్స్‌ను తీర్చిదిద్దడమే.. ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌ ప్రత్యేకత. ఒక విభాగానికి సంబంధించి వినియోగదారులు ఎలాంటి ప్రశ్నలు అడగొచ్చు? ఏ భాషలో ప్రశ్నలు అడిగితే ఎలా స్పందించాలి? ఎలాంటి ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇవ్వాలి? తదితర అంశాలను ముందుగానే గుర్తించి.. దానికి అనుగుణంగా ఏఐ టూల్స్‌ను సమర్థవంతంగా తీర్చిదిద్దడమే ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌. అంటే.. ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌ ద్వారా కచ్చితత్వంతో కూడిన సమాధానాలను వినియోగదారులకు అందిస్తారు. ఉదాహరణకు ఒక సంస్థ చాట్‌బోట్‌ ద్వారా కస్టమర్‌ సపోర్ట్‌ సేవలు అందిస్తే.. ఆ సేవలు, ఉత్పత్తులకు సంబంధించి సరైన సమాచారాన్ని ఇచ్చే విధంగా ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌ నైపుణ్యం ఉపయోగపడుతుంది. అందుకే ఇప్పుడు సంస్థలు ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌కు, అందులో నైపుణ్యాలున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ఏఐ టూల్స్‌ డిజైనింగ్‌

ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌లో మరో ముఖ్యమైన అంశం.. ప్రాంప్ట్స్‌కు సంబంధించి ఏఐ టూల్స్‌ డిజైనింగ్, స్ట్రక్చరింగ్, ప్రోగ్రామింగ్, కోడింగ్‌లను రూపొందించడం. ఇందులో నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్, నేచురల్‌ లాంగ్వేజ్‌ అండర్‌ స్టాండింగ్‌ వంటివి వినియోగిస్తారు. ఆయా భాషలకు సంబంధించిన అంశాలను లోతుగా విశ్లేషిస్తారు. వీటన్నింటి ద్వారా ఏఐ మోడల్స్‌ ఆధారంగా వినియోగదారులు అడిగే ప్రశ్నలకు కచ్చితత్వంతో కూడిన సమాచారం, సమాధానం ఇచ్చేలా సదరు ఏఐ టూల్స్‌ను రూపొందిస్తారు.

చదవండి: IIT-Madras Announced New Course: ఐఐటీ మద్రాస్ లో కొత్త కోర్సు

కీలక నైపుణ్యాలు

ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌లో కెరీర్‌ కోరుకునే వారికి రెండు నైపుణ్యాలు కీలకంగా మారుతున్నాయి. అవి..ప్రోగ్రామింగ్, డేటా అనాలిసిస్‌. ఎందుకంటే.. ఆయా ప్రాంప్ట్‌లకు సంబంధించి ఏఐ టూల్స్‌ సమర్థంగా పని చేయాలంటే.. అందుకు తగిన సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌ను రూపొందించాల్సి ఉంటుంది. అదే విధంగా.. సదరు సంస్థలకు సంబంధించిన సేవలు, ఉత్పత్తులు, వినియోగదారుల డేటాను విశ్లేషించాల్సి ఉంటుంది. ఈ విశ్లేషణ ఆధారంగా ఆయా ఉత్పత్తులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని రూపొందించడానికి వీలవుతుంది. అందుకే డేటా అనాలిసిస్‌ నైపుణ్యాలు ప్రాంప్ట్‌ ఇంజనీర్‌గా కెరీర్‌ కోరుకునే వారికి ఎంతో కీలకంగా మారుతున్నాయి. ప్రోగ్రామింగ్, డేటా అనాలిసిస్‌ స్కిల్స్‌తోపాటు ఆయా భాషలపై పరిజ్ఞానం, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, టీమ్‌ వర్కింగ్‌ స్కిల్స్‌ ఉంటే ప్రాంప్ట్‌ ఇంజనీర్‌గా మరింత సమర్థవంతంగా రాణించే అవకాశం ఉంటుంది.

సీఎస్‌ఈ విద్యార్థులకు అనుకూలం

ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌లో కెరీర్‌ కోరుకునే వారికి అకడమిక్‌గా టెక్నికల్‌ నేపథ్యం ఉంటే మరింత సు­లువుగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. కంప్యూటర్‌ సైన్స్, డేటా సైన్స్, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌లలో బీటెక్‌ ఉత్తీర్ణులు ఈ జాబ్‌ ప్రొఫైల్‌కు సరితూగుతారని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే వీరికి అకడమిక్‌గా ప్రోగ్రామింగ్, కోడింగ్‌పై అవగాహన ఉంటుంది. దీంతో ప్రాంప్ట్స్‌ రూపకల్పనలో ముందంజలో నిలిచే ఆస్కారం ఉంటుంది.

సర్టిఫికేషన్స్‌

ప్రాంప్ట్‌ ఇంజనీర్‌గా కెరీర్‌ కోరుకునే వారు నిర్దేశిత సర్టిఫికేషన్స్‌ పూర్తి చేయడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. నెట్‌వర్క్‌ సెక్యూరిటీ ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్, సర్టిఫైడ్‌ సెలీనియం ప్రొఫెషనల్, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్, యాక్సెసబిలిటీ టెస్టింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్, పైథాన్, డేటా సైన్స్‌ వంటి విభాగాల్లో సర్టిఫికేషన్స్‌ పూర్తి చేసుకుంటే.. ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌లో మరింత సమర్థవంతంగా రాణించేందుకు వీలవుతుంది. ప్ర­స్తుతం ఈ కోర్సులను ఉడెమీ, కోర్సెరా వంటి సంస్థలు అందిస్తున్నాయి. అదే విధంగా పలు ఐటీ సంస్థలు తమ సిబ్బందికి అంతర్గత శిక్షణ ద్వారా ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌ స్కిల్స్‌పై అవగాహన కల్గిస్తున్నాయి. 

విస్తృత అవకాశాలు

ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఏఐ టెక్నాలజీ, చాట్‌బోట్, ఇతర వర్చువల్‌ అసిస్టెంట్‌ టూల్స్‌ వినియోగం పెరుగుతోంది. దీంతో ప్రాంప్ట్‌ ఇంజనీర్స్‌కు కెరీర్‌ అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయి. ఏఐ కాంట్రాక్ట్‌ రివ్యూ ఫర్మ్స్, ఫిన్‌టెక్, ఎడ్‌ టెక్, సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఎక్కువగా ఉద్యోగాలు అందుకునే వీలుంది.

ఆకర్షణీయ వేతనాలు

ప్రాంప్ట్‌ ఇంజనీర్లకు సంస్థలు ఆకర్షణీయ వేతనాలను అందిస్తున్నాయి. ఎంట్రీ లెవల్‌లో ఏడాదికి రూ.6 లక్షల వరకు; రెండు నుంచి అయిదేళ్ల అనుభవంతో మిడిల్‌ లెవల్‌లో కనిష్టంగా రూ.6 లక్షలు–గరిష్టంగా రూ.12 లక్షల వార్షిక వేతనం పొందే అవకాశం ఉంది. అయిదేళ్లకు పైగా అనుభవంతో సీనియర్‌ లెవల్‌లో గరిష్టంగా రూ.20 లక్షల వరకు వార్షిక వేతనం సొంతం చేసుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలో సగటున 2.3 లక్షల డాలర్ల వార్షిక వేతనంతో ప్రాంప్ట్‌ ఇంజనీర్లను సంస్థలు నియమించుకుంటున్నాయి.

పెరుగుతున్న డిమాండ్‌

ప్రాంప్ట్‌ ఇంజనీర్లకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్‌ పెరుగుతోంది. లింక్డ్‌ఇన్‌ సర్వే ప్రకారం–ఈ ఏడాది చివరికి చాట్‌బోట్, చాట్‌ జీపీటీ, ఇతర మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ను వినియోగించే వారి సంఖ్య 2.5 బిలియన్లకు చేరుకోనుంది. ఆయా సంస్థలు ప్రాంప్ట్‌ ఇంజనీర్లను భారీ స్థాయిలో నియమించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఏఐ విభాగంలో ప్రాంప్ట్‌ ఇంజనీర్ల భాగస్వామ్యం పెరుగుతోందని, గత రెండేళ్లలో ప్రాంప్ట్‌ ఇంజనీర్ల నియామకం 51 శాతం పెరిగిందని ఓ ప్రముఖ సర్వే పేర్కొంది.

టాప్‌ కెరీర్స్‌ జాబితాలో

ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌ టాప్‌–5 కెరీర్స్‌ జాబితాలో నిలుస్తోంది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం విడుదల చేసిన ఫ్యూచర్‌ ఆఫ్‌ జాబ్స్‌ ప్రకారం–గత ఏడాది సరికొత్త ఉద్యోగావకాశాల్లో నెంబర్‌ 1 జాబ్‌గా ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌ విభాగాన్ని పేర్కొంది. 2025 నాటికి ఏఐ నియామకాల్లో ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో 30 శాతం మేరకు ఉద్యోగాలు ఉంటాయని వెల్లడించింది.

ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌.. సర్టిఫికేషన్స్‌

నెట్‌వర్క్‌ సెక్యూరిటీ ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌; సర్టిఫైడ్‌ సెలీనియం ప్రొఫెషనల్‌; సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌; యాక్సెసబిలిటీ టెస్టింగ్‌; ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింVŠ ;పైథాన్,డేటా సైన్స్‌.

అవసరమైన నైపుణ్యాలు

డేటా అనాలిసిస్, ప్రోగ్రామింగ్‌ స్కిల్స్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నైపుణ్యాలు, నేచురల్‌ లాంగ్వేజ్‌ స్కిల్స్, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్, నేచురల్‌ లాంగ్వేజ్‌ అండర్‌ స్టాండింగ్‌ స్కిల్స్, రీసెర్చింగ్‌ స్కిల్స్‌. 

Published date : 26 Dec 2024 03:48PM

Photo Stories