Skip to main content

IIT Jobs: ఐఐటీల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌.. ఏడాదికి రూ.2కోట్లకు పైగా వేత‌నం..

iit campus placement News and Updates: Know Highest Salary Package here
iit campus placement News and Updates: Know Highest Salary Package here

ఐఐటీలు.. దేశంలో ఇంజనీరింగ్‌ విద్యను అందించడంలో పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లు. ఈ విద్యాసంస్థల్లో చదువుకున్న ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా టాప్‌ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారు. అందుకే కార్పొరేట్‌ సంస్థలకు ఐఐటీల విద్యార్థులు హాట్‌ కేక్‌లుగా మారుతున్నారు. ప్రస్తుతం ఐఐటీల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ప్రక్రియ కొనసాగుతోంది. సంస్థలు ఆకర్షణీయ వేతనాలతో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ ఏడాది గరిష్ట ప్యాకేజీ రూ.2కోట్లకు పైగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో.. ఐఐటీల్లో ప్లేస్‌మెంట్స్‌ ట్రెండ్స్, నియామక విధానాలు, హాట్‌ జాబ్‌ ప్రొఫైల్స్‌పై ప్రత్యేక కథనం.. 

 • కంపెనీలకు హాట్‌ కేక్‌లుగా ఐఐటీల విద్యార్థులు
 • జోరుగా తొలి దశ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌
 • గరిష్టంగా రూ.2కోట్లకు పైగా వేతనాలతో ఆఫర్లు
 • పలువురు విద్యార్థులకు డబుల్‌ ఆఫర్స్‌ బొనాంజ

ఐఐటీల్లో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్స్‌ ప్రతి ఏటా డిసెంబర్‌లో ప్రారంభమై.. తదుపరి ఏడాది మార్చి వరకు కొనసాగుతాయి. డిసెంబర్‌లో నిర్వహించే డ్రైవ్స్‌ను తొలి దశగా పేర్కొంటారు. రెండో దశ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ జనవరిలో జరుగుతాయి. ఈ ఏడాది తొలి దశలోనే 80 శాతం మేరకు నియామకాలు ఖరారు కావడం విశేషం. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సంస్థలు ఆన్‌లైన్‌ విధానంలోనే ఎంపిక ప్రక్రియ నిర్వహించాయి. వర్చువల్‌ ఇంటర్వ్యూలు, గ్రూప్‌ డిస్కషన్స్‌ ద్వారా ఆఫర్స్‌ ఖరారు చేశాయి.

చ‌ద‌వండి: Engineering Careers

డబుల్‌ ధమాకా

ఐఐటీలంటే ప్లేస్‌మెంట్స్‌కు ఢోకా ఉండదు. కాని గతేడాది కరోనా పరిణామాల కారణంగా.. ఆఫర్లలో జాప్యం, ప్యాకేజీల్లో కొంత తటపటాయింపు జరిగింది. ప్రస్తుతం 2021–22కు సంబంధించి మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపించింది. కార్పొరేట్‌ కంపెనీలు ఐఐటీ విద్యార్థులకు ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించాయి. వేతన ప్యాకేజ్‌లు కూడా భారీగా ఉన్నాయి. అంతేకాకుండా దాదాపు అన్ని ఐఐటీల్లోనూ సగటున 30శాతం మంది విద్యార్థులకు డబుల్‌ ఆఫర్లు లభించాయి. 

గరిష్టంగా రూ.2.4 కోట్లు

 • డిసెంబర్‌ 1వ తేదీన ప్రారంభమైన తొలి దశ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో.. గరిష్టంగా రూ.2.4 కోట్ల ప్యాకేజ్‌తో ఇంటర్నేషనల్‌ ఆఫర్లు లభించాయి. ఈ ఘనతను ఐఐటీ ఖరగ్‌ పూర్‌ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. బీటెక్, ఎంటెక్, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌.. ఇలా అన్ని కోర్సులు కలిపి దాదాపు 1100 మంది విద్యార్థులున్న ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తొలి దశలోనే 80 శాతం మందికి కొలువులు ఖాయం అయ్యాయి. 
 • ఐఐటీ రూర్కీకి చెందిన విద్యార్థులకు రూ.2.15 కోట్ల ప్యాకేజ్‌తో ఇంటర్నేషనల్‌ ఆఫర్స్‌ లభించాయి. ఇతర ఐఐటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. 
 • ఐఐటీ ఢిల్లీలో 35 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ఆఫర్లు దక్కాయి. వార్షిక వేతనం రూ.2. కోట్లు–రూ.2.4 కోట్ల మధ్యలో ఉంది. 
 • ఐఐటీ ముంబైలో.. 48 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ఆఫర్లు లభించంగా.. గరిష్ట వేతనం రూ.2.05 కోట్లుగా నమోదైంది.
 • ఐఐటీ గువహటిలో 28 మంది విద్యార్థులకు ఇంటర్నేషనల్‌ ఆఫర్లు సొంతమయ్యాయి. ఇక్కడ కూడా గరిష్ట వేతనం రూ.2.05 కోట్లుగా నమోదైంది. సగటు వేతనం రూ.1.2 కోట్లుగా ఉంది. 
 • ఐఐటీ–చెన్నైలో.. 45 మందికి పైగా విద్యార్థులకు ఇంటర్నేషనల్‌ ఆఫర్లు లభించాయి. ఈ ఇన్‌స్టిట్యూట్‌లోనూ గరిష్ట వేతనం రూ.2కోట్లుగా నమోదైంది. 

డొమెస్టిక్‌ ఆఫర్లలోనూ

ఐఐటీ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌లో.. ఈ ఏడాది డొమెస్టిక్‌ ఆఫర్లు కూడా భారీ స్థాయిలో నమోదయ్యాయి. ముఖ్యంగా గత ఏడాదితో పోల్చుకుంటే సగటున 40 శాతం మేరకు పెరుగుదల కనిపించింది. వేతనాలు సైతం గత సంవత్సరం కంటే 30 నుంచి 40 శాతం మేర పెరిగాయి. అన్ని ఐఐటీల్లోనూ కనిష్టంగా రూ.20 లక్షలు, గరిష్టంగా రూ.కోటి, సగటున రూ.40 లక్షల వేతనంతో ఆఫర్లు లభించాయి.
 

చ‌ద‌వండి: Engineering Guest Speaks

పెరిగిన కంపెనీల సంఖ్య

 • ఐఐటీ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొన్న కంపెనీల సంఖ్య సైతం ఈ ఏడాది భారీగానే పెరిగింది. ఇంటర్నేషనల్, డొమెస్టిక్‌ రెండూ కలిపి గత ఏడాదితో పోల్చితే 40 నుంచి 50 శాతం మేర వృద్ధి నమోదైంది. ఐఐటీ చెన్నైలో 45 శాతం, ఐఐటీ ఢిల్లీలో 48 శాతం ,ఐఐటీ–ముంబైలో 40 శాతం, ఐఐటీ–హైదరాబాద్‌లో 40 శాతం మేర పెరుగుదల కనిపించింది. 
 • ఈ ఏడాది ఐఐటీ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్స్‌లో.. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, ట్విటర్, ఉబెర్‌ వంటి బహుళ జాతి సంస్థలు మొదలు జొమాటో, వేదాంతు, మీషో వంటి స్టార్టప్‌ కంపెనీల వరకూ... దాదాపు 150 వరకు సంస్థలు క్యాంపస్‌ ఆఫర్లు అందించాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌ తదితర సంస్థలు తమ అంతర్జాతీయ ప్రధాన కేంద్రాలతోపాటు.. మన దేశంలోని ఆపరేషన్‌ సెంటర్లలోనూ ఉద్యోగాలు కల్పించాయి.

టాప్‌ జాబ్‌ ప్రొఫైల్స్‌

ఐఐటీల క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో లభించిన జాబ్‌ ప్రొఫైల్స్‌ను చూస్తే.. అధిక శాతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, నెట్‌వర్క్స్‌ తదితర విభాగాల్లోనే ఉన్నాయి. వీటితోపాటు ఐటీ విభాగంలో.. ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్‌ ప్రొఫైల్స్‌కు డిమాండ్‌ కొనసాగింది. అదే విధంగా బ్యాంకింగ్, ఫైనాన్స్,ఈ–కామర్స్, లాజిస్టిక్స్, ఎడ్‌టెక్‌ సంస్థలు సైతం క్యాంపస్‌ ఆఫర్లు ఇచ్చాయి. వీటిలోనూ అధిక శాతం అనలిటిక్స్, ఏఐ విభాగాల్లోనే ఉన్నాయి.

‘కోర్‌’ బ్రాంచ్‌ల సంగతి?

కోర్‌ బ్రాంచ్‌లుగా పేర్కొనే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్‌ తదితర విభాగాల విద్యార్థులకూ ఈ ఏడాది పరిస్థితులు అనుకూలంగా కనిపించాయి. శాంసంగ్‌ ఇండియా, ఎల్‌ అండ్‌ టీ, టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్, బజాజ్‌ ఆటో, మారుతి సుజికి, మహీంద్రా గ్రూప్, ఓఎన్‌జీసీ వంటి తయారీ సంస్థలు ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొని ఆఫర్లు కల్పించాయి. కోర్‌ సెక్టార్‌లో ప్రధానంగా ప్రొడక్ట్‌ డిజైనర్, ప్రొడక్ట్‌ అనలిస్ట్‌ ఉద్యోగాలు లభించాయి.

కారణం అదే

ఈ ఏడాది ఐఐటీ విద్యార్థులకు తొలి దశలోనే భారీగా ఆఫర్లు లభించడానికి కారణం ఏంటి? అంటే.. కంపెనీల కార్యకలాపాలు కరోనా పూర్వ స్థాయికి చేరుకోవడమే అంటున్నాయి ఐఐటీల క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ వర్గాలు. కొత్త పంథాలో వ్యాపార ప్రణాళికలు రూపొందిస్తున్న సంస్థలు.. అందుకు తగిన సంఖ్యలో నిపుణుల నియామకానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా కంపెనీలన్నీ ఏఐ ఆధారితంగా కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తున్నాయి. అందుకే రోబోటిక్స్, ఏఐ–ఎంఎల్‌ విభాగాల్లో అధిక నియామకాలు జరిపినట్లు భావిస్తున్నారు. 

చ‌ద‌వండి: Engineering News

ఐఐటీ–హైదరాబాద్‌ హవా

ఐఐటీ–హైదరాబాద్‌లో ఈ ఏడాది క్యాంపస్‌ డ్రైవ్స్‌ హవా కొనసాగింది. ఈ క్యాంపస్‌లో మొత్తం 427 మంది విద్యార్థులకు 446 ఆఫర్లు లభించాయి. వీరిలో 34 మంది ఇంటర్నేషనల్‌ ఆఫర్లు సొంతం చేసుకున్నారు. సగటు వేతనం రూ.1.5 కోట్లుగా నమోదైంది. డొమెస్టిక్‌ ఆఫర్లు కూడా భారీగానే లభించాయి. దేశీయ ఆఫర్లలో గరిష్ట వేతనం రూ. 65 లక్షలుగా, సగటు వేతనం రూ.23 లక్షలుగా ఉంది. ఈ క్యాంపస్‌లో 10 స్టార్టప్‌ సంస్థలు పాల్గొని.. 36 ఆఫర్లు ఇవ్వడం గమనార్హం. అదే విధంగా ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌ ప్రారంభించిన ఎంటెక్‌ ఇంటర్‌ డిసిప్లినరీ ప్రోగ్రామ్‌ తొలి బ్యాచ్‌ విద్యార్థులందరికీ ఉద్యోగాలు లభించాయి.

ఐఐటీలు.. టాప్‌ రిక్రూటర్స్‌

ఈ ఏడాది ఐఐటీల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అడోబ్, ఫ్లిప్‌కార్ట్, ఐటీసీ, హిందుస్థాన్‌ యూనిలివర్, మెర్సిడజ్‌ బెంజ్, క్వాల్‌కామ్, శాప్‌ ల్యాబ్స్, ఇంటెల్‌ టెక్నాలజీస్, జేపీ మోర్గాన్‌.. టాప్‌ రిక్రూటర్స్‌గా నిలిచాయి. ఈ సంస్థలు తదుపరి దశల్లోనూ క్యాంపస్‌ డ్రైవ్స్‌లో పాల్గొని.. మరిన్ని ఆఫర్లు ఇచ్చే అవకాశం ఉందని ఐఐటీల క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆ నైపుణ్యాలు తప్పనిసరి

కంపెనీలు అభ్యర్థుల స్కిల్స్‌ విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదని క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ సెల్స్‌ ప్రతినిధులు పేర్కొంటున్నారు. కోర్‌ నైపుణ్యాలతోపాటు పర్సనల్‌ స్కిల్స్, రియల్‌ టైమ్‌ స్కిల్స్, కమ్యూనికేషన్, లేటెస్ట్‌ టెక్నాలజీపై అవగాహన తదితర విషయాల్లో సునిశిత పరిశీలన చేస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా కంపెనీలు తాము కోరుకునే లేటెస్ట్‌ స్కిల్స్‌ ఉన్న అభ్యర్థులకే అవకాశం కల్పిస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు.

ఐఐటీ క్యాంపస్‌ డ్రైవ్స్‌(2021–22).. ముఖ్యాంశాలు

 • గత ఏడాదితో పోల్చితే దాదాపు రెట్టింపు స్థాయిలో ఆఫర్లు.
 • 80 శాతం పైగా విద్యార్థులకు తొలిదశలోనే నియామకాలు ఖరారు. 
 • సగటున కనిష్టంగా రూ.20 లక్షలు.. గరిష్టంగా రూ.1.10కోట్ల డొమెస్టిక్‌ ప్యాకేజ్‌.
 • సగటున రూ.కోటి.. గరిష్టంగా రూ.2.4 కోట్ల ఇంటర్నేషనల్‌ ప్యాకేజీ.
 • ఏఐ, అనలిటిక్స్, రోబోటిక్స్, నెట్‌వర్క్స్‌లోనే అధిక శాతం జాబ్‌ ప్రొఫైల్స్‌.
 • కోర్‌ సెక్టార్‌లోనూ ఆశించిన స్థాయిలో నియామకాలు.

ఇండస్ట్రీ రెడీ స్కిల్స్‌

ఐఐటీల్లో భారీ ఆఫర్లు రావడానికి ఇండస్ట్రీ రెడీ నైపుణ్యాలు అందేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే కారణం! ఇందుకోసం ఐఐటీలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఐఐటీ హైదరాబాద్‌లో గత రెండేళ్లుగా పలు వినూత్న చర్యలు చేపట్టాం. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పించడం, ఇంటర్‌ డిసిప్లినరీ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ను అందించడం, ఇండస్ట్రీ లెక్చర్స్‌ వంటివి చేశాం. ఫలితంగా విద్యార్థులకు వాస్తవ నైపుణ్యాలు లభించడంతో.. జాబ్‌ మార్కెట్‌లో ముందంజలో నిలిచారు. అన్ని ఐఐటీలు కూడా ఇదే తరహాలో వినూత్న చర్యలు తీసుకుంటున్నాయి. అందుకే ప్లేస్‌మెంట్స్‌ విషయంలో ఐఐటీల విద్యార్థుల పట్ల కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.
–ప్రొ‘‘ బి.ఎస్‌.మూర్తి, డైరెక్టర్, ఐఐటీ–హైదరాబాద్‌


​​​​​​​లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Published date : 14 Dec 2021 06:00PM

Photo Stories