India Post GDS 2023: ఎలాంటి రాత పరీక్షలు లేకుండానే 30,041 పోస్టులు.. ఉద్యోగాల వివరాలు, ఎంపిక విధానం..
- గ్రామీణ్ డాక్ సేవక్ పోస్ట్‌లకు ప్రకటన
- బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ పోస్ట్‌లు
- పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక
- ఏపీలో 1,058; తెలంగాణలో 961 పోస్ట్‌లు
భారత తపాలా శాఖ.. మెట్రో నగరాల నుంచి మారుమూల పల్లెల వరకు సేవలందిస్తోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వినియోగదారులకు సేవలందించేందుకు వినూత్న విధానలను అవలంబిస్తూ శాఖలను విస్తరిస్తోంది.
దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న గ్రామాల పరిధిలోని ప్రజలకు సేవలు అందించే ఉద్దేశంతో.. గ్రామీణ్ డాక్ సేవక్ పోస్ట్‌లకు గతంలోనే రూపకల్పన చేసింది.
ఈ పోస్ట్‌ల్లో నియామకాలకు ప్రతి ఏటా ప్రకటన ఇస్తోంది. తాజాగా 2023కు సంబంధించి గ్రామీణ్ డాక్ సేవక్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్ట్‌ల వివరాలు
గ్రామీణ్ డాక్ సేవక్ పేరిట.. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనుంది. వీరు తమకు కేటాయించిన పోస్ట్ ఆఫీస్ పరిధిలో నిర్దేశిత విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఏపీలో 1,058, తెలంగాణలో 961
తాజా నోటిఫికేషన్ ద్వారా తపాలా శాఖ దేశ వ్యాప్తంగా మొత్తం 30,041 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. వీటిలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 1,058, తెలంగాణ సర్కిల్‌లో 961 పోస్ట్‌లు ఉన్నాయి.
అర్హతలు
- పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లను తప్పనిసరిగా చదివుండాలి. అభ్యర్థులు తమ స్థానిక భాషను చదివుండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, సైక్లింగ్ కూడా అవసరం.
- వయసు: ఆగస్ట్ 23,023 నాటికి 18–40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
పదో తరగతి మెరిట్
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్..ఈ మూడు పోస్ట్‌లకు కూడా పదో తరగతిలో ప్రతిభ ఆధారంగానే నియామకాలు ఖరారు చేస్తారు. పదో తరగతిలో అభ్యర్థులు పొందిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఎలాంటి రాత పరీక్షలు ఉండవు.
ఆకర్షణీయ వేతనం
- బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్‌లకు వేతనాలు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి.
- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌లకు రూ.12,000–రూ.29,380 శ్రేణిలో వేతనం ఉంటుంది. అంటే.. రూ.12 వేల మూల వేతనంతో కెరీర్ ప్రారంభమవుతుంది.
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్‌లకు రూ.10,000 –రూ.24,470 శ్రేణిలో ప్రారంభ వేతనం లభిస్తుంది.
- వీటికి అదనంగా ఈ మూడు పోస్ట్‌లకు డీఏ, అదే విధంగా టైమ్ రిలేటెడ్ కంటిన్యుటీ అలవెన్స్ పేరిట ఇతర భత్యాలు కూడా లభిస్తాయి. మొత్తంగా నెలకు రూ.14 వేలకు పైగా వేతనం పొందొచ్చు.
- వీటితోపాటు ఆఫీస్ నిర్వహణ భత్యం, సైకిల్ నిర్వహణ భత్యం, కంబైన్డ్ డ్యూటీ అలవెన్స్ వంటివి కూడా అందుకునే వీలుంది.
ఆఫీస్ సదుపాయం బాధ్యత
గ్రామీణ్ డాక్ సేవక్‌ల విషయంలో మరో కీలక నిబంధన.. ఈ పోస్ట్‌లకు ఎంపికైన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్.. తమ గ్రామ స్థాయిలో కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి వసతి సదుపాయం చూపించాల్సి ఉంటుంది. ఎంపికైన వారు సంబంధిత గ్రామంలోనే నివాసం ఉండాలనే నిబంధన కూడా విధించారు.
15 రోజుల్లోపు సమ్మతి
ఎంపికైన అభ్యర్థులు.. ఎంపిక జాబితా వెల్లడైన పదిహేను రోజుల్లోపు ఆయా పోస్ట్‌లలో చేరేందుకు తమ సమ్మతిని తెలపాల్సి ఉంటుంది. లేదంటే వారి పేరుని తొలగించి.. ఆ స్థానంలో మెరిట్ జాబితాలోని ఇతర అభ్యర్థులతో మార్కుల ఆధారంగా రెండో జాబితా విడుదల చేస్తారు.
స్వస్థలంలో పని చేసే అవకాశం
గ్రామీణ్ డాక్ సేవక్ పోస్ట్‌లకు ఎంపికైతే తమ స్వస్థలాల్లోనే పని చేసే అవకాశం లభిస్తుంది. అభ్యర్థులు డివిజన్ వారీగా మాత్రమే పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవాలని.. పోస్ట్‌ల వారీగా ప్రాథమ్యతను దరఖాస్తు సమయంలోనే పేర్కొనాలని స్పష్టం చేశారు. ఆయా సర్కిల్స్ పరిధిలో భాష ప్రాతిపదికగా పోస్ట్‌ల సంఖ్యను పేర్కొన్నారు.
దీంతో.. తెలుగు రాష్ట్రాలకు(ఏపీ, తెలంగాణ) చెందిన అభ్యర్థులు ఈ రాష్ట్రాల్లోని డివిజన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది.
విధులు ఇలా
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
ఈ హోదాలో రోజు వారీ తపాలా వ్యవహారాలు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌కు సంబంధించిన విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. తపాలా శాఖ అందిస్తున్న ఉత్పత్తులు, సేవలకు సంబంధించి మార్కెటింగ్, కొత్త కస్టమర్లను చేర్పించడం వంటి బాధ్యతలు సైతం చేపట్టాల్సి ఉంటుంది.
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
ఈ హోదాలో స్టాంపులు,స్టేషనరీ విక్రయం, ఉత్తరాల బట్వాడాతోటు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించి కస్టమర్ల నుంచి డిపాజిట్లు, చెల్లింపులు వంటి విధులు నిర్వర్తించాలి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు సహాయం అందించాలి. అదే విధంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేని సమయాల్లో బీపీఎం విధులను కూడా ఏబీపీఎం నిర్వర్తించాల్సి ఉంటుంది.
డాక్ సేవక్
వీరిని సబ్ పోస్ట్ ఆఫీస్‌లు, హెడ్ పోస్ట్ ఆఫీస్‌లలో నియమిస్తారు. వీరు విధుల్లో భాగంగా స్టాంపులు, స్టేషనరీ విక్రయాలు, అదే విధంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, చెల్లింపులు, ఇతర కార్యకలాపాలను నిర్వర్తించాలి. వినియోగదారులకు వారి నివాసం వద్దే సేవలు అందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు రైల్వే మెయిల్ సర్వీస్‌లోని సార్టింగ్ ఆఫీస్‌లు,మెయిల్ బ్యాగ్స్ పంపడం వంటి విధులు కూడా నిర్వర్తించాలి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 23.08.2023
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు సవరణ అవకాశం: ఆగస్ట్ 24 నుంచి 26 వరకు
- ఎంపిక జాబితా వెల్లడి: 31.12.2023
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://indiapostgdsonline.gov.in/
- ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: https://indiapostgdsonline.gov.in/Reg_validation.aspx
చదవండి: SSC Recruitment 2023: ఇంటర్ అర్హతతో 1207 స్టెనోగ్రాఫర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | August 23,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |