Skip to main content

SSC CPO Preparation Tips: 1,876 ఎస్‌ఐ పోస్టులు.. పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

పోలీస్‌ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త! జాతీయ స్థాయిలో.. కీలకమైన విభాగాల్లో.. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఐ) కొలువు సొంతం చేసుకునే అవకాశం వచ్చింది! స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. ఢిల్లీ పోలీస్‌ విభాగంతోపాటు సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)లో.. మొత్తం 1,876 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. గ్రూప్‌–బి(నాన్‌–గెజిటెడ్‌), గ్రూప్‌–సి హోదాల్లో కొలువు సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌ వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌ తదితర వివరాలు..
SSC CPO Exam Pattern and Syllabus and Preparation Tips
  • ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్‌ దళాల్లో 1,876 ఎస్‌ఐ ఉద్యోగాలు
  • నియామక ప్రకటన విడుదల చేసిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌
  • ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో దరఖాస్తుకు అర్హత
  • మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహణ

మొత్తం 1,876 పోస్టులు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ తాజా నోటిఫికేషన్‌ ద్వారా ఢిల్లీ పోలీస్‌ విభాగంతోపాటు, కేంద్ర హోంశాఖ పరిధిలోని సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌లో మొత్తం 1,876 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందుకోసం రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్ట్‌లు నిర్వహించనుంది.

చ‌ద‌వండి: SSC CPO Notification 2023: 1876 ఎస్‌ఐ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది ఇదే..
 

అర్హతలు

  • ఆగస్ట్‌ 15, 2023 నాటికి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. 
  • వయసు: ఆగస్ట్‌ 1, 2023 నాటికి 20–25 ఏళ్లు ఉండాలి. ఎస్‌సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. 
  • ప్రారంభ వేతన శ్రేణి రూ.35,400–రూ.1,12,400గా ఉంటుంది.

మూడు దశల ఎంపిక ప్రక్రియ
ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్‌ ఎస్‌ఐ పోస్టులకు మూడు దశల్లో ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. అవి.. రాత పరీక్ష(పేపర్‌–1), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌/ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్, రాత పరీక్ష (పేపర్‌–2).

రాత పరీక్ష పేపర్‌–1

  • పేపర్‌–1 పరీక్ష మొత్తం 200 మార్కులకు నాలుగు విభాగాల్లో(జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌) జరుగుతుంది. ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఆన్‌లైన్‌ టెస్ట్‌గా నిర్వహిస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కును తగ్గిస్తారు.

రెండో దశ.. ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌

  • తొలిదశ రాత పరీక్షలో నిర్దేశిత కటాఫ్‌ మార్కులు సాధించిన వారికి రెండో దశలో ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ ఉంటుంది. ఇందులో అర్హత సాధించేందుకు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగుండాలి. 
  • పురుష అభ్యర్థుల కనీస ఎత్తు 170 సెంటీ మీటర్లు ఉండాలి. అదే విధంగా ఛాతీ విస్తీర్ణం 80 సెంటీ మీటర్లు ఉండాలి(శ్వాస పీల్చినప్పుడు 85 సెంటీ మీటర్లకు విస్తరించాలి). మహిళా అభ్యర్థుల కనీస ఎత్తు 157 సెంటీ మీటర్లు ఉండాలి.

చ‌ద‌వండి: Junior Engineer Posts in Central Govt: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌

  • ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌లో నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగిన అభ్యర్థులకు తర్వాత దశలో ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌(పీఈటీ) పేరుతో పలు ఈవెంట్స్‌లో పోటీ నిర్వహిస్తారు. 
  • పరుగు పందెం: పురుష అభ్యర్థులు 100 మీటర్లు పరుగును 16 సెకన్లలో, మహిళా అభ్యర్థులు 18 సెకన్లలో పూర్తి చేయాలి. దీంతోపాటు పురుష అభ్యర్థులు 1.6 కిలో మీటర్ల దూరాన్ని 6.5 నిమిషాల్లో, మహిళా అభ్యర్థులు 800 మీటర్ల పరుగును నాలుగు నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • లాంగ్‌ జంప్‌: పురుష అభ్యర్థులు 3.65 మీటర్ల దూరం,మహిళా అభ్యర్థులకు 2.7 మీటర్ల దూరం
  • హై జంప్‌: పురుష అభ్యర్థులకు 1.2 మీటర్ల ఎత్తు, మహిళలు 0.9 మీటర్ల ఎత్తు.
  • షాట్‌పుట్‌: పురుషులకు మాత్రమే ఈ ఈవెంట్‌ నిర్వహిస్తారు. అభ్యర్థులు 16 ఎల్‌బీ (7.26 కిలోగ్రామ్‌ల)ను 4.5 మీటర్ల దూరం విసరాల్సి ఉంటుంది. 
  • లాంగ్‌ జంప్, హై జంప్, షాట్‌పుట్‌ ఈవెంట్లలో నిర్దేశిత లక్ష్యాలను కనీసం మూడు ప్రయత్నాల్లో పూర్తి చేయాలి.

పేపర్‌–2 రాత పరీక్ష
ఫిజికల్‌ ఈవెంట్స్‌లో అర్హత సాధించిన వారికి పేపర్‌–2 పేరుతో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందు­లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌పై మొత్తం 200 ప్రశ్నలతో 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తా­రు. ఈ పరీక్ష కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటుంది. పరీక్షకు లభించే సమయం రెండు గంటలు.

కొలువు ఖరారు
పేపర్‌–2 పరీక్షలోనూ మెరుగైన ప్రతిభ కనబరిచి తుది జాబితాలో నిలిస్తే.. ఎస్‌ఐ కొలువు ఖాయమైనట్లే! ఢిల్లీ పోలీస్‌ విభాగానికి ఎంపికైన వారికి గ్రూప్‌–సి హోదా, సీఏపీఎఫ్‌ దళాలకు ఎంపికైన వారికి గ్రూప్‌–బి(నాన్‌–గెజిటెడ్‌) హోదా కల్పిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న విభాగం ప్రాథమ్యతలు, వారు పొందిన మార్కులు ఆధారంగా ఆయా విభాగాలకు కేటాయిస్తారు.

శిక్షణలో ఉత్తీర్ణత తప్పనిసరి
నియామకాలు ఖరారు చేసుకుని శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు ఏడు ఫిజికల్‌ ఈవెంట్స్‌కు సంబంధించిన టెస్ట్‌లలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. వెర్టికల్‌ బోర్డ్‌పై జంపింగ్, రోప్‌ జంపింగ్, టార్జాన్‌ స్వింగ్, హారిజంటల్‌ బోర్డ్‌పై జంపింగ్, పార్లెల్‌ రోప్, మంకీ క్రాల్, వెర్టికల్‌ రోప్‌ ఈ వెంట్స్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అప్పుడే వారిని ఆయా దళాల్లో కొలువులకు పంపుతారు

సన్నద్ధత పక్కాగా
ఎంపిక ప్రక్రియలో కీలకమైన రాత పరీక్షలకు అభ్యర్థులు పక్కా ప్రణాళికతో సన్నద్ధత సాగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పేపర్‌–1, పేపర్‌–2లలో కనీస అర్హత మార్కుల నిబంధన ఉంది. అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు 30 శాతం మార్కులు, ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులు 25% మార్కు­లు, ఇతర రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు 20% మార్కు­లు పొందాల్సి ఉంటుంది. అప్పుడే సదరు అభ్యర్థులను తదుపరి దశకు పరిగణనలోకి తీసుకుంటారు.

జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌
ఈ విభాగంలో రాణించేందుకు వెర్బల్, నాన్‌–వెర్బల్‌ రీజనింగ్‌ అంశాలపై పట్టు సాధించాలి. ముఖ్యంగా స్పేస్‌ విజువలైజేషన్, సిమిలారిటీస్‌ అండ్‌ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అనాలిసిస్, విజువల్‌ మెమొరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్‌ సిరిస్, కోడింగ్‌–డీకోడింగ్, నంబర్‌ అనాలజీ, ఫిగరల్‌ అనాలజీ, వర్డ్‌ బిల్డింగ్, వెన్‌ డయాగ్రమ్స్‌ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.

జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌
అభ్యర్థుల్లోని సామాజిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగే విభాగం ఇది. భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌
ఈ విభాగంలో రాణించాలంటే.. ప్యూర్‌ మ్యాథ్స్‌తోపాటు అర్థ గణిత అంశాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా డెసిమల్స్, ఫ్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్‌ రూట్స్, యావరేజెస్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, అల్జీబ్రా, లీనియర్‌ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీలపై పట్టు సాధించాలి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్‌
ఈ విభాగంలో రాణించడానికి.. బేసిక్‌ గ్రామర్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా యాంటానిమ్స్, సినానిమ్స్, మిస్‌–స్పెల్ట్‌ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్‌/ప్యాసివ్‌ వాయిస్, డైరెక్ట్‌ అండ్‌ ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూటషన్స్, ప్యాసేజ్‌ కాంప్రహెన్షన్‌లను ప్రాక్టీస్‌ చేయాలి. బేసిక్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌పై పట్టుతోపాటు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం ఇంగ్లిష్‌ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదివి..అందులోని ముఖ్యాంశాలతో సొంత శైలిలో పరీక్షలో నిర్దేశించిన మాదిరిగా క్రోడీకరించడానికి సాధన చేయాలి.

ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌
ఫిజికల్‌ ఈవెంట్స్‌లో రాణించడానికి.. అభ్యర్థులు రాత పరీక్ష ప్రిపరేషన్‌ దశ నుంచే ఆ దిశగా కృషి చేయాలి. ప్రతిరోజు కనీసం రెండు గంటలు ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌లో పేర్కొన్న అంశాలపై శిక్షణ పొందాలి. ఈ ఫిజికల్‌ ప్రాక్టీస్‌ ఉదయం వేళల్లో చేస్తే శారీరక అలసటకు దూరంగా ఉండొచ్చు. ఇలా దరఖాస్తు సమయం నుంచే సన్నద్ధత పొందితే విజయావకాశాలు మెరుగవుతాయి. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 15.08.2023
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ: ఆగస్ట్‌ 16, 17 తేదీల్లో
  • పేపర్‌–1 రాత పరీక్ష: అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం.
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, చీరాల, విజయనగరం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

 

చ‌ద‌వండి: SSC CPO Notification 2023: 1876 ఎస్‌ఐ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories