Skip to main content

DRDO Recruitment 2022: 630 సైంటిస్ట్‌ కొలువుల వివరాలు, ఎంపిక విధానం, భవిష్యత్తు అవకాశాలు..

DRDO Recruitment 2022 for Scientist Posts full details here

బీటెక్, సైన్సెస్‌లో పీజీ పూర్తి చేశారా.. లేదా చివరి సంవత్సరం చదువుతున్నారా.. గేట్‌ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించారా.. పరిశోధనలతోపాటు కెరీర్‌ అవకాశం కోసం అన్వేషిస్తున్నారా..?! అయితే.. మీకు చక్కటి అవకాశం.. డీఆర్‌డీఓ సైంటిస్ట్‌–బి కొలువులు! ఈ పోస్టును సొంతం చేసుకుంటే.. డీఆర్‌డీఓకు సంబంధించిన పరిశోధన కేంద్రాల్లో.. యుక్తవయసులోనే సైంటిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి.. గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగే అవకాశం లభిస్తుంది!! ఇందుకోసం చేయాల్సిందల్లా.. డీఆర్‌డీఓ–ఆర్‌ఏసీ నిర్వహించే ఎంపిక ప్రక్రియలో విజయం సాధించడమే! తాజాగా.. ఆరు వందలకు పైగా సైంటిస్ట్‌–బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. డీఆర్‌డీవో సైంటిస్ట్‌ కొలువుల వివరాలు, ఎంపిక విధానం, భవిష్యత్తు అవకాశాలు తదితర అంశాలపై విశ్లేషణ...

  • సైంటిస్ట్‌–బి హోదాతో.. 630 ఉద్యోగాలు
  • డీఆర్‌డీఓ–ఆర్‌ఏసీ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ
  • బీటెక్, సైన్స్‌ పీజీ, గేట్‌ స్కోర్‌ ఆధారంగా పోటీ పడే అవకాశం
  • రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభతో విజయం
  • రూ.56,100 మూల వేతనంతో కెరీర్‌ ప్రారంభం

డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనేజేషన్‌(డీఆర్‌డీవో).. దేశ రక్షణ రంగానికి అవసరమైన క్షిపణులు, ఇతర ఆయుధ పరికరాలు, అస్త్రాలకు సంబంధించి నిత్యం పరిశోధనలు చేసే సంస్థ. ఆయా పరిశోధనలకు అవసరమైన మానవ వనరులను నిరంతరం నియమించుకుంటూ ముందుకు సాగుతోంది. పరిశోధనల్లో యువ శాస్త్రవేత్తలకు పెద్దపీట వేస్తోంది. ఏటా సైంటిస్ట్‌–బి హోదాలో కొలువుల భర్తీ చేపడుతోంది. తాజాగా ఈ ఏడాది 630 పోస్ట్‌లతో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

ఆర్‌ఏసీ ఆధ్వర్యంలో.. నియామక ప్రక్రియ

సైంటిస్ట్‌–బి హోదాలో కొలువుల భర్తీకి డీఆర్‌డీఓ శ్రీకారం చుట్టింది. సదరు ఎంపిక ప్రక్రియను డీఆర్‌డీఓలోని రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌ (ఆర్‌ఏసీ)నిర్వహిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ మొదలు చివరి దశ ఇంటర్వ్యూ వరకూ.. అన్నింటిని ఆర్‌ఏసీనే నిర్వహించి..ఎంపికైన అభ్యర్థులకు డీఆర్‌డీఓలో కొలువుదీరేలా నియామకాలు ఖరారు చేస్తుంది.

మూడు సంస్థల్లో.. 630 పోస్టులు

  • తాజా నోటిఫికేషన్‌ ద్వారా.. డీఆర్‌డీఓ సహా మొత్తం మూడు సంస్థల్లో 630 సైంటిస్ట్‌–బి కొలువులను భర్తీ చేయనున్నారు. వీటిలో డీఆర్‌డీఓ–579 పోస్ట్‌లు;
  • డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(డీఎస్‌టీ)–8 పోస్ట్‌లు; ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఏడీఏ)–43 పోస్ట్‌లు ఉన్నాయి. 
  • తాజాగా చేపడుతున్న నియామక ప్రక్రియను రెండు విభాగాలు.. పార్ట్‌–1, పార్ట్‌ –2గా పేర్కొన్నారు. పార్ట్‌–1లో మూడు డిసిప్లిన్స్, పార్ట్‌–2లో 14 సబ్జెక్ట్‌ ఉన్నాయి.

చ‌ద‌వండి: Scientist Jobs: డీఆర్‌డీవో, ఆర్‌ఏసీలో 630 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

అర్హతలు

  • పార్ట్‌ 1కు సంబంధిత బ్రాంచ్‌తో ప్రథమ శ్రేణిలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు గేట్‌(గ్రాడ్యుయేట్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌)లో సంబంధిత పేపర్‌లో ఉత్తీర్ణత ఉండాలి.(లేదా) ఐఐటీ,ఎన్‌ఐటీల విద్యార్థులైతే 80 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచ్‌తో బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
  • పార్ట్‌ 2కు అర్హతలు: ఇంజనీరింగ్‌కు సంబంధించి.. ఆయా బ్రాంచ్‌లతో ప్రథమ శ్రేణిలో బీటెక్‌ ఉత్తీర్ణత సాధించాలి. 
  • ఫిజిక్స్‌కు సంబంధించి ఫిజిక్స్‌ స్పెషలైజేషన్‌తో ప్రథమ శ్రేణిలో పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
  • కెమిస్ట్రీకి సంబంధించి కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌తో పీజీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలి.
  • మ్యాథమెటిక్స్‌కు సంబంధించి మ్యాథ్స్‌ స్పెషలైజేషన్‌తో ప్రథమ శ్రేణిలో పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
  • మెటీరియల్‌ సైన్స్‌కు సంబంధించి ఈ స్పెషలైజేషన్‌తో ప్రథమ శ్రేణిలో పీజీ ఉత్తీర్ణత తప్పనిసరి.
  • అట్మాస్ఫియరిక్‌ సైన్స్‌ అభ్యర్థులు పీజీ స్థాయిలో ఈ సబ్జెక్ట్‌ స్పెషలైజేషన్‌తో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలి.

గేట్‌ అర్హత తప్పనిసరి

ఆయా సబ్జెక్ట్‌లు, విభాగాలకు సంబంధించి బీటెక్, పీజీ కోర్సుల్లో ఉత్తీర్ణతతోపాటు గేట్‌లోనూ ఉత్తీర్ణత సాధించి.. స్కోర్‌ కార్డ్‌ సొంతం చేసుకుని ఉండాలి.

రెండు రకాలుగా ఎంపిక ప్రక్రియ

  • మొత్తం పోస్ట్‌లను పార్ట్‌–1, పార్ట్‌–2గా వర్గీకరించిన నేపథ్యంలో.. ఎంపిక ప్రక్రియను కూడా రెండు వేర్వేరు విధాలుగా నిర్వహించనున్నారు. 
  • పార్ట్‌–1 అభ్యర్థులకు గేట్‌ స్కోర్‌ ఆధారంగా.. రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • పార్ట్‌–2 విభాగాల అభ్యర్థులకు గేట్‌ స్కోర్‌ ఆధారంగా నేరుగా పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూలకు ఎంపిక చేసే క్రమంలో ముందుగా.. గేట్‌లో పొందిన స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి తదుపరి దశలో వారు ఎంపిక చేసుకున్న విభాగం(పార్ట్‌–1/పార్ట్‌–2) ఆధారంగా.. ఒక్కో పోస్ట్‌కు 25 మందిని(1:25 నిష్పత్తిలో) ఆర్‌ఏసీ నిర్వహించే రాత పరీక్ష లేదా పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది.

చ‌ద‌వండి: Research/Scientist

రాత పరీక్ష.. రెండు పేపర్లుగా

పార్ట్‌–1గా పేర్కొన్న సబ్జెక్ట్‌లకు(ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌) జరిపే రాత పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. ఈ పరీక్షను పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు.

పర్సనల్‌ ఇంటర్వ్యూ

రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు 5 మందిని చొప్పున మలి దశలో నిర్వహించే పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. పార్ట్‌–2లో పేర్కొన్న సబ్జెక్ట్‌ విభాగాలకు రాత పరీక్ష ఉండదు. వీరికి గేట్‌ స్కోర్‌ ఆధారంగానే 1:5 నిష్పత్తిలో నేరుగా పర్సనల్‌ ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.

తుది ఎంపికలో వెయిటేజీ

అభ్యర్థులను తుది ఎంపిక చేసే క్రమంలో వెయిటేజీ విధానాన్ని అమలు చేయనున్నారు. రాత పరీక్షలో పొందిన మార్కులకు 80 శాతం, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ కల్పిస్తారు. పార్ట్‌–2 సబ్జెక్ట్‌ విభాగాలకు సంబంధించి గేట్‌ స్కోర్‌కు 80 శాతం, పర్సనల్‌ ఇంటర్వ్యూలో ప్రతిభకు 20 శాతం వెయిటేజీ కల్పిస్తారు. 

ఈఎస్‌ఈ మాదిరిగానే సిలబస్‌

పార్ట్‌–1 సబ్జెక్ట్‌ విభాగాలకు నిర్వహించే రాత పరీక్ష సిలబస్‌.. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) జరిపే ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ మెయిన్‌ ఎగ్జామినేషన్‌ సిలబస్‌ మాదిరిగానే ఉంటుంది. పార్ట్‌–1లోని సబ్జెక్ట్‌లైన.. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌కు సంబంధించి ఈఎస్‌ఈ పాత ప్రశ్న పత్రాలను సాధన చేయడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

అకడమిక్‌ నైపుణ్యాలే సాధనంగా

రాత పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు బీటెక్, పీజీ స్థాయిలో తమ అకడమిక్‌ పుస్తకాల్లోని అంశాలను అధ్యయయనం చేయాలి. ఆయా అంశాలను అప్లికేషన్‌ ఓరియెంటేషన్, ప్రాక్టికల్‌ ఓరియెంటేషన్‌తో చదవడం మేలు చేస్తుంది. సైంటిస్ట్‌ పోస్ట్‌లకు నిర్వహించే ఈ పరీక్షలో అభ్యర్థుల్లోని అన్వయ నైపుణ్యాలను పరిశీలించడానికి ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి అభ్యర్థులు ప్రాక్టికల్‌ స్కిల్స్, అప్లికేషన్‌ అప్రోచ్‌తో ముందుకుసాగడం ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా పరీక్ష డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహించనున్న నేపథ్యంలో..ఈ దృక్పథం ఉపయోగపడుతుంది.

గత ప్రశ్న పత్రాలు

అకడమిక్‌ పుస్తకాలతోపాటు డీఆర్‌డీఓ–ఆర్‌ఏసీ గత నియామక పరీక్షల ప్రశ్న పత్రాలు, గేట్‌ ప్రశ్న పత్రాలు, ఈఎస్‌ఈ ప్రశ్న పత్రాలను సాధన చేయాలి. వీటిద్వారా ప్రశ్నలు అడుగుతున్న తీరు, ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీ, తమ సామర్థ్య స్థాయి తెలుస్తాయి.

ఇంటర్వ్యూ ఇలా

మలిదశలో నిర్వహించే పర్సనల్‌ ఇంటర్వ్యూ.. అభ్యర్థులకు పరిశోధనల పట్ల ఉన్న ఆసక్తిని తెలుసుకునేలా ఉంటుంది. అభ్యర్థులు కెరీర్‌ అవకాశం కోణంలో పరీక్షకు హాజరయ్యారా? లేదా నిజంగానే పరిశోధనల పట్ల ఆసక్తి ఉందా? అని పరిశీలిస్తారు. కాబట్టి అభ్యర్థులు దేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇటీవల కాలంలో జరుగుతున్న పరిశోధనలు, ఆవిష్కరణలపై అవగాహన పెంచుకోవాలి. 

సెక్రటరీ, చైర్మన్‌ల స్థాయికి

‘సైంటిస్ట్‌–బి’ హోదాతో.. గ్రూప్‌–ఎ టెక్నికల్‌ స్థాయిలో కొలువులు సొంతం చేసుకున్న అభ్యర్థులు తమ పనితీరు, ప్రతిభ ఆధారంగా.. భవిష్యత్తులో డిఫెన్స్‌ ఆర్‌ అండ్‌ డీ సెక్రటరీ, చైర్మన్‌ల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. తొలుత సైంటిస్ట్‌–సిగా పదోన్నతి లభిస్తుంది. ఆ తర్వాత సైంటిస్ట్‌–డి, ఈ, ఎఫ్, జి స్థాయిలకు చేరుకోవచ్చు. ఆ తర్వాత సైంటిస్ట్‌–హెచ్‌ హోదాతో ఔట్‌ స్టాండింగ్‌ సైంటిస్ట్‌గా ఉన్నత స్థాయి అందుకోవచ్చు. ఈ హోదాలోనూ చూపిన ప్రతిభ ఆధారంగా డిస్టింగ్విష్డ్‌ సైంటిస్ట్, ఆ తర్వాత డిఫెన్స్‌ ఆర్‌ అండ్‌ డీ సెక్రటరీ, చైర్మన్‌ స్థాయి వరకు ఎదగొచ్చు. 

  • సైంటిస్ట్‌–బి హోదాలో ప్రారంభంలోనే రూ. 56,100–రూ.1,77,500 వేతన శ్రేణిలో నెలకు రూ.88 వేల నికర వేతనం పొందొచ్చు. 

అయిదు నెలల శిక్షణ

సైంటిస్ట్‌–బి హోదాలో నియమితులైన అభ్యర్థులకు పుణెలోని డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలో అయిదు నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో వీరిని ఆఫీసర్‌ ట్రైనీగా పిలుస్తారు. దీనినే ఇండక్షన్‌ ప్రోగ్రామ్‌గానూ పేర్కొంటున్నారు. 

డీఆర్‌డీఓ సైంటిస్ట్‌–బి.. ముఖ్య సమాచారం

  • ఆర్‌ఏసీ ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ.
  • డీఆర్‌డీఓలో 579, డీఎస్‌టీలో 8, ఏడీఏలో 43 పోస్ట్‌లు.
  • అర్హత: ఆయా బ్రాంచ్‌లతో ప్రథమ శ్రేణిలో బీటెక్‌ ఉత్తీర్ణత, గేట్‌ ఉత్తీర్ణత.
  • సైన్స్‌ విభాగాలకు సంబంధించి ఆయా స్పెషలైజేషన్లలో పీజీ ఉత్తీర్ణత.
  • ఆయా కోర్సుల చివరి సంవత్సరం అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • గరిష్ట వయో పరిమితి: డీఆర్‌డీఓ అభ్యర్థులకు 28ఏళ్లు; డీఎస్‌టీ అభ్యర్థులకు 35 ఏళ్లు, ఏడీఏ అభ్యర్థులకు 30ఏళ్లు. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు.

దరఖాస్తు విధానం

  • https://rac.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు చివరి తేదీ: ఆన్‌లైన్‌ దరఖాస్తు అందుబాటులోకి వచ్చిన 21 రోజుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • రాత పరీక్ష తేదీ: అక్టోబర్‌ 16, 2022
  • రాత పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కాన్పూర్, కోల్‌కత, పుణె.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://rac.gov.in

యువతకు చక్కటి అవకాశం

డీఆర్‌డీఓలో సైంటిస్ట్‌–బి ఉద్యోగాలను యువతకు చక్కటి అవకాశంగా చెప్పొచ్చు. ఎంపికైతే డీఆర్‌డీఓకు ఉన్న పదుల సంఖ్యలోని పరిశోధన కేంద్రాల్లో శాస్త్రవేత్తలుగా విధులు నిర్వహిస్తూ.. సైంటిస్ట్‌ హోదాల స్థిరపడే అవకాశం లభిస్తుంది. ఈ విభాగంలో అడుగుపెట్టాలనుకునే వారికి అప్రమత్తత, వాస్తవ పరిస్థితులపై నిరంతర పరిశీలన, సమస్య సాధన నైపుణ్యాలు ఎంతో అవసరం. అప్పుడే మెరుగ్గా రాణించగలరు. 
–డా‘‘ డి.ఎన్‌.రెడ్డి, మాజీ చైర్మన్, డీఆర్‌డీఓ ఆర్‌ఏసీ

 


లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Experience Fresher job
For more details, Click here

Photo Stories