Skip to main content

Army Public School Recruitment: 136 టీచర్‌ పోస్ట్‌లు.. అర్హతలు, ఎంపిక విధానం ఇలా..

Army Public School Recruitment

బీఈడీ, డీఈడీ పూర్తి చేశారా.. టెట్, సీటెట్‌ పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించారా.. ఉపాధ్యాయ వృత్తిలో చక్కటి కెరీర్‌ కోసం ఎదురు చూస్తున్నారా.. మీకోసం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌లో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. దీనిద్వారా ప్రైమరీ, టీజీటీ, పీజీటీ పోస్ట్‌లలో.. కొలువుదీరే అవకాశం కల్పిస్తోంది.. ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ(ఏడబ్ల్యూఈఎస్‌)!! దేశ వ్యాప్తంగా ఈ సొసైటీ పరిధిలోని 136 ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌లో.. వచ్చే విద్యా సంవత్సరంలో..ఏర్పడనున్న ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం ఇటీవల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌లో టీచర్‌ పోస్ట్‌లు, అర్హతలు, ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం..

  • ఆర్మీ స్కూల్స్‌లో ప్రైమరీ, టీజీటీ, పీజీటీ పోస్ట్‌ల భర్తీకి ప్రకటన
  • జాతీయ స్థాయిలో 136 ఆర్మీ స్కూల్స్‌లో కొలువుదీరే అవకాశం
  • 2023-24లో ఖాళీల నియామకానికి ఎంపిక ప్రక్రియ

దేశ వ్యాప్తంగా ఉన్న మిలటరీ కంటోన్మెంట్స్, మిలటరీ స్టేషన్స్‌ పరిధిలో.. మొత్తం 136 ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ కోసం ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ పేరుతో ప్రత్యేక విభాగాన్ని సైతం నెలకొల్పారు. ప్రతి ఏటా ఆయా క్లస్టర్ల పరిధిలో ఏర్పడే ఖాళీలకు సంబంధించి ఈ సొసైటీ పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. తాజాగా 2023-24లో ఏర్పడే ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సొసైటీ నిర్వహించే రాత పరీక్షలో మార్కుల ఆధారంగా.. ఆయా క్లస్టర్లలోని పాఠశాలలు వేర్వేరుగా విడుదల చేసే నియామక నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని క్లస్టర్లు, పాఠశాలలను పరిగణనలోకి తీసుకుంటే.. రెండు వేలకు పైగా ఖాళీలు భర్తీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

చ‌ద‌వండి: Army Public School Recruitment 2022: టీచర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

అర్హతలు

  • ప్రైమరీ టీచర్స్‌: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల డీఈడీ ఉండాలి.బీఈడీ ఉత్తీర్ణులు కూడా ఈ పోస్ట్‌లకు అర్హులే. వీరు ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ఆరు నెలల వ్యవధిలోని పీడీపీఈటీ/ఎన్‌సీటీఈ నిర్వహించే బ్రిడ్జ్‌ కోర్సులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
  • టీజీటీ: కనీసం యాభై శాతం మార్కులతో డిగ్రీతోపాటు సంబంధిత సబ్జెక్ట్‌తో బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి.
  • పీజీటీ: యాభై శాతం మార్కులతో సంబంధిత స్పెషలైజేషన్‌తో పీజీ ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే పోస్ట్‌లకు సంబంధించిన సబ్జెక్ట్‌తో బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి.
  • పీజీటీ కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్ట్‌కు సంబంధించి సీఎస్‌ఈ/ఐటీ బ్రాంచ్‌తో బీటెక్‌/ పీజీ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ఎమ్మెస్సీ(కంప్యూటర్‌ సైన్స్‌)/బీఎస్సీ -కంప్యూటర్‌సైన్స్‌/బీసీఏతోపాటు పీజీ డిగ్రీ ఉత్తీర్ణత/పీజీ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అండ్‌ పీజీ డిగ్రీ ఉండాలి. 
  • ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ సబ్జెక్ట్‌కు సంబంధించి.. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతోపాటు, ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంపీఈడీ ఉత్తీర్ణులవ్వాలి.
  • మిగిలిన అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి.. సదరు సబ్జెక్ట్‌లో పీజీతోపాటు బీఈడీ ఉత్తీర్ణతను నిర్దేశించారు.
  • విద్యార్హతలతోపాటు సీటెట్‌ లేదా టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. తొలి దశ రాత పరీక్ష సమయానికి టెట్‌/సీటెట్‌ రాయని వారు కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అలాంటి వారు తుది నియామకం సమయానికి సీటెట్‌/టెట్‌ ఉత్తీర్ణత సాధించాలి.
  • వయసు: తాజా గ్రాడ్యుయేట్లకు ఏప్రిల్‌ 1, 2023 నాటికి 40ఏళ్లలోపు, పని అనుభవం ఉన్న వారికి 57 ఏళ్లలోపు ఉండాలి.

మూడు దశల ఎంపిక ప్రక్రియ

ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌లో..పీఆర్‌టీ, టీజీటీ, పీజీటీ పోస్ట్‌ల భర్తీకి సంబంధించి నిర్వహించే ప్రక్రియ మొత్తం మూడు దశలుగా ఉంటుంది. తొలి దశలో అభ్యర్థులకు పోస్ట్‌ల వారీగా ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. 

చ‌ద‌వండి: AP Teacher Recruitment 2022: టీచర్‌ కొలువు.. పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌

తొలి దశ రాత పరీక్ష.. ఇలా

  • ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌గా నిర్వహించే తొలి దశ రాత పరీక్ష.. ఆయా పోస్ట్‌లకు వేర్వేరు విధానాల్లో నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం నాలుగు సెక్షన్‌లు 200 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌ ఏలో బేసిక్‌ జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ నుంచి 20 ప్రశ్నలు, సెక్షన్‌-బిలో పెడగాజీ, కరిక్యులం అండ్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ అంశాల నుంచి 20 ప్రశ్నలు, సెక్షన్‌-సిలో అకడమిక్‌ ప్రొఫిషియన్సీ నుంచి 160 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. 
  • మూడు పోస్ట్‌లకు సంబంధించి ఇవే విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
  • పోస్ట్‌ను అనుసరించి వేర్వేరు స్థాయిల్లో ప్రశ్నల క్లిష్టత, సిలబస్‌ అంశాలు ఉంటాయి.
  • ప్రైమరీ టీచర్స్‌ అభ్యర్థులకు ప్రాథమిక, ప్రిపరేటరీ దశలో పెడగాజీపై ప్రశ్నలు అడుగుతారు. 
  • టీజీటీ అభ్యర్థులకు సెక్షన్‌-బిలో మిడిల్‌ అండ్‌ సెకండరీ స్టేజ్‌ పెడగాజీపై ప్రశ్నలు ఉంటాయి.
  • పీజీటీ అభ్యర్థులకు సెక్షన్‌-బిలో సెకండరీ అండ్‌ సీనియర్‌ సెకండరీ స్టేజ్‌ పెడగాజీపై ప్రశ్నలు అడుగుతారు.
  • సెక్షన్‌-సి అకడమిక్‌ ప్రొఫిషియన్సీ విభాగం విషయంలో.. టీజీటీ అభ్యర్థులకు ఒకటి నుంచి అయిదో తరగతి వరకు సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, హిందీ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. 
  • టీజీటీ సెక్షన్‌-సిలో ఆరు నుంచి పదో తరగతి వరకు అకడమిక్‌ నైపుణ్యాలను పరీక్షిస్తారు.
  • పీజీటీ సెక్షన్‌-సిలో పదకొండు, పన్నెండు తరగతుల స్థాయిలో అకడమిక్‌ నైపుణ్యాలకు సంబంధించిన అంశాలతో ప్రశ్నలు అడుగుతారు.
  • అన్ని పోస్ట్‌లకు నిర్వహించే రాత పరీక్ష మూడు గంటల వ్యవధిలో జరుగుతుంది.

రెండో దశ ఇంటర్వ్యూ

  • రాత పరీక్షలో నిర్దిష్ట కటాఫ్‌ మార్కులతో ఉత్తీర్ణత సాధించి, మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి తదుపరి దశలో పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలను మిలటరీ కంటోన్మెంట్స్, స్టేషన్స్‌లో ఉన్న పాఠశాలలు సొంతంగా నిర్వహిస్తాయి. ఇందుకోసం అభ్యర్థులు సదరు పాఠశాలలు ఇచ్చే నోటిఫికేషన్‌కు.. ఆర్మీ స్కూల్‌ ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఉత్తీర్ణత ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. 
  • శాశ్వత ప్రాతిపదికగా భర్తీ చేసే పోస్ట్‌లకు సంబంధించి సెంట్రల్‌ సెలక్షన్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 
  • దీంతోపాటు నిర్ణీత కాల వ్యవధికి ఫిక్స్‌డ్‌ టర్మ్‌ పేరుతో కూడా నియామకాలు చేపడతారు. ఈ పోస్ట్‌లకు స్థానిక మిలటరీ వర్గాల ఆధ్వర్యంలోని లోకల్‌ సెలక్షన్‌ బోర్డ్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

మూడో దశ.. టీచింగ్‌ స్కిల్స్, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ

ఎంపిక ప్రక్రియలో చివరి దశగా పేర్కొనే మూడో దశలో.. టీచింగ్‌ స్కిల్స్‌ పరిశీలన, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరిశీలన చేస్తారు. లాంగ్వేజ్‌ టీచర్స్‌ అభ్యర్థులకు ఎస్సే, కాంప్రహెన్షన్‌లలో 15 మార్కులు చొప్పున 30 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. దీంతోపాటు అభ్యర్థులకున్న కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ స్కిల్స్‌ను పరిశీలించేలా కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ను నిర్వహిస్తారు.

చ‌ద‌వండి: AP Model School Recruitment: ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో 207 టీచర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

విజయానికి అడుగులు ఇలా

  • సెక్షన్‌-ఎలోని జనరల్‌ నాలెడ్జ్‌లో సోషల్‌ సై¯Œ ్స, జనరల్‌ సై¯Œ ్స అంశాలపై పట్టు సాధించాలి.కరెంట్‌ అఫైర్స్‌లో మంచి మార్కుల కోసం జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
  • పెడగాజీ, కరిక్యులం, ఎడ్యుకేషన్‌ పాలసీ అంశాల విషయంలో శిశు వికాసం, బోధన పద్ధతులు తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.

మార్కుల సాధనకు

  • ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ టీచర్‌ పోస్ట్‌ల అభ్యర్థులకు కలిసొచ్చే అంశం.. అకడమిక్‌ ప్రొఫిషియన్సీ విభాగానికి 160 మార్కులు కేటాయించడం. ఈ అవకాశాన్ని అభ్యర్థులు అందిపుచ్చుకుంటే దాదాపు 110 మార్కులు సాధించొచ్చు. 
  • ప్రైమరీ టీచర్‌ పోస్టుల అభ్యర్థులు ఒకటి నుంచి అయిదు వరకు సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్‌ స్టడీస్, ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ పుస్తకాలను అధ్యయనం చేయాలి. ప్రధానంగా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదవడం వల్ల ఈ విభాగంలో మంచి మార్కులు పొందే అవకాశం ఉంది.
  • ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ ఆరు నుంచి పదో తరగతి వరకు అన్ని సబ్జెక్ట్‌ల కాన్సెప్ట్‌లపై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్‌కు, సైన్స్‌కు సంబంధించి ఆయా అంశాల భావనలు, సూత్రాలపై పట్టు సాధించాలి.
  • పీజీటీ అభ్యర్థులు ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల పుస్తకాలను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి కాన్సెప్ట్‌లతోపాటు ప్రతి చాప్టర్‌ వెనుక ఉండే ప్రాక్టీస్‌ బిట్స్‌ను సాధన చేయాలి.

ఏ విభాగమైనా.. ఇలా

టీజీటీ, పీజీటీ పలు సబ్జెక్ట్‌లలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి బీఈడీ పుస్తకాలను పునరావలోకనం చేసుకోవాలి. ముఖ్యంగా కంటెంట్, మెథడాలజీ విషయంలో ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. సీటెట్‌ పాత ప్రశ్న పత్రాలను అధ్యయనం చేయాలి. దీంతోపాటు ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌ పాత ప్రశ్న పత్రాలను సాధన చేయడం ద్వారా.. ఆయా విభాగాల్లోని వేర్వేరు అంశాలకు లభిస్తున్న వెయిటేజీపై అవగాహన ఏర్పడుతుంది. దీంతోపాటు ప్రశ్నలు అడుగుతున్న తీరు, సమాధానాలు ఇవ్వాల్సిన విధానంపైనా సన్నద్ధత పొందొచ్చు.

ముఖ్య తేదీలు

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్‌ 5, 2022
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: అక్టోబర్‌ 20, 2022
  • ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేదీలు: నవంబర్‌ 5, నవంబర్‌ 6,2022
  • ఫలితాల వెల్లడి: నవంబర్‌ 20, 2022
  • పర్సనల్‌ ఇంటర్వ్యూ,కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌: జనవరి/ఫిబ్రవరి2023లో జరిగే అవకాశం.
  • వెబ్‌సైట్‌: https://www.awesindia.com/
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: https://register.cbtexams.in/AWES/Registration

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 05,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories