Skip to main content

Air Force Recruitment 2023: ఇంటర్‌తో 'అగ్నివీర్‌వాయు' పోస్టులు.. రాత పరీక్ష ప్రిపరేషన్‌ ఇలా..

ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన వారికోసం ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్‌వాయు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మహిళలు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షలో చూపిన ప్రతిభ, ఫిజికల్, మెడికల్‌ టెస్టుల్లో అర్హత సాధించిన వారిని ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్‌వాయుగా తీసుకుంటారు. ఈ విధంగా ఎంపికైన వారు నాలుగేళ్ల పాటు ఎయిర్‌ఫోర్స్‌లో సేవలు అందించే అవకాశం లభిస్తుంది. ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్‌వాయుకు దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, ప్రయోజనాలపై ప్రత్యేక కథనం..
indian air force agniveer vayu recruitment 2023

ఎయిర్‌ఫోర్స్‌లో సైన్స్, నాన్‌ సైన్స్‌ విభాగాల్లో అగ్నివీర్‌వాయు ఖాళీలున్నాయి. సైన్స్‌ విభాగంలోని పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు నాన్‌సైన్స్‌ ఖాళీలకు పోటీ పడవచ్చు. ఇందుకోసం వీరు ప్రత్యేక పరీక్ష రాయాలి.

సైన్స్‌ విభాగం

ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. లేదా నిర్దేశిత బ్రాంచీల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సు 50శాతం మార్కులతో పూర్తిచేయాలి. లేదా ఫిజిక్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో రెండేళ్ల వొకేషనల్‌ కోర్సు 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఏ విద్యార్హతతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. టెన్త్‌/ఇంటర్‌/డిప్లొమా/ఒకేషనల్‌లో ఇంగ్లిష్‌లో 50శాతం మార్కులు పొందడం తప్పనిసరి.

చదవండి: Indian Air Force Notification 2023: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్‌ వాయు ఉద్యోగాలు

నాన్‌ సైన్స్‌ విభాగం

ఏదైనా గ్రూప్‌తో ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఏ అర్హతతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ..టెన్త్‌/ఇంటర్‌/ఒకేషనల్‌ ఇంగ్లిష్‌­లో కనీసం 50 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. వయసు: 17 1/2 నుంచి 21 ఏళ్ల లోపు ఉండాలి. డిసెంబర్‌ 26, 2002- జూన్‌ 26, 2006 మధ్య జన్మించినవారు అర్హులు. అన్ని విభాగాలకు పురుషులు 152.5 సెం.మీ. మహిళలలు 152 సెం.మీ ఉండాలి. ఎత్తుకు తగిన బరువు అవసరం. ఊపిరి పీల్చినప్పుడు, వదిలినప్పుడు ఛాతీ వ్యత్యాసం 5 సెం.మీ ఉండాలి.

ఎంపిక ఇలా

మూడు దశల్లో నిర్వహించే అర్హత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో రాత పరీక్ష, ఫిజికల్, మెడికల్‌ టెస్టులుంటాయి. ఈ మూడింటిలో అర్హత సాధించిన వారినే మాత్రమే తుదిగా ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.

చదవండి: Government Jobs after B.Tech: బీటెక్‌తో త్రివిధ దళాల్లో కొలువులు

ఫేజ్‌-1 రాత పరీక్ష 

రాత పరీక్ష ఆన్‌లైన్‌(సీబీటీ) విధానంలో ఉంటుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటా­యి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. సైన్స్‌ సబ్జెక్టులకు పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. నాన్‌ సైన్స్‌ అభ్యర్థులకు పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. ఇంగ్లిష్, రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. సైన్స్, నాన్‌ సైన్స్‌ రెండింటికీ దరఖాస్తు చేసుకున్నవారికి పరీక్ష సమయం 85 నిమిషాలు. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. 
అన్ని పరీక్షల్లోనూ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. అలాగే తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. అన్ని ప్రశ్నపత్రాల్లోనూ ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్‌ ప్రశ్నలు సీబీఎస్‌ఈ 10+2 స్థాయి నుంచి అడుగుతారు. ఎంపిక చేసుకున్న పరీక్షను బట్టి ఇంగ్లిష్‌ -20, ఫిజిక్స్‌-25, మ్యాథ్స్‌-25, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి.

ఫేజ్‌-2.. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌

ఫేజ్‌-1లో భాగంగా నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ చూపించిన అభ్యర్థులకు మాత్రమే ఫేజ్‌-2కు అవకాశం ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులు నిర్దేశిత సెలక్షన్‌ కేంద్రాలకు ప్రవేశ పత్రాలతోపాటు అవసరమైన సర్టిఫికేట్లు, వాటి జిరాక్స్‌ సెట్, ఫోటోలు తదితర అవసరమైన పత్రాలను తీసుకెళ్లాలి. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టులో భాగంగా అభ్యర్థులకు 1.6 కి.మీ దూరాన్ని పురుషులు 7, మహిళలు 8 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే పురుషులు ఒక్కోటి నిమిషం వ్యవధిలో 10 పుష్‌అప్స్, 10 సిట్‌అప్స్, 20 స్క్వాట్స్‌ పూర్తిచేయాలి. మహిళలు 90 సెకన్లలో 10 సిట్‌అప్స్, నిమిషంలో 15 స్క్వాట్స్‌ పూర్తిచేయగలగాలి. వీటిల్లో అర్హత సాధించినవారికి అడాప్టబిలిటీ టెస్టు-1 నిర్వహిస్తారు. అభ్యర్థి ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగానికి సరిపోతాడా లేదా అనేది నిర్ణయించడానికి ఆబ్జెక్టివ్‌ తరహాలో రాత పరీక్ష ఉంటుంది. ఇందులోనూ అర్హత సాధించిన వారికి అడాప్టబిలిటీ టెస్టు-2ను నిర్వహిస్తారు. ఈ దశలో అభ్యర్థి వాయుసేన వాతావరణానికి అలవాటు పడగలడా లేదా పరిశీలిస్తారు.

ఫేజ్‌-3

అడాప్టబిలిటీ టెస్టులోఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మెడికల్‌ టెస్టులు నిర్వహించి శిక్షణ, నాలుగేళ్ల విధుల నిమిత్తం తీసుంటారు.

చదవండి: NDA for Women: దీటుగా రాణించి.. ధీర వనితలుగా నిలిచే ఆస్కారం

రాత పరీక్ష ప్రిపరేషన్‌ ఇలా

అభ్యర్థులు మ్యాథ్స్, ఫిజిక్స్‌ విభాగాల్లోని అంశాలను ఎంసెట్‌ స్థాయిలో ప్రిపేర్‌ అయితే మంచి ఫలితం సాధించవచ్చు. దీంతోపాటు వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయాలి. దీని ద్వారా నిర్దేశిత సమయంలోపు పరీక్ష పూర్తిచేయగలుగుతారు. అంతేకాకుండా ఎక్కడ తప్పులు చేస్తున్నారో తెలుస్తుంది. ఇంగ్లిష్‌కు సంబంధించి వ్యాకరణాంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. రీజనింగ్‌ విభాగంలో మాదిరి ప్రశ్నలు ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. జనరల్‌ అవేర్‌నెస్‌కు సంబంధించి ఇటీవలి కాలంలో రక్షణశాఖలో తీసుకొచ్చిన నూతన సాంకేతికత, ఈ విభాగంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలపై దృష్టిపెట్టాలి. వీటితోపాటు స్పోర్ట్స్, అవార్డ్స్, బుక్స్, ఎన్నికలు తదితర తాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. 

అగ్నివీర్‌వాయు ప్రోత్సాహకాలు

అగ్నివీర్‌వాయులో ప్రవేశం పొందిన వారికి మొదటి ఏడాది ప్రతి నెల రూ.30,000, రెండో ఏడాది ప్రతి నెల రూ.33,000, మూడో ఏడాది ప్రతి నెల రూ.36,500 చెల్లిస్తారు. నాలుగో ఏడాది ప్రతి నెల రూ.40,000 చెల్లిస్తారు. వీరికి వార్షిక సెలవులు 30 ఉంటాయి. ఆరోగ్య సమస్యలను బట్టి సిక్‌లీవ్‌లు కూడా ఇస్తారు. నాలుగేళ్ల సర్వీస్‌ కాలంలో రిస్క్‌ అండ్‌ హార్డ్‌షిప్, రేషన్, డ్రెస్, ట్రావెల్‌ అలవెన్సులు అందిస్తారు. నాలుగేళ్ల పాటు రూ.48 లక్షలకు లైఫ్‌ ఇన్సూరెన్‌ కవర్‌ వర్తిస్తుంది. నాలుగేళ్ల సేవలకు గాను వారు పనిచేసిన విభాగాన్ని అనుసరించి అగ్నివీర్‌వాయు సర్టిఫికేట్‌ అందుతుంది. వీరి­కి ఫించను, గ్రాట్యుటీ, కరవు భత్యం, మిలటరీ సర్వీస్‌ పే(ఎంఎస్‌పీ),ఎక్స్‌సర్వీస్‌మెన్‌ హోదా ఇవే­వీ వర్తించవు. ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌ ) ఉండదు.

చదవండి: Jobs After 10th & Inter: పది, ఇంటర్‌తోనే... కొలువుల దిశగా!

ఉద్యోగంలో ఇలా

అగ్నివీర్‌వాయు స్కీంలో భాగంగా నాలుగేళ్ల సర్వీస్‌ను పూర్తిచేసుకున్న అగ్రివీర్‌ వాయు ఒక్కో బ్యాచ్‌ నుంచి గరిష్టంగా 25 శాతం మందిని మాత్రమే శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇందుకోసం నాలుగేళ్ల వ్యవధిలో చూపిన ప్రతి¿¶ , సంస్థ అవసరాలు ప్రామాణికంగా తీసుకుంటారు. 

పదోన్నతులు

సంబంధిత విభాగంలో విధుల్లో పనిచేసే వారు భవిష్యత్తులో ప్రమోషన్ల ద్వారా మాస్టర్‌ వారెంట్‌ ఆఫీసర్‌(ఎండబ్లు్యవో) స్థాయి వరకు చేరుకోవచ్చు. అంతేకాకుండా సర్వీస్‌లో కొనసాగుతూ సంబంధిత పరీక్షల్లో అర్హతలు సాధించిన వారు కమిషన్డ్‌ ఆఫీసర్లు కావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగం చేస్తూనే నిర్ణీత వ్యవధిగల ఉన్నత విద్యను కొనసాగించడానికి కూడా అనుమతిస్తారు. పదవీ విరమణ వయసు వరకు ఉద్యోగం కొనసాగవచ్చు. అనంతరం ఫించను, ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.

సేవానిధి

ప్రతినెల అందుకునే మొత్తంలో 30 శాతం కార్పస్‌ ఫండ్‌కి జమచేస్తారు. మొత్తం నాలుగేళ్ల కాలానికి గానూ సేవనిధిలో రూ.5.02 లక్షలు అగ్నివీరుని వేతనం నుంచి జమవుతాయి. అంతేమొత్తాన్ని ప్రభుత్వమూ జమచేస్తుంది. రెండు కలిపి రూ.10.04 లక్షలవుతాయి. దీనికి వడ్డిని జతచేసి, అగ్నివీర్‌వాయుకు అందజేస్తారు. నాలుగేళ్ల సర్వీస్‌ పూర్తయి∙వైదొలగిన వారికి బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేలా ఏర్పాట్లు చేస్తారు. వీరికి కార్పొరేట్‌ సంస్థల్లోనూ అవకాశాలు ఉంటాయి. నాలుగేళ్ల సర్వీస్‌లో మధ్య­లో కావాలంటే వైదొలిగే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సందర్భంలో వేతనం నుంచి జమ అయిన మొత్తాన్ని అగ్నివీర్‌వాయుకు అందిస్తారు. కాని ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహం మాత్రం దక్కదు.

చదవండి: After Inter: ఇంటర్ తర్వాత.. ఎన్నెన్నో అవకాశాలు

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 2023, మార్చి 31 
  • ఆన్‌లైన్‌ పరీక్షలు: 2023 మే 20 నుంచి
  • వెబ్‌సైట్‌: https://agnipathvayu.cdac.in/
Qualification 12TH
Last Date March 31,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories