Skip to main content

Government Jobs after B.Tech: బీటెక్‌తో త్రివిధ దళాల్లో కొలువులు

బీటెక్‌ అభ్యర్థులకు త్రివిధ దళాల్లో ప్రత్యేక కొలువులు అందుబాటులో ఉన్నాయి. వీటికోసం ఇండియన్‌ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. ముఖ్యంగా కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌(సీఏపీఎఫ్‌)-అసిస్టెంట్‌ కమాండెంట్స్‌(ఏసీ), ఇండియన్‌ ఆర్మీ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు తదితరాల గురించి తెలుసుకుందాం..
Government Jobs after B.Tech in Army

కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌

  • బీటెక్‌ విద్యార్థులకు త్రివిధ దళాల్లో కొలువు కల్పించే పరీక్ష.. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌. ఇండియన్‌ మిలిటరీ అకాడమీ, నేవల్‌ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీల్లో పర్మనెంట్‌ కమిషన్‌ ర్యాంకు ఉద్యోగాలకు నిర్వహించే ఈ పరీక్షలో.. నేవల్‌ అకాడమీ అభ్యర్థులు తప్పనిసరిగా బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన ఉంది. 
  • బీటెక్‌ అభ్యర్థులు నేవల్‌ అకాడమీతోపాటు బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతగా పేర్కొనే మిగిలిన మూడు విభాగాలకూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రాత పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది. ఇండియన్‌ మిలటరీ అకాడమీ, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ అభ్యర్థులకు 300 మార్కులకు; ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ అభ్యర్థులకు 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. 
  • రాత పరీక్షలో నిర్దేశిత కటాఫ్‌ మార్కులు పొందిన అభ్యర్థులకు సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌(ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది అన్ని అకాడమీల అభ్యర్థులకు ఉమ్మడిగా అయిదు రోజులపాటు జరుగుతుంది. ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీకి టెస్టులను 6రోజులపాటు నిర్వహిస్తారు. అన్నింటిలోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిస్తే త్రివిధ దళాల్లో కొలువు ఖాయం అవుతుంది.

చ‌ద‌వండి: Government Jobs after B.Tech: బీటెక్‌తో.. సర్కారీ కొలువుల బాట!

సీఏపీఎఫ్‌-ఏసీ

  • సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌(సీఏపీఎఫ్‌)-అసిస్టెంట్‌ కమాండెంట్స్‌(ఏసీ)..బీటెక్‌ విద్యార్థులు పోటీ పడేందుకు అవకాశం ఉన్న మరో మార్గం. కేంద్ర సాయుధ దళాలుగా పేర్కొనే.. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌); సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌); సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌); ఇండో-టిబెటిన్‌ పోలీస్‌ ఫోర్స్‌(ఐటీబీపీ); సశస్త్ర సీమాబల్‌(ఎస్‌ఎస్‌బీ)లో.. అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాలకు యూపీఎస్‌సీ ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం మూడు దశల్లో జరగుతుంది. అవి..రాత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్‌/పర్సనల్‌ ఇంటర్వ్యూ. తొలిదశ రాత పరీక్ష రెండు పేపర్లలో(జనరల్‌ ఎబిలిటీ అండ్‌ ఇంటెలిజెన్స్‌-250 మార్కులు; జనరల్‌ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్‌-450 మార్కులు) ఉంటుంది. పేపర్‌-2ను డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. 
  • పార్ట్‌-ఎ(జనరల్‌ స్టడీస్‌), పార్ట్‌-బి(ఎస్సే అండ్‌ కాంప్రహెన్షన్‌).. రెండు విభాగాలుగా పేపర్‌-2 ఉంటుంది. పార్ట్‌-ఎలో ఎస్సే కొశ్చన్స్‌ అడుగుతారు. పార్ట్‌-బీలో 120 మార్కులకు ప్రెసిస్‌ రైటింగ్, రిపోర్ట్‌ రైటింగ్, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లపై ప్రశ్నలు ఉంటాయి. రెండు రాత పరీక్షల తర్వాత ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇందులోనూ ప్రతిభ చూపితే.. చివరగా 150 మార్కులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

చ‌ద‌వండి: UPSC CDS 1 2023 Notification: 341 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..

ఇండియన్‌ ఆర్మీ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు

ఆర్మీలో ప్రవేశించాలనుకునే బీటెక్‌ అభ్యర్థులకు చక్కటి మార్గం..టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు. ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులు, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సైతం దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్‌లో అభ్యర్థుల మార్కుల శాతాన్ని పరిగణనలోకి తీసుకుని ముందుగా షార్ట్‌లిస్ట్‌ రూపొందిస్తారు. ఆ జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులకు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో విజయం సాధించిన వారికి ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. దీన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆర్మీలో లెఫ్టినెంట్‌ హోదాతో పర్మినెంట్‌ కమిషన్‌ లభిస్తుంది.

ఇండియన్‌ నేవీ.. యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్‌(యూఈఎస్‌)

నేవీలో నేరుగా క్యాంపస్‌ నుంచే అడుగు పెట్టేందుకు మార్గం..యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్‌. యూఈఎస్‌ ద్వారా పర్మనెంట్‌ కమిషన్, షార్ట్‌సర్వీస్‌ కమిషన్‌లలో నియామకాలు చేపడతారు. ఏడాదికి ఒకసారి ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. నేవీ అధికారుల బృందాలు దేశంలోని అత్యుత్తమ ఇన్‌స్టిట్యూట్‌లను సందర్శించి క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. వాటిలో ప్రతిభ చూపిన వారికి నియామకాలు ఖరారు చేస్తారు. మెకానికల్, మెరైన్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్, సివిల్, నావల్‌ ఆర్కిటెక్చర్‌ తదితర 18 బ్రాంచ్‌లలో ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. నాలుగో సెమిస్టర్‌ వరకు 60 శాతం మార్కులు పొంది ఉండాలి. 

చ‌ద‌వండి: Engineering Students: బీటెక్‌ నాలుగేళ్ల ప్రణాళిక ఇలా..

నేవీ.. గ్రాడ్యుయేట్‌ ఎంట్రీ స్కీమ్‌

  • ఇండియన్‌ నేవీలో బీటెక్‌ ఉత్తీర్ణులకు అందుబాటులో ఉన్న స్కీమ్‌ ఇది. పైలట్‌ (ఎంఆర్‌); పైలట్‌(ఎఎంఆర్‌);అబ్జర్వర్‌;ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రో లర్‌; జనరల్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌(జీఎస్‌ఎక్స్‌); హైడ్రో విభాగం; నేవల్‌ ఆర్కిటెక్ట్‌; ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ; లాజిస్టిక్స్‌; ఎడ్యుకేషన్‌; నేవల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌æ కేడర్‌లలో కొలువులు భర్తీ చేస్తారు.  
  • పైలట్‌ పోస్ట్‌లకు బీటెక్‌తోపాటు కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ కలిగుండాలి. 
  • జనరల్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, హైడ్రోగ్రఫీ ఆఫీసర్‌ పోస్ట్‌లకు బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత అర్హతగా నిర్దేశిస్తారు. 
  • ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ పోస్ట్‌లకు 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌/ఐటీ) లేదా బీఎస్సీ(ఐటీ) లేదా ఎంటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌) లేదా ఎమ్మెస్సీ(కంప్యూటర్స్‌) లేదా బీసీఏ/ఎంసీఏ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొంటారు. 
  • లాజిస్టిక్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు బీఈ/బీటెక్‌/ఎంబీఏ/ఎంసీఏ/ఎంఎస్సీ(ఐటీ)లలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత లేదా బీఎస్సీ/బీకామ్‌/బీఎస్సీ(ఐటీ)తోపాటు ఫైనాన్స్‌ /లాజిస్టిక్స్‌/సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌/మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌లలో పీజీ డిప్లొమా ఉండాలి. 
  • నేవల్‌ ఆర్మమెంట్‌ ఇన్స్‌పెక్షన్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు మెకానికల్‌/సివిల్‌ /ఏరోనాటికల్‌/మెటలర్జీ/నావల్‌ ఆర్కిటెక్చర్‌ స్పెషలైజేషన్లతో బీఈ/బీటెక్‌లలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన వారిని అర్హులుగా పేర్కొంటారు.
  • ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత సాధించి.. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదివిన అభ్యర్థులు అర్హులు. 
  • ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు ద్వితీయ శ్రేణితో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(మ్యాథ్స్‌ /ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/ఇంగ్లిష్‌/కంప్యూటర్‌ సైన్స్‌) ఉత్తీర్ణత లేదా ఇంజనీర్‌ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/మెకానికల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణత లేదా ఎకనామిక్స్‌/హిస్టరీ/పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో విజయం సాధించిన వారికి ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ నిర్వహించి నియామకాలు ఖరారు చేస్తారు. 

చ‌ద‌వండి: Best Engineering Branch: బీటెక్‌... కాలేజ్, బ్రాంచ్‌ ఎంపిక ఎలా

నేవీ ఇంజనీరింగ్‌ ఆఫీసర్‌

ఇంజనీర్‌ ఆఫీసర్‌(జనరల్‌ సర్వీస్‌), సబ్‌-మెరైన్‌ టెక్నికల్‌ ఆఫీసర్, నావల్‌ ఆర్కిటెక్ట్‌ ఆఫీసర్, ఎలక్ట్రికల్‌ ఆఫీసర్‌(జనరల్‌ సర్వీస్‌), ఎలక్ట్రికల్‌ ఆఫీసర్‌ (సబ్‌-మెరైన్‌) పోస్టులను నేవీలో భర్తీ చేస్తారు. దీనికి బీటెక్‌లో సంబంధిత స్పెషలైజేషన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. బీటెక్‌లో మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందించి..వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ఎయిర్‌ఫోర్స్‌.. ఏఎఫ్‌క్యాట్‌

  • ఎయిర్‌ఫోర్స్‌లోనూ పలు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ సొంతంగా చేపట్టే నియామక ప్రక్రియ ఏఎఫ్‌క్యాట్‌(ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌)లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఫ్లయింగ్‌ బ్రాంచ్, గ్రౌండ్‌ డ్యూటీ విభాగాల్లో పలు టెక్నికల్‌ కొలువులకు ఈ పరీక్ష ద్వారా పోటీ పడొచ్చు. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌లో అడుగు పెట్టాలనుకుంటే.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 60 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్మీడియెట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌లలో 60 శాతం మార్కులు సొంతం చేసుకోవాలి. లేదా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • గ్రౌండ్‌ డ్యూటీకి సంబంధించి..గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌) విభాగంలో చేరాలనుకుంటే.. ఇంటర్మీడియెట్‌లో 50 శాతం మార్కులతోపాటు ఇంజనీరింగ్‌ బీటెక్‌/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ విభాగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

చ‌ద‌వండి: Best Branch in Engineering : Btechలో బెస్ట్ బ్రాంచ్ ఏది..? ఎలా సెల‌క్ట్ చేసుకోవాలి..?

రెండు దశల ఎంపిక ప్రక్రియ

  • ఏఎఫ్‌క్యాట్‌ ఎంపిక ప్రక్రియ రెండు దశలుగా ఉంటుంది. తొలిదశలో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే స్క్రీనింగ్‌ టెస్ట్‌లో ప్రతిభ చూపిన వారికి తదుపరి దశ ఎస్‌ఎస్‌బీ ప్రక్రియ జరుగుతుంది. ఎస్‌ఎస్‌బీలో విజయం సాధించిన అభ్యర్థులకు  ౖసైకలాజికల్‌ టెస్ట్, ఫ్లైయింగ్‌ బ్రాంచ్‌కు ఎంపికైన వారికి కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టమ్‌(సీపీఎస్‌ఎస్‌) టెస్టు ఉంటుంది.
  • ఏఎఫ్‌క్యాట్‌ పరీక్షను 100 ప్రశ్నలతో 300 మార్కులకు జనరల్‌ అవేర్‌నెస్, వెర్బల్‌ ఎబిలిటీ ఇన్‌ ఇంగ్లిష్‌; న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ రీజనింగ్‌; మిలటరీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌ల అభ్యర్థులకు.. ఇంజనీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ పేరుతో మెకానికల్‌; కంప్యూటర్‌ సైన్స్‌; ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ సబ్జెక్ట్స్‌లో 50 ప్రశ్నలతో 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు తాము ఆసక్తి చూపిన బ్రాంచ్‌కు సరితూగే సబ్జెక్ట్‌తో ఇంజనీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది.
  • వీటిలోనూ విజయం సాధిస్తే.. మెడికల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇలా అన్నింటిలోనూ చూపిన ప్రతిభ ఆధారంగా తుది జాబితా రూపొందించి.. పర్మనెంట్‌ కమిషన్‌తో కొలువు ఖరారు చేస్తారు.
Published date : 28 Dec 2022 12:41PM

Photo Stories