Skip to main content

Best Branch in Engineering : Btechలో బెస్ట్ బ్రాంచ్ ఏది..? ఎలా సెల‌క్ట్ చేసుకోవాలి..?

బీటెక్.. దేశ వ్యాప్తంగా లక్షల మంది విద్యార్థుల స్వప్నం. తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కోర్సుపై మక్కువ అంతా ఇంతా కాదు. తమ స్వప్నం సాకారం చేసుకునేందుకు విద్యార్థులు జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, ఎంసెట్ వంటి పలు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు రాస్తుంటారు.

ఇంజనీరింగ్‌లో నచ్చే కాలేజీలో, మెచ్చే బ్రాంచ్‌లో చేరాలన్నది ప్రతి విద్యార్థి లక్ష్యం. అందుబాటులో ఉన్న అనేక ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో ఎందులో చేరితే మంచిది?! ఏ బ్రాంచ్‌లో ఏముంది.. దేనికి భవిష్యత్తు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి? గత టాపర్లు క్రేజీగా భావించిన బ్రాంచ్‌లు.. ఇటీవల కాలంలో బీటెక్‌లో బెస్ట్‌గా నిలుస్తున్న బ్రాంచ్‌ల గురించి తెలుసుకుందామా..

Engineering college Admissions : ఇంజ‌నీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?

ఇంజనీరింగ్ అభ్యర్థులకు బ్రాంచ్ ఎంపిక అత్యంత కీలకంగా మారింది. ఏ బ్రాంచ్‌ను ఎంపిక చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందో తెలియని సందిగ్థత. ప్రస్తుతం బెస్ట్ బ్రాంచ్‌లుగా నిలుస్తూ.. నాలుగేళ్ల తర్వాత బీటెక్ పట్టా చేతికందే సమయానికి జాబ్ మార్కెట్‌లో కొలువులు ఖాయం చేసే బ్రాంచ్‌ల్లో చేరాలన్నది నిపుణుల సలహా.

సీఎస్‌ఈ.. టాపర్ల గమ్యం ఇదే.. :CSE
☛ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్.. సీఎస్‌ఈగా సుపరిచితం. బీటెక్ ఔత్సాహిక విద్యార్థుల్లో ఎక్కువ మంది సీఎస్‌ఈలో చేరడానికే ఆసక్తిచూపుతారు. ఈ బ్రాంచ్‌తో ఐటీ కొలువులు, ఆకర్షణీయ ప్యాకేజీలు లభిస్తాయనే నమ్మకమే అందుకు కారణం. అందుకు తగ్గట్టుగానే క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో ఐటీ రంగ కంపెనీలు తొలుత సీఎస్‌ఈ విద్యార్థులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. నాలుగేళ్ల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో.. ముఖ్యంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్, నెట్‌వర్కింగ్, అల్గారిథమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ప్రోగ్రామ్ డిజైన్,కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ హార్డ్‌వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటాబేస్, డేటా స్ట్రక్చర్స్ తదితర అంశాలను అధ్యయనం చేస్తారు.

AP EAMCET 2022 College Predictor : మీ ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీటు వ‌స్తుందో తెలుసా..?
☛ సీఎస్‌ఈ పూర్తి చేసుకొని సబ్జెక్టుపై పట్టు సాధించడంతో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులు.. కంప్యూటర్ ప్రోగ్రామర్, సిస్టమ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, సాఫ్ట్‌వేర్ డవలపర్, సిస్టమ్ డిజైనర్, రీసెర్చ్ అనలిస్ట్ తదితర జాబ్స్ ప్రొఫైల్స్‌లో చేరొచ్చు. ప్రస్తుత ఆటోమేషన్ యుగాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. రానున్న రోజుల్లో కూడా సీఎస్‌ఈ విద్యార్థులకు కొలువులు ఖాయమని చెప్పొచ్చు.
☛ గత అయిదారేళ్లుగా జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, ఎంసెట్ వంటి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులు.. సీఎస్‌ఈ బ్రాంచ్‌నే తొలి ప్రాధాన్య‌త‌గా ఎంపిక చేసుకుంటున్నారు. గతేడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత సాధించి టాప్-1000లో నిలిచిన అభ్యర్థుల్లో 70 శాతం మంది సీఎస్‌ఈ బ్రాంచ్‌లో చేరడమే ఇందుకు నిదర్శనం. ఐఐటీల్లో గతేడాది తొలిసారి అమ్మాయిల కోసం ప్రవేశపెట్టిన సూపర్ న్యూమరరీ సీట్ల విధానంలో సైతం జనరల్ కేటగిరీలో సీఎస్‌ఈ బ్రాంచ్ క్లోజింగ్ ర్యాంకు రెండు వేలలోపే ఉండటం గమనార్హం.

TS EAMCET 2022 College Predictor : మీరు ఎంసెట్‌-2022 ప‌రీక్ష రాశారా..? మీ ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీటు వ‌స్తుందంటే..?

క్రేజ్ త‌గ్గ‌ని.. సివిల్ ఇంజనీరింగ్.. 

Civil Eng


కోర్ బ్రాంచ్‌లలో మరో ముఖ్యమైన బ్రాంచ్.. సివిల్ ఇంజనీరింగ్. ఇది అత్యంత పురాతనమైనదే కాకుండా.. విస్తృతమైన బ్రాంచ్. రహదారులు, వంతెనలు, విమానాశ్రయాలు, హాస్పిటల్స్, సాగునీటి ప్రాజెక్టులు, గృహనిర్మాణాలు, అపార్ట్‌మెంట్లు, ఇతర మౌలిక వసతులన్నింటి ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణం, నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలన్నీ చూసేది సివిల్ ఇంజనీర్లే. సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో భాగంగా ముఖ్యంగా సాలిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్స్, స్ట్రక్చరల్ అనాలసిస్, సర్వేయింగ్, డిజైన్ ఆఫ్ ఆర్‌సీ స్ట్రక్చర్స్, డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్, ట్రాన్స్‌పొర్టేషన్ ఇంజనీరింగ్, క్యాడ్ తదితర అంశాలను బోధిస్తారు. గత కొన్నేళ్లుగా విద్యార్థులు ఆసక్తి చూపుతున్న బ్రాంచ్ ఇది. ఇటు ఉద్యోగావకాశాల పరంగానూ సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు జాబ్ మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. రియాలిటీ రంగం దూకుడు మీదుండటం సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు కలిసొస్తోంది. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే..భవిష్యత్తు ఖాయం అనేది నిస్సందేహం. అందుకే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను ఎంపిక చేసుకునే వారి సంఖ్య సైతం పెరుగుతోంది.

ఈసీఈ..ఇటు ఐటీ.. అటు కోర్.. 

ECE


ఈసీఈ.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్. బీటెక్ ఔత్సాహిక విద్యార్థుల రెండో ప్రాథమ్యంగా నిలుస్తోంది.. ఈసీఈ. ఈ బ్రాంచ్‌లో ప్రధానంగా.. ఎలక్ట్రానిక్ పరికరాలు, అనలాగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యుట్స్, శాటిలైట్ కమ్యూనికేషన్స్, మైక్రోవేవ్ ఇంజనీరింగ్, మైక్రోప్రాసెసర్స్, మైక్రో కంట్రోలర్స్, ట్రాన్సిమిటర్, రిసీవర్, ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్ పరికరాల తయారీ, యాంటెన్నా, కమ్యూనికేషన్ సిస్టమ్స్ గురించి అవగాహన కల్గిస్తారు. టీవీ, రేడియో, కంప్యూటర్స్, ఫోన్స్ వెనుక ఉన్నది ఈసీఈ ఇంజనీర్లే! ఈ బ్రాంచ్‌లో చేరడం వల్ల కోర్ సెక్టార్స్‌తోపాటు సాఫ్ట్‌వేర్ రంగంలోనూ కొలువులు సొంతం చేసుకునే అవకాశముంది. ఈసీఈ బ్రాంచ్‌తో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, అసెంచర్, సామ్‌సంగ్, వంటి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు పొందొచ్చు. మరోవైపు బీహెచ్‌ఈఎల్, ఎన్‌టీపీసీ, ఇస్రో, డీఆర్ డీవో, ఓఎన్‌జీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ కొలువులు సొంతం చేసుకోవచ్చు. రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతూ.. కొత్త టెక్నాలజీలు ఆవిష్కరిస్తుండటంతో విద్యార్థులు ఈసీఈని ప్రాథమ్యంగా ఎంపిక చేసుకుంటున్నారు. అందుకే ఐఐటీల్లో జనరల్ కేటగిరీలో మూడు వేల లోపు ర్యాంకుతోనే ఈ బ్రాంచ్ సీట్లన్నీ భర్తీ అవుతున్నాయి.

జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న కోర్సు.. కెమికల్ ఇంజనీరింగ్.. : 

Eng


విద్యార్థులను ఆకట్టుకుంటున్న మరో బ్రాంచ్.. కెమికల్ ఇంజనీరింగ్. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సూత్రాల ఆధారంగా కెమికల్ ఇంజనీరింగ్ పనిచేస్తుంది. కెమికల్ ఇంజనీరింగ్‌లో పరిశోధనల కారణంగా నానో టెక్నాలజీ, బయో ఇంజనీరింగ్, బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్, మెటీరియల్ ప్రాసెసింగ్ వంటి సరికొత్త విభాగాలు పుట్టుకొస్తున్నాయి. మానవ జీనోమ్ ప్రాజెక్టు, జెనిటిక్ ఇంజనీరింగ్, డీఎన్‌ఏ సీక్వెన్సింగ్ వంటివి కెమికల్ ఇంజనీరింగ్‌లో విప్లవాత్మక మార్పులకు దారితీశాయి. నాలుగేళ్ల కెమికల్ ఇంజనీరింగ్ కోర్సులో భాగంగా.. ఎయిర్‌పొల్యూషన్ కంట్రోల్, కెమికల్ ప్రాసెస్ ఇండస్ట్రీస్, ఎన్విరాన్‌మెంటల్ పొల్యూషన్ కంట్రోల్, సేఫ్టీ మేనేజ్‌మెంట్, ఇన్స్‌ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్,కెమికల్ రియాక్షన్ ఇంజనీరింగ్, ఫెర్టిలైజర్ టెక్నాలజీ వంటి అంశాలను విద్యార్థులు చదువుతారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలు హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్ వంటి పెట్రోలియం ఉత్పత్తుల సంస్థల్లో కెమికల్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతోంది. అదే విధంగా రీసెర్చ్ కార్యకలాపాలు పెరగడం.. జాతీయ స్థాయిలో సీఎస్‌ఐఆర్ లేబొరేటరీలు, డీఆర్‌డీఓ లేబొరేటరీల్లో సైతం కెమికల్ ఇంజనీర్లకు ఉద్యోగాల పరంగా డిమాండ్ నెలకొంది.

అప్‌కమింగ్ బ్రాంచ్.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్..

Aeronautical Eng


అప్‌కమింగ్ బ్రాంచ్‌గా ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌ను పేర్కొనొచ్చు. ముఖ్యంగా స్పేస్ క్రాఫ్ట్, ఎయిర్‌క్రాఫ్ట్‌ల డిజైన్, డవలప్‌మెంట్‌లకు సంబంధించిన బ్రాంచ్.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్ విద్యార్థులు ఎయిరోడైనమిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్, ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్, ఫ్లయిట్ మెకానిక్స్, ఎయిరోస్పేస్ ప్రొపల్షన్, థర్మోడైనమిక్స్ అండ్ ప్రొపల్షన్ వంటి అంశాలను అధ్యయనం చేస్తారు. క్షిపణి ప్రయోగాలు, అంతరిక్ష కార్యక్రమాల డిజైన్, డెవలప్‌మెంట్, టెస్టింగ్ పరంగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా ఈ బ్రాంచ్ పూర్తి చేసిన అభ్యర్థులు డీఆర్‌డీఓ, ఇస్రో వంటి సంస్థల్లో మెరుగైన అవకాశాలు అందుకోవచ్చు. మరోవైపు.. ప్రైవేటు రంగంలోనూ ఇటీవల కాలంలో ఏరోస్పేస్ ఇంజనీర్లకు సంస్థలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ రంగంలో కొత్త ఆపరేటర్లు ప్రవేశించడం, డొమెస్టిక్, కార్గో ఎయిర్‌లైన్స్ సంస్థలు విస్తరించడం కూడా ఏరోస్పేస్ ఇంజనీర్లకు మెరుగైన అవకాశాలు లభించేందుకు దోహదం చేస్తోంది.

ఎవర్ గ్రీన్ పవర్ కోర్సు.. ఈఈఈ.. 

EEE


ఈఈఈ.. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. కోర్ బ్రాంచ్‌గా సుపరిచితం. ఈఈఈ ద్వారా అకడెమిక్‌గా అటు ఎలక్ట్రికల్, ఇటు ఎలక్ట్రానిక్స్.. రెండింటిపైనా పట్టు లభిస్తుంది. ఫలితంగా రెండు రంగాలకు చెందిన పరిశ్రమల్లో కొలువు దీరొచ్చు. అందుకే ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తోంది.. ఈఈఈ బ్రాంచ్. ఈ బ్రాంచ్ విద్యార్థులు నాలుగేళ్ల కోర్సులో భాగంగా.. ఎలక్ట్రికల్ టెక్నాలజీ, మెషిన్స్, మోటార్లు, జనరేటర్లు, సర్క్యూట్ అనాలసిస్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నటిజమ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఇన్స్‌ట్రుమెంటేషన్, కంట్రోల్ సిస్టమ్స్, పవర్ ఇంజనీరింగ్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ తదితర అంశాలను చదువుతారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, బీహెచ్‌ఈఎల్, ఎన్‌హెచ్‌పీసీ, డీఎంఆర్‌సీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు టాటా, సామ్‌సంగ్, రిలయన్స్, సీమెన్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, హిటాచీ, జిందాల్ స్టీల్ అండ్ పవర్ వంటి ప్రైవేట్ కంపెనీల్లోనూ ఈఈఈ అభ్యర్థులు ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ప్రభుత్వ పరంగా విద్యుత్ రంగంలో అమలవుతున్న పథకాలు, ప్రైవేటు రంగంలో ఏర్పాటవుతున్న హైడల్ పవర్ ప్రాజెక్ట్‌ల కారణంగా రానున్న నాలుగేళ్లలో రెండు లక్షల మంది ఈఈఈ ఇంజనీర్ల అవసరం ఉంటుందని అంచనా. మరోవైపు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసే దిశగా సంస్థలు అడుగులు వేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, టీవీలు, వాషింగ్ మెషీన్స్ తదితరాలకు సంబంధించి అసెంబ్లింగ్ యూనిట్ల సంఖ్య దేశంలో పెరుగుతోంది. గత మూడు, నాలుగేళ్లుగా ఎన్‌ఐటీ, ఐఐటీల్లో చేరే విద్యార్థుల మూడో ప్రాథమ్యంగా ఈ బ్రాంచ్ నిలుస్తోంది.

మెకానికల్ ఇంజనీరింగ్.. ఎవర్ గ్రీన్

mechanical engineering


మెకానికల్ ఇంజనీరింగ్‌కు ఎవర్ గ్రీన్ బ్రాంచ్‌గా పేరుంది. ద్విచక్ర వాహనాల నుంచి విమానాల తయారీ వరకు.. మెకానికల్ ఇంజనీర్ల పాత్ర కీలకం. ముఖ్యంగా యంత్రాలు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ మోటార్లు, భారీ వాహనాల డిజైన్, తయారీ మెకానికల్ ఇంజనీర్లు లేకుండా సాధ్యం కాదు. నాలుగేళ్ల మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో భాగంగా.. థర్మోడైనమిక్స్, మెషిన్ డ్రాయింగ్, ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్, డైనమిక్స్ ఆఫ్ మెషినరీ, హీట్ అండ్ మాస్ ట్రాన్స్‌ఫర్ వంటి సబ్జెక్టులను అధ్యయనం చేస్తారు.

☛ చదవండి: బీటెక్‌లో ఈసీఈతో బంగారు భవిత అందుకోండి.. కెరీర్‌లో దూసుకెళ్లండి..

దేశంలో మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలు, ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌కు ఊతమిచ్చేలా అనుసరిస్తున్న విధానాలు మెకానికల్ ఇంజనీర్లకు అవకాశాలను మెరుగుపరుస్తున్నాయి. రోబోటిక్స్, ఆటోమేషన్, మానవ రహిత వాహనాల తయారీకి సంస్థలు వినూత్న ప్రయోగాలు చేస్తుండటం భవిష్యత్‌లో మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులకు కలిసొచ్చే అంశంగా మారింది.
ఐఐటీల్లో జనరల్ కేటగిరీలో నాలుగు వేలలోపు ర్యాంకుతో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సీట్లు భర్తీ అవుతున్నాయి. ఈ విభాగంలోని కొలువులను అందుకోవాలంటే.. ప్రస్తుతం సంస్థలు అనుసరిస్తున్న నూతన సాంకేతిక నైపుణ్యాలైన రోబోటిక్స్, ఆటోమేషన్, 3-డి డిజైన్ వంటి అంశాలపై కోర్సులో అడుగుపెట్టిన రోజు నుంచే పట్టు సాధించే దిశగా కృషి చేయాలి.

Engineering‌ Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోస‌మే!

బ్రాంచ్ ఏదైనా.. ఇదే ముఖ్యం..
ప్రస్తుతం పరిశ్రమ అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే.. సివిల్, సీఎస్‌ఈ, మెకానికల్, ఈసీఈ, ఎలక్ట్రికల్, కెమికల్ బ్రాంచ్‌లు ముందంజలో నిలుస్తున్న మాట వాస్తవమే. ఈ బ్రాంచ్‌లతో సర్టిఫికెట్ సొంతం చేసుకుంటే కొలువులు ఖాయం అనే అభిప్రాయముంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. ఏ బ్రాంచ్ విద్యార్థులైనా ఆ బ్రాంచ్‌కు సంబంధించి ఆధునిక టెక్నాలజీలపై పట్టు సాధించడం లక్ష్యంగా చేసుకోవాలి. ముఖ్యంగా రానున్న మూడేళ్లలో ఆటోమేషన్ ప్రభావం అధికంగా ఉంటుందనే అంచనాల దృష్ట్యా.. ఇందుకు సంబంధించిన నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ఇది కోర్ బ్రాంచ్‌ల విద్యార్థులకు సైతం వర్తిస్తుంది.
                                                                 - ప్రొఫెసర్ ఎన్.వి.రమణరావు, డెరైక్టర్, నిట్-వరంగల్

Published date : 09 Aug 2022 02:58PM

Photo Stories