Engineering Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోసమే!
-
ఏ బ్రాంచ్‌అయినా ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌సొంతం చేసుకోవడం ప్రధానం.
-
అన్ని రంగాల్లోనూ పెరుగుతున్న టెక్నాలజీ ఆధారిత కార్యకలాపాలు.
-
రానున్న రోజుల్లో ఏఐ, రోబోటిక్స్, ఆటోమేషన్‌కొలువులు అధికం.
-
బ్రాంచ్‌ఎంపికలో ఆసక్తి, అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటున్న నిపుణులు.
-
నిరంతర అధ్యయనం, స్వీయ అభ్యసన నైపుణ్యాలుంటేనే రాణించే అవకాశం.
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ఊపందుకుంటోంది. జాతీయ సంస్థలైన నిట్‌లు, ఐఐటీలు మినహా.. ఇతర అన్ని ఇన్‌స్టిట్యూట్‌లలో బీటెక్ అడ్మిషన్ల సందడి నెలకొంది! దాంతో ఏ బ్రాంచ్‌తో భవిష్యత్తు బాగుంటుంది.. నాలుగేళ్ల తర్వాత జాబ్ మార్కెట్లో ఎలాంటి ట్రెండ్ ఉంటుంది.. ప్రస్తుతం ఎలా ఉంది.. ఏ బ్రాంచ్ ఎంచుకుంటే మంచిది.. కాలేజీ ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... ఇలా ఎన్నో
సందేహాలు విద్యార్థులకు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. బీటెక్ ప్రవేశాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు బ్రాంచ్, కాలేజీ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆయా బ్రాంచ్‌లతో అవకాశాలు, జాబ్ మార్కెట్ ట్రెండ్స్ తదితర అంశాలపై విశ్లేషణ..
వాస్తవానికి ప్రస్తుతం జాబ్ మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. కావాల్సిందల్లా.. ఇండస్ట్రీ అవసరాలకు తగినట్లుగా తాజా నైపుణ్యాలను సొంతం చేసుకోవడమే. ఇటీవల కాలంలో అన్ని రంగాల్లో లేటెస్ట్‌టెక్నాలజీ( ఇండస్ట్రీ 4.0 స్కిల్స్) ఆధారంగా కార్యకలాపాలు సాగుతున్నాయి. వీటిని అందిపుచ్చుకుంటే ఏ బ్రాంచ్‌విద్యార్థులకైనా.. భవిష్యత్తు అవకాశాలు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
బ్రాంచ్ సెలక్షన్
- బీటెక్‌లో చేరాలనుకుంటున్న విద్యార్థుల్లో ఎదురవుతున్న మొదటి సందేహం.. ఏ బ్రాంచ్‌సెలక్ట్‌చేసుకుంటే బాగుంటుంది?! అనేది. ఈ విషయంలో ప్రధానంగా రెండు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి..
- ఒకటి, వ్యక్తిగత ఆసక్తి, వ్యక్తిగత సామర్థ్యాలు; కాగా రెండోది, జాబ్‌మార్కెట్‌ప్రస్తుత పరిస్థితులు; విద్యార్థులు ఈ రెండింటినీ బేరీజు వేసుకుంటూ.. భవిష్యత్తు అవకాశాలపై అంచనాతో తమ ఆసక్తికి అనుగుణంగా బ్రాంచ్‌ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- బీటెక్‌తర్వాత కార్పొరేట్‌కొలువే లక్ష్యమైతే.. దానికి అనుగుణంగా వాస్తవ పరిస్థితుల్లో అమలవుతున్న తాజా నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
బ్రాంచ్‌ల వారీగా అవకాశాలు
సీఎస్‌ఈ
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్.. సీఎస్‌ఈ. ఇది ప్రస్తుతం ఎక్కువ మంది ఎంచుకునే బ్రాంచ్. ప్రస్తుతం జాబ్ మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. సీఎస్‌ఈ విద్యార్థులకు అవకాశాలు మెరుగ్గా లభిస్తున్నాయి. నేటి డిజిటల్ యుగంలో.. సీఎస్‌ఈ విద్యార్థులకు కొలువులకు కొదవలేదని చెప్పొచ్చు. కాని ఈ బ్రాంచ్‌ను ఎంచుకునే విద్యార్థులకు ప్రాథమికంగా కొన్ని నైపుణ్యాలు ఉండాలి. అవి.. మ్యాథమెటికల్ స్కిల్స్, కంప్యుటేషనల్ థింకింగ్. అంతేకాకుండా సీఎస్‌ఈలో చేరాక కోడింగ్, ప్రోగ్రామింగ్‌పై పట్టు సాధించాలి. అప్పుడే సీఎస్‌ఈలో చేరిన ఉద్దేశం నెరవేరుతుంది.
చదవండి: ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో ఈ సాఫ్ట్‌వేర్ కోర్సులదే హవా..
ఈసీఈ
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్(ఈసీఈ) బ్రాంచ్ నైపుణ్యాలతో కోర్‌సెక్టార్స్‌తోపాటు సాఫ్ట్‌వేర్ రంగంలోనూ కొలువులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. శరవేగంగా విస్తరిస్తున్న టెలికం రంగం..ఆధునిక సాంకేతిక విధానాలు.. నైపుణ్యాలున్న మానవ వనరుల కోసం సంస్థలు అన్వేషిస్తుండటం వంటివి ఈసీఈ విద్యార్థులకు వరంగా మారుతున్నాయి.
చదవండి: బీటెక్‌లో ఈసీఈతో బంగారు భవిత అందుకోండి.. కెరీర్‌లో దూసుకెళ్లండి..
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్(ఈఈఈ). ఈ బ్రాంచ్ విద్యార్థులు.. ఇటు ఎలక్ట్రికల్ రంగం.. అటు ఎలక్ట్రానిక్స్ రంగం.. ఇలా రెండు రంగాలకు చెందిన పరిశ్రమల్లో కొలువు దీరొచ్చు. భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్న బ్రాంచ్‌గా ఈఈఈ ప్రాధాన్యం సంతరించుకుంది. పలు అంచనాల ప్రకారం–దేశంలో నిర్మితమవుతున్న ప్రాజెక్ట్‌లు, పథకాల కారణంగా రానున్న అయిదేళ్లలో దాదాపు మూడు లక్షల మంది ఎలక్ట్రికల్ ఇంజనీర్ల అవసరం ఏర్పడనుంది.
చదవండి: బీటెక్‌లో ఈఈఈతో భవిష్యత్తుకు భరోసా ఉంటుందా.. తెలుసుకోండిలా..
సివిల్ ఇంజనీరింగ్
మరో బ్రాంచ్.. సివిల్ ఇంజనీరింగ్. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, మౌలిక వసతులకు ప్రాధాన్యం, హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వంటి పథకాలు.. సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థుల భవిష్యత్తుకు వేదికలుగా నిలవనున్నాయి.
చదవండి: ఎవర్‌గ్రీన్ సివిల్ ఇంజనీరింగ్.. కెరీర్ అవకాశాలు ఇలా..
మెకానికల్ ఇంజనీరింగ్
ఎన్నో ఏళ్లుగా ఎవర్ గ్రీన్‌గా బ్రాంచ్‌గా నిలుస్తోంది.. మెకానికల్ ఇంజనీరింగ్. ఆటో మొబైల్ మొద లు.. విమానాల తయారీ వరకూ.. మెకానికల్ ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకం. ఇటీవల కాలంలో దేశంలో మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలు, ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌కు ఊతమిచ్చేలా అనుసరిస్తున్న విధానాలు కూడా మెకానికల్ ఇంజనీర్లకు కొలువులకు మార్గం వేస్తున్నాయి. ప్రైవేటు రంగంలో రోబోటిక్స్,ఆటో మొబైల్ సంస్థల వినూత్న ప్రయోగాలు.. మెకానికల్ విద్యార్థులకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ప్రస్తుతం సంస్థలు అనుసరిస్తున్న రోబోటిక్స్, ఆటోమేషన్, 3–డి డిజైన్‌వంటి స్కిల్స్‌పై పట్టు సాధిస్తే.. చక్కటి అవకాశాలు అందుకోవచ్చు.
కెమికల్ ఇంజనీరింగ్
ఇటీవల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలు హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌వంటి పెట్రోలియం ఉత్పత్తుల సంస్థల్లో కెమికల్ ఇంజనీర్ల అవసరం ఏర్పడింది. అదే విధంగా జాతీయ స్థాయిలోని సీఎస్‌ఐఆర్‌లేబొరేటరీలు, డీఆర్‌డీఓ లేబొరేటరీల్లో సైతం కెమికల్ ఇంజనీర్లకు డిమాండ్ నెలకొంది.
ఏరోస్పేస్ ఇంజనీరింగ్
అంతరిక్ష ప్రయోగాలు, క్షిపణుల డిజైన్, డెవలప్‌మెంట్, టెస్టింగ్‌పరంగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి డీఆర్‌డీఓ, ఇస్రో వంటి సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రైవేటు రంగంలోనూ ఏరోస్పేస్ ఇంజనీర్లకు సంస్థలు ఆహ్వానం పలుకుతున్నాయి.
బయో టెక్నాలజీ
బయో టెక్నాలజీ.. ఇటీవల కాలంలో దీనికి ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా పరిణామాల్లో బయోటెక్‌కు ప్రాధాన్యం పెరిగిందని చెప్పొచ్చు. ప్లాంట్‌బయోటెక్నాలజీ, హ్యూమన్‌బయోటెక్నాలజీ, యానిమల్‌బయోటెక్నాలజీ వం టి విభాగాల్లో పరిశోధనలు విస్తృతం అవుతున్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఫార్మా సంస్థల్లో సైతం అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ సంస్థల్లోనూ ఉద్యోగాలు దక్కించుకునే అవకాశముంది.
బయోమెడికల్ ఇంజనీరింగ్
మెడికల్‌విభాగంలో ఇంజనీరింగ్ నైపుణ్యాలను అన్వయిస్తూ.. డయాగ్నస్టిక్‌మెషీన్స్‌ను రూపొందించే విభాగం.. బయోమెడికల్ ఇంజనీరింగ్. మెడికల్ ఎక్విప్‌మెంట్ ప్రొడక్షన్ సంస్థలు, కార్పొరేట్ హాస్పిటల్స్ వీరికి ప్రధాన ఉపాధి వేదికలు.
నావల్ ఆర్కిటెక్చర్/మెరైన్ ఇంజనీరింగ్
నావల్ ఆర్కిటెక్చర్/మెరైన్ ఇంజనీరింగ్ కోర్సు ద్వారా అభ్యర్థులకు షిప్‌బిల్డింగ్, షిప్‌డిజైన్, హార్బర్‌టెక్నాలజీ నైపుణ్యాలు లభిస్తాయి. కోర్సు పూర్తి చేసిన తర్వాత షిప్ ఆర్కిటెక్ట్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, లాజిస్టిక్స్ విభాగాల్లో సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు లభించడం ఖాయం.
టెక్స్‌టైల్ టెక్నాలజీ
ఆధునిక అవసరాలకు అనుగుణంగా శరవేగంగా వృద్ధి చెందుతున్న మరో రంగం.. టెక్స్‌టైల్ పరిశ్రమ. ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో.. టెక్స్‌టైల్ టెక్నాలజీ/టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులకు డిమాండ్ నెలకొంది. ప్రొడక్షన్, రా మెటీరియల్ ప్రాసెసింగ్ నైపుణ్యాలు అందించే ఈ కోర్సు పూర్తి చేస్తే.. టెక్స్‌టైల్ పరిశ్రమలతోపాటు.. కేంద్ర జౌళి శాఖలోనూ ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
బ్రాంచ్, ఇన్‌స్టిట్యూట్.. దేనికి ప్రాధాన్యం
- ప్రస్తుతం పదుల సంఖ్యలో ఇంజనీరింగ్ బ్రాంచ్‌లు.. వందల సంఖ్యలో కళాశాలలు. దాంతో విద్యార్థులు బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీ ముఖ్యమా.. అనే సందిగ్ధంలో ఉంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం–బ్రాంచ్ ఎంపికలో విద్యార్థులు.. ఆసక్తికి, అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
- బెస్ట్‌ఇన్‌స్టిట్యూట్‌లో ఏ బ్రాంచ్‌లో చేరినా.. సదరు ఇన్‌స్టిట్యూట్‌కున్న ప్రామాణికత ఆధారంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కానీ.. విద్యార్థులు తమకు ఆసక్తి లేని బ్రాంచ్‌లో చేరితే.. నాలుగేళ్ల పాటు సదరు సబ్జెక్టులను చదవడం కష్టతరంగా మారే ఆస్కారముంది.
అనుబంధ బ్రాంచ్‌లపైనా
విద్యార్థులకు తమకు నచ్చిన బ్రాంచ్‌లో సీటు లభించే అవకాశాలు తక్కువగా ఉంటే.. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలి. ప్రధాన బ్రాంచ్‌లకు అనుబంధంగా కొత్త బ్రాంచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు సీఎస్‌ఈకి అనుబంధంగా ఐటీని; ఈసీఈకి అనుబంధంగా ఈటీఎం(ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికం మేనేజ్‌మెంట్)ను; మెకానికల్‌కు అనుబంధంగా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లేదా ఆటో మొబైల్ ఇంజనీరింగ్ వంటివి. వీటిని ఎంచుకోవచ్చు.
ఇన్‌స్టిట్యూట్ ఎంపిక
- ఇన్‌స్టిట్యూట్ ఎంపికలో.. విద్యార్థులు ప్రధానంగా నిబంధనలకు అనుగుణంగా సదుపాయాలు ఉన్నాయా? లేదా? అనేది పరిశీలించాలి. ఫ్యాకల్టీ అర్హతలు, ప్రొఫెసర్ల సంఖ్య, న్యాక్, ఎన్‌బీఏ తదితర సంస్థల గుర్తింపు సదరు ఇన్‌స్టిట్యూట్‌కు ఉందా అనేది తెలుసుకోవాలి. అకడెమిక్‌రికార్డ్, ప్లేస్‌మెంట్స్, పీహెచ్‌డీ ఫ్యాకల్టీ, ల్యాబ్స్, లైబ్రరీ, మౌలిక వసతుల ఆధారంగా ఇన్‌స్టిట్యూట్స్‌జాబితా రూపొందించుకోవాలి. ఆయా కళాశాలలకు ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించాలి.
ఆసక్తే ప్రధానం
బీటెక్‌లో చేరనున్న విద్యార్థులు బ్రాంచ్‌ఎంపికలో ఆసక్తికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులకు అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. బీటెక్‌లో చేరిన విద్యార్థులు కొత్త నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో అవకాశం వచ్చిన విద్యార్థులు.. బ్రాంచ్‌విషయంలో అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న కరిక్యులం ప్రకారం–ఇంటర్‌డిసిప్లినరీ విధానంలో బోధన సాగుతోంది. దీంతో విద్యార్థులు మేజర్‌తోపాటు మైనర్‌గా తమకు నచ్చిన బ్రాంచ్‌కు సంబంధించిన అంశాల్లో నైపుణ్యం పొందే అవకాశం ఉంది.
- ప్రొ‘‘ఎన్.వి.రమణరావు, డైరెక్టర్, నిట్ వరంగల్