EAMCET 2023: ఎంసెట్.. టాప్ స్కోర్ ఇలా!
- టీఎస్ ఎంసెట్-2023 తేదీలు ఖరారు
- మే 7 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ విభాగం పరీక్ష
- అన్వయ దృక్పథం, కాన్సెప్ట్‌లపై పట్టుతోనే విజయం
ఎంసెట్.. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు పరిచయం అక్కర్లేని పరీక్ష. ఈ ఎంట్రన్స్‌లో విజయం సాధించి.. రాష్ట్ర స్థాయిలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో సీటు సొంతం చేసుకోవాలని లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. మే 7వ తేదీ నుంచి టీఎస్ ఎంసెట్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇటీవల ప్రకటించింది. కాబట్టి ఇప్పటి నుంచి నిర్దిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ సాగిస్తే.. మంచి ర్యాంకు సొంతం చేసుకునే అవకాశముంది.
మే 7 నుంచి 11 వరకు
టీఎస్ ఎంసెట్-2023.. ఇంజనీరింగ్ విభాగం పరీక్షలను మే 7 నుంచి 11 వరకు ఆన్‌లైన్ విధానంలో అయిదు రోజులపాటు నిర్వహించనున్నారు. అంటే.. అభ్యర్థులకు దాదాపు రెండున్నర నెలల సమయం అందుబాటులో ఉంది. అయితే మార్చి 2 వరకు ప్రాక్టికల్ పరీక్షలు, ఆ తర్వాత మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు బోర్డ్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఇంటర్ బోర్డ్ పరీక్షల తర్వాత ప్రిపరేషన్‌కు లభించే సమయం నెల రోజులు మాత్రమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఇప్పటి నుంచే నిర్దిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలి.
చదవండి: Engineering Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోసమే!
ఎంసెట్ పరీక్ష ఇలా
ఎంసెట్ పరీక్ష మొత్తం 160 ప్రశ్నలు-160 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఇందులో ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40, మ్యాథమెటిక్స్ నుంచి 80 ప్రశ్నలు ఉంటాయి. అంటే.. మ్యాథమెటిక్స్‌కు ఎక్కువ వెయిటేజీ ఉంటుందని గుర్తించాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి మొదటి, ద్వితీయ సంవత్సరం సిలబస్‌లోని అన్ని టాపిక్స్‌పై పూర్తి పట్టు సాధించాలి.
70 శాతం సిలబస్
టీఎస్ ఎంసెట్-2023లో.. ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలుంటాయని తెలంగాణ ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.ప్రస్తుతం ద్వితీయం సంవత్సరంలో ఉన్నవారు 2021-22లో ప్రథమ సంవత్సరం చదివారు. ఆ సమయంలో కోవిడ్ కారణంగా బోర్డ్ సిలబస్‌ను 70 శాతానికి కుదించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇది విద్యార్థులకు ప్రిపరేషన్ పరంగా కొంత అనుకూలించే అంశంగా చెప్పొచ్చు. తొలగించిన 30 శాతం సిలబస్‌కు కొనసాగింపు ఉండే అంశాలను చదివే విషయంలో విద్యార్థులు కొంత ఇబ్బంది ఎదుర్కొనే ఆస్కారముంది. దీన్ని అధిగమించేందుకు తొలగించిన సిలబస్ అంశాలు, వాటికి కొనసాగింపుగా ఉన్న టాపిక్స్‌ను పరిశీలిస్తూ.. ప్రాథమిక భావనలు, సిద్ధాంతాలు, సూత్రాలపై అవగాహన పెంచుకోవాలని సబ్జెక్ట్ నిపుణులు సూచిస్తున్నారు.
బోర్డ్ పరీక్షలకు ప్రాధాన్యం
ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రస్తుతం తమ ప్రిపరేషన్‌ను పూర్తిగా ఇంటర్మీడియెట్ పరీక్షలకే కేటాయించాలనేది నిపుణుల సూచన. వాస్తవానికి ఎంసెట్ లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రిపరేషన్‌ను పూర్తి చేసుకొని ఉంటారు. కాబట్టి ఎంసెట్ గురించి ఆందోళన చెందకుండా.. బోర్డ్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించేలా కృషిచేయాలని సూచిస్తున్నారు.
చదవండి: ఎంసెట్‌లో సత్తా చాటేలా.. ప్రిపరేషన్ సాగించండిలా..
వార్షిక పరీక్షల తర్వాత
బోర్డ్ పరీక్షలు పూర్తయ్యాక ఎంసెట్ ప్రిపరేషన్ కోసం పూర్తి సమయం కేటాయించాలి. వాస్తవానికి ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు..ఆ సమయాన్ని రివిజన్ కోసం వినియోగించుకునే విధంగా వ్యవహరించాలి. ప్రిపరేషన్ సమయంలో తాము రాసుకున్న సొంత నోట్స్,షార్ట్‌కట్స్‌ను అనుసరిస్తూ.. రివిజన్ సాగిస్తే సమయం ఆదా అవుతుంది.దీంతోపాటు ఎంసెట్ సిలబస్‌లో పేర్కొన్న అన్ని అంశాలను పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుంది.
కాన్సెప్ట్స్ ఆధారిత ప్రిపరేషన్
గత రెండు, మూడేళ్ల ఎంసెట్ ప్రశ్నల శైలిని గమనిస్తే.. అధిక శాతం ప్రశ్నలు అభ్యర్థులోని అప్లికేషన్ అప్రోచ్‌ను పరీక్షించే విధంగా ఉంటున్నాయి.కాబట్టి అభ్యర్థులు కాన్సెప్ట్స్ ఆధారిత ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిపరేషన్ దశ నుంచే అప్లికేషన్ దృక్పథాన్ని అనుసరించాలి. ఫలితంగా ఎంసెట్‌లో మంచి మార్కులు సాధించే అవకాశం లభిస్తుంది.
సమయ పాలన
విద్యార్థులు ఇంటర్మీడియెట్ పరీక్షల తర్వాత ప్రిపరేషన్ కోసం ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్‌కు మూడు గంటలు చొప్పున సమయం కేటాయించుకునేలా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి. ఇలా ఒక్కో సబ్జెక్ట్‌కు నిర్దేశించుకున్న మూడు గంటల వ్యవధిలో మొదటి పదిహేను నిమిషాలను అంతకుముందు రోజు చదివిన అంశాల పునరావలోకనం కోసం కేటాయించాలి. ప్రిపరేషన్ సమయంలోనే ముఖ్యాంశాలతో షార్ట్ నోట్స్ రాసుకోవాలి. దీనివల్ల పరీక్షకు వారం రోజుల ముందు క్విక్ రివిజన్‌కు అవకాశం లభిస్తుంది.
మోడల్ టెస్ట్‌లకు హాజరు
ఇంటర్మీడియెట్ పరీక్షల తర్వాత ఎంసెట్‌కు పూర్తి సమయం కేటాయించే అభ్యర్థులు.. ఆ సమయంలోనే మోడల్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరవ్వాలి. వీటి ఫలితాలను విశ్లేషించుకోవాలి. తద్వారా తమ సామర్థ్య స్థాయి, ఇంకా పట్టు సాధించాల్సిన అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి. ఒకవేళ ఆయా అంశాలు క్లిష్టంగా ఉండి..ప్రస్తుత సమయంలో పట్టు సాధించలేమని భావిస్తే.. కనీసం ప్రాథమిక భావనల గురించి తెలుసుకోవాలి.
జేఈఈతో అనుసంధానం
ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థుల్లో అధిక శాతం.. జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్‌లకు కూడా సన్నద్ధమవుతుంటారు. ఇలాంటి అభ్యర్థులు జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షలతో ఎంసెట్ ప్రిపరేషన్‌ను అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ఫలితంగా ఒకే సమయంలో మూడు పరీక్షలకు సన్నద్ధత లభిస్తుంది. జేఈఈ-మెయిన్-2023 సెషన్-2 పరీక్షలు.. ఏప్రిల్ 6 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు సీరియస్ ప్రిపరేషన్ సాగిస్తే.. అది ఎంసెట్‌లో టాప్ స్కోర్ సాధించేందుకు ఉపయోగపడుతుంది.
100కు పైగా సాధించేలా
టీఎస్ ఎంసెట్ అభ్యర్థులు 100కు పైగా మార్కులు సాధించేలా కృషి చేయాలి. ఇంజనీరింగ్ కళాశాలలు, సీట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. 70 మార్కులు సాధించినా సీటు లభించే అవకాశం ఉంది. కాని బెస్ట్ కళాశాలల్లో సీటు సొంతం చేసుకోవాలంటే.. 100కు పైగా మార్కులు సాధించే ప్రయత్నం చేయాలి. అదే విధంగా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, టాప్-10 కళాశాలల్లో సీటు పొందాలంటే.. జనరల్ కేటగిరీ అభ్యర్థులు మరింత ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఎంసెట్ అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో సిలబస్‌లోని అన్ని అంశాలపై పట్టు సాధించేలా వ్యవహరించాలి. అప్పుడే.. పరీక్షలో వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
సబ్జెక్ట్‌ల వారీగా.. కీలక టాపిక్స్
మ్యాథమెటిక్స్
కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్. దీంతోపాటు 3-డి జామెట్రీ; కో ఆర్డినేట్ జామెట్రీ; వెక్టార్ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్; కాంప్లెక్స్ నెంబర్స్; పారాబోలా; ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్; క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్; థియరీ ఆఫ్ ఈక్వేషన్స్; పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్;బైనామియల్ థీరమ్;లోకస్ అంశాలపై పూర్తి స్థాయి అవగాహన అవసరం.
ఫిజిక్స్
ఎలక్ట్రో డైనమిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెచ్‌ఎం అండ్ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. అదే విధంగా సెంటర్ ఆఫ్ మాస్, మొమెంటమ్ అండ్ కొలిజన్; సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వేవ్స్‌లో లోతైన అవగాహన ఏర్పరచుకుంటే.. మంచి మార్కులు సొంతం చేసుకునే అవకాశాలు మెరుగవుతాయి.
కెమిస్ట్రీ
కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హలైడ్; ఆల్కహారల్ అండ్ ఈథర్, కార్బొనైల్ కాంపౌండ్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మో కెమిస్ట్రీ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. వీటితోపాటు మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి.
ప్రిపరేషన్ టిప్స్
- ప్రతి రోజు, ప్రతి సబ్జెక్ట్‌కు మూడు గంటలు తక్కువ కాకుండా సమయం కేటాయించాలి.
- ప్రాక్టీస్ టెస్ట్‌లు,మాక్ టెస్ట్‌లకు హాజరు కావాలి.
- ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయడం లాభిస్తుంది.
- టాపిక్ వైజ్ వెయిటేజీని పరిగణనలోకి తీసుకుని.. అత్యధిక వెయిటేజీ ఉన్న వాటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి.
- జేఈఈ-మెయిన్, ఎంసెట్‌ను అనుసంధానం చేసుకుంటూ చదవాలి.
- స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు, ఏఆర్ టైప్ కొశ్చన్స్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
టీఎస్ ఎంసెట్-2023.. ముఖ్య సమాచారం
- మే 7 నుంచి 11 వరకు ఎంసెట్(ఇంజనీరింగ్ స్ట్రీమ్).
- ఇంటర్మీడియెట్ ఎంపీసీ అర్హతతో పోటీ పడే అవకాశం.
- ద్వితీయ సంవత్సరం అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- మొదటి సంవత్సరంలో 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు.