Skip to main content

TS EAMCET 2024: ఎంసెట్‌లో ఆ ర్యాంకు వస్తే.. టాప్‌ కాలేజీల్లో సీటు పక్కా

TS EAMCET 2024

సాక్షి, హైదరాబాద్‌:   టీఎస్‌ఈఏపీ ఫలితాలు ప్రకటించడంతో ఇంజనీరింగ్‌ సీట్ల కోసం విద్యార్థుల హడావుడి మొదలైంది. తనకు వచ్చిన ర్యాంకుకు ఏ కాలేజీలో బ్రాంచిలో సీటొస్తుంది? ఏ కాలేజీలో ఎంత ర్యాంకు వరకు సీటు వచ్చే అవకాశం ఉంది? కౌన్సెలింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తదితర సవాలక్ష ప్రశ్నలు విద్యార్థులను వెంటాడుతున్నాయి. దీంతో కన్సల్టెన్సీలను, నిపుణులను సంప్రదిస్తున్నారు. తల్లిదండ్రులతో కలిసి ర్యాంకు గురించి చర్చిస్తున్నారు. 

కౌన్సెలింగ్‌ తేదీలు ప్రకటించేలోగా స్పష్టమైన సమాచారంతో సిద్ధంగా ఉంటే మంచిదని భావిస్తున్నారు. వాస్తవానికి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ మొదలయ్యేలోగా కొంత కసరత్తు అవసరమని నిపుణులు కూడా అంటున్నారు. తొలిదశ కౌన్సెలింగ్‌లో ఖచ్చితమైన ఆప్షన్లు పెట్టుకుంటే సీటు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గత ఏడాది కటాఫ్‌ను పరిశీలిస్తే కొంత స్పష్టత వచ్చే వీలుందని పేర్కొంటున్నారు.  

TS Inter Supplementary Exam 2024: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి .....


టెన్షన్‌ అవసరమే లేదు 
ఐదేళ్ళ క్రితం ఇంజనీరింగ్‌లో కంప్యూటర్‌ బ్రాంచిలకు తీవ్ర స్థాయిలో పోటీ ఉండేది. అయితే డిమాండ్‌ ఉన్న కోర్సులకే కాలేజీలు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల గత రెండేళ్ళుగా కంప్యూటర్‌ సైన్స్‌లో సీట్లు పెరిగాయి. గత ఏడాది ఏకంగా 14 వేల సీట్లు కొత్తగా వచ్చాయి. కాబట్టి సీటు కోసం టెన్షన్‌ పడాల్సిన అవసరమే లేదని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే వచి్చన ర్యాంకును బట్టి సీటు ఎక్కడ వస్తుందనేది సరిగ్గా అంచనా వేసి, ఆ దిశగా ఆప్షను ఇవ్వాలి. 

అవసరమైతే రెండో దశ కౌన్సెలింగ్‌ లేదా ఆఖరి దశలో సీట్లు మిగిలితే నచ్చిన కాలేజీని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం పరిస్థితిని బట్టి చూస్తే ఈ ఏడాది కూడా సీఎస్‌ఈలో పోటీ అదే విధంగా ఉండే వీలుంది. యూనివర్సిటీ క్యాంపస్‌లో సీఎస్‌ఈ బ్రాంచిలో సీటు రావాలంటే ఈఏపీ సెట్‌లో ఓపెన్‌లో 4 వేల లోపు ర్యాంకు వచ్చి తీరాలని నిపుణులు అంటున్నారు. 

టాప్‌ కాలేజీల్లో రావాలంటే 8 వేల లోపు ర్యాంకు అవసరమని స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో సాధారణ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఈ సంవత్సరం 60 వేల ర్యాంకు వచ్చినా సీఎస్‌ఈలో సీటు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నారు. జేఎన్‌టీయూ సుల్తాన్‌పూర్‌ క్యాంపస్‌లో పోటీ తక్కువగా ఉంటోంది. 19 వేల ర్యాంకు వరకు సీటు వచ్చే వీలుంది.  

అందరి దృష్టీ సీఎస్‌ఈపైనే 
ఏ స్థాయిలో ర్యాంకు వచ్చినా విద్యార్థి ముందుగా కోరుకునేది కంప్యూటర్‌ సైన్స్‌ సీటు. గత మూడేళ్ళుగా విద్యార్థులు పెట్టే ఆప్షన్లు చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది. గత ఏడాది 58 శాతం కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లకే అప్షన్లు ఇచ్చుకున్నారు. అయితే సరైన ర్యాంకు రాకపోయినా టాప్‌ కాలేజీలకు ప్రాధాన్యత ఇస్తూ అప్షన్లు పెడుతున్నారు. ఆఖరి దశ కౌన్సెలింగ్‌ వరకూ ఇదే తరహా ఆప్షన్లు ఇస్తున్నారు. 

ఫలితంగా తన ర్యాంకుకు వచ్చే కాలేజీని, బ్రాంచిని మొదటి రెండు దశల కౌన్సెలింగ్‌లోనే పోగొట్టుకుంటున్నారు. ఉదాహరణకు ఓ విద్యార్థికి 16 వేల ర్యాంకు వచ్చింది. అతనికి టాప్‌ టెన్‌లో కాకుండా వేరే కాలేజీలో కోరుకున్న బ్రాంచిలో సీటు వచ్చే వీలుంది. కానీ ఆప్షన్లు పెట్టే సమయంలో టాప్‌ టెన్‌కే పరిమితమ అవుతున్నారు. దీంతో కోరుకున్న కాలేజీ రావడం లేదు. ఇలా చేయడం వల్ల తనకు వచ్చేందుకు అవకాశం ఉన్న కాలేజీలోనూ సీటు పోగొట్టుకుంటున్నారు.  

TS EAMCET 2024 Counselling Dates : టీఎస్ ఈఏపీసెట్(ఎంసెట్)-2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌.. ఎప్పుడంటే..? సీట్ల‌ కేటాయింపు తేదీలు ఇవే..!


ఆప్షన్లుఇచ్చేటప్పుడు అప్రమత్తత అవసరం 
ఆప్షన్లు ఇచ్చేప్పుడు విద్యార్థులు అన్ని అంశాలను పరిశీలించాలి. గత కొన్నేళ్లలో ఏ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వచ్చిందనే అంశాన్ని పరిశీలించాలి. టాప్‌ కాలేజీలకే ప్రాధాన్యత ఇస్తూ ఆప్షన్లు ఇవ్వాలనే ధోరణి సరికాదు. 

ఈ దిశగా అనేక కౌన్సెలింగ్‌ల కోసం వేచి చూడటం మంచిది కాదు. మీకు సీటు వచ్చే వీలున్న కాలేజీని మీరు వదులుకుంటే, ఇతరులు ఆ సీటులో చేరతారు. అందువల్ల జాగ్రత్తగా కాలేజీని, బ్రాంచిని ఎంపిక చేసుకోవాలి. అవసరమైతే మంచి కాలేజీ కోసం తర్వాత కౌన్సెలింగ్‌లో ప్రయత్నించాలి.  
 – ఎంఎన్‌రావు (గణిత శాస్త్ర నిపుణుడు) 

Published date : 22 May 2024 01:26PM

Photo Stories