Skip to main content

Engineering Seats: 2,640 ఇంజనీరింగ్‌లో పెరిగిన సీట్లు.. మరో 4 వేల సీట్లకు చాన్స్‌..

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌లో సీట్లు మరో 2,640 పెరిగాయి. ఇవన్నీ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఏఐఎంఎల్, డేటాసైన్స్, సైబర్‌ సెక్యూరిటీ బ్రాంచీలకు సంబంధించినవే కావడం గమనార్హం. కాగా కొత్త వాటితో కలుపుకొని మొత్తం 1,01,661 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 72,741 సీట్లు కన్వీనర్‌ కోటా కింద ఉంటాయి.
2640 increased seats in engineering  EngineeringSeatsIncrease  HyderabadAdmissions NewComputerCourses

వాస్తవానికి కొత్తగా 20 వేల సీట్ల పెంపునకు కాలేజీలు దరఖాస్తు చేశాయి. అయితే ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు పెంచడాన్ని అధికారులు వ్యతిరేకించారు. అన్ని సదుపాయాలు, ఫ్యాకల్టీ ఉన్న 20 కాలేజీల్లో కూడా ప్రతీ బ్రాంచిలో 120 సీట్లకు మించి పెంచడం సరికాదని ప్రభుత్వానికి సూచించారు. 

ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేవలం 2,640 సీట్లకు మాత్రమే అనుమతి తెలిపింది. సీట్ల పెరుగుదల నేపథ్యంలో జూలై 17 వరకు ఆప్షన్లు ఇచ్చుకునే వెసులుబాటు కల్పించినట్టు సాంకేతిక విద్య కమిషనర్‌ దేవసేన తెలిపారు. ఇప్పటివరకు 95,383 మంది ఆప్షన్లు ఇచ్చారని వెల్లడించారు. 

చదవండి: College Predictor - 2024 (AP & TG EAPCET, POLYCET & ICET)

మరో 4 వేల సీట్లకు చాన్స్‌..

కొత్త కంప్యూటర్‌ కోర్సులు వచ్చిన నేపథ్యంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) వంటి బ్రాంచీలకు ఆదరణ తగ్గింది.

దీంతో ఈ కోర్సుల స్థానంలో సీఎస్‌ఈ, ఇతర కంప్యూటర్‌ కోర్సులకు అనుమతించే అంశాన్ని అధికారులు పరి శీలిస్తున్నారు. ఇదే జరిగితే మరో 4 వేల సీట్లు వచ్చే అవకాశం ఉంది. మరో విడత కౌన్సెలింగ్‌కు ఈ సీట్లు అందుబాటులోకి వచ్చే వీలుంది. 

కాగా  ఈ ఏడాది సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ బ్రాంచీలు రద్దు చేయాలని పలు కాలేజీలు దరఖాస్తు పెట్టుకున్నాయి.

ఈ సీట్లు 3 వేల వరకూ ఉన్నాయి. అయితే యూనివర్సిటీలు గుర్తించిన సీట్లు మాత్రం 1,770 సీట్లు మాత్రమే. వీటి స్థానంలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ సీట్లు ఇచ్చే విషయంలో ప్రభుత్వం విముఖతతో ఉంది.

చదవండి: Top 20 Engineering (Branch wise) Colleges in Telangana - Click Here

 సీఎస్‌ఈ, ఇతర కంప్యూటర్‌ నాన్‌ కోర్‌ గ్రూపులు కలిపి 48 వేల కన్వీనర్‌ కోటా సీట్లుండగా, మెకానికల్‌లో 2,979,  సివిల్‌లో 3,132, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో 4,202 సీట్లు మాత్రమే ఉన్నాయి.

వాస్తవానికి ఈ సీట్లలో కూడా ఏటా 40 శాతం మించి ప్రవేశాలు ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే ఉన్న ఆ కొన్ని సీట్లను తగ్గించేందుకు ప్రభుత్వం అంగీకరించడం లేదు. 

కొత్త సీట్లపై తర్జనభర్జన..

వాస్తవానికి కొత్త సీట్ల విషయంలో ప్రభుత్వం తర్జనభర్జన పడింది. సీట్లు పెంచడం వల్ల పడే ఆర్థిక భారంపై ఆరా తీసింది. కన్వీనర్‌ కోటా కింద కేటాయించే ప్రతి సీటుకు రూ.35 వేల వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయాలి.

10 వేల లోపు ర్యాంకు వస్తే మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం సగటున ఏడాదికి రూ.35 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. నాలుగేళ్లకు రూ. 100 కోట్ల భారం పడుతుందని లెక్కగట్టారు. 

Published date : 17 Jul 2024 12:11PM

Photo Stories