Artificial Intelligence: భవిత ‘ఏఐ’తుందో..?.. యువతలో గుబులు పుట్టిస్తున్న కృత్రిమ మేధ.. కారణం ఇదే..

ఈ టెక్నాలజీ వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కొన్ని సంస్థలు చెబుతుంటే మరికొన్ని సంస్థలు మాత్రం ఏఐ రాకతో ఉపాధికి గండి తప్పదని వాదిస్తున్నాయి. అయితే వృత్తి నైపుణ్యం, సాంకేతికతతో పోటీపడే సామర్థ్యం పెంపొందించుకోవడం ద్వారానే యువత ఉపాధికి ఢోకా ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఏఐ భాషా విధానంపై విశ్వవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు పలు సంస్థలు రంగంలోకి దిగాయి.
ఏఐ స్పీడ్ ఎంత?
గ్లోబల్ సిస్టమ్ అనే సంస్థ రూపొందించిన తాజా నివేదిక ప్రకారం ఏఐ వేగం కోసం భారత్ పరుగులు పెడుతోంది. తెలంగాణ సహా దేశంలోని అన్ని ప్రధాన ఐటీ నగరాలు ఏఐ టెక్నాలజీపై విస్తృతంగా పనిచేస్తున్నాయి. ఏఐ స్టార్టప్స్‌లో బెంగళూరు 21వ స్థానంలో, ఢిల్లీ 24, ముంబై 37, హైదరాబాద్ 41వ స్థానంలో ఉందని ఆ సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు ఏఐపై 40 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు స్కిల్ ఇండియా పేర్కొంది. మొత్తం 67200 కృత్రిమ మేధ సంస్థలున్నాయి.
అందులో 25 శాతం అమెరికాలోనే ఉన్నాయి. భారత్‌లో 1,67,000 స్టార్టప్స్ ఉంటే వాటిలో 6,636 సంస్థలు ఏఐపైనే పనిచేస్తున్నాయి. ఇవి ఈ రంగంపై రూ. లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టాయి. దేశంలోని ఆరోగ్య సేవా సంస్థలు ఏఐను ఉపయోగించి టెలి మెడిసిన్, వ్యక్తిగత ఆరోగ్య సేవలు, ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్ చేస్తున్నాయి. దేశీయ వైద్య సాంకేతికతల రంగంలో సుమారు 12 వేల స్టార్టప్స్ పనిచేస్తున్నాయి. ఫిన్‌టెక్ రంగంలో ఉన్న ఏఐ పెట్టుబడుల విలువ 90 వేల కోట్ల డాలర్లు. 2021లో దేశంలో 2,100 ఫిన్‌టెక్ కంపెనీలు ఉండగా ఇప్పుడు 10,200కు చేరాయి. స్టార్టప్ రంగంలో వ్యవస్థాపక పెట్టుబడులు 2021లో 53 వేల కోట్ల డాలర్లు. 2023 నాటికి భారీగా పెరిగింది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ఉపాధికి విఘాతమా?
స్కిల్ ఇండియా నివేదిక ప్రకారం దేశంలో 2026 నాటికి 10 లక్షల మంది ఏఐ నిపుణుల అవసరం ఉంది. దాదాపు 152 సంస్థల అవసరాలు, 3.88 లక్షల మంది నిపుణుల అభిప్రాయాలతో ఈ నివేదిక రూపొందింది. 2023 ఆగస్టు లెక్కల ప్రకారం దేశంలో 4.16 లక్షల మంది ఏఐ నిపుణులు ఉండగా ప్రస్తుతం 6.29 లక్షల మంది అవసరం ఉందని నివేదిక అంచనా వేసింది. ప్రపంచ మేధో సంపత్తి ఆర్థిక నవీకరణ సూచీ–2024 ప్రకారం 133 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 39వ స్థానంలో ఉంది. 2015లో 81వ స్థానంలో ఉంది. అంటే ఏఐ ఎంత వేగంగా దూసుకెళ్తుందో అర్థం చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.
అయితే ఏఐలో కీలకమైన లార్జ్ లాంగ్వేజీ మోడల్స్ (ఎల్‌ఎల్‌ఎం)పైనే యువతలో ఆందోళన ఉంది. ఇవి మానవ మేధస్సును మించి పనిచేస్తాయని.. దీనివల్ల మానవ వనరుల అవసరం ఉండదని భావిస్తున్నారు. కానీ ఈ భావనను నీలమ్ కర్న్ అనే ఏఐ నిపుణుడు తోసిపుచ్చుతున్నారు. ఎల్‌ఎల్‌ఎంలకు సరికొత్త ప్రోగ్రామ్ ఇవ్వగల స్థాయికి మన యువత ఎదగడం సాధ్యమేనని అంటున్నారు. అప్పుడు ఏఐని మించిన మేధోశక్తి మనకు ఉంటుందని చెబుతున్నారు.
ఏఐతో పోటీ తప్పదు
సర్విస్ సెక్టార్‌లో మార్పులొస్తున్నాయి. ఇప్పటివరకు డెవాబ్స్‌పై పనిచేశా. ఏఐ టెక్నాలజీ అంతర్లీనంగా ప్రభావం చూపిస్తోంది. టెక్నాలజీ మార్పు అనివార్యమని గుర్తించా. పదేళ్ల సీనియారిటీ ఉన్న నాకు ఏఐతో పోటీ పడే పరిస్థితి వచ్చింది. ఇది అనివార్యమనే భావిస్తున్నా.
–శ్రీరాంకుట్టి (ఏఐ స్టార్టప్ ఉద్యోగి)
ఆందోళన తొలగించాలి
టెక్నాలజీ వేగాన్ని అందుకోవాలంటే ఇప్పుడున్న మానవ వనరులకు శిక్షణ అవసరం. కొత్త సాంకేతికతపై ఆందోళన చెందుతుంటే మార్పు ఎలా సాధ్యం? కాకపోతే శిక్షణపై ప్రభుత్వాలు, ఐటీ సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏఐతో ఉద్యోగాలు పోతాయనే భయాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి.
– నవీన్ చావ్లా (ఐటీ నిపుణుడు)